జోగిపేట, న్యూస్‌లైన్: అందోలు మండలం రాంసానిపల్లి గ్రామానికి చెందిన వందలాది మంది రైతులు డీఏపీ ఎరువుల కోసం రోడ్డెక్కారు. ఇద్దరి రైతులకు ఒక బ్యాగు చొప్పున ఎరువులు కేటాయిస్తామని అధికారులు చెప్పడంతో ఆగ్రహించి శుక్రవారం జాతీయ రహదారిపై బైఠాయించారు. జోగిపేటలోని వ్యవసాయ మార్కె ట్ కార్యాలయం ఎదుట ఉన్న జాతీయ రహదారిపై రైతులు బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ స్తంభించింది. నారాయణఖేడ్ వైపు నుంచి వచ్చేవాహనాలు ముర్షత్ దర్గా వరకు, జోగిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు భారత్ పెట్రోల్ పంపు వరకు నిలిచిపోయాయి.
దీంతో ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా రైతులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ బైఠాయించారు. సుమారుగా 45 నిమిషాల సేపు రాస్తారోకో జరిగింది. ఇదిలా ఉండగా విషయం తెలుసుకుని ఏఓ విజయరత్న ఆందోళన చేపడుతున్న రైతుల వద్దకు వచ్చి నిబంధనల ప్రకారం పంపిణీ చేస్తున్నామని, ఎక్కువ పంపిణీ చేయడం తన పరిధిలో లేదని తెలిపారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఒక్క బస్తాను ఇద్దరు రైతులు ఎలా తీసుకుంటారని, ఎరువులు పంపిణీ చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌కు ఎందుకు సమాచారం ఇవ్వలేదని గ్రామ నాయకులు ఆగమయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్‌లు విజయరత్నను ప్రశ్నించారు. తన వద్ద ఫోన్ నంబరు లేకపోవడంతో చెప్పలేకపోయానన్నారు. ప్రభుత్వం ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున పంపిణీ చేయాల్సి ఉందని, త్వరలో అందరికీ ఎరువులు అందేలా చూస్తానని ఏఓ చెప్పడంతో రైతులు శాంతించారు.
ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు
Published Sat, Oct 5 2013 1:24 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement