సాక్షి, అందోల్: మరో ఐదు నిమిషాలు అయితే ముగ్గురూ గమ్యం చేరుకునేవారే, కానీ అంతలోనే విధి వక్రించింది. మృత్యువు కారు రూపంలో వచ్చి ఇద్దరిని బలిగొంది. వివరాల్లోకి వెళ్తే మండల పరిధిలోని సరాఫ్‌పల్లి గ్రామ సమీపంలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. కొర్పోల్ గ్రామానికి చెందిన అరిగే లక్ష్మయ్య(55), శంకయ్య, అశోక్‌లు ద్విచక్ర వాహనంపై శంకరయ్య బంధువులకు బంగారం (దసరా జమ్మి) ఇచ్చేందుకు హత్నూర మండలం చిన మద్దూరుకు వెళ్లి తిరిగి వస్తున్నారు. సరాఫ్‌పల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మారుతి వ్యాన్ ఓవర్‌టేక్ చేయబోయి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మయ్య, శంకరయ్యలు అక్కడికకక్కడే మృతిచెందగా, రెండు కాళ్లు విరిగి, క్షతగాత్రుడైన అశోక్‌ను సికింద్రాబాద్ గాంధీ అసుపత్రికి తరలించారు. ఈమేరకు ఎస్‌ఐ సత్యనారాయణ సంఘటనా స్థలాన్ని చేరుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
ఏడాదిలోనే ఇద్దరు మృతి
లక్షయ్య పెద్ద కొడుకు గత ఏడాది పురుగుమందు తాగి అత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు లక్ష్మయ్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబంలో ఇద్దరు పెద్దలను కోల్పోయారు. శంకరయ్యకు పెండ్లీడుకు వచ్చిన కూతురుతోపాటు, చేతికొచ్చిన కొడుకు ఉన్నాడు. చేతికి వచ్చిన కొడుకుతోపాటు, ఇప్పుడు భర్త కూడా చనిపోవడంతో ఇక తమకు దిక్కెవరంటూ లక్ష్మయ్య భార్య రోదిస్తున్న తీరు అక్కడివారిని కంటతడి పెట్టించింది. కాగా, శంకరయ్య తండ్రి సైతం గత ఏడాదే మృతిచెందాడు.