Andole
-
ఫెంటాస్టిక్ ఫోర్ పవర్ పోరు
అవి తెలంగాణకు నాలుగు దిక్కుల్లో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు. కులాలు, మతాలతోపాటు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వైరుధ్యం ఉన్న ప్రాంతాలు. కానీ ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం ఒక్కటిగానే ఆలోచిస్తున్నాయి. ఒకరికొకరు కూడబలుక్కున్నట్టుగా తీర్పునిస్తున్నాయి. అంతేకాదు 1952 నుంచి 2018 వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి మినహాయిస్తే.. మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టింది. ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో అధికారం ఖాయమన్న సెంటిమెంట్‌కు అచ్చంపేట, అందోల్, సికింద్రాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలు ప్రాతిపదికగా నిలిచాయి. దీంతో ఈసారి కూడా అందరి చూపు ఈ నాలుగు నియోజకవర్గాలపైనే కేంద్రీ కృతమైంది. ఏడు దశాబ్దాల సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాయా? ఆనవాయితీకే పట్టం కడతాయా? అనేది ఆసక్తికరంగా మారింది. ‘అచ్చం’ అదే ట్రెండ్... నల్లమల అడవిని ఆనుకుని ఉన్న అచ్చంపేట నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం, దాని అనుబంధ ఆదాయాలపైనే ఆధారపడిన ప్రాంతం. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఈ సెగ్మెంట్లో అక్షరాస్యులు తక్కువే. నాగర్‌కర్నూల్ ద్విసభ నియోజకవర్గం నుంచి వేరుపడి 1962లో అచ్చంపేటగా ఏర్పడిన అనంతరం 2018 వరకు 13 సార్లు ఎన్నిక జరిగితే. 2009లో ఒక్కమారు మినహా, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం గమనార్హం. పి.మహేంద్రనాథ్ 1972లో కాంగ్రెస్, 1983, 85లలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి ఎన్టీఆర్ కేబినెట్లో కీలక పదవులు నిర్వహించారు. 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి డాక్టర్ వంశీకృష్ణపై 4,831 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక అభ్యర్థి, ఒక పార్టీ నుంచి రెండుమార్లు కంటే ఎక్కువగా గెలవకపోవడం. సికింద్రాబాద్..గెలిస్తే జిందాబాదే ఆంగ్లో ఇండియన్లకు తోడు తమిళ, మలయాళీలు, పక్కా తెలంగాణ మూలాలున్న అడ్డా కూలీలతో నిండిపోయిన సికింద్రాబాద్ తీర్పు సైతం ఎప్పుడూ ప్రత్యేకమే. 1952 –2018 వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే 14 మార్లు.. ఇక్కడ ఏ పార్టీ కూటమి గెలిస్తే.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. 1978లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్(ఐ) 175 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టినా.. ఇక్కడ మాత్రం జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎల్.నారాయణ, తన సమీప కాంగ్రెస్(ఐ) అభ్యర్థిపై 8,152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ మద్దతుతో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలోనూ 1957, 62, 67 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.సత్యనారాయణ మినహాయిస్తే, మరెవరూ వరుసగా మూడుమార్లు విజయం సాధించలేదు. అందోల్ తీరూ అంతే.. కన్నడ–తెలంగాణ సమ్మిళిత సంస్కృతి కనిపించే ఈ నియోజకవర్గంలో ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలే అత్యధికం. 1952లో ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడిన అందోల్‌లో 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో ఒక్కమారు మినహా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1983లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపడితే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌జీ.. ఈశ్వరీబాయిపై విజయం సాధించారు. ఇక అత్యల్ప మెజార్టీలతో గెలిచిన అదృష్టవంతులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. ఇక్కడ కూడా వరుసగా 3 సార్లు ఎవరూ గెలవకపోవటం విశేషం. గజ్వేల్.. కమాల్ హైదరాబాద్‌కు సమీపాన్నే ఉన్నా.. పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన గజ్వేల్‌లోనూ 1952 నుంచి 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో గెలిచిన పార్టీనే 13 మార్లు అధికారంలోకి వచ్చింది. 1952లో జరిగిన తొలి ఎన్నికలో కమ్యూనిస్టుల అభ్యర్థి పెండెం వాసుదేవ్, కాంగ్రెస్ అభ్యర్థి మాడపాటి హన్మంతరావుపై 15 వేలకు పైగా ఓట్లతో విజయం సాధిస్తే, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వెంకటస్వామిపై, స్వతంత్ర అభ్యర్థి గజ్వేల్ సైదయ్య 1,035 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన పార్టీలే రాష్ట్రంలోనూ అధికార పగ్గాలు చేపట్టాయి. ఈ నియోజకవర్గం నుంచి మూడుమార్లు గెలిచిన అభ్యర్థిగా గజ్వేల్ సైదయ్య పేరిటే ఇప్పటికీ రికార్డు ఉంది. అయితే 2014, 18లలో విజయం సాధించిన కేసీఆర్..మూడోసారి కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగటంతో గజ్వేల్‌పై ఆసక్తి నెలకొంది. ఒకే తీర్పు..ఒకింత విచిత్రమే.. ఈ నాలుగు నియోజకవర్గాల ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ నాలుగు ప్రాంతాల్లో విభిన్న సామాజిక వర్గాలు ఉన్నాయి. భౌగోళికంగానూ చాలా భిన్నమైన ప్రాంతాలు. పెద్దగా ఆశలు, ఆకాంక్షలు లేని వారు అత్యధికంగా ఉండే నియోజకవర్గాలు. కానీ ఎప్పుడూ ఇక్కడ గెలిచిన పార్టీలే దాదాపుగా ప్రతిసారీ అధికారం చేపట్టడం ఒకింత విచిత్రమే అని చెప్పాలి. – మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకుడు -శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి -
అందోల్‌లో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీదే అధికారం
వట్పల్లి(అందోల్): అందోలులో ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారంలోకి రావడం సెంటిమెంట్‌గా మారింది. ఆ సెంటిమెంట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కొనసాగింది. నవంబర్ 30వ తేదీన జరిగే ఎన్నికలను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారాలు మొదలు పెట్టాయి. ఇరు పారీ్టల అభ్యర్థులు గెలుపుపై ధీమాతో ఉండగా, స్థానికంగా ఎవరు గెలిస్తే ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్న చర్చ ప్రారంభమైంది. బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అభ్యర్థిత్వాలు ఇది వరకే ఖరారు కావడంతో ఆ రెండు పార్టీలు దూసుకుపోతున్నాయి. బీజేపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. బీఎస్పీ తరఫున ముప్పారం ప్రకాష్ పేరును ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్‌కుమార్ ప్రకటించారు. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందోలు ఫలితాలపైనే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 8 సార్లు కాంగ్రెస్‌దే గెలుపు అందోలు నియోజకవర్గం 1952లో ఏర్పడగా, 1967లో ఎస్సీ రిజర్వుడుగా మారింది. 1952 నుంచి 1985 వరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని కొనసాగించింది. 1985లో తొలిసారిగా టీడీపీ నుంచి మల్యాల రాజయ్య విజయం సాధించారు. 1989లో దామోదర రాజనర్సింహ మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1998లో జరిగిన ఉప ఎన్నికల్లో సినీనటుడు బాబూమోహన్ ఎన్నికై తిరిగి 1999–2000 సంవత్సరంలో రెండో సారి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది మంత్రిగా పనిచేశారు. ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరిగితే అందులో ఎనిమిది సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలుగుదేశం పార్టీ నాలుగుసార్లు, ఒక్కసారి ఇండిపెండెంట్ అభ్యర్థి, రెండు సార్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. ముహూర్తాలు కలిసొచ్చేనా? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను ఏ తేదీన, ఏ సమయంలో వేయాలో జాతకాలు చూపించుకుంటున్నారు. ఈ సారి నామినేషన్లను పోటాపోటీగా వేసేందుకు ఇప్పటినుంచే ముహూర్తాలు చూపించుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి క్రాంతికిరణ్ వేలాది మందితో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేయగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాత్రం కేవలం ఐదుగురితో కలిసి వచ్చి నామినేషన్ సమరి్పంచారు. ఈసారి కూడా హంగామాతో నామినేషన్ వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. నియోజవర్గంలో మొత్తం 2.25,714 మంది ఓటర్లు ఉండగా, ఇందులో మహిళలు 1,13,646.. పురుషులు 1,12,68 మంది ఓటర్లు ఉన్నారు. -
టిక్కెట్ తండ్రికి ఇవ్వాలా? కూతురుకి ఇవ్వాలా?
రాజకీయాల్లో అన్న దమ్ముల సవాళ్ళు చూశాం. తండ్రీ కొడుకుల సవాళ్ళు చూశాం. తాజాగా తెలంగాణలో తండ్రీ కూతుళ్ళ సవాళ్ళు చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో ఆయనో సీనియర్ నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నపుడు ఒక వెలుగు వెలిగారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేద్దామని తన నియోజకవర్గం టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదే నియోజకవర్గానికి ఆయన కుమార్తె కూడా దరఖాస్తు చేశారు. ఇప్పుడు టిక్కెట్ తండ్రికి ఇవ్వాలా? కూతురుకి ఇవ్వాలా? పార్టీ నాయకత్వానికి పరీక్ష పెట్టిన ఆ ఇద్దరు ఎవరో చూద్దాం. ✍️ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆందోల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు సీటు. ఇక్కడి నుంచి మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ మూడు సార్లు విజయం సాధించారు. ఉమ్మడి రాష్ట్రంలో తన హవా నడిచినా..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దామోదరకు కాలం కలిసి రావడంలేదు. గత రెండు ఎన్నికల్లోనూ రాజనర్సంహకు ఓటమి ఎదురైంది. అందుకే ఈ సారి ఎలాగైనా తన తండ్రిని గెలిపించాలన్న పట్టుదలతో దామోదర రాజనర్సింహ కూతురు త్రిష నియోజకవర్గంలో పల్లె బాట కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ✍️ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రిని గెలిపించాలని కాంగ్రెస్ కేడర్‌కు నూరి పోస్తున్నారు. అయితే ఇటీవల గాంధీభవన్‌లో పోటీ చేయడానికి దరఖాస్తు చేసుకున్నవారిలో తండ్రి రాజనర్సంహతో పాటుగా ఆయన కుమార్తె త్రిష కూడా దరఖాస్తు చేయడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తండ్రికి పోటీగా బిడ్డ కూడా పార్టీలో టిక్కెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం గాంధీభవన్‌లో కలకలం రేపింది. ✍️గత కొంత కాలంగా దామోదర కుమార్తె త్రిష ఆందోల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. నియోజకవర్గంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అంతే కాదు నియోజకవర్గంలో రోజుకు ఒక గ్రామం చొప్పున పల్లెబాట పేరుతో ప్రజల్లో ఉంటూ..స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఎన్నికల క్యాంపెనింగ్ మొదలుపెట్టారు. అయితే దామోదర రాజనర్సింహ మాత్రం నియోజకవర్గంలో జరుగుతున్న ఏ కార్యక్రమాలకు హాజరు కావడంలేదు. అదే సమయంలో ఆయన కుమార్తె త్రిష ఉత్సాహంగా ప్రజల్లో తిరగుతుండటం..ఆయనేమో దూరంగా ఉండటం..ఇప్పుడు ఇద్దరూ టిక్కెట్ కోసం దరఖాస్తు చేయడంతో కాంగ్రెస్ శ్రేణులు అయోమయానికి గురవుతున్నారు. ✍️పార్టీలో సీనియర్ నేత అయిన రాజనర్సింహను గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం ఆయనకు సిడబ్లుసి సభ్యత్వం కట్ట బెట్టడంతో కార్యకర్తల్లో కొంత ఉత్సహం నింపింది. అయతే ఆయన మాత్రం ఇప్పటి వరకు నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమం చేపట్టకపోగా..కనీసం నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడకపోవడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు ప్రకటించక ముందు దామోదర అధికార పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగింది. అంతే కాదు జహిరాబాద్ ఎస్సి రిజర్వుడ్ స్థానం నుంచి దామోదర పోటీ చేస్తారని కూడా ఆందోల్‌లో ప్రచారం సాగింది. ✍️ఏది ఏమైనా దామోదర రాజనర్సింహ మౌనం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహం కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆందోల్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా దామోదర రాజనర్సింహ బరిలో ఉంటారా లేదా ఆయన కుమార్తె త్రిష పోటీ చేస్తారా అనే సందేహం కాంగ్రెస్ శ్రేణుల్ని పీడిస్తోంది. మరి ఆందోల్ కాంగ్రెస్ టిక్కెట్ ఎవరిదనే సస్పెన్స్ ఎప్పటికి వీడుతుందో చూడాలి.. -
అందోల్‌లో వేడెక్కుతున్న రాజకీయం.. వ్యూహాలు ఫలించేనా?
తెలంగాణ ఏర్పడిన తరువాత జరిగిన 2014 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ మంత్రి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి అప్పటి ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై విజయం సాధించడం జరిగింది. 2018 ఎన్నికల్లో టిఆర్ఎస్ ఆభ్యర్థిగా జర్నలిస్ట్ నాయకుడు మలిదశ ఉద్యమకారుడు చంటి క్రాంతి కిరణ్ కాంగ్రెస్ అభ్యర్ధి దామోదర రాజనర్సింహపై విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయితే విజయం సాధిస్తారో అదే పార్టీ ప్రభుత్వం చేపడుతోంది. వేడెక్కుతున్న రాజకీయం.. అధికార పార్టీలో పోటీలు! రోజు రోజుకు అందోల్‌లో రాజకీయం వేడెక్కింది. పోటీలో ఉండే నాయకులు టికెట్ల కోసం వారి, వారి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు, మాజీ డిప్యూటి సిఎం దామోదర్ రాజనర్సింహ పేరు ఖరారు అయినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీ నుంచి గత ఎన్నికల్లో మాజీ మంత్రి బాబూమోహన్ బరిలో నిలిచారు. ఈ సారి ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కమలంలో కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఇక అధికార పార్టీలో ఈసారి సిట్టింగ్‌లకే టికెటు దక్కడంతో మరోసారి అందోల్ నుంచి క్రాంతి కిరణ్ పోటీకి సై అంటున్నారు. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : నిరుద్యోగ సమస్య గ్రామీణ రోడ్ల సమస్య రైతులు పండించిన పంటలకు మద్దత్తు ధర లేకపోవడం పీజీ కళాశాలలో మౌళిక వసతుల లేమి మున్సిపల్‌కు సొంత భవనం లేకపోవడం రాజకీయ పార్టీల ప్రధాన పార్టీల టికెట్ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు: బీఆర్ఎస్ చంటి క్రాంతి కిరణ్ (సిట్టింగ్ ఎమ్మెల్యే) కాంగ్రెస్ పార్టీ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ బీజేపీ మాజీ మంత్రి పల్లి బాబుమోహన్ జిల్లా మాజీ జెడ్పి చైర్మన్ బాలయ్య టికెట్ రేసులో ఉన్నారు. వృత్తి పరంగా ఓటర్లు: నియోజకవర్గంలో ప్రధానంగా ఎక్కువ మంది ప్రజలు రైతాంగంపైనే ఆధారపడి ఉన్నారు. కొంత శాతం మంది వ్యాపారంపై ఆధారపడి ఉన్నారు. వ్యాపార పరంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో జోగిపేట మున్సిపాలిటీ ముందంజలో ఉంది. నియోజకవర్గంలో భౌగోళిక పరిస్థితులు నదులు: మంజీరా అత్యంత కీలకమైనది. మంజీరా నదిపై సింగూరు జలాశయం 30 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన ప్రాజెక్టు జంట నగరాల దాహార్తి తిరుస్తూ సంగారెడ్డి మెదక్ జిల్లాల రైతులకు సాగునీటి అవసరాలు తిరుస్తుంది. ఒక్క అందోలు నియోజకవర్గంలో ఎడమ కాలువ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుంది. సింగూరు పర్యాటక కేంద్రంగా విరజిల్లుతుంది. ఆలయాలు: ఉత్తర తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంగా పేరుగాంచిన అందోలు మండలంలోని కిచ్చన్నపల్లిలో దేవాలయం కలదు. అల్లాదుర్గం మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ దేవాలయం అదే విధంగా అక్కడే బేతాళ స్వామి ఆలయం అత్యంత ప్రతిష్ట గాంచినవి. నియోజకవర్గంలోని ఆసక్తికర అంశాలు : ఇప్పటి వరకు అందోలు నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరగగా మొదటి సారి జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి జోగిపేటకు చెందిన బసవ మామయ్య విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సార్లు విజయం సాధించగా టీడీపీ నాలుగు సార్లు విజయం సాధించింది. తెలంగాణ రాష్టం ఏర్పడ్డాక బీఆర్ఎస్ రెండు సార్లు విజయం సాధించింది. రాజకీయానికి సంబంధించి ఇతర అంశాలు : 1957 లో మొదటిసారిగా ఏర్పడిన అందోలు నియోజకవర్గం మొదటి రెండు పర్యయాలు జనరల్ స్థానంగా ఉండి 1967 లో ఎస్సి రీజర్వు స్థానంగా ఏర్పడింది. 1957 లో జోగిపేటకు చెందిన ప్రముఖ స్వతంత్ర సమర యోధుడు బసవ మనయ్య కాంగ్రెస్ అభ్యర్ధి రూక్ ఎండి.రూక్ మోద్దీన్ పై విజయం సాధించడం జరిగింది. 1962 లో లక్షిదేవి గారు కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి బసవ మణయ్య పై విజయం సాధించారు. 1967 లో ఎస్సి రిజర్వుడ్ గా ఏర్పడిన తరువాత సిరారపు రాజనర్సింహ కాంగ్రెస్ పార్టీ తరుపున స్వతంత్ర అభ్యర్థి ఈశ్వరప్ప పై విజయం సాధించారు. 1972 లో రాజనర్సింహ కాంగ్రెస్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థి లక్మన్ కుమార్ పై విజయం సాధించారు. 1978 లో మరో మారు రాజనర్సింహ ఎమ్మెల్యేగా విజయం సాధించారు 1983 లో టిడిపి తరుపున ఆల్ దేకర్ లక్మన్ జి ఈశ్వరి భాయ్ పై విజయం సాధించడం జరిగింది 1985 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి రాజనర్సింహ పై గెలుపొందడం జరిగింది. 1989 లో కాంగ్రెస్ పార్టీ తరువున దామోదర రాజనర్సింహ పోటి చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాల్యాల రాజయ్య పై విజయం సాదించారు. 1994 లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాల్యాల రాజయ్య కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై గెలుపొందారు. 1998 లో అప్పటి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా కొనసాగుతున్న మాల్యాల రాజయ్య సిద్ధిపేట ఎంపీగా గెలుపొందడంతో జరిగిన బై ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గా సినీ యాక్టర్ బాబుమోహాన్ గెలుపొందారు. 1999 లో జనరల్ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బాబుమోహన్ కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ పై మరోమారు గెలుపొందడం జరిగింది. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజనర్సింహ తెలుగుదేశం అభ్యర్థి బాబుమోహన్ పై రెండు సార్లు వరుసగా విజయం సాధించి ప్రాథమిక ఉన్న విద్యాశాఖలతో ఉప ముఖ్యమంత్రి గా కావడం జరిగింది. -
అందోల్, జోగిపేట చైర్మన్‌ను దింపేద్దాం..
సాక్షి, జోగిపేట(అందోల్): సంగారెడ్డి జిల్లాలోని అందోల్–జోగిపేట మున్సిపాలిటీ రాజకీయాలు ఊహించని విధంగా రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై సొంత పార్టీ (బీఆర్ఎస్)కి చెందిన కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో నోటీసును అందజేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం 11 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు తమ కుటుంబ సభ్యులతో కలసి చిట్కుల్లోని చాముండేశ్వరీ అమ్మవారి ఆలయం ఆవరణలో సమావేశమయ్యారు. చైర్మన్, వైస్చైర్మన్ల వ్యవహారశైలిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, వారిని పదవిలో నుంచి దింపేయాలని తీర్మానించారు. అక్కడ నుంచి నేరుగా సంగారెడ్డి కలెక్టరేట్‌కు వెళ్లారు. అక్కడ కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ వీరారెడ్డిని కలిశారు. ఆయన సూచన మేరకు ఇన్‌వార్డులో అవిశ్వాస తీర్మానం నోటీసును అందించారు. అక్కడి ఉద్యోగులు సోమవారం వచ్చి కలెక్టర్‌ను కలవాలని సూచించడంతో నోటీసు అందించి వెనుదిరిగారు. మెజారిటీ కౌన్సిలర్ల వ్యతిరేకత అందోల్ – జోగిపేట మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులున్నాయి. ఇందులో 14 మంది బీఆర్ఎస్, ఆరుగులు కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు చైర్మన్‌ను వ్యతిరేకిస్తున్నారు. రోజూ చైర్మన్ వెంట ఉండే కౌన్సిలర్లు సైతం బహిరంగంగా చైర్మన్ తీరుపై విమర్శలు చేయడం విశేషం. కాగా, ఈ పరిణామంపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ నాయకులు తెలిపారు. -
తనకంటే ముందే తనువు చాలించాలని..
సాక్షి, రాయికోడ్(అందోల్): తన భాగస్వామికన్నా ముందే తనువు చాలించాలనుకున్న ఓ వృద్ధురాలు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమె అంత్యక్రియలు ముగిసి 24 గంటలు గడవకముందే భర్త అనారోగ్యంతో మృతిచెందాడు. ఈ విషాధ సంఘటన సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం శంశోద్దీన్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. శంశోద్దీన్‌పూర్ సర్పంచ్ బి.నర్సింలు పెద్దనాన్న మల్లయ్యకు వారం క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో ఆస్పత్రికి తరలించారు. చదవండి: (భార్యను భరించలేను.. విడాకులు కావాల్సిందే: సాఫ్ట్వేర్ ఇంజనీర్) భర్త అనారోగ్యాన్ని చూసి తట్టుకోలేక భార్య లక్ష్మమ్మ(75)భర్త కంటే ముందే తనువు చాలించాలని గురువారం పురుగులమందు తాగింది. వెంటనే బీదర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ అదే రాత్రి 9.30 గంటలకు మృతి చెందింది. శుక్రవారం సాయంత్రం ఆమె అంత్యక్రియలు పూర్తికాగా రాత్రి 10 గంటల ప్రాంతంలో అనారోగ్యంతో ఉన్న లక్ష్మమ్మ భర్త మల్లయ్య(80) మృతి చెందాడు. వృద్ధ దంపతులిద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. లక్ష్మమ్మ అంత్యక్రియలు చేసి వెళ్లిన బంధువులు శనివారం సాయంత్రం మల్లయ్య అంత్యక్రియలు జరిపారు. చదవండి: (భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..) -
కారంపొడి చల్లి.. కత్తులతో దాడి
సంగారెడ్డి మున్సిపాలిటీ/జోగిపేట (అందోల్): పాతకక్షలు భగ్గుమన్నాయి. భూ వివాదం విషయమై చోటుచేసుకున్న ఘర్షణ.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. తండ్రీకొడుకులపై ప్రత్యర్థులు కారంపొడి చల్లి.. కత్తులతో దాడి చేశారు. దీంతో కొడుకు మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. జోగిపేట సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి దేవయ్య (మెదక్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ), కాశన్నగారి ప్రదీప్‌కు చెందిన వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. భూ తగాదాల కారణంగా ఇరువురి మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాయి.(చదవండి: ‘నీవు లేకుండా నేను ఎలా బతకాలి’ ) ఈ క్రమంలో తమకు సంబంధించిన పొలంలో దేవయ్య దున్నుకుంటున్నారని తెలుసుకున్న ప్రదీప్ సోదరులు కాశన్నగారి కరుణాకర్, ప్రసాద్, స్నేహితుడు సైదులు, మరో ఇద్దరు మహిళలు మాణెమ్మ, సురేఖలు కలసి మంగళవారం దేవయ్య, ఆయన కుమారుడు కరుణాకర్‌తో గొడవకు దిగారు. వీరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ప్రదీప్ వర్గానికి చెందిన వారు తండ్రీకొడుకులపై కారంపొడి చల్లి, మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చెందాడు. దేవయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. -
మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్
జోగిపేట (అందోల్): ‘ఆర్టీసీ సమ్మె ముగియకుంటే మా జీవితాలు ముగిసినట్లే. నా భర్త ఉద్యోగానికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. సీఎం సారూ.. కనికరిస్తే బాగుండు. సమ్మె కారణంగా ఆందోళనతో నా భర్త మతి స్థిమితితం కోల్పోయాడు. కడుపునిండా తిని 20 రోజులయ్యింది’అంటూ ఆర్టీసీ కండక్టర్ నాగేశ్వర్ (45) భార్య సుజాత కన్నీటి పర్యాంతమవుతూ తమ కష్టాలను వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ నాగేశ్వర్ జోగిపేటకు చెందిన సుజాతను 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రతి రోజు సంగారెడ్డి డిపో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటీవల ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్‌లైన్‌ను టీవీలో చూసినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో సుజాత తన తల్లి నివాసం ఉండే జోగిపేటకు భర్తతో కలసి వచ్చింది. మూడు, నాలుగు రోజులనుంచి నాగేశ్వర్ టికెట్.. టికెట్.. బస్ ఆగింది దిగండి.. రైట్ రైట్ అంటూ అరవడం, అసందర్భంగా నవ్వుతుండటం, ఫోన్ రాకున్నా హాలో.. హాలో అనడం, ఎవరు చేశారని ఎవరైనా అడిగితే అశ్వత్థామ.. అని సమాధానం ఇస్తున్నాడు. ఒక్కోసారి ఉండండి.. డిపోలో కలెక్షన్ కట్టివస్తా .. అని కూడా అంటున్నాడని భార్య సుజాత ఆందోళన వ్యక్తం చేసింది. తనను, పిల్లలను కూడా గుర్తు పట్టడంలేదని తెలిపింది. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, జీతం రాక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో చదువులను మధ్యలోనే మాన్పించేసినట్లు ఆమె చెప్పింది. నాగేశ్వర్ రాత్రంతా నిద్రపోకుండా ఏదో ఒకటి మాట్లాడుతుండడంతో భర్త ప్రవర్తనను చూసి సుజాత కన్నీరు మున్నీరవుతూ జాగారం చేస్తుండగా, కొడుకులు కూడా తల్లిదండ్రుల బాధను చూసి వారు కూడా నిద్రకు దూరం అవుతున్నారు. చేతిలో డబ్బులు లేవని, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు సాయం చేయాలని సుజాత వేడుకుంటోంది. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్న ఉన్నవారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని తెలిపింది. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో దేవుడి మీద భారం వేసి అలాగే ఉన్నట్లు తెలిపింది. కాగా, నాగేశ్వర్‌కు చికిత్స చేయించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. (చదవండి: చలో ట్యాంక్‌బండ్ మరో మిలియన్ మార్చ్) -
ఆకట్టుకుంటున్న శక్తి పోలింగ్ స్టేషన్
సాక్షి, జోగిపేట(అందోల్): అందోలులోని ఉన్నత పాఠశాలలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా బుధవారం శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. నియోజకవర్గానికి ఒక్కటి శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఆదేశాలు ఉండటంతో అందోలులో ఏర్పాటు చేసినట్లు అందోలు తహసీల్దార్ బాల్‌రెడ్డి తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రానికి వెళ్లే దారిని అందంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక కర్టెన్లతో స్వాగత తోరణాన్ని ఏర్పాటు చేశారు. వివాహ వేడుకలాగా ఏర్పాటు చేసిన స్వాగతతోరణం బాగా ఆకట్టుకుంటుంది. గ్రామస్తులు ప్రత్యేకంగా ఈ కేంద్రాన్ని చూసి వెళ్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జోగిపేటలోని బాలుర ఉన్నత పాఠశాలలో శక్తి పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటు చేశారు. -
‘సీ విజిల్ యాప్‌ను వినియోగించాలి’
సాక్షి, జోగిపేట(అందోల్): ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు చేసేందుకు సీ విజిల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని జెడ్పీ సీఈవో రవి సూచించారు. శుక్రవారం పట్టణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు యువత ఈ విషయంలో స్పందించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 13 నుంచి సీ విజిల్ అందుబాటులోకి ఎన్నికల కమిషన్ తెచ్చినట్లు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రతీ నియోజకవర్గం పరిధిలో 24 గంటలు పనిచేసే విధంగా నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీ విజిల్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఫిర్యాదుదారులకు 100 నిమిషాల్లో సమాచారం పంపే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన, యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి బాబూ నాయక్ తహసీల్దారు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏకగ్రీవాల్లో దూసుకుపోతున్న టీఆర్ఎస్
సాక్షి, మెదక్: పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. గ్రామపంచాయతీల ఏకగ్రీవాల్లో అధికార పార్టీ టీఆర్ఎస్ సత్తా చాటుతోంది. తాజాగా అందోల్ నియోజకవర్గంలో 12 గ్రామాల్లో సర్పంచ్ల ఎన్నిక ఏకగీవ్రం కాగా.. ఈ 12 స్థానాలను టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. అల్లదుర్గం మండలం మందాపూర్, రెగోడ్ మండలం పెద్ద తండా, టేక్మాల్ మండలం మల్కాపూర్, చంద్రు తండా, సాంగ్యతాండ, అసన్ మహమ్మద్‌పల్లి, చెరువు ముందరి తండా, పుల్కల్ మండలం లింగంపల్లి, బద్దీరిగూడెం, గొంగళూర్ తండా, వట్పల్లి మండలం దర్కాస్‌పల్లి, గౌతంపూర్ తదితర గ్రామాల్లో సర్పంచ్ పదవులను ఏకగ్రీవంగా టీఆర్ఎస్ సొంతం చేసుకుంది. -
అందోల్.. దంగల్
అందోల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధానంగా ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్ఎస్ నుంచి జర్నలిస్ట్ నేత క్రాంతికిరణ్ అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ప్రజాఫ్రంట్ తరఫున మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మరోసారి బరిలో నిలిచారు. ఇక తాజామాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు టీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవడంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఎల్ఎఫ్ నుంచి జయలక్ష్మి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే తిరిగి గెలిపిస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్ భరోసాతో ఉన్నారు. స్థానిక నినాదాన్ని తెరపైకి తేవడంలో సఫలీకృతుడైన క్రాంతికిరణ్ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కలిసి వస్తాయని దామోదర ధీమా వ్యక్తం చేస్తున్నారు. జోగిపేట(అందోల్): కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ‘అందోలు’ నియోజకవర్గానికి పేరుంది. 1952 నుంచి 2014వరకు 15సార్లు జరిగిన ఎన్నికల్లో 9సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బాబూమోహన్ గెలుపొందారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా వరకు అమలయ్యాయనే చెప్పవచ్చు. అయితే 2018లో జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబూమోహన్‌కు టీఆర్ఎస్ పార్టీ మొండి చెయ్యి చూపింది. దీంతో ఆయన బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరఫున జర్నలిస్టు క్రాంతికిరణ్, కాంగ్రెస్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, బీఎల్ఎఫ్ నుంచి జయలక్ష్మి, బీఎస్పీ తరఫున బుచ్చయ్యలు పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నా తాజామాజీ ఎమ్మెల్యేగా ఉన్న బాబూమోహన్ కూడా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుంది. ఈ నియోజకవర్గ పరిధిలో 8 మండలాలు వస్తాయి. ఈసారి ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయి. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు. అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సింగూరు నీటిని సేద్యానికి అందించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కాలువల నిర్మాణం చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు కాలువల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. అందోలు పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.4.90 కోట్లు మంజూరు చేసారు. మొత్తం 10కోట్ల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. చాలా సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న జోగిపేట మోడల్ స్కూల్ భవనాన్ని రూ.1.70 కోట్లతో పూర్తి చేసారు. జోగిపేటలో 100 పడకల ఆస్పత్రినిర్మాణం పనులను పూర్తి చేసారు. గత సంవత్సరమే మంజూరైనా పనులు అసంపూర్తిగా ఉండగా ఈ ప్రభుత్వం పూర్తి చేసింది. బీసీ, మైనార్టీ బాలికల, బాలుర గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి. జోగిపేటలో రెండున్నర కోట్లతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాన్ని పూర్తి చేసారు. ఈ స్టేడియం గత ప్రభుత్వ హయాంలోనే మంజూరైంది. సుమారుగా రూ.200 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ద్వారా రోడ్లు, కల్వర్టులు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జోగిపేట కట్టుకాలువ పనులకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరు కావడంతో పనులు కొనసాగుతున్నాయి. రూ.36.99 కోట్లతో తాలెల్మ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారు. ఈ పథకంతో మూడు మండలాలకు చెందిన గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రధాన సమస్యలు నియోజకవర్గంలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా సేద్యానికి నీరు అందించాల్సిన అవసరం ఉంది. ఈ మండలాల్లో కేవలం బోర్లు, చెరువులపైనే ఆధారపడి పంటలు పండించుకుంటున్నారు. నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉపాధిమార్గాలు లేక చాలా మంది వలస పోతున్నారు. నియోజకవర్గంలో ఇంకా పూర్తిస్థాయిలో ఇంటింటికీ తాగునీటి పథకం పనులు పూర్తికాలేదు. అందోలు, జోగిపేటలలో ప్రధాన ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తి కాలేదు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కడా డబుల్బెడ్రూం ఇళ్లు పూర్తి కాలేదు. నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా అర్హత ఉంది. చంటి క్రాంతికిరణ్ (టీఆర్ఎస్) జర్నలిస్టు క్రాంతికిరణ్ ఈసారి జరగబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అందోలు నియోజకవర్గంలో స్థానికులకు 60 ఏళ్లుగా అవకాశం లభించలేదని, స్థానిక నినాదాన్ని తెరపైకి తేవడంలో సఫలీకృతుడైన క్రాంతికిరణ్ అధికార పార్టీ ద్వారా టికెట్టు సంపాదించగలిగారు. అందోలులో ‘స్థానిక’ సెంటిమెంట్ ఉన్నట్లు స్వయంగా కేసీఆర్ ప్రకటించడం విశేషం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని వట్పల్లి మండలం పోతులగూడ గ్రామం స్వగ్రామం, స్థానికుడినైన తనను ఆదరించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు. దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్) మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అందోలు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తండ్రి మాజీ మంత్రి రాజనర్సింహ మరణించడంతో 1989లో దామోదర రాజనర్సింహకు పోటీ చేసే అవకాశం లభించింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను, ఎన్నికల్లో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. రూ.400 కోట్లతో జేఎన్టీయూ ఏర్పాటు చేసానని, 2006లో సింగూరు కాలువ పనులకు దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించానని ప్రచారంలో చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్నారు. జయలక్ష్మి (బీఎల్ఎఫ్) జయలక్ష్మి కార్మికనేతగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర అంగన్వాడీ వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంగన్వాడీ టీచర్‌గా పనిచేసిన ఆమె కార్మికులకు నేరుగా సేవలను అందించాలన్న ఉద్ధేశంతో టీచర్ పదవికి రాజీనామా చేసి ఫుల్‌టైం సీఐటీయూ అనుబంధ సంఘంలో పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ఉద్యమాలతో రాష్ట్ర బీఎల్ఎఫ్ కమిటీని ఆకర్షించారు. నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండడంతో బీఎల్ఎఫ్ మహిళా అభ్యర్థిగా జయలక్ష్మిని ఎంపిక చేసారు. బీఎల్ఎఫ్ ప్రకటించిన మేనిఫెస్టోను ఊరూరా ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకుపోతున్నారు. సీఐటీయూ అనుబంధంగా ఉన్న ఆశ, అంగన్వాడీ, మున్సిపల్, హమాలీ, అసంఘటిత కార్మిక సంఘాల ఓటర్లపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు. సిట్టింగ్ ప్రొఫైల్ తాజామాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సీఎం కేసీఆర్ 1998లో బాబూమోహన్‌ను అందోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉపఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గం నుంచి 1998, 1999, 2014లలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కార్మికమంత్రిగా కూడా పనిచేసారు. టీడీపీలో ఉన్న బాబూమోహన్ 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన బాబూమోహన్ 86,759 ఓట్లు సాధించి అప్పటి డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహను 3208 ఓట్లతో ఓడించారు. సీఎం కేసీఆర్‌ను బావ అని పిలిచేంత సన్నిహితం బాబూమోహన్‌కు ఉన్నా 2018లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు ఇవ్వలేదు. దీంతో బీజేపీలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో చేరి పోటీ చేస్తున్నారు. పరిపూర్ణానందస్వామితో పాటు ఇతర జాతీయ నాయకులతో నియోజకవర్గంలో సభలను ఏర్పాటు చేసి ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు. 2014 పోల్ గ్రాఫ్ మొత్తం ఓటర్లు: 2,22,779 బాబూమోహన్ (టీఆర్ఎస్) 86,759 పోలైన ఓట్లు: 1,80,186 మెజార్టీ: 3,208 రాజనర్సింహ(కాంగ్రెస్) 83,551 పోలైన ఓట్లు: 1,80,186 2018 ఓట్ గ్రాఫ్ పోలింగ్ కేంద్రాలు: 294 మహిళా ఓటర్లు: 1,11,646 పురుషులు : 1,10,229 మొత్తం ఓటర్లు: 2,21,894 -
కేసీఆర్‌పై విరుచుకుపడ్డ బాబుమోహన్
సాక్షి, అందోల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగని తాజా మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబుమోహన్ విమర్శించారు. బుధవారం జోగిపేట హౌసింగ్ బోర్డు కాలనీలో బీజేపీ కార్యాలయాన్ని బాబుమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ దళితుల్ని అవమానపరుస్తున్నారని, దళితుడే ముఖ్యమంత్రి అని ప్రకటించిన కేసీఆర్ నలుగురు దళితులను మోసం చేశాడని ఆరోపించారు. కేసీఆర్‌ను దళిత వ్యతిరేకిగా అభివర్ణించారు. బీజేపీకి దళితున్ని పార్టీ అధ్యక్షుడిగా, రాష్టపతిగా అవకాశం కల్పించిన ఘనత ఉందని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ నాయకులు సూది, దారం, చెక్కర అంటూ దర్జీల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని అన్నారు. మంచి మహా మహా రాజులకు బట్టలు కుట్టిన చరిత్ర దర్జీలదని పేర్కొన్నారు. బీజేపీ జెండా అందోల్ నియోజకవర్గంలో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మందుకు డబ్బుకు బీజేపీ దూరంగా ఉంటుందని తెలిపారు. -
అధికార పార్టీలో పోటాపోటీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి : సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అందోలు టీఆర్ఎస్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. 2014 సా«ధారణ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో పార్టీలోకి వచ్చిన బాబూమోహన్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన వైఖరితో పార్టీ నియోజకవర్గ నేతలు కొందరు దూరంగా ఉంటున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తామంటూ ఇద్దరు నేతలు మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఎవరికి దక్కుతుందనే అంశంపై స్థానికంగా చర్చ జరుగుతోంది. అందోలు అసెంబ్లీ నియోజకవర్గం ఆవిర్భావం నుంచి 2014 సాధారణ ఎన్నికల వరకు 15 పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్, టీడీపీ వరుస విజయాలు నమోదు చేసిన ఈ నియోజకవర్గంలో 2014 సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. 1998 ఉప ఎన్నికతో పాటు 1999 సాధారణ ఎన్నికల్లో టీడీపీ తరపున టికెట్ సాధించిన సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వరుస ఓటమి చవిచూసిన ఆయన 2014 సాధారణ ఎన్నికల సందర్భంగా చివరి నిమిషంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా నాలుగేళ్లకు పైగా పదవీ కాలం పూర్తి చేసిన బాబూమోహన్ వైఖరితో కొందరు టీఆర్ఎస్ నేతలు విభేదిస్తున్నారు. జోగిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ డి.బి.నాగభూషణం, సాయికుమార్ వంటి ఒకరిద్దరు నేతలు బహిరంగంగానే ఎమ్మెల్యే వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో వీరికి మరికొందరు మార్కెట్ కమిటీ చైర్మన్లు, కొందరు నేతలు కూడా తోడైనట్లు సమాచారం. అసంతృప్త నేతల్లో కొందరు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌తో సత్సబంధాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఎంపీ బీబీ పాటిల్ చాలా కాలంగా అందోలు నియోజకవర్గంలో పర్యటించకపోవడం ఎమ్మెల్యే, ఎంపీ నడుమ నెలకొన్న విభేదాలకు తార్కాణంగా చెబుతున్నారు. బరిలోకి కొత్త ముఖాలు అందోలు నియోజకవర్గం టీఆర్ఎస్లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య తాజాగా తెరమీదకు వస్తున్నారు. నియోజకవర్గ రాజకీయాలపై తమదైన పట్టుకలిగిన మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి వర్గం బక్కి వెంకటయ్యకు మద్దతు పలుకుతున్నట్లు తెలి సింది. మాణిక్ రెడ్డి సోదరుడు జైపాల్‌రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య అభ్యర్థిత్వాన్ని బహిరంగంగా సమర్థిస్తున్నట్లు సమాచారం. గతంలో దుబ్బాక జెడ్పీటీసీ సభ్యుడిగా పనిచేసిన బక్కి వెంకటయ్యకు సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యం కూడా ఉంది. జోగిపేటలో సుమారు రెండు దశాబ్దాలుగా వ్యాపార సంబంధాలు కలిగి ఉండడంతో స్థానికులతో విస్తృత పరిచయాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న బక్కి వెంకటయ్య ఇప్పటికే అంతర్గతంగా స్థానిక నేతలను కలుస్తూ, మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నట్లు సమాచారం. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బాబూమోహన్ ఉండడంతో ఎన్నికల నాటికి బలంగా తెరమీదకు వచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే టీఆర్ఎస్ ఆవిర్భావ సమయంలో ఆర్సీపురం జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన జర్నలిస్టు సంఘం నేత సీహెచ్ క్రాంతికిరణ్ కూడా టీఆర్ఎస్ టికెట్‌ను ఆశిస్తున్నారు. అందోలు టికెట్ స్థానికులకే అనే నినాదాన్ని తెరమీదకు తెస్తున్నారు. ఆయన మద్దతుదారులు కూడా సామాజిక మాధ్యమాల్లో ఇదే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లోనూ క్రాంతికిరణ్ టికెట్ ఆశించినా దక్కక పోవడంతో ఇండిపెండెంట్‌గా పోటీ చే శారు. తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇటీవల కొందరు టీఆర్ఎస్ అసంతృప్త నేతలతో సమావేశమైనట్లు సమాచారం. బాబూమోహన్ వర్గీయులు మాత్రం ఆయనకు టికెట్ దక్కదనే ప్రచారాన్ని తోసిపుచ్చుతున్నారు. ప్రభుత్వ పథకాల అమలు అందోలు నియోజకవర్గంలో పకడ్బంధీగా అమలవుతుండటాన్ని ప్రస్తావిస్తున్నారు. -
కొత్త పంచాయతీలు ఏకగ్రీవం చేసుకోండి
జోగిపేట(అందోల్) సంగారెడ్డి : జిల్లాలో మొదటి నూతన పంచాయతీ భవనాన్ని బ్రాహ్మణపల్లిలోనే నిర్మిస్తానని, అందుకు అవసరమైన నిధులను నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ ప్రకటించారు. గురువారం అందోల్ మండలం బ్రాహ్మణపల్లి గ్రామ నూతన గ్రామ పంచాయతీని కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పుణ్యమాఅని నియోజకవర్గంలో చాలా వరకు కొత్త పంచాయతీలను ఏర్పాటు చేసుకోగలిగామన్నారు. ప్రభుత్వం కొత్త పంచాయతీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న పట్టుదలతో ఉందన్నారు. అభివృద్ధికి అడ్డుపడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్త పంచాయతీల్లో పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేసుకుంటే గ్రామాన్ని అందరి అభిప్రాయాల మేరకు అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆరోగ్యం బాగా లేకున్నా నాకు ఇష్టమైన బ్రాహ్మణపల్లి గ్రామానికి వచ్చానని అన్నారు. తనకు భగవంతుడు ఆకాశమంత కీర్తిని ఇవ్వగలిగాడని, నాకు ఈ రోజు ఆరోగ్యం బాగా ఉంటే ఆస్ట్రేలియాలో ప్రధాని పక్కన కూర్చునే కార్యక్రమానికి వెళ్లే వాడినని, అలాంటి గుర్తింపు తనకు ఉందని, గ్రామాల్లో కొన్ని కలుపు మొక్కల వల్ల ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ నర్సింగ్‌రావు, తహసీల్దార్ నాగేశ్వరరావు, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు లింగాగౌడ్, జగన్మోహన్రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వర్కల అశోక్, కౌన్సిలర్లు శ్రీకాంత్, గోపాల్, లక్ష్మణ్, నవీన్, గ్రామ పెద్దలు నారాయణ భట్టాచారి, సుదర్శన భట్టాచారి, ఈఓ పీఆర్డీ శ్రీనివాసరావు, ఏపీఓ అర్చన, మార్కెట్ డైరెక్టర్ మల్లికార్జున్, మాణిక్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ యశస్విని, టీఆర్ఎస్ పట్టణ, యవత అ«ధ్యక్షుడు సీహెచ్. వెంకటేశం, జి.రవీంద్రగౌడ్, టీఆర్ఎస్ నాయకులు జాకీర్, శ్రీధర్‌రెడ్డిలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. -
అక్క ఊరిలో ఉత్సవాలకు వచ్చి..
పుల్కల్(అందోల్) : అక్క ఊరిలో జరుగుతున్న ఉత్సవాలను చూడడానికి వచ్చిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోర్పోల్లో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఉప్పరిగూడెంకు చెందిన దూసరి శేఖర్(19) కోర్పోల్‌లోని తన అక్క ఊరిలో జరుగుతున్న జాతరకు వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో బట్టలు ఊతికేందుకు వెళ్లాడు. అందరూ ఒడ్డున బట్టలు ఊతుకుతుండగా శేఖర్ స్నానం చేసేందుకు చెరువు లోకి దిగాడు. ఈత వచ్చినప్పటికీ చెరువు అవతలి వైపుకు వెళ్లి తిరిగి వస్తుండగా నీటిలో మునిగి పోయాడు. రెండేళ్ల క్రితం మిషన్ కాకతీయలో బాగంగా చెరువులో పూడిక తీయడంతో నీళ్లు అధికంగా ఉన్నాయి. మనుగుతున్న శేఖర్‌ను గమనించిన వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బయటకు తీసే ప్రయత్నం చేయగా అప్పడికే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పుల్కల్ ఎస్ఐ ప్రసాద్‌రావు విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్ఐ తెలిపారు. ఒక్కగానొక్క కొడుకు మృతి.. వీరయ్య– నర్సమ్మ దంపతులకు శేఖర్ ఒక్కడే కొడుకు, ఇద్దరు ఆడ పిల్లలు. రెండు సంవత్సరాల క్రితం శేఖర్ తండ్రి వీరయ్య గుండె పోటుతో మృతి చెందాడు. శేఖర్ సంగారెడ్డిలోని ఓ స్వీట్ హౌజ్‌లో పనిచేస్తూ తల్లిని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. -
ఎమ్మెల్యే వర్సెస్ సర్పంచ్ : నువ్వెంత అంటే నువ్వెంత
సాక్షి, వట్పల్లి(అందోల్): మండలంలోని ఖాది రాబాద్ గ్రామంలో ఎమ్మెల్యే బాబూమోహన్ పర్యటన ఉద్రిక్తతకు దారిసింది. గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించడానికి వచ్చిన ఎమ్మెల్యే బాబూమోహన్‌కు స్థానిక సర్పంచ్ రమేశ్జోషి మధ్య విద్యుత్ ఉపకేంద్రం వివాదం చెలరేగింది. గ్రామంలో ఏర్పాటుచేసిన విద్యుత్ ఉపకేంద్రం ప్రారంభించిన నాటి నుంచి ఇంత వరకు వినియోగంలోకి రాలేదని, అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే వినియోగంలోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటానని సమాధానం ఇచ్చారు. మూడేళ్లుగా ఇవే మాటలు చెబుతూ గ్రామస్తులను మోసం చేస్తున్నారని, సమస్యకు తక్షణ పరిష్కారం చూపాలని సర్పంచ్ పట్టుబట్టడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ వివాదం నువ్వేంత అంటే నువ్వెంత అని, చూసుకుందామంటే చూసుకుందామనే స్థాయికి వెళ్లింది. ఈ గొడవ ఎక్కడికి దారితీస్తుందోనని స్థానికులు భయాందోళలకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు వెంటనే కలుగజేసుకొని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమనిగింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
మరో ఐదు నిమిషాలు అయ్యింటే..
సాక్షి, అందోల్: మరో ఐదు నిమిషాలు అయితే ముగ్గురూ గమ్యం చేరుకునేవారే, కానీ అంతలోనే విధి వక్రించింది. మృత్యువు కారు రూపంలో వచ్చి ఇద్దరిని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని సరాఫ్పల్లి గ్రామ సమీపంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. కొర్పోల్ గ్రామానికి చెందిన అరిగే లక్ష్మయ్య(55), శంకయ్య, అశోక్‌లు ద్విచక్ర వాహనంపై శంకరయ్య బంధువులకు బంగారం (దసరా జమ్మి) ఇచ్చేందుకు హత్నూర మండలం చిన మద్దూరుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. సరాఫ్పల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మారుతి వ్యాన్ ఓవర్టేక్ చేయబోయి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య, శంకరయ్యలు అక్కడికకక్కడే మృతిచెందగా, రెండు కాళ్లు విరిగి, క్షతగాత్రుడైన అశోక్‌ను సికింద్రాబాద్ గాంధీ అసుపత్రికి తరలించారు. ఈమేరకు ఎస్ఐ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఏడాదిలోనే ఇద్దరు మృతి లక్షయ్య పెద్ద కొడుకు గత ఏడాది పురుగుమందు తాగి అత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు లక్ష్మయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబంలో ఇద్దరు పెద్దలను కోల్పోయారు. శంకరయ్యకు పెండ్లీడుకు వచ్చిన కూతురుతోపాటు, చేతికొచ్చిన కొడుకు ఉన్నాడు. చేతికి వచ్చిన కొడుకుతోపాటు, ఇప్పుడు భర్త కూడా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరంటూ లక్ష్మయ్య భార్య రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. కాగా, శంకరయ్య తండ్రి సైతం గత ఏడాదే మృతిచెందాడు. -
సర్పంచులకు అన్ని అధికారాలు ఇవ్వాలి
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం హైదరాబాద్: కింది స్థాయిలో అన్ని సమస్యల పరిష్కారానికి గ్రామ వ్యవస్థే ఎంతో కీలకమని దానికి నిధులు, విధులు, అధికారం ఇవ్వకపోవడం సబబు కాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గ్రామ స్థాయిలో ఏ సమస్య వచ్చినా ముందుగా సర్పంచ్‌నే ప్రశ్నిస్తారని, వారికి విధులు కల్పించడం వల్ల ప్రభుత్వంపై భారం తగ్గడమే కాకుండా పనులు కూడా సక్రమంగా జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘సర్పంచుల మహా ధర్నా’ పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్, పురుషోత్తంలతో కలసి కోదండరాం ఆవిష్కరించారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ నిధులు, విధులు కల్పించాలని రాజ్యాంగం చెప్పినా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు ఆందోళ్ కృష్ణ, శాంతి నాయక్ పాల్గొన్నారు. -
స్కాలర్‌షిప్పుల కోసం విద్యార్థుల నిరసన
మదనపల్లె రూరల్: తమకు స్కాలర్షిప్పులు రావడంలేదని పేర్కొంటూ పీజీ చేస్తున్న ఓబీసీ విద్యార్థులు బుధవారం సబ్‌కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ కళాశాలలో ఫిజిక్స్ గ్రూప్ విద్యార్థులకు స్కాలర్షిప్ వచ్చి ఇతరులకు ఇవ్వకపోవడంపై దారుణమన్నారు. స్కాలర్షిప్కు అవసరమైన అన్ని సర్టిఫికెట్లను జతపరిచి వెబ్సైట్లో వెళ్లి చూడగా పెండింగ్ అట్ కలెక్టర్ ఆఫీస్ అంటూ వస్తోందని తెలిపారు. చిత్తూరుకు వెళ్లి కలెక్టరేట్లో విచారించగా తమకేమీ సంబంధం లేదని పేర్కొంటున్నారని, విజయవాడలోని ఈబీసీ కార్పొరేషన్‌కు వెళ్లి కనుక్కోండంటూ చెబుతున్నారని వాపోయారు. ఇప్పటికే స్కాలర్షిప్లు రానివారు కళాశాల ఫీజులు చెల్లించాలని యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని తెలిపారు. అనంతరం సబ్‌కలెక్టరేట్‌లో ఏవో సురేంద్రబాబుకు వినతిపత్రం సమర్పించారు. నిరసన తెలిపిన వారిలో ఏబీవీపీ నాయకులు భరత్‌రెడ్డి, భరత్‌చౌహాన్, ఖాజా, మస్తాన్, చందు పాల్గొన్నారు. -
మంజీరా జిల్లా ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు రేగోడ్: అందోల్ కేంద్రంగా మంజీరా జిల్లాను ఏర్పాటు చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజాభిప్రాయం మేరకే జిల్లాలు, మండలాల ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ చెబుతున్నా అందుకనుగుణంగా జరగటం లేదన్నారు. రాజకీయలబ్ధి కోసమే పునర్విభజన చేస్తున్నారన్నారు. అందోల్ నియోజకవర్గం నుంచి ఎమ్యెల్యేగా పనిచేసిన వారు అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. మంజీరా జిల్లాలో నియోజకవర్గంలోని ఏడు మండలాలతో పాటు నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని కలపాలన్నారు. లేకుంటే ఈ ప్రాంత ప్రజలు, విద్యార్థులకు ఎంతో నష్టం జరుగుతోందన్నారు. పునర్విభజన సరిగా లేదంటూ నియోజకవర్గంలోని రేగోడ్, అల్లాదుర్గం వంటి మండలాల్లో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయన్నారు. వెనుకబడిన ప్రాంతమైన అందోల్‌ను మంజీరా జిల్లాగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
జోగిపేటలో భారీ వర్షం
జోగిపేట: అందోలు మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో మంగళవారం భారీగా వర్షం కురిసింది. ఉదయం 4 గంటల నుంచి ఎడతెరపిలేకుండా వర్షం కురియడంతో మండల పరిధిలోని వివిధ చెరువులు, కుంటల్లోకి నీరు కొద్దిపాటిగా చేరినట్లు ప్రజలు తెలిపారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 11 గంటల వరకు వర్షం కురియడంతో జనజీవనం స్థంభించి పోయింది. బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాలకు వెళ్లి ప్రార్థనలు చేస్తారు. వర్షం కారణంగా మసీదుల్లోనే ప్రార్థనలు చేశారు. జోగిపేటలోని ప్రధాన రహదారులపై అక్కడక్కడ గుంతల్లో నీరు చేరింది. కొన్ని రోడ్లు వర్షంతో చిత్తడిగా మారాయి. జనాలు ఇంట్లో నుంచి బయటకు రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. 40 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షం కురియడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
‘అందోలు’కు రూ.80 కోట్లు
అందోలు-ఎర్రారం వరకు బైపాస్‌రోడ్డు మోడల్‌స్కూల్ టెండర్లు పూర్తి అందోలు ఎమ్మెల్యే పి.బాబూమోహాన్ జోగిపేట: అందోలు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులకు గాను ప్రభుత్వం ఇటీవల రూ.80 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే పీ.బాబూమోహన్ పేర్కొన్నారు. గురువారం అందోలు గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని ఎస్సీ కాలనీలల్లో సీసీ రోడ్ల కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఏడు మండలాల్లోని పాఠశాలలో టాయ్లెట్ల నిర్మాణం, పైప్లైన్ల ఏర్పాటు, డ్రింకింగ్ వాటర్ కోసం రూ.5 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులు నియోజకవర్గ అభివృద్ధి నిధులు కోటి, జిల్లా మంత్రి ద్వారా రూ. 2 కోట్లు, విద్యాశాఖ మంత్రి ద్వారా రూ.2కోట్లు మంజూరు చేస్తున్నారన్నారు, పలు అభివృద్ధి పనులకు సంబంధించి ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. రూ.13 కోట్లతో నిర్మిస్తున్న పాలిటెక్నిక్ కళాశాలల నూతన భవనాలు శరవేగంగా పనులు జరుగుతున్నాయన్నారు. బుదేరాలో రూ.12 కోట్లతో డిగ్రీ కళాశాల నిర్మాణం, రాయికోడ్‌లో రూ. 13 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్, బుదేరాలో రోడ్లు భవనాల శాఖ గెస్ట్‌హౌస్ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. అందోలు పెద్ద చెరువు వద్ద రూ.4.50 కోట్లతో మినీ ట్యాంకు బండ్ నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. జోగిపేట-నాందేడ్ అకోలా రహదారి ఫోర్‌లైన్ రోడ్లుగా విస్తరించేందుకు గాను ఎలాంటి అడ్డంకులు రాకుండా అల్మాయిపేట వద్ద నుంచి బైపాస్‌రోడ్డు పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయన్నారు. ఆత్మకమిటీ చైర్మన్ లక్ష్మికాంతరెడ్డి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు కే.రమేశ్, మాజీ ఉపాధ్యాక్షుడు లింగాగౌడ్, పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు డీబీ నాగభూషణం, కౌన్సిలర్లు శ్రీకాంత్, లక్ష్మణ్, టేక్మాల్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు యూసూఫ్ అలీ, నాయకులు రవీంద్రగౌడ్, గోపాల్, సీహెచ్.వెంకటేశం, చేనేత సొసైటీ చైర్మన్ వర్కల అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు. -
పెట్రోల్ బంక్ వద్ద వినియోగదారుల ఆందోళన
కోనరావుపేట(కరీంనగర్) : మండలకేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ వద్ద శనివారం సాయంత్రం వినియోగదారులు ఆందోళన చేపట్టారు. కల్తీ పెట్రోల్ విక్రయిస్తున్నారని, దీంతో తమ వాహనాలు చెడిపోతున్నాయని ఆరోపిస్తూ తహసీల్దార్ గంగయ్యకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం ప్రకారం.. కోనరావుపేట పెట్రోల్ బంక్‌లో కొన్ని రోజులుగా కల్తీ పెట్రోల్ విక్రయాలు జరుపుతున్నారు. ఫలితంగా పెట్రోల్ వినియోగించిన వారు తమ వాహనాలు త్వరగా చెడిపోతున్నాయని, మెకానిక్‌లను అడిగితే కల్తీ పెట్రోల్ పోయడమే కారణమని చెబుతున్నారని అన్నారు. శనివారం సాయంత్రం కోనరావుపేట, వట్టిమల్ల, కొండాపూర్, వెంకట్రావుపేట గ్రామాలకు చెందిన ఆటోడ్రైవర్లు, వాహనదారులు పెట్రోల్‌ను బాటిళ్లలో పట్టి చూడగా కింద నీరులాంటి పదార్థం ఏర్పడింది. దేవయ్య, దామోదర్, రామచంద్రం ఈ విషయమై తహసీల్దార్ గంగయ్యకు ఫిర్యాదు చేశారు. -
ఆందోళనలో ముంపు బాధితులు
గౌరవెల్లి, గండిపెల్లి సామర్థ్యం పెంపును వ్యతిరేకి స్తున్న నిర్వాసితులు నిర్వాసితుల పక్షాన పోరాటానికి సిద్ధమైన విపక్షాలు అంచనాలు రూపొందించే పనిలో అధికారులు రిజర్వాయర్ పనులు చేపట్టే దిశలో ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : గౌరవెల్లి, గండిపెల్లి రిజర్వాయర్ల సామర్థ్యం పెంచాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కరీంనగర్, వరంగల్ జిల్లాలోని సుమారు నాలుగు వేల మంది నిర్వాసితులు కానున్నారు. వీరిలో 80 శాతం మంది దళిత, గిరిజనులే. ముఖ్యంగా గండిపెల్లి రిజర్వాయర్ సామర్థ్యం పెంపుతో ముంపుకు గురయ్యే వారిలో నూటికి 99 శాతం గిరిజనులే కావడం గమనార్హం. తొలిదశలో నిర్వాసితులుగా మారి ప్రభుత్వ సాయంతో సమీప ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసిన రైతులు సైతం రీ డిజైనింగ్ ఫలితంగా మళ్లీ భూములు కోల్పోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో నిర్వాసితుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికంగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించడంతోపాటు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం నేతలు నిర్వాసితుల పక్షాన ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే సీపీఐ వీరికి బాసటగా వివిధ కార్యక్రమాలు చేపట్టగా, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం నిర్వాసితులకు అండగా పాదయాత్ర నిర్వహించారు. మరోవైపు ఆయా రిజర్వాయర్ల సామర్థ్యం పెంపుకే మొగ్గు చూపుతున్న ప్రభుత్వం అంచనాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. ఇప్పటికే రీడిజైన్‌కు సంబంధించి సర్వే కూడా పూర్తి కావడం గమనార్హం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా రిజర్వాయర్ల పనులు చేపట్టి దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గౌరవెల్లి నేపథ్యమిదీ... వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు జలాశయం దిగువన సుమారు రెండు లక్షల ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరందించే ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి 2007 సెప్టెంబర్ 9న గౌరవెల్లి, గండిపెల్లి, తోటపెల్లి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తోటపల్లి జలాశయానికి రెండు వేలు, గౌరవెల్లి రిజర్వాయర్‌కు 1800, గండిపెల్లికి 295 ఎకరాల భూమిని సేకరించి నిర్వాసితులకు నష్టపరిహారం అందించారు. వైఎస్ మరణానంతరం సహాయ పునరావాస కార్యక్రమాలు ఆగిపోయాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసింది. రీడిజైన్ పేరుతో 1.41 టీఎంసీల గౌరవెల్లి రిజర్వాయర్‌ను 8.23 టీఎంసీలకు, 0.148 టీఎంసీల గండిపెల్లి రిజర్వాయర్‌ను ఒక టీఎంసీ సామర్థ్యానికి పెంచుతూ తాజాగా ఉత్తర్వులు విడుదల చేసింది. రీడిజైన్వల్ల మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరందివచ్చని ప్రభుత్వం భావిస్తోంది. సర్కారు తాజా నిర్ణయంతో హుస్నాబాద్ మండలంలోని నాలుగు గ్రామాలు ముంపుకు గురికానున్నాయి. మొత్తం 1868 ఎకరాలను భూమిని సేకరించేందుకు అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. ఇప్పటికే ముంపు బాధిత ప్రాంతాలుగా ప్రకటించిన గుడాటిపల్లి, తెనుగుపల్లి, మద్దెలపల్లి, కొత్తపల్లి గ్రామాలతోపాటు తాజాగా మరో నాలుగు గ్రామాలు ముంపు బారినపడనున్నాయి. ఈసారి ముంపుకు గురయ్యే ప్రాంతాలన్నీ గిరిజన ఆవాసాలే కావడం గమనార్హం. చింతల్‌తండా, జాలుబాయితండా, సేవానాయక్‌తండా, బొంథ్యాతండా, తిరుమల్తండా, సోమాజితండాలు వీటిలో ఉన్నాయి. గండిపెల్లి రిజర్వాయర్ కోసం మరో 1152 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో కరీంనగర్ జిల్లాలో 857, వరంగల్ జిల్లాలో 243 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమయ్యారు. రీడిజైన్ వల్ల మొత్తం 16 గిరిజన తండాలు ముంపు బారిన పడనున్నాయి. వీటిలో ఏడు తండాలు కరీంనగర్, తొమ్మిది తండాలు వరంగల్ జిల్లాల్లోనివి. ఆ ప్యాకేజీతో నష్టమే... రీడిజైన్‌కు ముందు ఈ రెండు రిజర్వాయర్ల కింద భూమి కోల్పోయే రైతులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద ఎకరాకు రూ.2.10 లక్షల చొప్పున చెల్లించారు. అదే సమయంలో ఈ ప్రాంతంలోని భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. ఎకరా ధర రూ.6–10 లక్షల వరకు పలికింది. సర్కారు అందించిన సాయంతో చుట్టుపక్కల భూమిని కొందామనుకున్న రైతులకు నిరాశే ఎదురైంది. తాజాగా రీడిజైన్ పేరుతో భూమిని కోల్పోయే రైతులకు 123 జీవో ప్రకారం వర్షాధార భూములకు ఎకరాకు రూ.6.5 లక్షలు, శిఖం భూములకు ఎకరాకు 5.5 లక్షల వరకు చెల్లించాలని భావిస్తోంది. ఇండ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూం పథకాన్ని వర్తింపజేయాలని యోచిస్తోంది. సర్కారు ఇచ్చే నష్టపరిహారంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అరెకరం భూమి కూడా కొనలేని పరిస్థితి నెలకొంది. ఒక్కో ఎకరా రూ.12 నుంచి రూ.15 లక్షల ధర పలుకుతోంది. దీంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్వాసితులంతా గిరిజనులు, నిరక్షరాస్యులే అధికంగా ఉండటంతో భూమిని కోల్పోతే రోడ్డున పడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మేం ఒప్పుకోం.. రీడిజైన్ పేరుతో తమ భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోబోమని నిర్వాసితులు చెబుతున్నారు. చావనైనా చస్తాం కానీ పాత పద్ధతిలో భూమిని సేకరిస్తామంటే ఒక్క ఎకరా భూమి కూడా ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే గుడాటిపల్లెలో నిర్వాసితులు నిరవధిక దీక్ష చేపట్టారు. ఒకవేళæతప్పనిసరైతే 2103 పార్లమెంట్ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలని కోరుతున్నారు. అందులో భాగంగా బహిరంగ మార్కెట్‌కు నాలుగు రెట్లు ధర లేదా ఎకరాకు రూ.15 లక్షల చొప్పున చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతోపాటు ఊరుకు ఊరు, తండాకు తండా నిర్మించాలని కోరుతున్నారు. ఇంటికో ఉద్యోగం, ఎస్సీ, ఎస్టీలకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పశువుల పాకలకు, పైప్‌లైన్, బావులు, బోర్లు, చెట్లకు ప్రత్యేక ధర చెల్లించాలని కోరుతున్నారు. రిజర్వాయర్ ఆయకట్టులో కోరిన చోటే కాలనీ నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. జైలుకైనా పోతంగానీ.. భూములియ్యం – బానోతు హేమ్లానాయక్, గండిపెల్లి మేం జైలుకైనా పోయేందుకు సిద్ధంగా ఉన్నాం. సర్కారు చెబుతున్న రేటుకు సెంటు జాగా కూడా ఇచ్చేది లేదు. ముందు చెప్పినట్లు డ్యాం కట్ట చేస్తే చాలు. మళ్లా పెంచుడెందుకు.. మమ్ముల్ని ముంచుడెందుకు? మా భూములు ఇచ్చి మేం ఎక్కడపోయి బతుకాలే. మా పిల్లలు ఏం చేసి బతుకుతరు? ఎకరం రూ.12లక్షల పైనే.. – బానోతు రెడ్డి, శ్రీరాంతండా మా తండాల రూ.12 లక్షలు పెట్టినా ఎకరం భూమి దొరుకుత లేదు. డ్యాం కింద పోయే భూములకు ఐదారు లక్షలు ఇత్తమంటే ఎట్ల. నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. అందులో నాలుగు ఎకరాల మామిడితోట ఉన్నది. సీజన్‌కు రూ.2లక్షల పంటలు తీసేటోళ్లం. ఆ భూములు పోతున్నయంటేనే ఏడుపొస్తుంది. -
చెరువులకు జల కళ..
అందోలు, అన్నాసాగర్ పెద్ద చెరువులకు వర్షపు నీరు రైతన్నల్లో ఆనందం జోగిపేట : అందోలు మండలంలోని చెరువులు, కుంటలు నీటితో కళ కళలాడుతున్నాయి. ఐదు రోజుల క్రితం ఏ మాత్రం నీళ్లే లేని అన్నాసాగర్ పెద్ద చెరువులో ఒకేసారి భారీగా నీరు వచ్చి చేరింది. రెండు మాసాల క్రితం మిష¯ŒS కాకతీయ పథకం కింద ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టారు. చెరువులోకి కాల్వల ద్వారా బ్రాహ్మణపల్లి, నేరడిగుంట, డాకూర్ గ్రామాలమీదుగా నీరు వచ్చి చేరింది. అలాగే అందోలు పెద్ద చెరువులోకి వర్షపు నీరు వచ్చి చేరింది. నాలుగు రోజులు నుంచి ఈ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. దీంతో గ్రామాల్లోని కుంటల్లో కూడా నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటి వరకు నాలుగు రోజుల్లో 5 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు అంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు జోరందుకున్నాయి. అన్నాసాగర్ చెరువు కింద రైతులు వరి నాట్లు దాదాపు పూర్తి చేస్తున్నారు. పోసానిపేట, డాకూరు, అక్సా¯ŒSపల్లి, జోగిపేట, అందోలు, కొడెకల్, నాదులాపూర్, తాలెల్మ ప్రాంతాల్లోని కుంటల్లో వర్షపు నీరు వచ్చి చేరింది. ప్రతిరోజూ ఈ ప్రాంతంలో వర్షం కురుస్తూనే ఉంది. వారం పాటు ఇలాగే వర్షాలు కురిస్తే భూగర్భజలాలు పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. చెరువులోకి నీరు రావడం సంతోషంగా ఉంది అన్నాసాగర్ పెద్ద చెరువులో ఇటీవల మిష¯ŒS కాకతీయ పథకం కింద పూడిక తీత పనులు చేపట్టారు. ఇది కొంతమేరకు ఉపయోగపడింది. ఖరీఫ్ సీజ¯ŒS ప్రారంభంలో చుక్కనీరు లేకపోవడంతో ఆందోళన చెందాం. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షపు నీరు చెరువులోకి చేరింది. – మల్లేశం, రైతు , అన్నాసాగర్ చెరువులు నిండితేనే ప్రయోజనం పోసానిపేట చెరువులోకి వేరే కాలువల ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో కేవలం వర్షం నీరుతో మాత్రమే చెరువు నిండే అవకాశం ఉంది. నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. వర్షాకాలంలో అనుకున్నంతగా వర్షాలు కురుస్తే రైతులు గట్టెక్కినట్లే. – దుర్గయ్య, రైతు, పోసానిపేట -
హరితహారంలో పాల్గొన్న బాబు మోహన్
మెదక్ : మెదక్ జిల్లా పోతిరెడ్డిపల్లిలో బుధవారం చేపట్టిన హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే బాబూమోహన్ అందరినీ ఉత్సాహపరిచారు. కార్యక్రమంలో భాగంగా ఒక్క రోజే ఏడువేల మొక్కలను గ్రామంలో నాటారు. ఆయనతోపాటు సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్, రాష్ట్ర హరితహారం ఇంచార్జి ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకావడంతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. అంబేద్కర్ విగ్రహం నుంచి చౌదరి చెరువు వరకు దాదాపు రెండు కిలోమీటర్ల పొడుగునా జనంతో రహదారి నిండిపోయింది. గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి నృత్యాలు, పాటలతో ప్రముఖులకు స్వాగతం పలికారు. -
పదవులు ఎవరికి ఇద్దాం!
జోగిపేట : ఎవరికి ఏ పదవులు కావాలో.. ఇవ్వాలో చెప్పదలచుకున్నారా.. చిట్టీ రాసి సంచిలో వేయండి అంటూ అందోల్ ఎమ్మెల్యే బాబూమోహన్ కార్యకర్తలకు సూచించారు. ప్రభుత్వం త్వరలో భర్తీ చేయబోయే నామినేటెడ్ పోస్టుల కోసం అభిప్రాయ సేకరణ చేపట్టేందుకు ఆయన హైదరాబాద్‌లోని నెక్టార్ గార్డెన్ క్లబ్లో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎవరికి ఏ పదవి కావాలో చిట్టీ రాసి సంచిలో వేయాలని ఖాళీ సంచిని అక్కడుంచారు. కొందరు కార్యకర్తలు లేచి ఏ పదవైనా ఎమ్మెల్యేగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు అభ్యంతరం లేదని చెప్పగా అదే అభిప్రాయం రాసి వేయండి అంటూ ఆయన సూచించడం విశేషం. మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ సమావేశానికి హాజరై కొద్ది సేపటి తర్వాత జిల్లా పర్యటనకు వెళ్లారు. అనంతరం ఈ చిట్టీల కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 250 మంది వరకు నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరైనట్లు సమాచారం. జోగిపేట, వట్పల్లి, రాయికోడ్ మండలాల్లో మార్కెట్ కమిటీ పదవులు కోరుతూ పలువురు ఫలానా నాయకుడికి ఇస్తే బాగుంటుందని తెలుపుతూ చిట్టీలు రాసి సంచిలో వేశారు. చైర్మన్ పదవుల రేసులో ఉన్న వారు తమ పేర్లతో చిట్టీలు రాసినట్లు తెలిసింది. జోగిపేట మార్కెట్‌కు ముగ్గురు రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్యే సంచిలోని చిట్టీలను ఎప్పుడు చదువుతారో... తమ పేరును ఎప్పుడు పలుకుతారోనని నాయకులు స్థానిక నాయకుల్లో టెన్షన్ పట్టుకుంది. -
మహిళా రైతు ఆత్మహత్య
మెదక్ (ఆందోల్) : మెదక్ జిల్లా ఆందోల్ మండలం డాకూర్ గ్రామంలో శుక్రవారం కవిత(28) అనే మహిళా రైతు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల వేసిన పత్తి పంట ఎండిపోవటం, అప్పులబాధ తీర్చే మార్గం కనపడకపోవటంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. -
ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం
ఆందోల్ (మెదక్) : హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. మెదక్ జిల్లా ఆందోల్ మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ఉంటూ ఇంటర్మీడియట్ చదువుతున్న సౌజన్య, ప్రవల్లిక అనే ఇద్దరు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. విద్యార్థినులు శుక్రవారం నుంచి కనిపించడంలేదు. దీంతో ప్రిన్సిపాల్ శనివారం జోగిపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. -
‘ఆంధ్రాపోరి’ఆడియో ఆవిష్కరణ
-
రైతు కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోవడంలేదు
- వైఎస్సార్ సీపీ అందోలు నియోజకవర్గ ఇన్చార్జి బి.సంజీవరావు జోగిపేట: వైఎస్సార్ సీపీ రాష్ర్ట అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కలిసి స్థానిక సమస్యలను వివరించినట్లు అందోలు నియోజకవర్గ ఇన్చార్జి బి.సంజీవరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో పంట నష్టాన్ని భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న కుటుంబాల గూర్చి రాష్ర్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని పార్టీ అధ్యక్షుడికి వివరించినట్లు తెలిపారు. జిల్లాలో రైతులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంపై వత్తిడితేవాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందన్నారు. ప్రత్యేకంగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంతైనా ఉందన్నారు. గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే లబ్ధిదారులకు అందేలా అధికారులపై వత్తిడి తీసుకురావాలని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు లక్ష్మణ్, మదన్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
నీళ్లలో పసికందు
మెదక్ (జోగిపేట): మెదక్ జిల్లా జోగిపేట మండలం ఆందోల్ చెరువులో రెండు నెలల పసికందు మృతదేహం లభించింది. గురువారం ఉదయం నీటిపై బాలుని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బాలుడు ఎవరు, ఇంతటి దారుణానికి పాల్పడిన వారు ఎవరు అనే వివరాలు ఇంకా తెలియా రావాల్సి ఉంది. -
ఆరు మాసాల్లోనే అద్భుతాలు చేయాలా?
పొన్నాల, దామోదర వ్యాఖ్యలపై అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఆగ్రహం జోగిపేట: ఆరు మాసాల్లో అద్భుతాలు చేయాలా! ఐదేళ్ల కోసం తమకు ప్రజలు పట్టం కట్టారనే విషయాన్ని ప్రతి పక్ష పార్టీలు గుర్తుంచుకోవాలని అందోలు శాసనసభ్యుడు బాబూమోహన్ పేర్కొన్నారు. బుధవారం జోగిపేట ఎంపీపీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జోగిపేటలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితరులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే తిప్పి కొట్టారు. నియోజకవర్గానికి 60 వేల ఎకరాలు ఎక్కడి నుంచి తెస్తారని పొన్నాల ప్రశ్నించడం సిగ్గుచేటని, ఆయన మాదిరి ఎస్సీల భూములను లాక్కొని మాత్రం ఇవ్వమని, ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసి ఇస్తామన్నారు. తెలంగాణ మేమిచ్చాం...మేం తెచ్చామంటున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఇవ్వకుంటే భూస్థాపితమవుతామనే భయంతోనే ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే వందలాది మంది విద్యార్థులు, యువకులు అమరులు కాకముందే ఇవ్వాల్సి ఉండెనన్నారు. ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పుఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో మార్పురాలేదన్నారు. అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, అన్ని పార్టీలను మెప్పించి ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదింపజేసుకున్న సీఎం కేసీఆర్ గురిచి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల తర్వాత అభివృద్ధిపై మాట్లాడితే అందుకు తాము సిద్ధంగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పెన్షన్లు, రేషన్ కార్డులు తమ ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకే పెన్షన్లు ఇచ్చారన్నారు. భర్త ఉన్నా భార్యకు వితంతు పెన్షన్ ఇచ్చిన ఘునులు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. ఈనెల 15లోగా రెండు నెలల పెన్షన్లను అందిస్తామన్నారు. రూ.540 కోట్లతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తాం నియోజకవర్గంలో రూ.540 కోట్లతో ఇంటింటికి మంచినీరందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి 100 లీటర్ల చొప్పున మంచినీటిని ఇస్తామని, ఇందుకు సంబంధించిన బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం పొందిందన్నారు. కాకతీయ మిషన్ పేరుతో చేపట్టనున్న చెరువుల పూడిక తీత పనులకు గాను నియోజకవర్గానికి రూ.400 నుంచి రూ.600 కోట్ల వరకు కేటాయింపులు జరిగాయన్నారు. మొదటి విడతగా రూ.13.50 కోట్లు విడుదలైనట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షులు జైపాల్‌రెడ్డి తదితరులు తదితరులు పాల్గొన్నారు. -
హవ్వా! ఏంటిది?
* అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా అసంపూర్తి పాఠశాల భవనం * జూదం, మద్యం, వ్యభిచారాలకు కేంద్రంగా మారిన వైనం * ఆరేళ్లుగా ముందుకు సాగని పనులు జోగిపేట: అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటలో అసంపూర్తిగా ఉన్న బాలుర ఉన్నత పాఠశాల భవనం నేడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది. గత ప్రభుత్వ పాలకులు ఇక్కడ ఆధునిక వసతులతో కూడిన నూతన భవనాన్ని నిర్మించేందుకు 2008-09లో పాత భవనాన్ని కూల్చి కొత్త భవనం పనులను చేపట్టారు. రూ.కోటి నిధులతో ప్రారంభమైన భవనం నిధుల కొరతతో ముందుకు వెళ్లలేదనే చెప్పవచ్చు. ప్రస్తుతం నిర్మిస్తున్న భవనం స్థలంలో ఉన్న పాత పాఠశాల భవనంలో ఎంతో మంది విద్యార్థులు విద్యను అభ్యసించి ఉన్నత స్థానంలోకి వెళ్లిన వారు ఉన్నారు. ప్రస్తుతం ఆ స్థలం జూదం, వ్యభి చారం, మద్యం సేవించడం వంటి అసాంఘిక కార్యక్రమాలకు కేంద్రంగా మారడంతో పూర్వ విద్యార్థులు, గ్రామ పురప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చీకటి అయ్యిందంటే చాలు మద్యపాన ప్రియులు అసంపూర్తిగా ఉన్న భవనంపై భాగంలో కూర్చొని మద్యం సేవిస్తున్నారు. అంతే కా కుండా తాగిన మత్తులో ఖాళీ బాటిళ్లను రోడ్డుపైకి విసిరివేస్తూ యాగి చేస్తున్నారు. అంతేకాకుండా ఆ ప్రాంతమంతా చీకటిగా ఉండడంతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పట్టపగలే జూదం ఆడుతున్నారు. ఈ తతంగం అంతా ఆ ప్రాం తంలో నివసించే వారు నానా రకాలా ఇబ్బం దు లు పడుతున్నారు. మద్యం, జూదం, వ్యభిచారా న్ని కళ్లారా చూస్తున్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఆ ప్రాంత కాలనీ వాసు ల్లో నెలకొంది. భవనాన్ని కమ్మేసిన ముళ్లపొదలు సుమారు 6 ఏళ్లుగా భవన నిర్మాణం పనులు నిలిచిపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలు ఏపుగా పెరగడంతో భవనం కింది భాగం కనిపించని పరిస్థితి ఏర్పడింది. దీంతో జూదరులు, మద్యపాన ప్రియులకు అనుకూలంగా ఏర్పడిందనే చెప్పవచ్చు. నగర పంచాయతీ అధికారులు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద అసంపూ ర్తి భవనంలో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించే కార్యక్రమాలు చేపట్టాలని స్థానికులు, విద్యావంతులు కోరుతున్నారు. -
‘పునర్విభజన’ మళ్లీ తెరపైకి..
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలో కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన నేపథ్యంలో జిల్లాలో కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలేమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాజా పరిస్థితులు, అంచనాల మేరకు జిల్లాలో కొత్తగా రెండు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశం ఉండగా, రెండు స్థానాలు ముక్కలయే పరిస్థితులున్నాయి. కొత్తగా ఏర్పడే ఓ స్థానం ఎస్సీకి రిజర్వు అయ్యే పరిస్థితి ఉండగా, గతంలో ఎస్సీకి రిజర్వు అయిన స్థానం మళ్లీ జనరల్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పుల కారణంగా జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపంలో మార్పు రానుంది. డీలిమిటేషన్ అంశంపై చర్చ నేపథ్యంలో జిల్లాలో ఉన్న పరిస్థితులు, రాజకీయ వర్గాల అంచనాలు ఎలా ఉన్నాయన్న దానిపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో పలు అంశాలు వెల్లడయ్యాయి. అయితే, అధికారిక కసరత్తులో భాగంగా ఈ ప్రతిపాదనలలో మార్పులు జరిగే అవకాశం ఉంది. జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభమే కాని పరిస్థితుల్లో ఈ మార్పులు కేవలం ప్రతిపాదనలేనని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతానికి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా, పునర్విభజన జరిగితే 12 స్థానాలు అయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు లెక్కలు కడుతున్నాయి. మండలాల జనాభా, స్వరూపం, కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పలు మండలాలు తమ నియోజకవర్గాలు మార్చుకోనున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొత్తగా తూప్రాన్, అల్లాదుర్గం నియోజకవర్గాలు తెరపైకి రానున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గ స్వరూపంలో మార్పు కలగనుండగా, అందోల్ నియోజకవర్గం రిజర్వేషన్ మారే అవకాశం ఉంది. వివ రాలను పరిశీలిస్తే...నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్, హత్నూర, కౌడిపల్లి మండలాలతో పాటు పటాన్‌చెరులోని జిన్నారం మండలాన్ని కలిపే అవకాశం ఉంది. ఇదే నియోజకవర్గంలోని శివ్వంపేట, వెల్దుర్తి, తూప్రాన్ మండలాలతో పాటు గజ్వేల్ నియోజకవర్గం నుంచి వర్గల్ లేదా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటతో కలిపి తూప్రాన్ కేంద్రం గా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అందోల్ రిజర్వేషన్ మారేనా? జిల్లాలోనే పెద్ద నియోజకవర్గంగా ఉన్న అందోల్ అసెంబ్లీ స్థానాన్ని రెండు ముక్కలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఆందోల్ పరిధిలోని ఆందోల్, పుల్కల్, మునిపల్లి, టేక్మల్ మండలాలను కలిపి ఆందోల్ నియోజకవర్గంలోనే ఉంచుతారు. రేగోడ్, రాయికోడు, అల్లాదుర్గం మండలాలను, నారాయణఖేడ్ పరిధిలోని పెద్దశంకరంపేటలను కలిపి అల్లాదుర్గం నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు. ఇదే జరిగితే అల్లాదుర్గం, రేగోడ్, రాయికోడు మండలాల్లో దళితులు ఎక్కువగా ఉన్నందున కొత్తగా ఏర్పడబోయే అల్లాదుర్గం స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసి, ఇప్పటివరకు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్న ఆందోల్ నియోజకవర్గాన్ని జనరల్ చేసే అవకాశాలున్నాయి. పార్లమెంటుకు రెండు చొప్పున! తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘాని (సీఈసీ)కి లేఖ రాశారు. ఈ లేఖ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయన్నమాట. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను ఎంపీ స్థానానికి రెండు చొప్పున పెరుగుతాయని రాజకీయ వర్గాల ంచనా. అదే జరిగితే జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సి ఉంది. అయితే, జహీరాబాద్ పార్లమెంటు స్థానంలోని నాలుగు నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. మరి ఆ ఎంపీ స్థానం పరిధిలో పెరిగే రెండు అసెంబ్లీల్లో రెండు స్థానాలు నిజామాబాద్‌లో పెరుగుతాయా? మనకో స్థానం వస్తుందా? లేక రెండు స్థానాలొస్తాయా అనేది జనాభా లెక్కలపైన ఆధారపడి ఉంటుంది. అయితే, ఏ లెక్క ఉన్నా జహీరాబాద్ పరిధిలో ఒకటి, మొదక్ పార్లమెంటు పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గం పెరుగుతుందని తెలుస్తోంది. పునర్విభజన ఎలా? అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆగమేఘాల మీద జరిగే అవకాశం లేదని నిపుణులంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖకు సీఈసీ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపిన తర్వాతే అసలు ప్రక్రి య మొదలవుతుంది. సీఈసీ ఏర్పాటు చేసే కమిటీ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం పునర్విభజనపై కసరత్తు ప్రారంభిస్తుంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని, మండలాలు, గ్రామాల సరిహద్దులు చెరిగిపోకుండా పునర్విభజన ప్రతిపాదనను తెరపైకి తెస్తుంది. ఆ ప్రతిపాదన క్రమంలో అన్ని రాజకీయ పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని, అభ్యంతరాల నమోదును కూడా పరిశీలించాల్సి ఉంది. ఇది జరిగేందుకు కనీసం రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అంచనా. -
సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
జోగిపేట,న్యూస్‌లైన్: ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చానని అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అందోల్ మండలం డాకూర్ గ్రామంలో ఆయనను వివిధ కుల సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది యువకులు, విద్యార్థుల ఆత్మబలిదాన ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అందుకే తన విజయాన్ని అమరులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఎదుటి పార్టీ వారు తనను అవమాన పరిచే విధంగా ప్రకటనలు చేశారన్నారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులు తన విజయానికి కృషి చేశారన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా తన విజయానికి తోడ్పడ్డాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను పలకరించాలనుకున్నానని, అయితే ఈ లోగానే కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ రావడం తనకు బాధ కల్గించిందన్నారు. అందుకే పెళ్లిళ్లకు హాజరవుతూ ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకుంటున్నానన్నారు. దండలు, శాలువాలు తేవద్దు తాను నియోజకవర్గంలో పర్యటించేప్పుడు శాలువాలు, పూలదండలు తీసుకరావద్దని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. తాను గ్రామాలకు వచ్చినప్పుడు కేవలం సమస్యలు చెబితే చాలునన్నారు. అనవసరంగా డబ్బులు వృధా చేయవద్దని కోరారు. డాకూర్‌లో సన్మానం డాకూర్ గ్రామంలో బాబూమోహన్, మాజీ ఎంపీ పి.మాణిక్రెడ్డిలకు కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్ ఏ.శంకరయ్య, మాజీ సర్పంచ్ తమ్మళి శ్రీనివాస్, కురుమ సహకార సంఘం చైర్మన్ రొడ్డ క్రిష్ణయ్య తదితరులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జి.లింగాగౌడ్, డీబీ నాగభూషణం, పిట్ల లక్ష్మణ్, సీహెచ్.వెంకటేశం, జగదీశ్, జి.రవీందర్‌గౌడ్, డాకూరి నాగభూషణంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నా గెలుపు ప్రజలకే అకింతం అల్లాదుర్గం రూరల్: తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అందోల్ ప్రజలకే తన విజయాన్ని అకింతమిస్తున్నట్లు ఎమ్మెల్యే బాబుమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అల్లాదుర్గం మండలంలో పోతులబోగుడలలో ఓ వివాహనికి ఆయన హాజరయ్యారు. అనంతరం వట్పల్లి వెంకట ఖాజా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని, వారికి సేవలందించి కృతజ్ఞతతో ఉంటానన్నారు.అలాగే అవినీతి లేని పాలన అందిస్తానన్నారు. మరో సారి సేవ చేయడానికి అవకాశం కల్పించిన అందోల్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వట్పల్లి టీఆర్ఎస్ నాయకులు బాబుమోహన్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల నాయకులు మాజీ ఎంపీపీ కాశీనాథ్, మరవెళ్లి ఎంపీటీసీ సభ్యులు భిక్షపతి, శివాజీరావు, ఉదయ్‌కిరణ్, నాయకులు సుభాష్రావ్, మండల టీఆర్ఎస్ యువత అధ్యక్షుడు అశోక్‌గౌడ్, కుత్బుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, ఖాజాపటేల్ తదితరులు పాల్గొన్నారు. -
దామోదరను దెబ్బతీసిన అందోల్, పుల్కల్
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహపై టీఆర్ఎస్ అభ్యర్థి బాబూమోహన్ గెలుపొందడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. సీఎం అభ్యర్థిగా రంగంలోకి దిగిన దామోదర రాజనర్సింహ ఓటమిని పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి నియోజకవర్గంలోని అందోల్, పుల్కల్ మండలాలే దోహదపడ్డాయి. 12వ రౌండ్ వరకు రేగోడ్, అల్లాదుర్గం, రాయికోడ్ మండలాల ఓట్లతో లీడ్ల్ ఉన్న రాజనర్సింహకు 13వ రౌండ్ నుంచి మెజార్టీ తగ్గుతూ వచ్చింది. ఈ రౌండ్ నుంచి అందోల్, పుల్కల్, టేక్మాల్, మునిపల్లి మండల ఓట్లు వచ్చాయి. అందోల్‌లో 3747 ఓట్లు, పుల్కల్ మండలంలో 2750 ఓట్లు మొత్తం 6497 ఓట్ల మెజార్టీ టీఆర్ఎస్కు లభించింది. మునిపల్లి, టేక్మాల్ మండలాల్లో కాంగ్రెస్‌కు స్పల్ప మెజార్టీ వచ్చింది. అప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉండడంతో చివరి రౌండ్లో 3208 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. జోగిపేట నగర పంచాయతీలోనే టీఆర్ఎస్కు 2410 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఈ ఓట్లే రాజనర్సింహ విజయాన్ని దెబ్బతీశాయని చెప్పవచ్చు. అల్లాదుర్గం, రాయికోడ్, రేగోడ్, మునిపల్లి మండలాల్లో కనీసం 20వ వేల ఓట్ల మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ భావించింది. అనుకున్నంత మెజార్టీ రాకపోవడంతో ఓట్ల లెక్కింపు పూర్తికాక ముందే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. గత ఎన్నికల్లో అందోల్, పుల్కల్ మండలాల్లో బాబూమోహన్‌కు అనుకూలంగా ఓట్లు వచ్చాయి. ఈ రెండు మండలాల్లోనే కాంగ్రెస్ పార్టీకి బలమైన కేడర్ ఉన్నప్పటికీ ఫలితాలు వ్యతిరేకంగా రావడంపై దామోదర రాజనర్సింహ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మునిపల్లి, టేక్మాల్, పుల్కల్, రాయికోడ్ మండలాల్లో స్థానిక సంస్థల్లో వచ్చిన ఓట్ల మెజార్టీ రాలేదు. టీఆర్ఎస్కు కూడా అల్లాదుర్గంలో జెడ్పీటీసీ సభ్యుడికి వచ్చిన మెజార్టీ రాలేదని సమాచారం. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ నాయకుల స్వగ్రామాల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థికి తక్కువగా ఓట్లు వచ్చాయి. -
‘అందోల్’ పైనే ఆందోళన
క్రాస్ ఓటింగ్ ఎవరి పుట్టి ముంచుతుందోనని నేతల గుండెల్లో గుబులు! జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతుండంతో అభ్యర్థుల్లో గుండెల్లో గుబులు పుడుతోంది. ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. ఒకేపార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటరు ఏ పార్టీవైపు మొగ్గు చూపాడో తేల్చుకోలేక అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవ ర్గంలో టీడీపీ అభ్యర్థికి కొంతమంది పార్టీ నాయకులు బహిరంగంగా మద్దతు ఇచ్చినా ఎమ్మెల్యే విషయానికి వచ్చే సరికి ఎవరికి వారు క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందోల్‌లో టీఆర్ఎస్, కాంగ్రెస్, అభ్యర్థికి, పుల్కల్లో కాంగ్రెస్ అభ్యర్థికి, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్‌లలో కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులకు, టేక్మాల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి బాబూమోహన్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని కేడర్ అంతా ఆయన వెంట వచ్చినా పుల్కల్, అల్లాదుర్గం, అందోల్‌లో కొంత మంది నాయకులు టీడీపీలోనే ఉండిపోయారు. మిగతా వారు టీఆర్ఎస్కు ఏకపక్షంగా ఓటువేశారు. టీఆర్ఎస్లో చేరని టీడీపీ నాయకులకు టీడీపీ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ ప్రచార బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గం కేంద్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ ఎంపీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నారు. అభ్యర్థుల గుణ గణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహరశైలిపై ఒక అంచనాకు వచ్చిన మెజార్టీ ఓటర్లు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు అభ్యర్థులకు ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం అభ్యర్థులను కలవరపరుస్తోంది. క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగిందనే అంశంపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మండలాలు, గ్రామాల వారీగా ఓటింగ్ సరళిపై సమాచారం సేకరించిన ఆయా పార్టీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌పై బూత్‌ల వారీగా ఆరా తీస్తున్నారు. ఓటర్ల వ్యవహర శైలి లోక్‌సభ అభ్యర్థుల్లో గుబులు రేపుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థికి మొగ్గు చూపిన ఓటర్లు ఎంపీ విషయంలో మరో పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉండడంతో ఓటర్లు తమకు ఇష్టం వచ్చిన అభ్యర్థికి వారికి ఓటు వేశారు. నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం..ఎవరికి నష్టం కల్గిస్తుందో 16వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది. -
దామోదర్‌పై దయ కలిగేనా?
1. అందోల్ నియోజకవర్గంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇక్కడ మొత్తం అరుుదుగురు పోటీలో ఉన్నారు. సీఎం కావాలని కలలుకంటున్న దామోదర్ టీఆర్ఎస్ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్నారు. తెలంగాణ జిల్లాల్లో పర్యటించాల్సిన దామోదర్ నియోజకవర్గానికే పరిమితమై సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 2. 2009లో సినీనటుడు పి. బాబూమోహన్‌పై దామోదర్ 2906 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. 3. గె లుపొందితే సీఎం అవుతారని,సింగూరు జలాలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తామని హామీ ఇస్తున్నారు. 4. కాంగ్రెస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. సంప్రదాయ ఓటుబ్యాంకు ఉంది. ఈనెల 27న సోనియాగాంధీ ఆందోల్ బహిరంగసభ లో పాల్గొన నున్నారు.ఈ అంశాలపైనే దామోదర్ గంపెడు ఆశలతో ఉన్నారు. 5. ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ప్రభావం బలంగా ఉండటమే టీఆర్ఎస్కు అనుకూల అంశం. యువకులు టీఆర్ఎస్ వెంట ఉన్నారు. . 6. డీసీసీబీ మాజీ వైస్‌చైర్మన్ పి.జైపాల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరటం, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి మద్దతు ఉండటంతో టీఆర్ఎస్ బలం పెరిగింది. 7. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే నవ తెలంగాణ సాధించవచ్చునని బాబూమోహన్ ప్రచారం చేయుడం లాభించే అంశం. 8. వైఎస్సార్ సీపీ అభ్యర్ధి బి. సంజీవరావు ప్రధాన పోటీ ఇస్తున్నారు. స్థానికతను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను ముందుకు తెచ్చారు. క్రిస్టియన్, మైనార్టీలు ఆయనకుఅండగా ఉన్నారు. పొత్తులో భాగంగా బీజేపీ తరఫున బుర్రి ఎల్లయ్యు పోటీలో ఉన్నారు. -
పేదల సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యం
రాయికోడ్, న్యూస్‌లైన్: పేద ప్రజల సంక్షేమం వైఎస్సార్ సీపీతోనే సాధ్యమని ఆ పార్టీ అందోల్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి బి.సంజీవరావు అన్నారు. ఆది వారం రాయికోడ్‌లో మండల నాయకులతో సమావేశమై ఎన్నికల ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజీవరావు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల సమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులు దామోదర రాజనర్సింహ, బాబూమోహన్‌లపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని తెలిపారు. అందుబాటులో ఉండని పార్టీలు, నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏనాడు ఉద్యమిం చని బాబూమోహన్‌కు టికెట్ ఇచ్చిన టీఆర్ఎస్కు ప్రజాదరణ ఉండబోదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా చాటుతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. అంతకుముందు సింగితం గ్రామంలో పార్టీ నాయకులతో సమావేశమై ఆ తరువాత స్థానిక చర్చిలో నిర్వహించిన ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటేశ్వర్‌రెడ్డి, బాలకృష్ణారెడ్డి, నాయకులు చంద్రశేఖర్, కేశవ్‌రెడ్డి, దేవదాస్, ఖాజా, శివారెడ్డి, బాబు, పేత్రు పాల్గొన్నారు. రూ.350 కోట్ల అభివృద్ధి ఎక్కడ? మునిపల్లి: గత ఐదేళ్లలో రూ.350 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానంటూ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ గొప్పలు చెబుతున్నారని వైఎస్సార్ సీపీ అందో ల్ నియోజకవర్గ అభ్యర్థి బి.సంజీవరావు విమర్శించారు. ఆదివారం ఆయన మండలంలోని బుదేరా చౌరస్తాలో విలేకరులతో మాట్లాడుతూ అభివృద్ధి పనులు ఎక్కడ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గంలో దళితులను రాజకీయంగా ఎదగకుండా చేసింది దామోదర కాదా? అని ఆయన ప్రశ్నించారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బాలకృష్ణారెడ్డి, ప్రభాకర్ పాల్గొన్నారు. -
‘అందోల్’లో గెలిస్తే రాజయోగమే
జోగిపేట, న్యూస్‌లైన్: అందోలు అసెంబ్లీ స్థానం...మంత్రిపదవికి రాజమార్గంగా మారింది. ఎస్సీకి రిజర్వయిన ఇక్కడి నుంచి పోటీచేసిన వారినంతా పదవులు వరించాయి. ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లిన చాలామంది మంత్రులుగా పనిచేశారు. అందువల్లే ఈ సీటు పొందేందుకు దాదాపు అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. గెలిస్తే...పదవే 1967, 72, 77 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున అందోలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సి.రాజనర్సింహకు రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పదవులు దక్కాయి. ఇక 1985వ సంవత్సరంలో జడ్జి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మల్యాల రాజయ్య రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు. 1989వ సంవత్సరంలో తండ్రి రాజనర్సింహ మృతితో రాజకీయాల్లోకి వచ్చిన సి.దామోదర రాజనర్సింహ ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందారు. ఆయన ఆ పదవిలో మూడేళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మల్యాల రాజయ్య ఇక్కడ జయకేతనం ఎగురవేసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన రాజయ్య, సిద్దిపేట ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఖాళీ అయిన అందోలు స్థానానికి 1998వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున సినీనటుడు పి.బాబూమోహ న్ పోటీ చేసి గెలుపొందారు. తిరిగి 1999లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి విజయం సాధించిన బాబూమోహన్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సి.దామోదర్‌కు ప్రాథమిక విద్యాశాఖమంత్రి పదవి వరించింది. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అందోల్ నుంచి విజేతగా నిలిచిన దామోదర్ రాజనర్సింహ మార్కెటింగ్ శాఖ, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ, రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఇద్దరిలో ఎవరు గెలిచినా కేబినెట్లో స్థానం? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడితే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని ఆ అధిష్టానం ప్రకటించడం...దానికితోడు తెలంగాణ ప్రాంత ప్రచార కమిటీకి సారథ్య బాధ్యతలను దామోదరకు అప్పగించడంతో రానున్న రోజుల్లో ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందని స్థానిక పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇక్కడి నుంచే ప్రస్తుతం టీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న బాబూమోహన్ విజేతగా నిలిచి, టీఆర్ఎస్ అధికారాన్ని చేపడితే కేసీఆర్‌కు సన్నిహితుడైన బాబూమోహన్‌కు ముఖ్య పదవే దక్కుతుందని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సారి ఎవరికి రాజయోగం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది. -
బాబూమోహన్ ఇంటింటా ప్రచారం
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ నగర పంచాయతీ ఎన్నికల్లో భాగంగా శనివారం టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ఇంటింటా ప్రచారం చేశారు. తొలుత పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు. కాలనీల్లో తిరుగుతూ టీడీపీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరారు. స్థానిక 5, 6, 7, 8, 9 వార్డుల్లోని ప్రజలను కలసి ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు, తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఓట్లు వేయాలని బాబూమోహన్ అభ్యర్థించారు. కార్యక్రమంలో బరిలో ఉన్న అభ్యర్థులు సావిత్రి, జంగం మహేష్, సదాశివుడు, ఫర్హానా బేగం, భవానీ, టీడీపీ నాయకులు డీ వీరభద్రారావు, దుర్వాసులు, రత్నం గౌడ్, మాణిక్యం గౌడ్, టీడీపీ టేక్మాల్ మండల అధ్యక్షుడు యూసూఫ్, నాయకులు గోపాల్, భూమమ్మ పాల్గొన్నారు. -
బాబూమోహన్ ఇక షి‘కారు’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ‘సైకిల్’ దిగి ‘కారెక్కే’ యోచనలో ఉన్నారు. అందోల్ నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడటం, కేసీఆర్‌తో బాబూమోహన్‌కు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకు ఇటీవల హరీష్‌రావు ఆయనకు ఫోన్‌చేసి టీఆర్ఎస్లోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిసింది. అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్ఎస్లో చేరటం దాదాపు ఖరారైనట్టే. ఆ విషయం ఇటీవల బాబూమోహన్ స్వయంగా ఆయన సన్నిహితులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన బాబూమోహన్ సినిమా రంగం నుంచి నేరుగా అందోల్ నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ స్థానికేతరుడు అయినప్పటికీ అప్పట్లో సినీగ్లామర్, కేసీఆర్ అండదండలతో టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పర్యాయం కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం, రాజకీయ సమీకరణలు మారటంతో 2004 నుంచి వరుసగా రెండుసార్లు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోతూ వచ్చారు. ఫలితంగా నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. టీడీపీకి చెందిన దిగువ శ్రేణి ముఖ్యనేతలు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్, టీఆర్ఎస్లోకి వెళ్లిపోయారు. అందోల్ నియోజకవర్గంపై మంచి పట్టున్న మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు మాణిక్‌రెడ్డి కూడా ఇటీవల టీఆర్ఎస్లో చేరారు. ఆయనే బాబూమోహన్‌ను టీఆర్ఎస్లోకి తీసుకువచ్చేందుకు గట్టిగా యత్నిస్తున్నట్లు సమాచారం. నిజానికి అందోల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ బలహీనంగానే ఉంది. ఇక్కడ ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి చెప్పుకోదగిన స్థాయి నాయకుడు ఎదగలేదు. కేసీఆర్‌కు బాబూమోహన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో... బాబూమోహన్‌కు పోటీ లేకుండా చేసేందుకే ఈ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి బలమైన నాయకత్వాన్ని ప్రోత్సహించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విమర్శలకు చెక్ చెప్పేందుకు కూడా కేసీఆర్ బాబూమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహ బలమైన పునాదులు వేసుకున్నారు. ఎలాగైనా సరే ఆయనను ఓడించాలని పట్టుదలతో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు ‘బాబూమోహనాస్త్రమే’ సరైందనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. వెంటాడుతున్న విలీన భయం.. ఇప్పటికే బాబూమోహన్ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేవారు. కానీ ఆయన్ను విలీన భయం వెంటాడుతున్నట్లు సమాచారం. ఒకవేళ టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నా, లేదా పార్టీని పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. అటు టీడీపీ నుంచి టికెట్ రాక, ఇటు టీఆర్ఎస్ నుంచి పోటీచేసే అవకాశం లేక ‘రెంటికీ చెడ్డ రేవడి’ అవుతుందనే భయంతో బాబూమోహన్ ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ విలీనమైతే తన భవిష్యత్తు ఏమిటో ముందు కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, అంతవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనతో బాబూమోహన్ ఉన్నట్లు తెలిసింది. -
‘రాజనర్సింహా’ఎప్పటికయ్యేనో?
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు చేపట్టిన ‘రాజనర్సింహ ఎత్తిపోతల పథకం’ పనులు సకాలంలో పూర్తికాకపోవడంతో రైతుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. 2006లో దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టు వద్ద కాల్వల నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కాల్వల నిర్మాణం, భూసేకరణలకు గాను ప్రభుత్వం రూ.89.98 కోట్లను మంజూరు చేసింది. అయితే నీటిని అందించేందుకు ఎత్తిపోతల పథకం తప్పనిసరి అని భావించి 2009లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2010-11లో ఎత్తిపోతల పథకానికి సంబంధించి ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను రెండేళ్లలోగా పూర్తి చేసేందుకుగాను ప్రభుత్వంతో కాంట్రాక్టర్ అగ్రిమెంట్ చేసుకున్నారు. నిధుల మంజూరులో జాప్యం జరగడంతో ప్రధాన కాంట్రాక్టర్ సంవత్సరం క్రితం సబ్‌కాంట్రాక్టర్‌కు అప్పగించారు.అప్పటి నుంచి ప్రస్తుతం పనులు కొనసా..గుతునే ఉన్నాయి. ఏడాదిలోగా పనులు పూర్తవుతాయని పలుసార్లు డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ స్వయంగా ప్రకటించినా ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చడంలేదు. ఈ పథకానికి డిప్యూటీ సీఎం తండ్రి స్వర్గీయ మాజీ మంత్రి రాజనర్సింహ ఎత్తిపోతల పథకంగా నామకరణం చేశారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల మధ్య విభేదాలు నెలకొనడం వల్లే నిధుల మంజూరులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఎత్తిపోతల పథకం పనుల్లో భాగంగా పంప్‌హౌస్, కెనాల్, డెలివరీ స్లంప్, ఎలక్ట్రిక్, ప్యానెల్ గదులు, నిర్మాణాలకు సంబంధించి ఫినిషింగ్ పనులు చేపట్టాల్సి ఉంది. ఈ పనులను రూ.12 కోట్లతో చేపడుతున్నారు. డిప్యూటీ సీఎంకు ప్రతిష్టాత్మకం సింగూరు జలాలను సేద్యానికి అందించే విషయంలో డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేయించాలన్న పట్టుదలతో ఉన్నప్పటికీ సాధ్యపడలేదు. ఇప్పటికే నీరందిస్తామని పలుసార్లు డిప్యూటీ సీఎం ప్రకటనలు చేశారు. అయినా అందించ లేకపోయారు. పనులను త్వరగా పూర్తి చేయించేందుకు అధికారులు, కాంట్రాక్టర్లపై డిప్యూటీ సీఎం ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గం పరిధిలో 40 వేల ఎకరాలకు గాను ప్రాజె క్టు నుంచి 2టీఎంసీల నీటిని సేద్యానికి అందించాల్సి ఉంది. అయితే ఈ నీటిని కాల్వల నిర్మాణం ద్వారా అందిస్తారు. పూర్తి స్థాయిలో కాల్వల నిర్మాణం జరగలేదు.