జోగిపేట: జోగిపేట నగర పంచాయతీగా ఏర్పడిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.2.63 కోట్లు మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి అప్పట్లోనే టెండర్లను నిర్వహించారు. ఎన్నికల ముందు నిర్వహించిన టెండర్లను రద్దు చేయాలని కోరుతూ అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఉన్నతాధికారులకు సిఫార్సు చేయడంతో టెండర్లను రద్దు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రూ.50 లక్షలు నూతన భవన నిర్మాణానికి, మిగతా రెండు కోట్లు జోగిపేట, అందోలులోని సీసీ రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం తదితర పనుల నిమిత్తం వినియోగించుకునేందుకు అప్పటి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
నగర పంచాయతీ అధికారులు రూ.2.63 కోట్లకు సంబంధించి 36 పనులకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపగా టెండర్లు నిర్వహించాలని ఆదేశించింది. ఫిబ్రవరిలో టెండర్ల తేదీని కూడా ఖరారు చేశారు. పనులను చేపట్టేందుకు సీడీఆర్ అనే కాంట్రాక్టు సంస్థ టెండర్లను దక్కించుకుంది. పనులను ప్రారంభించాలనుకుంటున్న సమయంలోనే ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతో పనులను ప్రారంభించలేదు. ఇటీవల నగర పంచాయతీకి కొత్త పాలక వర్గం ఏర్పడింది. రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
నగర పంచాయతీకి సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్లను రద్దు చేసి తిరిగి చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పి.బాబూమోహన్ మున్సిపల్ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వెంటనే రూ.2.63 కోట్ల పనులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు ప్రస్తుతం నగర పంచాయతీ ఖాతాలో ఉన్నాయి. నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టాలనే విషయమై కొత్త పాలకవర్గం సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. ఒక్కో వార్డులో రూ.8, 9 లక్షల చొప్పున కేటాయించి పనులు చేపట్టాలని చెర్మైన్‌తో పాటు వార్డు కౌన్సిలర్లు అనధికార సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే టీఆర్‌ఎస్ పార్టీ కావడం..నగర పంచాయతీ పాలకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడంతో నిధుల వినియోగ విషయంలో స్పష్టత రావడంలేదు.
గతంలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ద్వారానే పనులు చేపట్టేలా కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసేందుకు నగర పంచాయతీ పాలకవర్గం భావిస్తున్నట్లు తెలిసింది.
జోగిపేట నగర పంచాయతీ టెండర్ల రద్దు
Published Tue, Aug 5 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM
Advertisement
Advertisement