అదానీతోపాటు కీలక అంశాలపై చర్చించాలని విపక్షాల పట్టు
అంగీకరించని ప్రభుత్వం... ప్రతిపక్ష సభ్యుల ఆందోళన
ఉభయ సభలు సోమవారానికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై ప్రతిపక్షాలు పట్టువీడడం లేదు. అదానీ అంశంతోపాటు మణిపూర్ రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ పట్టణంలో జరిగిన హింసాకాండపైనా చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించాయి. ప్రభుత్వం అంగీకరించలేదు. ఫలితంగా పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభలు నాలుగో రోజు శుక్రవారం సైతం స్తంభించాయి.
లోక్‌సభ, రాజ్యసభలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. రెండు సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. కాంగ్రెస్, సమాజ్‌వాదీ పారీ్టల ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి బిగ్గరగా నినాదాలు చేశారు. ఇంతలో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.
నియంతృత్వం నశించాలి, అదానీని అరెస్ట్ చేయాలి అనే నినాదాలతో సభ మార్మోగిపోయింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, కొందరు ఎంపీలు మాత్రం సభను పదేపదే అడ్డుకొంటూ ప్రజల ఆకాంక్షలు వినిపించకుండా చేస్తున్నారని స్పీకర్ ఓంబిర్లా మండిపడ్డారు. విపక్ష సభ్యుల తీరుపట్ల ప్రజలు చింతిస్తున్నారని చెప్పారు. సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరారు. అయినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతించలేదు.
దీంతో స్పీకర్ సభను మధ్యాహ్యం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన ఆగలేదు. చేసేది లేక సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యçసభలోనూ ఇదే రీతిలో విపక్షాలు సభా కార్యకలాపాలకు అడ్డుతగిలాయి.
అదానీ గ్రూప్‌పై వచి్చన అవినీతి ఆరోపణలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ విపక్ష ఎంపీలు ఇచి్చన వాయిదా తీర్మానాలను రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ తిరస్కరించారు. రూల్ నెంబర్ 267 కింద వాయిదా తీర్మానాలు ఇవ్వడాన్ని విపక్షాలు ఒక ఆయుధంగా మార్చుకుంటున్నాయని తప్పుపట్టారు. దీనిపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి ఎంతకీ అదుపులోకి రాకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment