సింగూరు ప్రాజెక్టు వద్ద పర్యాటకుల రద్దీ
ప్రాజెక్టుకు పెరిగిన సందర్శకుల తాకిడి
మూడు గేట్ల ద్వారా మంజీరలోకి నీరు
జోగిపేట: సింగూరు ప్రాజెక్టులో వరదనీరు భారీగా చేరుతుండడంతో ఆ నీటి తాకిడిని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం పెరగడంతో ఇరిగేషన్ అధికారులు మంజీర నదిలోకి మూడు గేట్ల ద్వారా నీరు దిగువకు వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు వేలాది మంది ప్రాజెక్టుకు తరలివచ్చారు.
కార్లు, వ్యాన్లు, ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో సింగూరుకు తరలివస్తున్నారు. అన్ని దారులు సింగూరు వైపే మళ్లుతున్నాయి. ఆదివారం కావడంతో హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, జోగిపేట, మెదక్, జహీరాబాద్‌తో పాటు పుల్కల్ మండలం చుట్టు ప్రక్కల ప్రాంతాలకు చెందిన వారు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రెండు కి.మీ దూరం నుండే పర్యాటకులు బారులు తీరి కనిపించారు.
ప్రాజెక్టు పైకి వాహనాలను పోలీసులు అనుమతించడంలేదు. ప్రత్యేకంగా చెక్‌పోస్టును కూడా ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు ఎవరినీ అనుమతించకపోవడంతో పర్యాటకులు అసంతృప్తిని వ్యక్తం చేసారు. కొందరు గోల చేయడంతో వారిని ఆపడం పోలీసుల వశం కాకపోవడంతో చివరికి వదిలిపెట్టారు.
సెల్ఫీల జోరు
ప్రాజెక్టును చూసేందుకు వచ్చిన పర్యాటకులు నీళ్లు కనిపించేలా ఫోటోలు దిగడంలో పోటీలు పడడం కనిపించింది. సెల్ఫీలకైతే అంతే లేకుండా పోయింది. కుటుంబ సభ్యులంతా కలిసి వచ్చి వీక్షిస్తున్నారు.
పార్కు నిండా పర్యాటకులే..
ప్రాజెక్టు క్రింది భాగంలో ఉన్న చిల్ర్డన్స్‌పార్కు పర్యాటకులతో నిండిపోయింది. ప్రాజెక్టును చూడడానికి వచ్చిన వారంతా వెంట క్యారేజ్‌లు తెచ్చుకుంటున్నారు. పార్కులో కూర్చొని భోజనాలు చేసారు.