అవి తెలంగాణకు నాలుగు దిక్కుల్లో ఉన్న శాసనసభ నియోజకవర్గాలు. కులాలు, మతాలతోపాటు ఆర్థికంగా, సామాజికంగా ఎంతో వైరుధ్యం ఉన్న ప్రాంతాలు. కానీ ఎన్నికలొచ్చినప్పుడు మాత్రం ఒక్కటిగానే ఆలోచిస్తున్నాయి. ఒకరికొకరు కూడబలుక్కున్నట్టుగా తీర్పునిస్తున్నాయి. అంతేకాదు 1952 నుంచి 2018 వరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఒక్కసారి మినహాయిస్తే.. మిగిలిన అన్ని ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టింది.
ఇక్కడ గెలిస్తే రాష్ట్రంలో అధికారం ఖాయమన్న సెంటిమెంట్‌కు అచ్చంపేట, అందోల్, సికింద్రాబాద్, గజ్వేల్ నియోజకవర్గాలు ప్రాతిపదికగా నిలిచాయి. దీంతో ఈసారి కూడా అందరి చూపు ఈ నాలుగు నియోజకవర్గాలపైనే కేంద్రీ కృతమైంది. ఏడు దశాబ్దాల సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తాయా? ఆనవాయితీకే పట్టం కడతాయా? అనేది ఆసక్తికరంగా మారింది.
‘అచ్చం’ అదే ట్రెండ్...
నల్లమల అడవిని ఆనుకుని ఉన్న అచ్చంపేట నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయం, దాని అనుబంధ ఆదాయాలపైనే ఆధారపడిన ప్రాంతం. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీలు ఉన్న ఈ సెగ్మెంట్‌లో అక్షరాస్యులు తక్కువే. నాగర్‌కర్నూల్ ద్విసభ నియోజకవర్గం నుంచి వేరుపడి 1962లో అచ్చంపేటగా ఏర్పడిన అనంతరం 2018 వరకు 13 సార్లు ఎన్నిక జరిగితే. 2009లో ఒక్కమారు మినహా, మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి పార్టీయే రాష్ట్రంలో అధికారం చేపట్టడం గమనార్హం.
పి.మహేంద్రనాథ్ 1972లో కాంగ్రెస్, 1983, 85లలో టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించి ఎన్టీఆర్ కేబినెట్‌లో కీలక పదవులు నిర్వహించారు. 2009లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇక్కడ మాత్రం టీడీపీ అభ్యర్థి పి.రాములు తన సమీప ప్రత్యర్థి డాక్టర్ వంశీకృష్ణపై 4,831 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఒక అభ్యర్థి, ఒక పార్టీ నుంచి రెండుమార్లు కంటే ఎక్కువగా గెలవకపోవడం.
సికింద్రాబాద్..గెలిస్తే జిందాబాదే
ఆంగ్లో ఇండియన్లకు తోడు తమిళ, మలయాళీలు, పక్కా తెలంగాణ మూలాలున్న అడ్డా కూలీలతో నిండిపోయిన సికింద్రాబాద్ తీర్పు సైతం ఎప్పుడూ ప్రత్యేకమే. 1952 –2018 వరకు 15 సార్లు సాధారణ ఎన్నికలు జరిగితే 14 మార్లు.. ఇక్కడ ఏ పార్టీ కూటమి గెలిస్తే.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది.
1978లో మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్(ఐ) 175 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టినా.. ఇక్కడ మాత్రం జనతా పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన ఎల్.నారాయణ, తన సమీప కాంగ్రెస్(ఐ) అభ్యర్థిపై 8,152 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్ మద్దతుతో టీఆర్‌ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలోనూ 1957, 62, 67 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కె.సత్యనారాయణ మినహాయిస్తే, మరెవరూ వరుసగా మూడుమార్లు విజయం సాధించలేదు.
అందోల్ తీరూ అంతే..
కన్నడ–తెలంగాణ సమ్మిళిత సంస్కృతి కనిపించే ఈ నియోజకవర్గంలో ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వర్గాలే అత్యధికం. 1952లో ద్విసభ నియోజకవర్గంగా ఏర్పడిన అందోల్‌లో 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో ఒక్కమారు మినహా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన పార్టీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1983లో రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపడితే, ఇక్కడ మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్‌జీ.. ఈశ్వరీబాయిపై విజయం సాధించారు. ఇక అత్యల్ప మెజార్టీలతో గెలిచిన అదృష్టవంతులు కూడా ఈ నియోజకవర్గంలోనే ఉండటం గమనార్హం. ఇక్కడ కూడా వరుసగా 3 సార్లు ఎవరూ గెలవకపోవటం విశేషం.
గజ్వేల్.. కమాల్
హైదరాబాద్‌కు సమీపాన్నే ఉన్నా.. పూర్తిగా గ్రామీణ ప్రాంతమైన గజ్వేల్‌లోనూ 1952 నుంచి 2018 వరకు జరిగిన 15 ఎన్నికల్లో గెలిచిన పార్టీనే 13 మార్లు అధికారంలోకి వచ్చింది. 1952లో జరిగిన తొలి ఎన్నికలో కమ్యూనిస్టుల అభ్యర్థి పెండెం వాసుదేవ్, కాంగ్రెస్ అభ్యర్థి మాడపాటి హన్మంతరావుపై 15 వేలకు పైగా ఓట్లతో విజయం సాధిస్తే, 1962లో కాంగ్రెస్ అభ్యర్థి జి.వెంకటస్వామిపై, స్వతంత్ర అభ్యర్థి గజ్వేల్ సైదయ్య 1,035 ఓట్ల స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు.
మిగిలిన అన్ని ఎన్నికల్లోనూ ఇక్కడ గెలిచిన పార్టీలే రాష్ట్రంలోనూ అధికార పగ్గాలు చేపట్టాయి. ఈ నియోజకవర్గం నుంచి మూడుమార్లు గెలిచిన అభ్యర్థిగా గజ్వేల్ సైదయ్య పేరిటే ఇప్పటికీ రికార్డు ఉంది. అయితే 2014, 18లలో విజయం సాధించిన కేసీఆర్..మూడోసారి కూడా ఇక్కడి నుంచే పోటీకి దిగటంతో గజ్వేల్‌పై ఆసక్తి నెలకొంది.
ఒకే తీర్పు..ఒకింత విచిత్రమే..
ఈ నాలుగు నియోజకవర్గాల ఓటర్లు ఇస్తున్న తీర్పు ఎప్పుడూ ఆసక్తికరమే. ఈ నాలుగు ప్రాంతాల్లో విభిన్న సామాజిక వర్గాలు ఉన్నాయి. భౌగోళికంగానూ చాలా భిన్నమైన ప్రాంతాలు. పెద్దగా ఆశలు, ఆకాంక్షలు లేని వారు అత్యధికంగా ఉండే నియోజకవర్గాలు. కానీ ఎప్పుడూ ఇక్కడ గెలిచిన పార్టీలే దాదాపుగా ప్రతిసారీ అధికారం చేపట్టడం ఒకింత విచిత్రమే అని చెప్పాలి. – మల్లేపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకుడు
-శ్రీగిరి విజయ్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment