డిగ్రీ కళాశాలలో మాట్లాడుతున్న ఎన్నికల రిటర్నింగ్ అధికారి రవి
సాక్షి, జోగిపేట(అందోల్): ఎన్నికల అక్రమాలపై ఫిర్యాదులు చేసేందుకు సీ విజిల్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకోవాలని జెడ్పీ సీఈవో రవి సూచించారు. శుక్రవారం పట్టణలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్నికల అధికారులకు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు యువత ఈ విషయంలో స్పందించాలని కోరారు. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి 13 నుంచి సీ విజిల్ అందుబాటులోకి ఎన్నికల కమిషన్ తెచ్చినట్లు తెలిపారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు కోసం ప్రతీ నియోజకవర్గం పరిధిలో 24 గంటలు పనిచేసే విధంగా నిఘా బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సీ విజిల్ ఫిర్యాదులపై తీసుకున్న చర్యలకు సంబంధించి ఫిర్యాదుదారులకు 100 నిమిషాల్లో సమాచారం పంపే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందన్నారు. 18 సంవత్సరాలు నిండిన, యువతీ యువకులు తమ ఓటు హక్కును నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సమావేశంలో నోడల్ అధికారి బాబూ నాయక్ తహసీల్దారు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment