
ఆరు మాసాల్లోనే అద్భుతాలు చేయాలా?
పొన్నాల, దామోదర వ్యాఖ్యలపై అందోలు ఎమ్మెల్యే బాబూమోహన్ ఆగ్రహం
జోగిపేట: ఆరు మాసాల్లో అద్భుతాలు చేయాలా! ఐదేళ్ల కోసం తమకు ప్రజలు పట్టం కట్టారనే విషయాన్ని ప్రతి పక్ష పార్టీలు గుర్తుంచుకోవాలని అందోలు శాసనసభ్యుడు బాబూమోహన్ పేర్కొన్నారు. బుధవారం జోగిపేట ఎంపీపీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జోగిపేటలో జరిగిన సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తదితరులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై చేసిన విమర్శలను ఎమ్మెల్యే తిప్పి కొట్టారు.
నియోజకవర్గానికి 60 వేల ఎకరాలు ఎక్కడి నుంచి తెస్తారని పొన్నాల ప్రశ్నించడం సిగ్గుచేటని, ఆయన మాదిరి ఎస్సీల భూములను లాక్కొని మాత్రం ఇవ్వమని, ప్రభుత్వ సొమ్ముతో కొనుగోలు చేసి ఇస్తామన్నారు. తెలంగాణ మేమిచ్చాం...మేం తెచ్చామంటున్న కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఇవ్వకుంటే భూస్థాపితమవుతామనే భయంతోనే ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని గమనించాలన్నారు. తెలంగాణపై నిజంగా ప్రేమ ఉంటే వందలాది మంది విద్యార్థులు, యువకులు అమరులు కాకముందే ఇవ్వాల్సి ఉండెనన్నారు.
ఎన్నికల్లో ప్రజలు గట్టి తీర్పుఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో మార్పురాలేదన్నారు. అసెంబ్లీలో లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, అన్ని పార్టీలను మెప్పించి ఏకగ్రీవ తీర్మానంతో ఆమోదింపజేసుకున్న సీఎం కేసీఆర్ గురిచి మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదన్నారు. నాలుగున్నర సంవత్సరాల తర్వాత అభివృద్ధిపై మాట్లాడితే అందుకు తాము సిద్ధంగా ఉంటామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పార్టీలకతీతంగా పెన్షన్లు, రేషన్ కార్డులు తమ ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అనర్హులకే పెన్షన్లు ఇచ్చారన్నారు. భర్త ఉన్నా భార్యకు వితంతు పెన్షన్ ఇచ్చిన ఘునులు కాంగ్రెస్‌లో ఉన్నారన్నారు. ఈనెల 15లోగా రెండు నెలల పెన్షన్లను అందిస్తామన్నారు.
రూ.540 కోట్లతో ఇంటింటికీ మంచినీటిని అందిస్తాం
నియోజకవర్గంలో రూ.540 కోట్లతో ఇంటింటికి మంచినీరందిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరికి 100 లీటర్ల చొప్పున మంచినీటిని ఇస్తామని, ఇందుకు సంబంధించిన బిల్లు కూడా అసెంబ్లీలో ఆమోదం పొందిందన్నారు.
కాకతీయ మిషన్ పేరుతో చేపట్టనున్న చెరువుల పూడిక తీత పనులకు గాను నియోజకవర్గానికి రూ.400 నుంచి రూ.600 కోట్ల వరకు కేటాయింపులు జరిగాయన్నారు. మొదటి విడతగా రూ.13.50 కోట్లు విడుదలైనట్లు వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి, ఎంపీపీ అధ్యక్షురాలు విజయలక్ష్మి, డీసీసీబీ మాజీ ఉపాధ్యక్షులు జైపాల్‌రెడ్డి తదితరులు తదితరులు పాల్గొన్నారు.