సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. తెలంగాణలో కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన నేపథ్యంలో జిల్లాలో కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాలేమిటన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. తాజా పరిస్థితులు, అంచనాల మేరకు జిల్లాలో కొత్తగా రెండు అసెంబ్లీ స్థానాలు ఏర్పాటయ్యే అవకాశం ఉండగా, రెండు స్థానాలు ముక్కలయే పరిస్థితులున్నాయి.
కొత్తగా ఏర్పడే ఓ స్థానం ఎస్సీకి రిజర్వు అయ్యే పరిస్థితి ఉండగా, గతంలో ఎస్సీకి రిజర్వు అయిన స్థానం మళ్లీ జనరల్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ మార్పుల కారణంగా జిల్లాల్లోని పలు అసెంబ్లీ నియోజకవర్గాల స్వరూపంలో మార్పు రానుంది. డీలిమిటేషన్ అంశంపై చర్చ నేపథ్యంలో జిల్లాలో ఉన్న పరిస్థితులు, రాజకీయ వర్గాల అంచనాలు ఎలా ఉన్నాయన్న దానిపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో పలు అంశాలు వెల్లడయ్యాయి. అయితే, అధికారిక కసరత్తులో భాగంగా ఈ ప్రతిపాదనలలో మార్పులు జరిగే అవకాశం ఉంది.
జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభమే కాని పరిస్థితుల్లో ఈ మార్పులు కేవలం ప్రతిపాదనలేనని రాజకీయ వర్గాలంటున్నాయి. ప్రస్తుతానికి జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా, పునర్విభజన జరిగితే 12 స్థానాలు అయ్యే అవకాశం ఉందని రాజకీయ పార్టీలు లెక్కలు కడుతున్నాయి. మండలాల జనాభా, స్వరూపం, కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని పలు మండలాలు తమ నియోజకవర్గాలు మార్చుకోనున్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కొత్తగా తూప్రాన్, అల్లాదుర్గం నియోజకవర్గాలు తెరపైకి రానున్నాయి.
నర్సాపూర్ నియోజకవర్గ స్వరూపంలో మార్పు కలగనుండగా, అందోల్ నియోజకవర్గం రిజర్వేషన్ మారే అవకాశం ఉంది. వివ రాలను పరిశీలిస్తే...నర్సాపూర్ నియోజకవర్గంలో నర్సాపూర్, హత్నూర, కౌడిపల్లి మండలాలతో పాటు పటాన్‌చెరులోని జిన్నారం మండలాన్ని కలిపే అవకాశం ఉంది. ఇదే నియోజకవర్గంలోని శివ్వంపేట, వెల్దుర్తి, తూప్రాన్ మండలాలతో పాటు గజ్వేల్ నియోజకవర్గం నుంచి వర్గల్ లేదా దుబ్బాక నియోజకవర్గంలోని చేగుంటతో కలిపి తూప్రాన్ కేంద్రం గా నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
అందోల్ రిజర్వేషన్ మారేనా?
జిల్లాలోనే పెద్ద నియోజకవర్గంగా ఉన్న అందోల్ అసెంబ్లీ స్థానాన్ని రెండు ముక్కలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలంటున్నాయి. ఆందోల్ పరిధిలోని ఆందోల్, పుల్కల్, మునిపల్లి, టేక్మల్ మండలాలను కలిపి ఆందోల్ నియోజకవర్గంలోనే ఉంచుతారు. రేగోడ్, రాయికోడు, అల్లాదుర్గం మండలాలను, నారాయణఖేడ్ పరిధిలోని పెద్దశంకరంపేటలను కలిపి అల్లాదుర్గం నియోజకవర్గంగా ఏర్పాటు చేస్తారు. ఇదే జరిగితే అల్లాదుర్గం, రేగోడ్, రాయికోడు మండలాల్లో దళితులు ఎక్కువగా ఉన్నందున కొత్తగా ఏర్పడబోయే అల్లాదుర్గం స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసి, ఇప్పటివరకు ఎస్సీ రిజర్వ్‌డ్‌గా ఉన్న ఆందోల్ నియోజకవర్గాన్ని జనరల్ చేసే అవకాశాలున్నాయి.
పార్లమెంటుకు రెండు చొప్పున!
తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలను 153కు పెంచాలని సీఎం కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘాని (సీఈసీ)కి లేఖ రాశారు. ఈ లేఖ ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 34 అసెంబ్లీ స్థానాలు ఏర్పాటవుతాయన్నమాట. మొత్తం 17 ఎంపీ స్థానాలకు గాను ఎంపీ స్థానానికి రెండు చొప్పున పెరుగుతాయని రాజకీయ వర్గాల ంచనా. అదే జరిగితే జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగాల్సి ఉంది.
అయితే, జహీరాబాద్ పార్లమెంటు స్థానంలోని నాలుగు నియోజకవర్గాలు నిజామాబాద్ జిల్లాలో ఉన్నాయి. మరి ఆ ఎంపీ స్థానం పరిధిలో పెరిగే రెండు అసెంబ్లీల్లో రెండు స్థానాలు నిజామాబాద్‌లో పెరుగుతాయా? మనకో స్థానం వస్తుందా? లేక రెండు స్థానాలొస్తాయా అనేది జనాభా లెక్కలపైన ఆధారపడి ఉంటుంది. అయితే, ఏ లెక్క ఉన్నా జహీరాబాద్ పరిధిలో ఒకటి, మొదక్ పార్లమెంటు పరిధిలో మరో అసెంబ్లీ నియోజకవర్గం పెరుగుతుందని తెలుస్తోంది.
పునర్విభజన ఎలా?
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఆగమేఘాల మీద జరిగే అవకాశం లేదని నిపుణులంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖకు సీఈసీ సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపిన తర్వాతే అసలు ప్రక్రి య మొదలవుతుంది. సీఈసీ ఏర్పాటు చేసే కమిటీ పర్యవేక్షణలో జిల్లా యంత్రాంగం పునర్విభజనపై కసరత్తు ప్రారంభిస్తుంది. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని, మండలాలు, గ్రామాల సరిహద్దులు చెరిగిపోకుండా పునర్విభజన ప్రతిపాదనను తెరపైకి తెస్తుంది. ఆ ప్రతిపాదన క్రమంలో అన్ని రాజకీయ పక్షాల వాదనలను పరిగణనలోకి తీసుకుని, అభ్యంతరాల నమోదును కూడా పరిశీలించాల్సి ఉంది. ఇది జరిగేందుకు కనీసం రెండు నుంచి మూడేళ్లు పడుతుందని అంచనా.
‘పునర్విభజన’ మళ్లీ తెరపైకి..
Published Wed, Jul 30 2014 1:47 AM | Last Updated on Thu, Apr 4 2019 5:45 PM
Advertisement
Advertisement