జోగిపేట నగర పంచాయతీ పీఠం దక్కేదెవరికో! | who will get location panchayat chairperson? | Sakshi
Sakshi News home page

జోగిపేట నగర పంచాయతీ పీఠం దక్కేదెవరికో!

Published Fri, May 23 2014 12:10 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

who will get location panchayat chairperson?

జోగిపేట,న్యూస్‌లైన్ :  జోగిపేట నగర పంచాయతీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఎంపిక విషయంలో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తీసుకోబోయే నిర్ణయంపై స్థానిక కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. 20 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 13 వార్డులను గెలుచుకోగా, టీఆర్‌ఎస్ 4, టీడీపీ 2, బీజేపీ ఒక అభ్యర్థి గెలుపొందారు. చైర్‌పర్సన్ రేసులో మాత్రం ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. కవిత సురేందర్ గౌడ్, శోభా నారాయణ గౌడ్, ప్రవీణ రామాగౌడ్ చైర్మన్ పదవి కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రావడంతో పార్టీలో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. ధైర్యంగా తనకు చైర్‌పర్సన్ పదవి కావాలంటూ అడగలేకపోతున్నారు.

మొదటినుంచి కవిత సురేందర్ గౌడ్ చైర్‌పర్సన్ తానే నంటూ ప్రచారం చేసుకున్నా, పార్టీలో తానే సీనియర్‌నని తనకే అవకాశం ఇవ్వాలని డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి హెచ్.నారాయణ గౌడ్ తన భార్య కోసం ప్రయత్నిస్తున్నారు. మాజీ ఎంపీపీ రామాగౌడ్ కూడా చైర్‌పర్సన్ పదవిని ఆశించి తన భార్యను బరిలోకి దింపి గెలిపించుకున్నారు. ఆయన కూడా తన సన్నిహితులతో ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం. చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న శోభ, ప్రవీణ తోటికోడళ్లు కావడం విశేషం.

అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేట నగర పంచాయతీ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తక్కువ రావడంతో దామోదర రాజనర్సింహ స్థానిక నాయకులపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు నాయకుల అసమర్థత  కారణంగానే స్థానికంగా పార్టీకి ఓట్లు తక్కువ వచ్చాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.  ఎమ్మెల్యే, ఎంపీల ప్రమాణ స్వీకారం తర్వాత మున్సిపల్ ఎన్నికల నూతన పాలకవర్గాల ఎన్నిక జరిగే అవకాశం ఉంది. సమయం దగ్గర పడుతున్న కొద్దీ చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు. ఈ ముగ్గురితో పాటు పట్టణానికి చెందిన మరో మహిళ అభ్యర్థి కూడా చైర్‌పర్సన్ పదవిని ఆశిస్తున్నారు.

 దామోదర మదిలో ఎవరో
  మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తీసుకోబోయే నిర్ణయాన్ని ఊహించడం కష్టమని చెప్పవచ్చు. రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోవడంతో ఎవరిని చైర్‌పర్సన్‌గా ఎన్నిక చేస్తే బాగుంటుందనే విషయంపై ఆయన సీరియస్‌గా ఆలోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. చైర్‌పర్సన్ అభ్యర్థి పేరును ఎప్పటిలాగే సీల్డ్ కవర్‌లో పంపుతారా? లేక ముందుగానే ప్రకటిస్తారో తెలియడంలేదు. ఏది ఏమైనప్పటికీ దామోదర నిర్ణయించిన అభ్యర్థే చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.  

 టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రయత్నాలు
 జోగిపేట పట్టణంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా గెలుపొందిన అభ్యర్థి చైర్‌పర్సన్ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చైర్‌పర్సన్ ఎన్నికకు సరిపోను వార్డు సభ్యులు లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇతర పార్టీల వార్డు సభ్యులు ఎంత వరకు సహకరిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement