జోగిపేట.. ఉద్యమాల కోట | This story about of jogipet village! | Sakshi
Sakshi News home page

జోగిపేట.. ఉద్యమాల కోట

Published Sun, Feb 21 2016 1:58 AM | Last Updated on Sun, Sep 3 2017 6:03 PM

జోగిపేట.. ఉద్యమాల కోట

జోగిపేట.. ఉద్యమాల కోట

ప్రథమాంధ్ర మహాసభకు పుట్టినిల్లు
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మహాసభలు
గ్రంథాలయ ఉద్యమమూ ఇక్కడి నుంచే...
తెలంగాణలోనే అతిపెద్ద లోహరథం


జోగిపేట : నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన  ప్రథమాంధ్ర మహాసభకు పురుడు పోసిన గడ్డ జోగిపేట. జిల్లాలోనే విశిష్టమైన స్థానాన్ని జోగిపేట సంపాదించింది. నిజాం కాలంలో తెలంగాణ విమోచన ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయం.

నిజాం పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించి స్వాతంత్య్రం సాధించాలన్న ఆకాంక్షను పెంపొందించేందుకు 1828లో తెలంగాణ ఆంధ్ర మహాసభను మాడపాటి హనుమంతరావు స్థాపించారు. 1930, మార్చి 3,4,5 తేదీలలో స్థానిక దేవాలయంలో  ప్రథమాంధ్ర మహాసభను నిర్వహించారు. ఈ సమావేశానికి సురవరం ప్రతాపరెడ్డితో పాటు మహామహులెందరో హాజరై ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేశారు. అంతే కాకుండా నడింపల్లి సుందరమ్మ అధ్యక్షతన ప్రథమాంధ్ర మహిళా మహాసభ కూడా జోగిపేటలోనే నిర్వహించడం గమనార్హం.
 
గ్రంథాలయ ఉద్యమం కూడా...
నిజాం నిరంకుశాన్ని ప్రజలకు వివరించేందుకు అప్పటి విమోచన ఉద్యమ నాయకులు గ్రంథాలయ ఉద్యమాన్ని చేపట్టారు. అయితే నిజాం నవాబు గ్రంథాలయాలను కొనసాగించవద్దని గస్తీనిషాన్ శాసనాన్ని జారీ చేశారు. దీనికి వ్యతిరేకంగా 1922లో మొట్టమొదటి సారిగా జోగిపేటలో శ్రీ జోగినాథ ఆలయాన్ని నిర్మించారు. స్థానిక స్వాతంత్య్ర సమరయోధులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు.
 
జోగినాథ్ గంజ్ ....
రైతులు పండించిన ధాన్యాలను జోగిపేటలోని మార్కెట్‌లో విక్రయించేవారు.  వేలాది మంది రైతులతో మార్కెట్ కిక్కిరిసి పోయేది. ఆ మార్కెట్‌కు జోగినాథ్ గంజ్‌గా నామకరణం చేశారు. జోగిపేటలో 1941లో వ్యవసాయ మార్కెట్‌ను ఏర్పాటు చేసారు. స్థానికంగా శ్రీ జోగినాథ ఆలయం ప్రాచుర్యం పొందడంతో జోగినాథ గంజ్‌గా నామకరణం చేసినట్లుగా సమాచారం.
 
ముఖద్వారం నుంచే  గ్రామంలోకి...
జోగిపేటలోని ముఖ ద్వారం (గౌని) గుండానే గ్రామంలోకి ప్రవేశిస్తారు. నలువైపులా అప్పట్లో నిర్మించిన నాలుగు ప్రవేశ ద్వారాలలో ఇదొకటి. స్థానికంగా నిర్వహించే రథోత్సవం ఈ ముఖ ద్వారం నుంచే ప్రారంభమవుతుంది. ఈ ముఖద్వారం పై నుంచే రథానికి శిఖరాలను ఏర్పాటు చేస్తారు.
 
పట్టణ ప్రముఖులు
అందోలు నియోజకవర్గానికి మొట్ట మొదటిసారిగా స్థానికుడైన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత బస్వమాణయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  దివంగత శేరి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా, మార్కెట్ చైర్మన్‌గా బాధ్యతలను నిర్వహించారు. స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత డాకూరి గాలయ్య 18 ఏళ్లపాటు జోగిపేట సర్పంచ్‌గా పనిచేసి మన్ననలను పొందారు.
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఆవిర్భావ దినోత్సవ సంబరాలను కూడా 2013లో జోగిపేటలోనే నిర్వహించుకోవడం యాదృచ్చికమే. టీఆర్‌ఎస్ పార్టీ అధినేతగా కె.చంద్రశేఖర్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
 
జోగిపేటకు ఆ పేరెలా వచ్చిందంటే..
అందోలు రాజధానిగా పరిపాలన సాగించిన శౌర్యవంశరెడ్డి రాజులైన రామినేయుని వంశంలోని నాల్గో తరం రాజు అల్లామరెడ్డికి సంతానం కలగలేదు. దాంతో రామజోగి అనే సాధువు సలహా ప్రకారం వైక్రాంతగిరి పైన శివలింగాన్ని ప్రతిష్ఠించి, పుత్రకామేష్టీ యాగాన్ని నిర్వహించాలని సూచించడంతో అల్లమారెడ్డికి సంతానం కల్గింది. తనకు సలహ ఇచ్చిన రామజోగికి కృతజ్ఞతగా వైక్రాంతగిరి (జోగిపేట గుట్ట) కింద క్రీ.శ 1547లో ఓ గ్రామాన్ని నిర్మించి దానికి రామ జోగిపేటగా నామకరణం చేశారట.

ఇది కాలక్రమంలో జోగిపేటగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతుంది. దీంతో పాటు  వైక్రాంత గిరిపై ఉన్న జైన తీర్థంకరుల విగ్రహాలను తొలగించి తమ ఇష్టదైవమైన శివ లింగాన్ని ప్రతిష్ఠించి జైన జోగుల బస్తీని వీరశైవ బస్తీగా పేరు మార్చారట, అయితే కాల క్రమేనా జోగుల బస్తీ జోగిపేటగా రూపుదిద్దుకున్నట్లుగా కూడా చెబుతున్నారు. పూర్వీకులు గతంలో నాలుగు ప్రవేశ ద్వారాలను నిర్మించారు. వీటితో పాటు వందల సంఖ్యలో బురుజులు కూడా నిర్మించారు.
 
చారిత్రాత్మకం క్లాక్‌టవర్...
గ్రామానికి నాలుగు వైపుల ఉన్న ద్వారాలకు మధ్యలో క్రీ.శ. 18వ శతాబ్దంలో అసఫ్ జాహీల పాలనలో గడియారపు గోపురాన్ని నిర్మించారు. గ్రామంలో మధ్యలో ఉండడంతో కాలక్రమేన  క్లాక్‌టవర్‌గా ప్రజలు నామకరణం చేసుకున్నారు. క్లాక్‌టవర్‌కు చుట్టూ ఉన్న గడియారాలు నిరంతరం నడిచేవని, గడియారం గట్టిగా మోగడంతోనే నిద్రలేచేవారని, క్లాక్‌టవర్‌కు ఉన్న గడియారంతోనే ప్రజలంతా తమ దైనందిన కార్యక్రమాలు చేసుకునేవారిని తెలుస్తుంది.

కొంత కాలం నుంచి ప్రస్తుతం ఆ గడియారాలు పనిచేయకుండా నిలిచిపోయాయి. తిరిగి వాటికి మరమ్మతులు చేయించేందుకు ప్రస్తుత నగర పంచాయతీ పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది. క్లాక్‌టవర్ మధ్యలో తెల్లటి పాలరాతి మహాత్మాగాంధీ విగ్రహన్ని కూడా అప్పట్లో ప్రతిస్ఠించారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ క్లాక్‌టవర్ నేటికి చెక్కు చెదరలేదు.
 
అతిపెద్ద లోహరథం
సుమారు 400 ఏళ్ల క్రితం స్థానిక గుట్టపై జోడు లింగాలు వెలిశాయి.  ప్రస్తుతం శ్రీ జోగినాథ ఆలయంగా విరజిల్లుతోంది. ప్రతి ఏటా ఈ ఆలయంలో జాతరను ఉగాది పండగకు ముందు నిర్వహిస్తారు. దానిలో భాగంగా రథంను ఊరేగిస్తారు. ఇందుకుగాను 52 ఫీట్ల ఎత్తుతో లోహ రథాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. 12 ఏళ్ల క్రితం 32 టన్నుల ఇనుముతో  తయారు చేయించిన రథానికి 5 అంతస్తులున్నాయి. ప్రతి అంతస్తులో ఒక్కొక్క దేవతా మూర్తుల ప్రతిమలను ఏర్పాటు చేసారు. గణపతి, దుర్గామాత, నందీశ్వరుడు, నాగసర్పం, జోగినాథ దేవతామూర్తుల విగ్రహాలు రథంపై ఏర్పాటు చేశారు. ఈ రథం తెలంగాణలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది.
 
నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడాం
నిజాం కాలంలో వారి నిరంకుశపాలనకు చరమగీతం పాడేందుకు అందరం కలిసి పోరాడాం. జోగిపేటలో మొట్టమొదటి ప్రథమాంధ్ర మహాసభను జయప్రదం చేసేందుకు తామంతా శ్రమించాం. తమ పోరాటంలో భాగంగా నిజాం నవాబులు ఎన్నో సార్లు తమను జైళ్లో పెట్టించినసందర్భాలున్నాయి. గ్రంథాలయాల ఏర్పాటును వ్యతిరేకించినా జోగిపేటలోని క్లాక్‌టవర్ పక్కనే ఏర్పాటు చేశాం. పోరాట సమయంలో వారు చిత్ర హింసలకు గురి చేసారు. - అరిగె ఆశయ్య, స్వాతంత్య్రసమరయోధులు జోగిపేట
 
గర్వపడుతున్నాను
ఎంతో చరిత్ర కలిగిన జోగిపేట నగర పంచాయతీకి తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికైనందుకు గర్వపడుతున్నాను.  ప్రథమాంధ్ర మహసభతో పాటు తొలి మహిళా సభకు కూడా ఇక్కడే జరిగింది. చారిత్రాత్మకమైన కట్టడాలను రక్షించేందుకు తనవంతుగా కృషి చేస్తా. క్లాక్‌టవర్‌కు ఉన్న గడియారాలను మరమ్మతు చేయించాలన్న ఆలోచన ఉంది.   
- ఎస్.కవిత సురేందర్‌గౌడ్, చైర్‌పర్సన్ జోగిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement