సాక్షి, అమరావతి: పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. పలువురు అధికారుల తీరుపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు అలవాటే అని విమర్శించారు.
కాగా, సజ్జల అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నా కూడా చంద్రబాబుది దబాయింపే. చంద్రబాబు హయాంలో వ్యవస్థలను తొక్కిపెట్టారు. గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని హత్య చేసింది. అర్జెంటుగా అధికారంలోకి వచ్చేయాలన్నది చంద్రబాబు ఆశ. చంద్రబాబు ఆశలు కలలుగానే మిగులుతాయి. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు.
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయి. పలువురు అధికారుల తీరుపై అనుమానాలున్నాయి. ఒక్క బండిల్‌లోనే 6 ఓట్లు తేడాగా కనిపించాయి. అన్ని బండిల్స్‌లోనూ గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. కౌంటింగ్ సమయంలో అధికారులు ఎలా వ్యవహరించారో చూశాం. వైఎస్సార్‌సీపీ ఓట్లను టీడీపీ ఓట్లలో కలిపేశారు. దీనిపై కౌంటింగ్ అయిపోయాక అడగాలని ఆర్వో అన్నారు. రీకౌంటింగ్ చేయాలని కోరడం అభ్యర్థి హక్కు అని అన్నారు.
అలాగే, తెలుగుదేశం పార్టీ వైరస్ లాంటిది. అన్ని వ్యవస్థలను ఆ వైరస్ పాడు చేస్తుంది. మేం అధికారులపై ఒత్తిడి తెస్తే రిజల్ట్ ఇలా ఎందుకు వస్తుంది. మాపై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ధర్మయుద్ధమే చేస్తుంది అని స్పష్టం చేశారు.
సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో ఏమన్నారంటే..
- "ప్రజలు చంద్రబాబు కోసం వేయి కళ్లతో నిరీక్షిస్తున్నారు.. " అని ఆయన అనుకుంటే.. రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలకూ పోటీ పెడతానని ఎందుకు అనలేకపోతున్నాడు?
- దత్తపుత్రడు లేకుండా అడుగు బయటకు వేయలేనని ఎందుకు అనుకుంటున్నాడు.
- మాట్లాడటానికి దేనికైనా ఒక లాజిక్, ప్రాతిపదిక ఉండాలి
- ఈ ఫలితాలు చూసి ధైర్యం వచ్చిందనుకుంటే 175 స్థానాలకూ పోటీ చేస్తామని చెప్పండి
- ఈ రోజే ఆ మాట అనుంటే ఒప్పుకునేవాళ్లం..అలాంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో లేదు..చంద్రబాబుకు అస్సలు లేదు
వ్యవస్థల్లోకి చొచ్చుకెళ్లడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
- ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవతవకలు జరిగాయి అని చంద్రబాబు అంటూ ఐఏఎస్ అధికారులందరినీ నిందిస్తున్నాడు
- పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల కౌంటింగ్ విషయంలో వాళ్ళ వాళ్లు పట్టుబడ్డారని రిటర్నింగ్ అధికారి కూడా చెప్తున్నాడు
- అక్కడి అధికారులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందని మేం భావిస్తున్నాం
- సరైన ఆధారాలు చూపించినా అక్కడ చర్యలు తీసుకోలేదు
- కౌంటింగుకు మా అభ్యర్థి, ఏజెంట్లుగా ఉన్న కార్యకర్తలు మాత్రమే వెళ్లారు.
- టీడీపీ వాళ్లు మాత్రం కడప, అనంతపురం జిల్లాల్లోని పెద్ద నాయకులు అందరూ ఏజెంట్లుగా కూర్చున్నారు
- దబాయించి ఏదో చేయాలనే పరిస్థితికి ఎందుకు వచ్చారు మీరు..?
- ఎందుకయ్యా మీకేం పని అక్కడ...అవి గ్రాడ్యుయేట్ ఎన్నికలు కదా?
- తెలుగుదేశం పార్టీ వ్యవహరశైలిలోనే ఆ ధోరణి ఉంది...ప్రతిపక్షంలో ఉన్నా వారికి ఆ ధోరణి మారదు
- వ్యవస్థలను మేనేజ్ చేయడం, వైరస్ లాగా దాంట్లోకి దూరడం వారికి అలవాటు
- కట్టకట్టేటప్పుడు, ఇన్ వ్యాలీడ్ ఓట్లను తమవాటిలో ఎలా దూర్చాలి, కింది స్థాయి వారిని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచించే నాయకులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు
- అక్కడకు వచ్చి దబాయించి ఆ ఓట్లను అటూ ఇటూ మార్చారు
- ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు, స్కీమ్‌లు వేసే అలవాటు మీకే ఉంది
- దబాయించి గొంతెత్తి అరిచే నాయకులను అక్కడకు తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు
- దానికి చంద్రబాబునాయుడే సంజాయిషీ ఇవ్వాలి...
- పైగా మమ్మల్ని విమర్శిస్తారు..అధికారంలో ఉన్న పార్టీ అక్రమాలు చేస్తుందని అంటాడు
మేం అక్రమాలకు పాల్పడితే ఫలితాలు అలా ఎందుకు ఉంటాయి..?
- అధికార పార్టీ అక్రమాలకు పాల్పడేదే అయితే అక్కడి ఫలితాలు అలా ఎందుకు వస్తాయి?
- కౌంటింగ్ మూడు రోజులు కాదు...ముప్పై రోజులు జరుగొచ్చు
- అక్కడ తప్పులు జరగలేదా..? జరిగినట్లు ఆధారాలతో సహా చూపాం కదా..?
- ఓట్లు అటూ ఇటూ ఎందుకు మార్చారు..?
- ప్రతిపక్షంలో ఉన్నా నీదే దబాయింపు...ఇక అధికారంలో ఉంటే బుల్డోజ్ చేస్తాడు..ఇది చంద్రబాబు లక్షణం
- ఈ ఎన్నికల్లో కూడా ఆయనకు ఆ దబాయించే అలవాటు పోలేదు
- ప్రజాస్వామ్యయుతంగా పోరాడటం, విన్నవించుకోవడం, ధర్మయుద్ధం చేయడం వైఎస్సార్సీపీ లైన్
- అక్కడ ప్రజాస్వామ్యయుతంగా మాకున్న హక్కు మేరకు రీకౌంటింగ్ అడిగాం
- ఆధారాలతో సహా మీవాళ్లు చేసిన తప్పులు పట్టుబడినప్పుడు రీకౌంటింగ్ అడగటం మాకున్న హక్కు
- రీకౌంటింగ్ అడగడానికి అక్కడ ప్రాతిపదిక ఉందా లేదా అనేది చూడాలి
- నిజంగా దాష్టీకం చేసే వాళ్లమైతే అక్కడ పరిస్థితి మరో రకంగా ఉండేది కదా..?
- ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉన్న హక్కును మాత్రమే మా అభ్యర్థి ఉపయోగించుకున్నాడు
- డిక్లరేషన్ ఇచ్చారు...దాన్ని లీగల్ గా చాలెంజ్ చేస్తే చేస్తాడు
- అధికారులు మా అడుగులకు మడుగులు ఒత్తే వారైతే చంద్రబాబు హయాంలో మాదిరిగా "స్కిల్ స్కామ్"లు జరిగేవి.
- నీలా అడుగులకు మడుగులు ఒత్తించుకునేవారమైతే.. నీ హయాంలో జరిగినట్టు ఏబీ వెంకటేశ్వరరావులాంటి వారు మొత్తం రాజ్యం నడిపే వారు.
- నువ్వే ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేస్తావ్..తిరిగి నీవే హత్య చేశారు.. అని మిద్దెలెక్కి అరుస్తావ్.. నీ పాలనలో ప్రజల హక్కులను రాచిరంపాన పెట్టావ్
- దానికి సరైన వ్యతిరేక తీర్పును కూడా ప్రజలు ఇచ్చారు..నీ అరాచకాలను ప్రజలు ఇంకా ఎవరూ మర్చిపోలేదు
- మేం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా మా హక్కుల కోసం మేం పోరాడాల్సి వస్తోంది
- మమ్మల్ని పట్టుకుని ఎక్కడ లేని బూతులు తిట్టడం, తీవ్రమైన ఆరోపణలు చేయడం చంద్రబాబుకు మామూలు అయిపోయింది
చంద్రబాబు అంబేద్కర్ సూక్తి చెప్పడం అంటే దయ్యాలు వేదాలు వల్లించడమే:
- అంబేద్కర్ సూక్తి ఈ రోజు చంద్రబాబుకు గుర్తుకువచ్చింది
- ఎవరైనా ఎస్సీల్లో పుట్టాలనుకుంటారా.. అన్న మనిషి ఈ రోజు అంబేద్కర్ గారి మాటను ఉటంకించడం దయ్యాలు వేదాలు వల్లించడమే
- ఈ రోజు మాట్లాడిన ప్రతి మాటలో... అధికార కాంక్ష, ప్రజలు ఆయన్ను గద్దెనెక్కించినట్లు పగటి కలలు కంటున్నాడు బాబు
- మళ్లీ చెప్తున్నాం....ఆ కలలే ఆయనకు మిగులుతాయి...
- అన్ని వర్గాల ప్రజల అభిప్రాయం దీనిలో ప్రతిబింబించలేదనేది వాస్తవం
- అలా అని వచ్చిన ఫలితాలను మేం కొట్టేసినట్లు కాదు..వచ్చిన తీర్పును గౌరవిస్తాం
- కానీ దీన్ని చంద్రబాబుతో చెప్పించుకునే పరిస్థితి మాకు లేదు
- బాబు రిజెక్టెడ్ పర్సన్...ప్రజలు రిజెక్ట్ చేసి ఆయన్ను పక్కకు తోసేశారు
- ఏరోజైతే ఆయన అసెంబ్లీకి రానన్నాడో ఇక ఎన్నడూ చంద్రబాబు ఏపీ అసెంబ్లీకి రాడని అర్ధమైంది
- చంద్రబాబు అనవసరంగా అసెంబ్లీకి వచ్చే అవకాశం పోగొట్టుకున్నాడే అని మేము ఆ రోజే అనుకున్నాం
- ఆయనకు ఉన్న అక్కసు, కడుపుమంట చల్లార్చుకోవడానికి ఈ రోజు చంద్రబాబు మాట్లాడాడు
- ఆయన మాటలకు మేం పెద్దగా విలువ ఇవ్వడం లేదు
- ఈ అవసాన దశలో ఆయన భ్రమల్లో ఉండి ఏదైనా తృప్తి పొందింతే పొందనివ్వండి
మాకు హక్కు ఉంది కాబట్టే అభ్యంతరం తెలిపాం
- రీ కౌంటింగ్ కు, అక్రమాలపై అభ్యంతరం చెప్పడానికి అక్కడి అభ్యర్థికి హక్కు ఉందా లేదా అనేది చూడాలి
- నిబంధనల మేరకు ఏ అభ్యంతరం లేవనెత్తినా అధికారులు పరిష్కారం చూపాలి
- 8వ రౌండ్లో టీడీపీవి కాని ఓట్లు టీడీపీకి కలిపారని అభ్యంతరం చెప్పారు
- పరిశీలిస్తే 6 ఓట్లు దాంట్లో బయటపడ్డాయి..ఆర్వో కూడా నిజమేనని ఒప్పుకున్నారు
- అప్పటి నుంచీ వరుసగా జరిగిన కౌంటింగ్ తీరుపై అభ్యంతరాలు చెప్తూనే ఉన్నాం
- రిటర్నింగ్ అధికారి కౌంటింగ్ అయిన తర్వాత పరిశీలిద్దాం అన్నారు
- అదే మేం చేశాం..కౌంటింగ్ ముగిశాక మళ్లీ లెటర్ పెట్టి రీకౌంటింగ్ అడిగాం
- గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఓట్లను మరొకసారి వెరిఫై చేయమని అడిగాం
- ఇది మాకు ఉన్న హక్కు..అడిగే హక్కుందని చట్టం చెప్తోంది
- మేం వితండవాదం చేయలేదు...గాలిలోంచి డిమాండ్ తీసుకురాలేదు
- –ఆధారాలతో చూపించాం...దానికి సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు రావాల్సిన అవసరం ఏముంది..?
- పార్లమెంటు ఎన్నికలే 9, 10 ఓట్ల తేడాతో అటూ ఇటూ అయిన సందర్భాలు ఉన్నాయి
- అందుకే మళ్లీ కౌంటింగ్ చేయమన్నాం...వాళ్ల నాయకులంతా అక్కడే కూర్చొని గొడవ చేసి పైగా మమ్మల్ని కామెంట్ చేస్తున్నారు
కుప్పంలో మేం కొట్టిన దెబ్బకి పులివెందుల పోయిందంటూ శునకానందం
- కుప్పంలో మేం కొట్టిన దెబ్బ నుంచి తెరుకోలేక.. ఇప్పుడు పులివెందులలో విజయం అంటూ బాబు చెప్పుకుంటున్నారు
- ఎమ్మెల్సీ కౌంటింగు మూడు జిల్లాలకు సంబంధించినది...ఒక్క పులివెందులదే అని ఎలా చెప్తారు?
- కుప్పంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు స్థానికంగా ఉండేవి.. వాటన్నింట్లో మేము గెలిచాం
- మూడు పాత జిల్లాలు కలిపి కౌంటింగు చేస్తే... ఈయనకు పులివెందుల కనిపించిందట..
- ఈయనే సోషల్ మీడియాలో నాలుగు రాయిస్తాడు..పులివెందులలో అయిపోందంటూ.. శునకానందం పొందుతుంటాడు
టీడీపీ ఒక వైరస్ లాంటిది...
- టీడీపీ ఒక వైరస్ లాంటిది...వ్యవస్థల్లోకి దూరి మేనేజ్ చేసే అలవాటు ఉంది.
- కంప్యూటర్‌పై లెక్కేసినట్లు వరుసగా ఫలితాలు వస్తుండటంతో మాకు అనుమానం వచ్చింది
- పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో కౌంటింగ్ పూర్తయిన తర్వాత అభ్యంతరం చెప్పే నిబంధన ఉంది
- కానీ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో కౌంటింగ్ జరుగుతున్న ఏ దశలోనైనా అభ్యంతరం చెప్పొచ్చు అనే నిబంధన ఉంది
- దాన్ని మేం వినియోగించుకున్నాం...ఆర్వో కౌంటింగ్ అయిన తర్వాత అన్నారు..అయిన తర్వాత కూడా అభ్యంతరం చెప్పాం
- మాకు ఉన్న హక్కును మేం వినియోగించుకున్నాం.. స్పష్టమైన ఆధారాలు ఉండటంతో మేం రీకౌంటింగ్ కోరాం
- నిజంగా సీఎం కార్యాలయం నుంచే ఆదేశాలు వెళ్లి ఉంటే రీకౌంటింగ్‌కి అధికారులు ఎందుకు ఒప్పుకోలేదు..?
- అధికారాన్ని దుర్వినియోగం చేసి ఒత్తిడి తీసుకువస్తే పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది..? అదిలేదనేది స్పష్టంగా కన్పిస్తోంది
అధికార దుర్వినియోగం బాబుకే అలవాటు
- గతంలో వీళ్లు నెల్లూరు ఎన్నికలు, జడ్పీ ఎన్నికల్లో అడ్డంగా అధికార దుర్వినియోగం చేశారు
- మా పార్టీ శాసనసభ్యులను లాక్కోడానికి ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను వినియోగించుకున్నారు
- ఏబీ వెంకటేశ్వరరావు గురించి అయితే చెప్పనక్కర్లేదు..ఒక రాజుకింద సేనాధిపతిలా ఆనాడు రాజ్యాన్ని నడిపాడు
- అలాంటి పరిస్థితులు మా దగ్గర ఉంటే ఇలాంటి ఫలితాలు ఎందుకు వస్తాయి..?
- పశ్చిమ రాయలసీమ కౌంటింగ్‌పై లీగల్‌గా వెళ్లేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు
- ఎమ్మెల్యేలు ఓట్లు వేసే ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. టీడీపీ పోటీ పెట్టిన తర్వాత మేం సరదాగా పోటీకి పెట్టాం అని అనరు కదా?
- వారికున్న అలవాటు మేరకు అక్రమాలకు పాల్పడి, ప్రలోభపెట్టాలని ప్రయత్నం చేస్తారు
- చూద్దాం రేపు వచ్చే ఫలితాలే దీనికి సమాధానం చెప్తాయి
- వాళ్లకి బలం ఉన్నప్పుడు.. మేమే గెలుస్తాం అంటూ ఈ డాంభికాలు ఎందుకు..?
Comments
Please login to add a commentAdd a comment