జోగిపేట, న్యూస్‌లైన్: ‘సింగూరు ఎత్తిపోతల’పై మరో మాయ జరుగుతోంది. కాల్వల తవ్వకాలు, నిర్మాణంలో మాస్టర్ ప్లాన్‌ను పక్కన పెట్టి పాత కాల్వల గుండా, పంట పొలాల మీద నుంచి అడ్డుగోలుగా నీళ్లు పారిస్తున్నారు. నీళ్లును ఆందోల్ పెద్ద చెరువుకు తరలించాలనే ఏకైక లక్ష్యంతో అధికారులు, కాంట్రాక్టర్లు తాత్కాలిక కాల్వలు ఏర్పాటు చేసి నీళ్లు పారించే కార్యక్రమాన్ని ‘మమ’ అనిపించారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ వారం రోజుల కిందట ఆర్భాటంగా ప్రారంభించిన సింగూరు జలాల ట్రయల్న్ ్రవికటించి పంట పొలాల మీదకు నీళ్లు మళ్లిన విషయం తెలిసిందే.
మూడు గేట్లను అడుగు లోతుకు లేపి నీళ్లు వదలటంతో ఆ వేగానికి తట్టుకోలేక అసంపూర్తిగా కట్టిన కాల్వలు ఎక్కడికక్కడా తెగిపోయాయి. పాలకుల ఆతృతను రైతులు, ప్రతిపక్షాలు విమర్శించారు. పోయిన పరువు నిలబెట్టుకోవడం కోసం అటు పాలకులు, ఇటు అధికారులు, కాంట్రాక్టర్లు మూడు రోజులుగా కాల్వల వెంట తిరిగి వాటి నాణ్యత పరిశీలించారు. కాల్వ గుండా నీళ్లు పారించడం సాధ్యం కాదని నిర్ధారించుకున్న తరువాత ప్రాజెక్టు కాల్వ మాస్టర్ ప్లాన్‌ను పక్కన పడేశారు. డాకూర్, మాసానిపల్లి గ్రామాల మధ్యన ఉన్న కట్టుకాలువను తవ్వేశారు. ఇవి నిజాం కాలం నాటి కట్టు కాల్వలు. రైతుల పొలాల్లోంచి మట్టి తోడి గట్టుపోసి తాత్కాలికంగా కొత్త కాల్వలు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు నుంచి నీటి వేగాన్ని పూర్తిగా తగ్గించి కొద్దికొద్దిగా కాల్వలకు నీళ్లు వదిలారు. ఈ ప్రయత్నం కూడా వికటించింది. ఆందోల్ చెరువకు వెళ్లాల్సిన నీళ్లు డాకూర్ చెరువులోకి వెళ్లాయి. ఓ రాత్రంతా నీళ్లు చెరువులోకి పారాయి.
నిజాం కాలం నాటి కట్టుకాల్వను తవ్వేయడాన్ని మాసానిపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహన్ని వ్యక్తం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికాారులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో భయపడిన నీటిపారుదల శాఖ అధికారులు అఘమేఘాల మీద డాకూరు చెరువుకు వెళ్లే కాల్వను మూసి వేశారు. చెరవు నిండగానే తవ్విన కాలువను పూడ్చివేస్తామనే షరతు మీద తాత్కాలికంగా ఓ కాల్వను తవ్వేసి దాని ద్వారా మాసానిపల్లికి చెందిన కాల్వల మీదుగా అందోల్ చెరువులోకి నీరును పారించారు.
వాస్తవానికి 3 రోజుల్లోనే ఆందోల్ చెరువు నిండి అలుగు పోస్తుందని వేదిక మీద నుంచి డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఆందోల్ మండలంలో మూడు చెరువులు, పొల్కల్ మండలంలో 5 చెరువు నింపుతామని ప్రకటించారు. కానీ ప్రస్తుతం గేట్లను కొద్దిగా మాత్రమే తెరిచి పోట్టారు.
తాత్వాలికంగా కట్టిన కాల్వలకు ఏమాత్రం ఒత్తిడి లేకుండా నీటి ప్రవాహం సాగేటట్టు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం సాగుతున్న ప్రవాహ వేగాన్ని పట్టి చూస్తే పెద్ద చెరువు నిండటానికి కనీసం 10 రోజుల వరకు పట్టే అవకాశం ఉంది. మిగిలిన చెరువులు ఎప్పడు నింపుతారో..! ఇంకెన్ని తిప్పలు పెడతారో అధికారులకే తెలియాలి.
సింగూరు ఎత్తిపోతలలో మరో మాయ!
Published Tue, Feb 18 2014 11:25 PM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement
Advertisement