జోగిపేట : ‘మాకు తెలియకుండా ఆలయాలకు, మసీదులకు రూ.93 వేలు ఎలా పంపిణీ చేస్తారు?, మీ ఇష్టానుసారంగా ఇచ్చిన డబ్బులకు మేము ఆమోదం తెలుపం, ఇలా చేస్తే మిమ్మల్ని సరెండర్ చేయాల్సి వస్తుంది’ అని కమిషనర్ విజయలక్ష్మిపై పలువురు కౌన్సెలర్లు ధ్వజమెత్తారు. ఎమ్మెల్యే సూచన మేరకు ఆ నిధులు మంజూరు చేసినట్లు కమిషనర్ సభ్యులకు తెలిపారు.
బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సాధారణ సమావేశానికి చైర్‌పర్సన్ కవిత అధ్యక్షత వహించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు ప్రదీప్‌గౌడ్, శరత్‌బాబులు నగరపంచాయతీకి సంబంధించి అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్ల పనులను సీడీఆర్ ప్రాజెక్టుకుఅప్పగించాలని తీర్మానం ప్రవేశపెట్టగా దానికి మెజార్టీ సభ్యులు ఆమోదం తెలిపారు.
అయితే టీడీపీకి చెందిన కౌన్సిలర్ శ్రీకాంత్, టీఆర్‌ఎస్‌కు చెందిన లక్ష్మణ్‌లు ఇందుకు వ్యతిరేకించారు. అయితే 18 మంది కౌన్సిలర్లు చేతులెత్తి తీర్మానాన్ని ఆమోదించారు. సమావేశంలో ఆదాయం, ఖర్చులకు సంబంధించిన నివేదిక ఇవ్వకపోవడంతో సభ్యులు కమిషనర్ తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. అప్పటికప్పుడు నివేదికను కమిషనర్ విజయలక్ష్మి తయారు చేసి చదివి వినిపించినా సభ్యులు సంతృప్తి చెందలేదు. ఒక్కోక్క వార్డులో సుమారుగా రూ.8 లక్షల పనులకు సంబంధించి ప్రతిపాదనలను తయారు చేయించాలని కౌన్సిలర్లు కమిషనర్ విజయలక్ష్మికి సూచించారు.
అభివృద్ధి పనులకు మంజూరైన రూ. 2.63 కోట్లు, బీఆర్ జీఎఫ్ కింద రూ.19.64 లక్షల నిధులు అందుబాటులో ఉన్నాయని, 13 ఫైనాన్స్ కింద రూ.53 లక్షలు మంజూరయ్యాయని కమిషనర్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. తైబజారు వేలం పాటను ఈనెల 23న నిర్వహించాలని, బకాయిలున్న వారిని వేలం పాటలో అనుమతించకూడదని కౌన్సిలర్ గోపి, సునీల్‌కుమార్‌లు సూచించారు. కూరగాయల మార్కెట్‌ను నెల రోజుల్లోగా నగర పంచాయతీకి అప్పగించాలని కలెక్టర్, పంచాయతీరాజ్ ఈఈలకు లేఖ రాయాలని కౌన్సిలర్ ప్రదీప్‌గౌడ్ కమిషనర్‌కు తెలిపారు. గాంధీ పార్కు షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలను పెంచాలని వైస్ చైర్మన్ రాములు, కౌన్సిలర్లు నవీన్, లక్ష్మణ్‌లు కోరారు.
కౌన్సిలర్లుకు తెలియకుండా అనుమతులివ్వొద్దు
ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అనుమతులు ఆయా వార్డుల కౌన్సిలర్లకు చెప్పకుండా అనుమతులు ఇవ్వరాదని కౌన్సిలర్లు లక్ష్మణ్, మోహన్‌లాల్ జాదవ్ సభ దృష్టికి తెచ్చారు. అయితే సమావేశంలో ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి నర్సింహరాజు సమాధానమిస్తూ నగర పంచాయతీ యాక్టులో అలాంటి నిబంధన ఏదీలేదని తెలిపారు.
మాకూ మాట్లాడే అవకాశం ఇవ్వండి
అన్నీ అంశాలను మీరే మాట్లాడితే ఎలా? తమకు కూడా అవకాశం ఇవ్వాలని మహిళా కౌన్సిలర్ తోట్ల మమత కోరారు. ఒక్క సమస్యపైనే సభను సాగదీస్తే ఎలా ముందుకు వెళతామని ఆమె ప్రశ్నించారు. 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి మాట్లాడుతూ తమ వార్డులో తాగునీటి పైపు ఏర్పాటుపై ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మాకు తెలియకుండా డబ్బెలా ఇస్తారు?
Published Thu, Aug 7 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement