జోగిపేట: పశు సంపద వల్ల రైతులకు అనేక లాభాలున్నాయి. అయితే వీటికి వచ్చే సీజనల్ వ్యాధులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టాలు తప్పవని పశువైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. అంటు వ్యాధుల బారి నుంచి పశువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచిస్తున్నారు. సీజనల్ వ్యాధులను తొలి దశలోనే గుర్తించి చికిత్సలు చేయించాలని జోగిపేట పశువైద్య శాఖ ఏడీ శ్రీనివాసరావు, సెల్: 8374255444 తెలి పారు. వర్షాకాలంలో పరిసరాల ప్రభావం, వరద నీరు తాగడం, వ్యాధి కారక పురుగులున్న మేతను మేయడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలు రకరకాల వ్యాధుల బారిన పడి చనిపోయే ప్రమాదం ఉందన్నారు.
గొంతు వాపు వ్యాధి...
ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా పిలుస్తారు. కలుషితమైన నీరు, మేతను తీసుకోవడం వల్ల పశువుల్లో రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధి బారిన పడుతాయి. ఇది అంటు వ్యాధి కావడం వల్ల ఇతర పశువులకు సోకుతుంది. గొంతు కిందకు నీరు దిగి గొంతువాపు వస్తుంది. నోటి నుంచి చొంగ కారుస్తూ గురక, శ్వాస పీల్చడం కష్టమవుతుంది. కళ్లు రావడంతో పాటు ఊసులు తోడుతుంటాయి.
నివారణ...
వర్షాకాలం ప్రారంభ సమయమైన జూన్, జూలైలో పశువులు విధిగా గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. వ్యాధి బారిన పడిన పశువులను కట్టేసే దొడ్డిని క్రిమి సంహారక మందులతో శుభ్రం చేయాలి. వ్యాధి ఇతర పశువులకు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సమీప పశువుల వైద్యాధికారిని సంప్రదించి తగిన మందులు వాడాలి.
గాలికుంటు వ్యాధి...
ఇది వైరస్ సోకడం లేదా కలుషితమైన గాలి ద్వారా వస్తుంది. తల్లి పాల ద్వారా దూడలకు సంక్రమించే ప్రమాదం ఉంటుంది. నోరు గిట్టల మధ్య బొబ్బలు, నోటి నుంచి సొంగ కారుతుంది. దీని నివారణకు నోటిలోని పుండ్లకు బోరిక్ పౌడర్, గ్లిజరిన్ కలిపి రాయాలి. గిట్టల మధ్య పుండ్లకు పర్మాంగనేట్ ద్రావణంతో శుభ్రం చేసి వేపనూనె రాయాలి. వ్యాధుల బారిన పడిన పశువులను మందతో తీసుకెళ్లకుండా విడిగా ఉంచి చికిత్సలు చేయించాలి.
ఆరోగ్యంగా ఉన్న పశువుల లక్షణాలు
ఆరోగ్యంగా ఉన్న పశువులు తోక, చెవులను ఎప్పుడూ ఆడిస్తూ నెమరు వేస్తూ చురుగ్గా ఉంటాయి.
పాల ఉత్పత్తిలో మార్పు ఉండదు.
పేడ ఆకు పచ్చగా ఉంటుంది.
అనారోగ్యం బారిన పడ్డ పశువుల లక్షణాలు
వ్యాధుల బారిన పడిన పశువుల మూత్రం వరిగడ్డి రంగులో ఉంటుంది.
నెమరు వేయదు. జ్వరం ఉంటుంది.
చర్మం మొద్దుబారి వెంట్రుకలు పైకిలేస్తాయి.
కళ్ల నుంచి నీరు కారుతుంటుంది.
చెవులు కిందకు జారి అలసిపోయినట్లుగా కనిపిస్తాయి.
పశుపోషణలో
Published Tue, Sep 2 2014 11:58 PM | Last Updated on Sat, Jun 2 2018 8:44 PM
Advertisement