కొవ్వూరు: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన రాజమహేంద్రవరానికి చెందిన బొల్లంకొండ వెంకట సాయిలక్ష్మి మాయమాటలు చెప్పి విడతల వారీగా రూ.20 లక్షలు కాజేసినట్లు పట్టణానికి చెందిన కంఠమణి వెంకట విష్ణుకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుకుమార్ విశాఖపట్నంలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నారు. ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఇద్దరూ తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటూ ఉండేవారు.
ఈ క్రమంలో విష్ణుకుమార్‌కి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుందామని నమ్మించి తన అకౌంట్స్ నుంచి విడతల వారీగా పలుమార్లు సొమ్ము జమ చేయించుకుంది. పలు రకాల వస్తువులు కొనుగోలు చేసి తనతో బిల్లులు కట్టేంచేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. వివాహం చేసుకుందామని అడిగితే తన బావ వెంకట తిరుమలేశ్వరరావుతో మాట్లాడిస్తానని చెప్పి రూ.2 లక్షలు సొమ్ము జమ చేయించుకుంది.
మళ్లీ తన స్నేహితురాలు ప్రీతి ఫోన్ నంబర్ ఇచ్చి ఆమెకు మరో రూ.2.50 లక్షలు ఇస్తే వివాహం చేసుకుంటామని చెప్పించింది. ఆ సొమ్ము చెల్లించలేదన్నారు. అప్పటికే పలుమార్లు, వివిధ మార్గాల ద్వారా రూ.20 లక్షల వరకు చెల్లించారు. చివరిలో అడిగిన సొమ్ము ఇవ్వలేదని వారి ఫోన్‌లు స్వీచ్ ఆఫ్ చేసినట్లు, తన వద్ద సొమ్ము తీసుకుని మోసగించినట్లు విష్ణుకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్సై డి.భూషణం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment