జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చేపట్టిన ‘రాజనర్సింహ ఎత్తిపోతల పథకం’ పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. 2006లో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కాల్వల నిర్మాణం, భూసేకరణలకు గాను ప్రభుత్వం రూ.89.98 కోట్లను మంజూరు చేసింది. అయితే నీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకం తప్పనిసరి అని భావించి 2009లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2010-11లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసింది.
ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసేందుకుగాను ప్రభుత్వంతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. నిధుల మంజూరులో జాప్యం జరగడంతో ప్రధాన కాంట్రాక్టర్ సంవత్సరం క్రితం సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించారు.అప్పటి నుంచి ప్రస్తుతం పనులు కొనసా..గుతునే ఉన్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తవుతాయని పలుసార్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడంలేదు. ఈ పథకానికి డిప్యూటీ సీఎం తండ్రి స్వర్గీయ మాజీ మంత్రి రాజనర్సింహ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు నెలకొనడం వల్లే నిధుల మంజూరులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా పంప్‌హౌస్, కెనాల్, డెలివరీ స్లంప్, ఎలక్ట్రిక్, ప్యానెల్ గదులు, నిర్మాణాలకు సంబంధించి ఫినిషింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను రూ.12 కోట్లతో చేపడుతున్నారు.
డిప్యూటీ సీఎంకు ప్రతిష్టాత్మకం
సింగూరు జలాలను సేద్యానికి అందించే విషయంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఉన్నప్పటికీ సాధ్యపడలేదు. ఇప్పటికే నీరందిస్తామని పలుసార్లు డిప్యూటీ సీఎం ప్రకటనలు చేశారు. అయినా అందించ లేకపోయారు. పనులను త్వరగా పూర్తి చేయించేందుకు అధికారులు, కాంట్రాక్టర్లపై డిప్యూటీ సీఎం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు గాను ప్రాజె క్టు నుంచి 2టీఎంసీల నీటిని సేద్యానికి అందించాల్సి ఉంది. అయితే ఈ నీటిని కాల్వల నిర్మాణం ద్వారా అందిస్తారు. పూర్తి స్థాయిలో కాల్వల నిర్మాణం జరగలేదు.
‘రాజనర్సింహా’ఎప్పటికయ్యేనో?
Published Tue, Dec 24 2013 11:42 PM | Last Updated on Thu, Apr 4 2019 5:45 PM
Advertisement
Advertisement