
జోగిపేట పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మహిళలు
‘మల్లిక..మల్లిక ’ అనే పేరుతో అకౌంట్
అక్రమ సంబంధాలు అంటగడుతూ పోస్టింగ్‌లు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు, యువకులు
స్థానికంగా ఉండే యువతిపై అనుమానాలు
గతంలోనే ఎఫ్‌ఐఆర్ నమోదైనా పట్టించుకోని పోలీసులు
జోగిపేట: ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ తెరిచి.. గ్రామస్తుల ఫొటోలతో పాటు అసభ్యకర మాటలు పోస్టు చేస్తున్న వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన విషయమై ఈ ఏడాది మే నెలలోనే ఎఫ్‌ఐఆర్ నమోదైనా పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో మాసానిపల్లికి చెందిన మహిళలు, యువకులు ఆదివారం మరోసారి జోగిపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
‘మల్లిక.. మల్లిక’ పేరుతో...
‘మల్లిక.. మల్లిక’ అన్న పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ తెరిచి, చేతి వేళ్లను ప్రొఫైల్ పిక్‌గా పెట్టారు. మాసానిపల్లికి చెందిన సుమారు 20 మందికి పైగా యువకులు, యువతుల ఫొటోలు వాట్సాప్, ఫేస్‌బుక్ నుంచి డౌన్‌లోడ్ చేసి వాటితో ఫేస్‌బుక్ ద్వారా అసభ్యకర పదాలు పోస్టు చేస్తున్నారు. అంతేకాదు అక్రమ సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌లో మేసేజ్ చూసిన కౌడిపల్లి మండలానికి చెందిన వ్యక్తి.. తన భార్యపై అనుమానంతో పుట్టింటికి పంపించివేసినట్టు గ్రామస్తుల ద్వారా తెలిసింది.
ఆలస్యంగా గుర్తించిన గ్రామస్తులు.. విషయంపై ఆరా తీయగా స్థానికంగా ఉండే ఓ యువతి(22 ఏళ్లు)కి సంబంధించిన ఫేస్‌బుక్ ఐడీతో మేసేజ్‌లు వెళ్తున్నట్టు గమనించారు. బాధితులు జిల్లా పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించడంతో స్థానిక సీఐ, ఎస్సై విచారణ బాధ్యతలు తీసుకున్నారు. విషయం నియోజకవర్గ ప్రజాప్రతినిధుల దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఈ సంవత్సరం మే నెలలోనే సదరు యువతిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
పనిచేయని ఆదేశాలు
ఫేస్‌బుక్ మెసేజ్‌లు తొలగించాలని సదరు యువతిని పోలీసులు ఆదేశించారు. ఆమె తొలగించకపోవడంతో బాధితులు నిందితురాలిని నిలదీశారు. దీంతో ఆమె, ఇతర బంధువులు.. తమపై దాడికి ప్రయత్నించారంటూ ఫిర్యాదు చేయడంతో గ్రామానికి చెందిన 30 మంది మహిళలు, యువకులు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తప్పు చేసి తమపైనే ఫిర్యాదు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఫోన్‌లో ఉన్న బూతు పోస్టింగ్‌లను తొలగించేలా చర్యలు తీసుకోవాలని జోగిపేట ఎస్సై టి.శ్రీధర్‌ను కోరారు.
విచారణ చేస్తాం: - టి.శ్రీధర్, ఎస్సై
మాసానిపల్లి గ్రామానికి చెందిన యువకులు, యువతుల పేర ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో బూతు మెసేజ్‌లు పెడుతున్నారని ఫిర్యాదు వచ్చింది. గ్రామానికి చెందిన నిందితురాలిని విచారించాం. ఆమె తనకు సంబంధం లేదని చెబుతోంది. రాజు అనే వ్యక్తి పోస్టింగ్‌లు చేస్తున్నాడంటోంది. పూర్తిస్థాయిలో ఇంకా విచారణ చేయాల్సి ఉంది.