మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్‌ | TSRTC Strike: Bus Conductor Lost His Mental Balance | Sakshi
Sakshi News home page

మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్‌

Published Fri, Nov 8 2019 8:53 AM | Last Updated on Fri, Nov 8 2019 9:12 AM

TSRTC Strike: Bus Conductor Lost His Mental Balance - Sakshi

మతిస్థిమితం కోల్పోయిన కండక్టర్‌ నాగేశ్వర్‌తో కుటుంబ సభ్యులు

జోగిపేట (అందోల్‌): ‘ఆర్టీసీ సమ్మె ముగియకుంటే మా జీవితాలు ముగిసినట్లే. నా భర్త ఉద్యోగానికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. సీఎం సారూ.. కనికరిస్తే బాగుండు. సమ్మె కారణంగా ఆందోళనతో నా భర్త మతి స్థిమితితం కోల్పోయాడు. కడుపునిండా తిని 20 రోజులయ్యింది’అంటూ ఆర్టీసీ కండక్టర్‌ నాగేశ్వర్‌ (45) భార్య సుజాత కన్నీటి పర్యాంతమవుతూ తమ కష్టాలను వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ డిపోలో పనిచేస్తున్న కండక్టర్‌ నాగేశ్వర్‌ జోగిపేటకు చెందిన సుజాతను 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రతి రోజు సంగారెడ్డి డిపో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటీవల ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్‌లైన్‌ను టీవీలో చూసినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో సుజాత తన తల్లి నివాసం ఉండే జోగిపేటకు భర్తతో కలసి వచ్చింది. మూడు, నాలుగు రోజులనుంచి నాగేశ్వర్‌ టికెట్‌.. టికెట్‌.. బస్‌ ఆగింది దిగండి.. రైట్‌ రైట్‌ అంటూ అరవడం, అసందర్భంగా నవ్వుతుండటం, ఫోన్‌ రాకున్నా హాలో.. హాలో అనడం, ఎవరు చేశారని ఎవరైనా అడిగితే అశ్వత్థామ.. అని సమాధానం ఇస్తున్నాడు. ఒక్కోసారి ఉండండి.. డిపోలో కలెక్షన్‌ కట్టివస్తా .. అని కూడా అంటున్నాడని భార్య సుజాత ఆందోళన వ్యక్తం చేసింది. తనను, పిల్లలను కూడా గుర్తు పట్టడంలేదని తెలిపింది. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, జీతం రాక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో చదువులను మధ్యలోనే మాన్పించేసినట్లు ఆమె చెప్పింది.

నాగేశ్వర్‌ రాత్రంతా నిద్రపోకుండా ఏదో ఒకటి మాట్లాడుతుండడంతో భర్త ప్రవర్తనను చూసి సుజాత కన్నీరు మున్నీరవుతూ జాగారం చేస్తుండగా, కొడుకులు కూడా తల్లిదండ్రుల బాధను చూసి వారు కూడా నిద్రకు దూరం అవుతున్నారు. చేతిలో డబ్బులు లేవని, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు సాయం చేయాలని సుజాత వేడుకుంటోంది. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్న ఉన్నవారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని తెలిపింది. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో దేవుడి మీద భారం వేసి అలాగే ఉన్నట్లు తెలిపింది. కాగా, నాగేశ్వర్‌కు చికిత్స చేయించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. (చదవండి: చలో ట్యాంక్‌బండ్‌ మరో మిలియన్‌ మార్చ్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement