
ఎంపీగా పోటీ చేయాలని ఉంది: బాబూ మోహన్
వచ్చే ఎన్నికలలో లోక్సభ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని భావిస్తున్నట్లు ప్రముఖ నటుడు,మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్లో టీఆర్ఎస్ అద్యక్షుడు కేసీఆర్ను బాబు మోహన్ కలిశారు. అనంతరం బాబూ మోహన్ మాట్లాడుతూ... కేసీఆర్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పారు. తనను గతంలో ఎమ్మెల్యేగా చేసింది కేసీఆరే అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వచ్చే నెల మొదటి వారంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అయితే ఏ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతున్నది వెల్లడించేందుకు బాబూ మోహన్ నిరాకరించారు.
టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాజీ మంత్రి బాబూ మోహన్ ఈ నెల 23న ప్రకటించిన విషయం విదితమే. ఆందోల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా కొనసాగుతున్న తనకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థుల బీ-ఫారాలను ఇవ్వకపోవడంతో తాను తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాబూ మోహన్ గతంలో వివరించిన సంగతి తెలిసిందే.