bus conductor
-
రెప్పపాటులో షాకింగ్ ఘటన.. ఆ కండక్టర్ దేవుడయ్యా సామీ
భూమి మీద నూకలు ఉన్నాయ్.. అనే మాటను మరణం అంచుల వరకూ వెళ్లొచ్చిన సందర్భాల్లో తరుచు వాడుతూ ఉంటాం. ఇక్కడ ఓ యువకుడికి భూమి మీద నూకలు ఉన్నాయ్ కాబట్టే తృటిలో పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని బయటపడ్డాడు.కేరళలో ఓ యువకుడు బస్సులో ప్రయాణిస్తుండగా, కండక్టర్ టికెట్లు తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో సదరు యువకుడు కూడా కండక్టర్ పక్కనే ఉన్నాడు. యువకుడు బస్సులో నిల్చొని ఉండగా, కండక్టర్ సీటుకు ఆనుకుని టికెట్లు ఇస్తున్నాడు. అయితే యువకుడు ఉన్నట్టుండి పట్టు తప్పాడు. ఆ సమయంలో బస్సు వేగంగా కదులుతూ ఉండటంతో ఆ యువకుడు కింద పడిపోయాడనే అనుకున్నారంతా. రెప్పపాటులో జరిగిన ఈ ఘటనతో అంతా షాకయ్యారు.కానీ ఆ కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి అత్యంత సమయ స్ఫూర్తితో ఆ యువకుడ్ని ఒక్క చేత్తో పట్టుకుని బస్సులోకి లాగేశాడు. అంతే క్షణం పాటు ఏమైందో తెలియని ఆ యువకుడు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. అయితే కండక్టర్ వ్యవహరించిన తీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆ యువకుడు పడిపోబోతున్నాడు అనే విషయాన్ని మాత్రమే గ్రహించి చేయి అడ్డుపెట్టిన కండక్టర్‌ను అంతా కొనియాడుతున్నారు. ఆ కండక్టర్ దేవుడయ్యా సామీ అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Kerala bus conductor with 25th Sense saves a guy from Falling Down from Buspic.twitter.com/HNdijketbQ— Ghar Ke Kalesh (@gharkekalesh) June 7, 2024 -
Video Viral: మహిళా ప్రయాణికురాలిపై బస్ కండక్టర్ దాడి
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఓ బస్ కండక్టర్.. ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించాడు. ఏకంగా మహిళపై చేయిచేసుకున్నాడు. ఆమెపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ రంగంలోకి దిగింది. సదరు కండక్టర్‌ను విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించింది. వివరాలు.. కొత్తనూర్ డిపోకు చెందిన బీఎమ్‌టీసీ బస్సులో మంగళవారం ఓ మహిళ ప్రయాణించింది. బస్సు బిలేకహళ్లి నుంచి శివాజీనగర్ వెళ్తోంది. టికెట్ తీసుకునే విషయంలో కండక్టర్ హోన్నప్ప నాగప్ప అగసర్కు మహిళా ప్రయాణికురాలికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మొదట మహిళ కండక్టర్‌పై చేయి చేసుకోగా.. అనంతరం కండక్టర్ ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. మహిళ అని కూడా చూడకుండా దాడికి తెగబడ్డారు. దానిని బస్‌లోని మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘వేరే రాష్ట్రానికి చెందిన మహిళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించింది.. టికెట్ తీసుకునే విషయంలో బస్ కండక్టర్‌తో వాగ్వివాదం జరిగింది. ఆ వాదన పెరిగి పెద్దదైంది.. ఈ క్రమంలో కండక్టర్ ఆమెపై దాడి చేశాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. కండక్టర్ హొన్నప్ప నాగప్ప అగసర్‌పై క్రమశిక్షణా చర్యలు చేపట్టాం. తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’ అని పేర్కొంది. మరోవైపు కండక్టర్పైఓ మహిళా ప్రయాణికురాలు సిద్దాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. Bengaluru: Woman slaps bus conductor and he hits back. pic.twitter.com/RAQHV0yJlR — Pagan 🚩 (@paganhindu) March 27, 2024 -
రెండు బస్సు కథలు
బస్సు లోపల ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్ బస్సు బయట ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్‌కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా. మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి. సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్‌ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్‌తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్‌ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్‌ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు. ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి. ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్‌లను నడిపే బస్డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు. మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు. -
బస్సు కండక్టర్‌పై మహిళ దాడి
హైదరాబాద్: తాను దిగాల్సిన చోటబస్సు ఆపలేదని ఆగ్రహించిన ఓ మహిళ కండక్టర్‌పై దాడికి పాల్పడిన సంఘటన అత్తాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పులి యాదగిరి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న శుక్రవారం శివరాంపల్లిలో బస్సు ఎక్కిన ఆమె హైదర్‌గూడ కల్లు కంపౌండ్ ప్రాంతంలో దిగాల్సి ఉండగా అత్తాపూర్‌లో దిగింది. వెనక్కి వెళ్లేందుకుగాను రోడ్డు దాటి మెహిదీపట్నం నుంచి ఉప్పల్ వెళుతున్న 300 నంబర్ బస్సు ఎక్కింది. సుమారు 200 మీటర్ల దూరంలో ఉన్న బస్టాపులో దిగేందుకు ప్రయత్నిచగా కండక్టర్ ముత్యాల నర్సింహ ఎక్కడ దిగాలమ్మా అని అడిగాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ప్రసన్న మహిళలకు ఉచితంగా బస్సులు ఎందుకు నడుపుతున్నారో అంటూ ఆయన దవడలు వాయించింది. దీంతో ప్రయాణికులు జోక్యం చేసుకుని బస్సును రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెల్లారు. బస్సు స్టేషన్‌కు చేరుకోగానే ప్రసన్న అందరికళ్లుకప్పి అక్కడినుంచి పరారైంది. కండక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లారీ ఢీకొని.. ఆర్టీసీ కండక్టర్ దుర్మరణం
హైదరాబాద్: కరీంనగర్ – హైదరాబాద్ రాజీవ్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బస్సు కండక్టర్ మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం జినోమ్‌వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. సిద్దిపేట జిల్లా, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బ్యాగరి నవీన్‌కుమార్, వెంకటాపూర్‌కు చెందిన బాలనర్సయ్య(49) మంగళవారం ప్రయాణికులతో జేబీఎస్‌కు బయలుదేరారు. మార్గమధ్యంలో శామీర్‌పేట మండలం, అచ్చాయిపల్లి చౌరస్తా వద్ద ప్రయాణికులను దించేందుకు రోడ్డుపక్కన బస్సును నిలపడంతో అదే సమయంలో వేగంగా వచ్చిన బొలేరో వాహనం బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు డ్రైవర్, కండక్టర్లు కిందకు దిగి బస్సును పరిశీలిస్తుండగా అదే సమయంలో వెనకనుంచి వేగంగా వచ్చిన బస్సును ఢీ కొట్టింది. దీంతో బస్సు బొలేరో వాహనాన్ని తగలడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో కండక్టర్ అక్కడికక్కడే మృతిచెందగా, బస్సు డైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
మహిళ ఓవర్ యాక్షన్.. టికెట్ అడిగాడని కండక్టర్‌పై తిట్ల పురాణం
యశవంతపుర(బెంగళూరు): బస్ కండక్టర్‌ను మహిళ ఒకరు నోటికొచ్చినట్లు తిట్టిన వీడియో వైరల్ అయ్యింది. బెంగళూరులో సిటీ బస్ ఎక్కిన మహిళ టికెట్ తీసుకోలేదు. కండక్టర్ ఆమెను టికెట్ తీసుకోవాలని కోరగా ఉచిత ప్రయాణమని తెలిపింది. ఆధార్ కార్డు చూపాలని కండక్టర్ కోరగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగిని అని ఆమె ఐడీ కార్డు చూపారు. స్థానిక చిరునామా కార్డును చూపించాలని, లేదా టికెట్ తీసుకోవాలని కండక్టర్ చెప్పడంతో మహిళ రౌద్రరూపం దాల్చింది. ఇష్టానుసారం తిట్ల పురాణం వినిపించింది. కొందరు ఇది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా మహిళ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. #FreebusJourney in #KSRTCBus in #Karnataka An argument started between a woman passenger and a #bmtc bus conductor when the Conductor asked the woman to show Aadhar Card or Voter Card of Karnataka only to avail the free bus ride. The woman showed her Aadhaar card in her phone… pic.twitter.com/DoKMOsAvkQ — NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) July 26, 2023 చదవండి: విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు.. -
భారీ వర్షాలు.. బస్ డ్రైవర్లు, కండక్టర్లకు టీఎస్ఆర్టీసీ సూచనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా టీఎస్ఆర్టీసీ డ్రైవర్లందరూ ప్రమాదాలను నివారించాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వర్షాల నేపథ్యంలో విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం వహించవద్దని సూచించారు. రాష్ట్రంలో వారం రోజులపాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా డ్రైవర్లందరూ భద్రత సూచనలు పాటించాలని కోరారు. ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ సంస్థ ఎంతో కాలంగా ప్రయాణికుల భద్రతకు మారుపేరుగా నిలించిందన్నారు. జాతీయ స్థాయిలో అతి తక్కువ ప్రమాద రేటులో అనేక అవార్డులు అందుకుందని గుర్తుచేశారు. ఆర్టీసీ సంస్థలో సుశిక్షుతులైన డ్రైవర్లు ఉన్నారని, అయినా వర్షాకాలంలో మరోసారి భద్రతా నియమాలను మననం చేసుకుని తూ.చ పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయడం ఎంతైనా అవసరం ఉందన్నారు. జాగ్రత్త సూచనలు 1. వర్షం కురుస్తున్నప్పుడు వేగ నియంత్రణ పాటించాలి 2. మలుపుల వద్ద ఇండికేటర్‌ను ఉపయోగించాలి. 3. ముందు వెళ్ళే వాహనాలతో సురక్షిత దూరాన్ని పాటించాలి. దట్టమైన వర్షం ఉన్నచోట హారన్ ఉపయోగించాలి. 4. వర్షం కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయనపుడు వైపర్ వాడాలి. హెడ్‌లైన్‌ను lowbeamలోఫాగ్ lights తప్పనిసరిగా వాడాలి. వైపర్లను కండిషన్లో ఉంచుకోగలరు. బస్సు వేగాన్ని తగ్గించి నిదానంగా వెళ్లాలి. 5. చెరువులు కుంటలు నిండిన చోట నీటి ప్రవాహాన్ని పరిశీలించి జాగ్రత్తగా వాహనాన్ని నడపాలి. నదులు కల్వర్టులు ఎక్కువ నీటి ప్రవాహం ఉంటే ఎట్టి పరిస్థితుల్లో దాటే ప్రయత్నం చేయవద్దు. 6. Windscreen గ్లాసులను వైపర్‌తో బయట వైపు శుభ్రపరచవలెను. లోపల వైపు ఏదైనా క్లాత్‌తో శుభ్రపరచాలి. 7. డ్యూటికి బయలుదేరుటకు ముందే వైపర్, హెడ్ లైట్స్ పనితీరును పరిశీలించుకొనవలెను. తెల్లవారుజామున 3-5 గంటల సమయములో సమీప బస్ స్టేషన్ నందు ఆపుకొని నీళ్ళతో ముఖంకాళ్ళు చేతులు శుభ్రపరుచుకోవాలి. 8. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు బస్సును నిదానంగా నడిపించాలి. డ్యూటికి వచ్చే ముందు తగిన విశ్రాంతి తీసుకోవాలి. 9. దట్టమైన వర్షం ఉన్న సమయంలో ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేయరాదు. 10. అకస్మాత్తుగా సడన్ బ్రేక్ వేయకూడదు. వర్షం పడుతున్నప్పుడు తప్పకుండా లైట్లు వేసి వాహనాన్ని నియంత్రణలో నడపాలి. 11. వర్షం కురుస్తున్న సమయంలో డ్రైవింగ్ చేయునపుడు ఎదురుగా వచ్చే వాహనదారులతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక ఎట్టి పరిస్థితులో Wrong Route లో వెళ్లరాదు. 12. సెంట్రల్ లైన్ క్రాస్ చేయరాదు. 13. అకస్మాత్తుగా బస్సు యొక్క దిశను మార్చకూడదు. 14. అతివేగంగా బస్సును నడపరాదు. 15. అకస్మాత్తుగా ఇండికేటర్ వేయడం వలన వెనుక వచ్చే వాహనాలతో ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది కనుక సడన్ గా ఇండికేటర్ వేయకూడదు. 16. రోడ్డు మరమ్మత్తులో ఉన్నపుడు అతి వేగం తో డ్రైవింగ్ చేయరాదు. 17. బ్రేక్ సిస్టమ్ నుంచి ఎలాంటి ఏయిర్ లీకేజీలు ఉన్నాయో గమనించాలి. 18. ఘాట్ రోడ్డు ప్రయాణంలో ఎట్టి పరిస్థితిలోనూ బస్సును న్యూట్రల్ చేసి నడవకూడదు. 19. హైదరాబాద్ నగర శివారులో ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలి. నగరంలో మ్యాన్ హోల్స్ మరియు రద్దీ ప్రదేశాలలో కండక్టర్ సహాయంతో వాహనాన్ని నడపగలరు. 20. బస్సులో ఫుట్ బోర్డు ప్రయాణాన్ని నివారించాలి, ఫుట్ బోర్డు లో ఉన్న ప్రయాణికులను బస్సు లోపలికి చేర్చుకోవాలి. 21. నగరంలో అనేక మంది ప్రయాణికులు నడిచే బస్సు ఎక్కడం జరుగుతుంది. దీని ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వారి గమ్య స్థానం లోనే కండక్టర్, డ్రైవర్ గారు ఆపగలరు, బస్సులోకి చేర్చుకోగలరు. 22. ఫోన్ మాట్లాడుతూ, ఒంటిచేత్తో డ్రైవింగ్ చేయవద్దు. 23. అతి భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా తడిసిన కరెంటు స్తంభాలను ముట్టుకోరాదు. 24. తడి చేతులతో విద్యుత్ ప్రవాహం ఉన్న స్విచ్ బోర్డులను తాకరాదు. ఎంతో పేరున్న ఆర్టీసీ సంస్థ.. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా డ్రైవర్లు, కండక్టర్లు సురక్షితంగా బస్సులు నడిపి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని సంస్థకు సహకరించాలని సంస్థ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ సూచనలు జారీ చేశారు.. -
బస్సు త్వరగా ఎక్కమన్నందకు కండక్టర్‌పై మహిళల దాడి...
కర్ణాటక: బస్సులో త్వరగా ఎక్కమన్నందకు కోపగించుకున్న ఇద్దరు మహిళా ప్రయాణికులు కండక్టర్‌పై దాడికి దిగిన ఘటన బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ గుడ్డలో జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం సవదత్తి యల్లమ్మ గుడ్డ బస్టాప్ వద్ద వే చి ఉన్న ఇద్దరు మహిళలను బస్సు కండక్టర్ త్వరగా బస్సు ఎక్కాలని తొందర పెట్టాడు. ఈ క్రమంలో కండక్టర్‌కు, మహిళా ప్రయాణికుల మధ్య వాగ్వాదం జరిగింది. మాటమాట పెరిగి మహిళలు ఇద్దరు కండక్టర్‌పై చేయి చేసుకున్నారు. ఆయన బట్టలు చించివేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బస్సు త్వరగా ఎక్కాలని కోరినందుకు మహిళలు ఇద్దరు తనపై దాడి చేశారని కండక్టర్ భద్రణ్ణవర తెలిపారు. వారి జతలో ఉన్న ఓ పురుషుడు కూడా తనను దుర్బాషలాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. కుందగోళ–హుబ్లీ మార్గంలో మరో ఘటన ఓ వృద్ధురాలిని మహిళా కండక్టర్ చెంపపై కొట్టిన ఘటన కుందగోళ–హుబ్లీ మార్గంలో జరిగింది. కుందుగోళ నుంచి హుబ్లీకి వెళ్తున్న బస్సులో శుక్రవారం ఉదయం శెరెవాడ గ్రామం వద్ద టికెట్ విషయంపై గొడవ జరిగింది. మహిళా కండక్టర్ వృద్ధురాలి చెంపపై కొట్టారు. ఈ వీడియో కూడా ఇప్పుడు వైరల్‌గా మారింది. -
డ్రైవర్ దాష్టీకం.. బస్సు ఆపకుండా మహిళలపైకి దూసుకెళ్లి
తుమకూరు(బెంగళూరు): టికెట్ కలెక్షన్ రాలేదనే కోపంతో మహిళా ప్రయాణికులను ఎక్కించుకోకుండా బస్సును ముందుకు తీసుకెళ్తున్న డ్రైవర్ చర్యను మహిళలు అడ్డుకోగా వారిపైకి బస్సును దూకించేందుకు యత్నించాడు. ఈ ఘటన తుమకూరు జిల్లా కొరటెగెరె నాగేనహళ్లి గేట్ వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా కొళ్లేగాల నుంచి కొందరు మహిళలు జిల్లాలోని గోరవనహళ్లి మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి వచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం స్వగ్రామానికి వెళ్లేందుకు నాగేనహళ్లి గేట్ వద్ద వేచి ఉన్నారు. ఆ మార్గంలో వచ్చిన కేఎస్ ఆర్టీసీ బస్సును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే కలెక్షన్ లేదని బాధతో ఉన్న డ్రైవర్ బస్సును ఆపలేదు. దీంతో మహిళలు బస్సు ముందుకు వెళ్లి ఆపే ప్రయత్నం చేయగా డ్రైవర్ వారిపైకి వాహనాన్ని ఎక్కించే ప్రయత్నం చేశాడు. డ్రైవర్ ప్రవర్తనపై మహిళలంతా తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం తహసీల్దార్ మునిశామి రెడ్డి మహిళలకు వేరే బస్సును ఏర్పాటు చేశారు. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. చదవండి: Aryan Dubey Rebirth Story: ‘ఆవిడ మా ఆవిడే..’ పునర్జన్మ చెబుతూ హడలెత్తిస్తున్న కుర్రాడు! -
కండక్టర్ కుటుంబానికి రూ. 50 లక్షల సాయం అందించిన టీఎస్ఆర్టీసీ
హైదరాబాద్: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) అండగా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల నుంచి వరంగల్ వెళ్తున్న టీఎస్ఆర్టీసీ బస్సును రాంగ్ రూట్లో వచ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మల్యాల-బలవంతాపూర్ స్టేజీ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండక్టర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఈ నేపధ్యంలో యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్కరకొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాలరీ అకౌంట్స్‌ను ఇటీవల యూబీఐకి మార్చింది టీఎస్ఆర్టీసీ యాజమాన్యం. ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ సిబ్బందికి ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో సంస్థలోని ఉద్యోగులందరూ వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండటంతో ఉద్యోగులకు ఎంతో ఆర్థిక ప్రయోజనం చేకూరుతోంది. ప్రమాదాలు జరిగిన సమయంలో సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేతనం ప్రకారం) కనీసం రూ.40లక్షలు, రూపే కార్డు కింద మరో రూ.10లక్షలను యూబీఐ అందజేస్తోంది. ఈ మేరకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జగిత్యాల డిపో కండక్టర్ బొల్లం సత్తయ్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కులను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ మంగళవారం బస్‌భవన్‌లో అందజేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండక్టర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫతో పాటు కొడుకు ప్రవీణ్ కుమార్, కూతురు మాధవీలత సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెక్కులను అందజేసిన అనంతరం సజ్జనర్ మాట్లాడుతూ.. తన తప్పు ఏమీ లేకపోయినా రోడ్డు ప్రమాదంలో సత్తయ్య అకాల మరణం చెందటం దురదృష్టకరమన్నారు. ఉద్యోగుల సంక్షేమానికె తమ సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు గుర్తు చేశారు. కుటుంబపోషణలో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ సభ్యులకు సంస్థ అండగా నిలుస్తుందని, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్రయోజనాలతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాలను యాజమాన్యం మార్చడం జరిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్‌కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. కొన్ని పథకాలు ఆపద సమయంలో అక్కరకు వస్తాయని, ఇందుకు ఇదే ఉదాహరణ అని, వాటిని వినియోగించుకోవడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం వహించకూడదని సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూబీఐకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ వి.రవిందర్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఈడీలు ఎస్.కృష్ణకాంత్, వినోద్ కుమార్, యూబీఐ జనరల్ మేనేజర్ పి.క్రిష్ణణ్, రీజినల్ హెడ్ డి.అపర్ణ రెడ్డి, డిప్యూటీ రీజినల్ హెడ్ జి.వి.మురళీ కృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు. -
మందుబాబును బస్సు నుంచి తోసేసిన కండక్టర్.. వీడియో వైరల్..
చెన్నై: తమిళనాడు ఆర్టీసీ బస్సు కండక్టర్ ఓ మందుబాబుతో విచక్షణా రహితంగా ప్రవర్తించాడు. ఫుల్లుగా మద్యం తాగి బస్సు ఎక్కిన వ్యక్తిని తిట్టి బస్సు నుంచి కిందకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. మద్యం మత్తులో బస్సు ఎక్కిన వ్యక్తి తూలుతూ కన్పించాడు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నాడు. అతన్ని బస్సు దిగిపోవాలని కండక్టర్ వారించాడు. దీంతో ఆ వ్యక్తి ఆపసోపాలు పడుతూ కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా.. కండక్టర్ అతనిపై బాటిల్‌తో నీళ్లుపోశాడు. అనంతరం మెట్లపై నుంచి తోసేశాడు. ఫలితంగా అమాంతం అతడు కిందపడిపోయాడు. అయితే అతనికి గాయాలయ్యయా, పరిస్థితి ఎలా ఉందని కూడా చూడకుండా కండక్టర్ బస్సును పోనివ్వమన్నాడు. #government #TamilNadu #TamilnaduNews #bus #conductor pic.twitter.com/rGI9BMv1Rv — MAHES ARUN AMD (@mahes_arun_amd) November 19, 2022 తిరవన్నమళైలో జరిగిన ఈ ఘటనపై అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే ఆ వ్యక్తి బస్సులోనే మద్యం తాగుతున్నాడని, ప్రయాణికులతో దురుసుగా ప్రవర్తిస్తూ రచ్చ చేయడం వల్లే బస్సు నుంచి దించేసినట్లు కండక్టర్ వివరించాడు. ప్రయాణికులకు అసౌకర్యం కలగవద్దనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. చదవండి: ఉద్ధవ్ శివసేన కార్యాలయం కూల్చివేత..ముంబైలో ఉద్రిక్తత.. -
వైరల్: రూ.5 గొడవ.. కండక్టర్‌ను ఉతికారేశాడు
వైరల్: ఆర్టీసీ ఛార్జీల బాదుడుతో.. ఏ రూట్లలో ఎంతెంత పెరిగాయో, అదీ రోజువారీ ప్రయాణాలు చేసే ప్రయాణికులకు సైతం అంతుచిక్కడం లేదు. పైగా టార్గెట్ల పేరిట ఒక స్టాప్ బదులు.. మరోస్టాప్‌కు టికెట్ కొడుతూ ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు కొందరు కండక్టర్లు. దేశంలోని చాలా నగరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అలా.. అధిక ఛార్జీలు వసూలు చేసినందుకు ఓ కండక్టర్‌ను చితకబాదేశాడు ఓ ప్రయాణికుడు. మధ్యప్రదేశ్ భోపాల్‌లో తాజాగా జరిగిన ఘటన ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది. మంగళవారం ఉదయం పది గంటల ప్రాంతంలో.. పోలీస్ హెడ్‌క్వార్టర్స్ బస్టాప్ దగ్గర ఓ వ్యక్తి బస్సెక్కాడు. తాను దిగాల్సిన స్టాప్‌కు పది రూపాయలే టికెట్ కాగా.. కండక్టర్ మాత్రం ముందుస్టాప్ నుంచి టికెట్ కొట్టి.. మరో ఐదు రూపాయలు ఎక్కువగా వసూలు చేయాలని ప్రయత్నించాడు. NCC cadet thrashed city bus conductor in Bhopal, an argument broke out between the bus conductor and the NCC cadet over the difference of 5 rs. bus fare @ndtv @ndtvindia pic.twitter.com/hnA8B08sBw — Anurag Dwary (@Anurag_Dwary) September 14, 2022 ఈ క్రమంలో ఎన్సీసీ క్యాడెట్‌కు చెందిన సదరు ప్రయాణికుడు.. అధిక వసూలుపై నిలదీశాడు. తాను ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చేశాడు. అయినా సరే ఐదు రూపాయలు ఇవ్వాలని, లేదంటే దిగిపోవాలని కండక్టర్ చెప్పాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన సదరు ప్రయాణికుడు.. కండక్టర్‌ను చితకబాదేశాడు. అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు వాళ్లను ఆపే ప్రయత్నం చేయగా.. ప్రయాణికుడు బస్సు దిగిపోవడం, ఆ వెనకాల కండక్టర్ పరుగులు తీయడం వరకు బస్సులోని సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించింది రవాణా శాఖ. దీంతో సదరు ఎన్సీసీ క్యాడెట్‌పై జహాంగీర్‌బాద్ పీఎస్‌లో కేసు నమోదు అయ్యింది. నెట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఇదీ చదవండి: కన్నతల్లి అనుకుని.. ఆ బస్సు వెంట పరుగులు -
హతవిధీ!..పదేళ్ల తర్వాత విధులకు..గుండెపోటుతో
సాక్షి చెన్నై: పదేళ్ల సస్పెన్షన్ ముగిసిన నేపథ్యంలో విధులకు హాజరుకావాలని అధికారుల నుంచి అందిన ఉత్తర్వులతో ఆ కండెక్టర్ సంబరపడిపోయాడు. ఉదయాన్నే డ్యూటీకి బయలుదేరాడు ఈ క్రమంలో గుండెపోటుతో మృతి చెందడం స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా తిరుఆయార్పాడి గ్రామానికి చెందిన భాస్కరన్(53). తమిళనాడు ట్రాన్స్పోర్ట్ కమిషన్ పొన్నేరి డిపోలో కండెక్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గత 10 సంవత్సరాల క్రితం ఇతను సస్పెండ్ అయ్యాడు. సస్పెన్షన్ కాలం ముగిసిన నేపథ్యంలో విధులకు హాజరు కావాలని విల్లుపురం ట్రాన్స్పోర్ట్ కమిషన్ కార్యాలయం నుంచి శుక్రవారం భాస్కరన్‌కు ఉత్తర్వులు అందాయి. దీంతో శనివారం పొన్నేరి డిపోకు బయలుదేరిన భాస్కరన్ హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది భాస్కరన్‌ను సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి చెన్నై వైద్యశాలకు తరలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. చదవండి: SPSR Nellore Double Murder: ఎవరు? ఎందుకు? -
కోడి పుంజుకు కూడ టికెట్టు కొట్టాడు..
-
కోడికి ఫుల్ టికెట్... డిపో మేనేజర్ వెంకటేశం ఏం అన్నారంటే...
కోల్‌సిటీ(రామగుండం): ఓ ప్రయాణికుడు వెంట తీస్కపోతున్న కోడికి టికెట్ కొట్టాడో ఆర్టీసీ బస్సు కండక్టర్. కోడేంది? బస్సుల టికెట్ గొట్టుడేంది? అని సినిమాల్లో బ్రహ్మానందం కండక్టర్గ జేసిన సీన్లు గుర్తు తెచ్చకుంటున్నరా? ఆగుర్రాగుండ్రి. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఇది. మహమ్మద్ అలీ.. గోదావరిఖని డిపో బస్సు ఎక్కిండు. కరీంనగర్‌కు టికెట్ తీసుకున్నడు. చుట్టాలింటికి పోతున్నడో.. చుట్టాల దగ్గరనుంచే వస్తున్నడో... తెల్వదుగానీ కోడిని మాత్రం వెంట తెస్తున్నడు. చీరల మూటగట్టుకుని సీట్ల కూసున్నడు. అసలే కోడి. కూయకుండా ఉంటుందా? సుల్తానాబాద్ రాంగనే ‘కొక్కొరోకో’ అన్నది. సప్పుడొచ్చిన కెయ్యి చూసిండ్రు. ఇగ కండక్టర్ తిరుపతి ఊకుంటడా... మహమ్మద్ అలీ దగ్గరకొచ్చి చీర తీసి చూస్తే... కోడి. బస్సులో కోడిని ఎట్ల తీసుకొస్తవని సీరియస్ అయ్యిండు. టికెట్ తీసుకుంటవా లేదాని పట్టుబట్టిండు. కోడికి టికెటేందని అలీ... తీసుకోవల్సిందేనని తిరుపతి.. ఇద్దరూ లొల్లిపెట్టుకున్నా... చివరకు రూ.30లతో ఫుల్ టికెట్ కొట్టి కూల్ అయ్యిండు కండక్టర్. పైసలు పోతే పొయినయి.. కోడి మిగిలిందని నిమ్మలపడ్డడు అలీ. ఇదేందని అడిగితే.. ‘బస్సులో కోడిని తీసుకురావడానికి అనుమతి లేదు. అధికారులు తనిఖీ చేస్తే ఇబ్బందులొస్తయని టికెట్ ఇచ్చిన’ అని కండక్టర్ చెబితే.. ‘కోడిని బస్సులో అనుమతించిన కండక్టర్‌పై చర్యలు తీసుకుంటాం’ అని డిపో మేనేజర్ వెంకటేశం అంటున్నడు. అసలు పదేండ్లు దాటితే గానీ ఫుల్ టికెట్ ఉండదు... కానీ పదేండ్లుకూడా బతకని కోడికి ఫుల్ టికెట్ కట్ చేసుడేందని జనం నవ్వుకుంటున్నరు. -
‘ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడం లేదు. ఇబ్బందిగా ఉంది’
సాక్షి, హైదరాబాద్: ‘సిటీబస్సుల్లో ప్రయాణికులు మాస్కులు ధరించి ప్రయాణం చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు మాత్రం మాస్కులు సరిగా ధరించడం లేదు.ఇది ఇబ్బందిగా ఉంది’ అంటూ కొద్దిరోజుల క్రితం ఓ ప్రయాణికురాలు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌కు ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన వెంటనే ఆర్టీసీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. సంక్రాంతి రద్దీ సమయంలో స్వయంగా మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో తనిఖీలు సైతం నిర్వహించారు. ప్రయాణికులు, కండక్టర్లు, డ్రైవర్లు తప్పనిసరిగా మాస్కు ధరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్లో ఈ ఆదేశాలు పెద్దగా అమలుకు నోచుకోవడం లేదు. యథావిధిగా కండక్టర్లు, డ్రైవర్లు మాస్కులు సరైన పద్ధతిలో ధరించకుండానే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రోజుకు 20 లక్షల మంది ప్రయాణం.. రెండు రోజులగా సంక్రాంతి దృష్ట్యా సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. సాధారణంగా రోజుకు 20 లక్షల మంది ప్రయాణం చేస్తారు. కోవిడ్ రెండో ఉద్ధృతి అనంతరం ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయడంతో సిటీ బస్సుల రాకపోకలు సాధారణ స్థాయికి చేరుకున్నాయి. దీంతో పలు మార్గాల్లో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ఇలాంటి బస్సులో ఏ కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్ వేగంగా వ్యాపించేందుకు అవకాశం ఉంటుంది. చదవండి: సర్కారీ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచే ఆంగ్లంలో విద్యా బోధన ప్రయాణికులతో పాటు, డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు ధరించడంతో పాటు శానిటైజర్లతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రం చేసుకోవడం ఎంతో అవసరం. కోవిడ్ ఆరంభంలో ఈ దిశగా ఆర్టీసీ విస్తృత స్థాయిలో అవగాహన కల్పించింది. ప్రయాణికులను, సిబ్బందిని నిరంతరం అప్రమత్తం చేసింది. బస్సులను సైతం పూర్తిగా శానిటైజ్ చే శారు. కానీ మూడో ఉద్ధృతి మొదలైనప్పటి నుంచి ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవడ ంపై ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెట్రో రైల్ తరహాలో నియంత్రణ.. మెట్రో రైళ్లలో ప్రయాణం చేయాలంటే మాస్కు తప్పనిసరిగా ఉండాల్సిందే. మాస్కులేని ప్రయాణికులను గుర్తించి అవగాహన కల్పించేందుకు ఇటీవల మెట్రో రైళ్లలో తనిఖీలను విస్తృతం చేశారు. సిటీ బస్సుల్లోనూ ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించే విధంగా డిపో స్థాయి అధికారులు అవగాహన చర్యలు చేపట్టడం మంచిది. చదవండి: Telangana: రూ.786 కోట్లతో కొత్త పథకాలు పెరగనున్న రద్దీ.. సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లిన నగరవాసులు రానున్న రెండు రోజుల్లో తిరిగి నగరానికి చేరుకోనున్నారు. దూరప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకొనే ప్రయాణికులతో సిటీ బస్సుల్లో రద్దీ పెరగనుంది. మాస్కుల విషయంలో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా వైరస్ విజృంభించే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే బస్సులతో పాటు సిటీ బస్సుల్లోనూ మాస్కులను కచ్చితంగా అమలు చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. పైకి ఎలాంటి లక్షణాలు కనిపించకపోయినా ఒమిక్రాన్, డెల్టా వేరియంట్లు ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. దీనిని అధిగమించేందుకు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించడం ఒకటే పరిష్కారం అని వైద్యులు సూచిస్తున్నారు. -
బస్ కండక్టర్‌పై ప్రధాని మోదీ ప్రశంసలు
సాక్షి, టీ.నగర్: మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కోవై బస్ కండక్టర్‌కు ప్రశంసలందించారు. ఆయన మాట్లాడుతూ కోవైలో బస్ కండక్టర్ యోగనాథన్ ప్రయాణికులకు టికెట్‌తోపాటు మొక్కలను అందజేస్తున్నారని, తన ఆదాయంలో అధిక భాగాన్ని ఇందుకోసం వినియోగిస్తుండడం ప్రశంసనీయమన్నారు. ఈ విధంగా మోదీ తెలిపారు. ఇది విన్న యోగనాథన్ సంతోషం వ్యక్తం చేశారు. విలేకరులతో యోగనాథన్ మాట్లాడుతూ ప్రధాని మోదీ తనను ప్రశంసించడం సంతోషంగా ఉందని, ప్రోత్సాహకరంగా ఉందన్నారు. తనలా ఎందరో మొక్కలను నాటే పనుల్లో నిమగ్నమవుతారన్నారు. తనకు వచ్చే ఆదాయంలో 40 శాతాన్ని మొక్కలు నాటేందుకు ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. 34 ఏళ్లుగా కండక్టర్‌గా పనిచేస్తున్న తాను ఇంతవరకు మూడు లక్షలకు పైగా మొక్కలను నాటినట్లు తెలిపారు. గత ఏడాది 85 వేల మొక్కలను ఉచితంగా పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. యోగనాథన్ ఇప్పటి వరకు అనేక అవార్డులను అందుకున్నారు. సీబీఎస్ఈ ఐదో తరగతి పాఠ్యాంశంలోను ఈయన చోటుచేసుకున్నారు. ఇప్పటి వరకు అద్దె ఇంట్లో నివసిస్తున్న ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చదవండి: విజయవాడ వాసికి నా అభినందనలు: పీఎం మోదీ -
ఇక తెలంగాణలో ‘మెరూన్’ కండక్టర్లు!
సాక్షి, హైదరాబాద్: ఇక మెరూన్ రంగు ఆప్రాన్ (చొక్కా) ధరించి ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లు విధులు నిర్వహించనున్నారు. 2019 చివరలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన ఆదేశం మేరకు మహిళా కండక్టర్లకు సరికొత్త యూనిఫామ్స్ ఎట్టకేలకు అందబోతున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న 4,800 మంది మహిళా కండక్టర్ల కోసం రేమండ్స్ కంపెనీ నుంచి 30 వేల మీటర్ల వస్త్రాన్ని తాజాగా ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో కండక్టర్‌కు రెండు ఆప్రాన్‌లకు సరిపడా వస్త్రాన్ని సరఫరా చేస్తారు. వారు తమ కొలతలకు తగ్గట్టు కుట్టించుకుని, నిత్యం ఆప్రాన్ ధరించి డ్యూటీకి రావాల్సి ఉంటుంది. 60 లక్షల కోసం ఏడాది ఎదురుచూపు.. 2019లో ఆర్టీసీలో రికార్డు స్థాయిలో సుదీర్ఘంగా సాగిన సమ్మె అనంతరం సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అందులో వివిధ అంశాలపై నేరుగా ఉద్యోగులతో మాట్లాడి తెలుసుకున్న విషయాల ఆధారంగా పలు హామీలిచ్చారు. అందులో మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఆప్రాన్‌ను యూనిఫాంగా ఇవ్వాలన్నది కూడా ఒకటి. ఈ ఆప్రాన్ ఏ రంగులో ఉండాలన్నది కూడా మహిళా కండక్టర్లే నిర్ణయించి చెప్పాలంటూ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంది. ఎక్కువ మంది మెరూన్ రంగు వస్త్రం కావాలని కోరటంతో దాన్నే సిఫారసు చేసింది. వస్త్రం నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రేమండ్స్ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ వస్త్రాన్ని కొనేందుకు ఏడాదికిపైగా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీలో ఉన్న 4,800 మంది మహిళా కండక్టర్లకు రెండు ఆప్రాన్లు కుట్టివ్వాలంటే 30 వేల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిర్ధారించారు. అయితే జీతాలకు కూడా డబ్బులు చాలని పరిస్థితిలో అంతమేర నిధులను కూడా కేటాయిం చటం ఆర్టీసీకి కష్టంగా మారింది. ఆ వెంటనే బస్సు చార్జీలు పెంచటంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం దాదాపు రూ.2 కోట్లు పెరిగింది. దీంతో వస్త్రం కొనాలనుకున్న తరుణంలో కోవిడ్ రూపంలో సమస్య ఎదురైంది. గత వారం, పది రోజులుగా ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉండటంతో ఎట్టకేలకు వస్త్రం కొనుగోలు చేశారు. సాధారణంగా వస్త్రంతో పాటు యూనిఫాం కుట్టు కూలీలకు కూడా ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వస్త్రం మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. పురుషులకు ఇప్పట్లో లేనట్టే ఆర్టీసీలో ప్రతి మూడేళ్లకు ఓసారి రెండు జతల చొప్పున యూనిఫాం ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ గత ఆరేళ్లుగా యూనిఫాం జారీ నిలిచిపోయింది. సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫాం కొనుక్కుని వేసుకుంటున్నారు. కొంతమంది పాత యూనిఫాంతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో ఉన్న వస్త్రం కొంత స్టోర్‌లో ఉండిపోవటంతో కొన్ని డిపోలకు మధ్యలో ఒకసారి యూనిఫాం సరఫరా అయింది. యూనిఫాం లేకుండా డ్యూటీకి హాజరైతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు జేబు నుంచి ఆ ఖర్చు భరిస్తున్నారు. అయితే ఈ కొత్త యూనిఫాం కూడా మహిళలకు మాత్రమే ఇవ్వనున్నారు. పురుషులకు ఇప్పట్లో లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. చదవండి: మేడ్చల్ బస్ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్ఆర్టీసీ -
మేడ్చల్ బస్ డిపోలో కండక్టర్ ఆత్మహత్యాయత్నం
మేడ్చల్‌రూరల్: జీతాలు సకాలంలో రావడం లేదని, అధికారుల వేధింపులకు గురి చేస్తున్నారని మనస్థాపం చెందిన మేడ్చల్ ఆర్టీసీ డిపోలో పనిచేసే కండక్టర్ శనివారం ఉదయం మేడ్చల్ బస్ డిపో ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. వివరాలివీ... శామీర్‌పేట్ మండలం అలియాబాద్ గ్రామానికి చెందిన అశోక్ 14 సంవత్సరాలుగా మేడ్చల్ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నారు. కొంత కాలంగా జీతాలు సమయానికి రాకపోవడంతో కుటుంబ పోషణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని... ప్రతి నెల 5లోగా జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన మంత్రి, అధికారులు సకాలంలో ఇవ్వడం లేదంటూ ఈ నెల 16న అశోక్ మేడ్చల్ బస్ డిపోలో వేతనాలు సమయానికి ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై కార్మికులంతా ఏకం కావాలని కోరారు. అయితే డిపోలో ధర్నా చేసినందుకు అప్పటి నుంచి డిపో మేనేజర్ మాధవి, డిపో సీఐ స్వాతి, టీఐ–2 నర్సింహ్మలు తనకు డ్యూటీలు సరిగా వేయకుండా వేధింపులకు గురి చేస్తున్నారని మనస్థాపానికి గురైన అశోక్ శనివారం ఉదయం డిపో ఆవరణలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. గమనించిన తోటి కార్మికులు అతడి నుంచి అగ్గిపెట్టె లాక్కుని అడ్డుకున్నారు. అనంతరంæ కార్మికులు అశోక్‌ను సముదాయించి ఇంటికి పంపించారు. జీతాలు సరిగా రావడం లేదని నిరసన వ్యక్తం చేసిన అశోక్‌పై అధికారులు వేధింపులకు పాల్పడటంతోనే ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని కార్మికులు ఆరోపిస్తున్నారు. -
ప్రయాణికుడి పరేషాన్.. బస్ కండక్టర్ నిజాయితీ
సాక్షి, హైదరాబాద్ : టీఎస్ఆర్టీసీ దిల్సుఖ్నగర్ డిపోలో విధులు నిర్వహిస్తున్న ప్రవీణ అనే మహిళా కండక్టర్ నిజాయితీ చాటుకున్నారు. బస్‌లో ఓ ప్రయాణికుడు మర్చిపోయిన రూ.20 వేల నగదు బ్యాగ్‌ను మలక్‌పేట పోలీసుల సాయంతో తిరిగి అతనికి అప్పగించారు. శనివారం చోటుచేసుకున్న ఈ సంఘటనలో.. బస్సు సికింద్రాబాద్ నుంచి సరూర్‌నగర్ వెళ్తుండగా.. ఓ ప్రయాణికుడు స్టేజీ వచ్చిందనే తొందరలో క్యాష్ బ్యాగ్‌ను సీట్లోనో వదిలేసి బస్ దిగిపోయాడు. కండక్టర్ ప్రవీణకు ఆ బ్యాగ్ కనిపించడంతో దానిని తెరచి చూశారు. దాంట్లో రూ.20 వేల నగదు ఉండటంతో మలక్‌పేట పోలీసులకు సమాచారం ఇచ్చి.. వారి సాయంతో బాధితునికి బ్యాగ్ అందించారు. ప్రవీణ నిజాయితీపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు ఆమెను అభినందించారు. పోయిందనుకున్న సొమ్ము తిరిగి దక్కడంతో ప్రయాణికుడు కండక్టర్ ప్రవీణకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. -
బస్ కండక్టర్‌ను అభినందించిన పోలీసులు
-
కండక్టర్ కలెక్టరా.. అంతా ఫేక్!
కర్ణాటక: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చంటూ గత కొద్ది రోజులుగా ఓ వార్త సోషల్ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వైరల్ అవుతోంది. విషయానికొస్తే.. యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో బెంగళూరు లోకల్ బస్సు కండక్టర్ సత్తా చాటాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూకు ఎంపికయ్యాడు. ఇక ఇది కూడా పూర్తి చేస్తే అతడు ఏకంగా కండక్టర్ నుంచి కలెక్టర్ స్థాయికి చేరిపోతాడు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో, వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. (ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?) అయితే తాజా సమాచారం ప్రకారం ఈ వార్త ఫేక్ అని తెలుస్తోంది. మధు ఎన్సీ అనే కండక్టర్ యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మధు పేరుతో వచ్చిన ఆ రిజల్ట్ మధు కుమారి అని బెంగళూరుకు చెందిన వేరే అమ్మాయిదని తేలింది. దీంతో తప్పుడు సమాచారంతో మీడియాను తప్పుదోవ పట్టించిన మధుపై బీఎంటీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు. We’ve come to know that the BMTC bus conductor who claimed to have cracked the IAS Mains exam was lying. We have reason to believe that the roll number he showed us didn't belong to him. (1/2) — Bangalore Mirror (@BangaloreMirror) January 30, 2020 -
ఈ కండక్టర్.. కాబోయే కలెక్టర్?
తీరిక లేకుండా కండక్టర్ ఉద్యోగం. పెద్ద పెద్ద అకాడమీల్లో శిక్షణ పొందలేదు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నట్లు ఉన్న వనరులతోనే సివిల్స్ వైపు సాగిపోతున్నాడో యువ కండక్టర్. దూరవిద్యలో డిగ్రీ, పీజీలు చేసి సివిల్స్ పరీక్షల్లో మెయిన్స్‌ను అధిగమించాడు. కర్ణాటక, యశవంతపుర: పట్టుదల ఉంటే ఏమైనా సాధించవచ్చని నిరూపించే పనిలో ఉన్నారు బస్సు కండక్టర్ ఒకరు. మండ్య జిల్లా మళవళ్లికి చెందిన ఎన్సీ మధు బెంగళూరులోని కొత్తనూరు 34వ బీఎంటీసీ డిపోలో కండక్టర్‌గా పని చేస్తున్నాడు. తన 19 ఏటనే కండక్టర్ కొలువు సాధించాడు. చదువు అంటే ఎంతో ఇష్టం కావడంతో మధు ఐఏఎస్ కావాలని కలగన్నాడు. అందుకోసం దూర విద్య ద్వారా డిగ్రీ, పీజీని పూర్తి చేశాడు. 2014లో కేఎఎస్, 2018, 2019లో యుపీఎస్సీ పరీక్షలను రాశాడు. 2019లో కన్నడ మాధ్యమంలో సివిల్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణుడయ్యాడు. రాజనీతి శాస్త్రం, జనరల్ స్టడీస్‌ను ఎంపిక చేసుకొని రాసిన మెయిన్స్ పరీక్షల్లో పాసై ఇంటర్వ్యూకు ఎంపిక కావడం విశేషం. మార్చి 25న ఢిల్లీలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఇంటర్వ్యూలో పాసైతే కలెక్టర్ లేదా ఎస్పీ ఏదైనా సాధించినట్లే. రెండుసార్లు పరాజయం 2014లో కేఎఎస్ పరీక్ష , 2018లో సివిల్స్ రాసినా ఫలితం లేదు. నిరుత్సాహం పడకుండా ఈసారి సాధించాలనే పట్టుదలతో యూ ట్యూబ్‌లో సివిల్స్ పరీక్షల మెళకువలు నేర్చుకున్నాడు. తన మొబైల్ ఫోన్లో యూ ట్యూబ్ ద్వారా కోచింగ్ తీసుకుంటూ సన్నద్ధమయ్యాడు. 2019లో యుపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసి సత్తా చాటాడు. రోజూ 5 గంటలు వీడియోలతో కోచింగ్ తాను ఎక్కడా కోచింగ్‌కు వెళ్లలేదని, రోజు ఐదు గంటల పాటు యూ ట్యూబ్‌లోలో కోచింగ్ తరగతులను చూస్తూ పరీక్షకు సిద్ధమైనట్లు మధు చెబుతున్నాడు. తనకు యూ ట్యూబే మార్గదర్శనమని చెప్పాడు. ఇప్పుడు ఇంటర్వ్యూపై దృష్టి పెట్టినట్లు తెలిపాడు. -
టికెట్ల బాధ్యత ప్రయాణికులదే
సాక్షి, సిటీబ్యూరో: ఎక్కడో ఒక చోట విజిలెన్స్ సిబ్బంది మాటు వేసి ఉంటారు. ఆ మార్గంలో వెళ్లే బస్సును ఆకస్మాత్తుగా నిలిపేస్తారు. అంతే ఇక కండక్టర్‌కు ముచ్చెమటలు పట్టేస్తాయి. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంటారు. ఆ క్షణం లో ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో తెలియ ని ఆందోళన, ఏ ఒక్క ప్రయాణికుడు టిక్కెట్ తీసుకోకపోయినా అందుకు బాధ్యత వహించవలసిన దుస్థితి. ఇదంతా నిన్నటి సంగతి. ఇప్పుడు కండక్టర్లకు ఆ భయం లేదు. నిశ్చింత గా, నిర్భయంగా విధులు నిర్వహించవచ్చు. టిక్కెట్ తీసుకోవలసిన బాధ్యత ఇక పూర్తిగా ప్రయాణికుడిదే. ఈమేరకు ఆర్టీసీ సైతం విస్తృత ప్రచారాన్ని చేపట్టింది. ఇటీవల కార్మికులు చేపట్టిన సుదీర్ఘమైన సమ్మెలోనూ టిక్కెట్ తీసుకోవలసినబాధ్యత ప్రయాణికులదేనని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం కండక్టర్లకు ఉద్యోగభద్రతను కల్పిస్తూ టిక్కెట్ల బాధ్యతను ప్రయాణికులపైనే మోపింది. మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 178 ప్రకారం ప్రయాణికులు తప్పనిసరిగా టిక్కెట్తీసుకొని ప్రయాణం చేయాలని, టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తే రూ.500 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొంటూ ఆర్టీసీ ముమ్మర ప్రచారం చేపట్టింది. కొత్త ఏడాది నగరంలోని అన్ని అలైటింగ్ పాయింట్ వద్ద తనిఖీలను ఉధృతం చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ అధికారులు తెలిపారు. ఎన్నో పోరాటాల ఫలితం... నిజానికి టిక్కెట్ల అంశం కండక్టర్లకు కత్తిమీద సాములా మారింది. వివిధ రూట్లలో అత్యధిక ఆదాయం తెచ్చిన కండక్టర్లు, డ్రైవర్లకు ప్రోత్సాహకాలు అందజేస్తూనే టిక్కెట్లపైన వచ్చే ఆదాయంలో ఒక్క రూపాయి తక్కువగా ఉన్నా కఠిన చర్యలు తీసుకోవడం వేలాది మంది కండక్టర్ల ఉద్యోగభద్రతకు ముప్పుగా పరిణమించింది. అలా ఎంతోమందిపైన సస్పెన్షన్ వేటు పడింది. ఉద్యోగాలకు దూరమై ఏళ్లతరబడి కోర్టుల చుట్టూ తిరిగిన వాళ్లు, ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డ కార్మికులు ఎంతోమంది ఉన్నారు. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో సుమారు 8 వేల మంది కండక్టర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఒక బస్టాపులో ఎక్కి ఆ తరువాత బస్టాలోనే దిగే ప్రయాణికులు, ఒకటి,రెండు బస్టాపులకు టిక్కెట్ తీసుకొకుండా తప్పించుకొనేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఈ క్రమంలో విజిలెన్స్ తనిఖీల కారణంగా కండక్టర్లు మూల్యం చెల్లించవలసి వచ్చేది. నగరంలోని 29 డిపోల పరిధిలో ఎక్కడో ఒక చోట కండక్టర్లపైన వేటు పడడం పరిపాటిగా మారింది. మరోవైపు తాము టిక్కెట్ తీసుకొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కండక్టర్లు తమ వద్దకు రాకుండానే ఉండిపోయారని తరచుగా ప్రయాణికులు బుకాయించేవారు. గతంలో పావలా పైసల టిక్కెట్ తీసుకోకపోయినా కండక్టర్లే మూల్యం చెల్లించవలసి వచ్చేది. ఇలాంటి పరిణామాల బారి నుంచి తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు అనేక ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని టిక్కెట్ బాధ్యతను ప్రయాణికులపైన మోపడంతో ఆర్టీసీ కండక్టర్లకు ఊరట లభించినట్లయింది. బస్టాపుల్లోనే తనిఖీలు మరోవైపు ఇక నుంచి బస్టాపుల్లోనే తనిఖీలను నిర్వహిస్తారు. రోడ్లపైన బస్సులను నిలిపేసి మార్గమధ్యలో తనిఖీలు చేయడం వల్ల ప్రయాణికులు తమ సమయాన్ని తీవ్రంగా నష్టపోవలసి వస్తుంది. అప్పటికే బస్సుల కోసం గంటల తరబడి పడిగాపులు కాసిన వాళ్లు మరో గంట పాటు టిక్కెట్ల తనిఖీల కోసం నిరీక్షించవలసి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రయాణికులు బస్సు దిగే బస్టాపుల్లో మాత్రమే విజిలెన్స్ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. లాస్ట్ బస్టాపుల్లో బస్సులు ఆగిన తరువాత రెండు వైపులా ఫుట్‌బోర్డుపైన నించొని తనిఖీలు చేస్తారు. దీనివల్ల ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పటికే ఈ పద్ధతి అమల్లో ఉంది, త్వరలో పూర్తిస్థాయిలో ఆన్‌రోడ్ తనిఖీలకు స్వస్తి చెప్పాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. -
పాత టికెట్లు ఇచ్చి పైసలు వసూలు చేసిన కండక్టర్
షాద్‌నగర్‌రూరల్ : ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన తాత్కాలిక కండక్టర్ ఉదంతం ఒకటి శనివారం వెలుగు చూసింది. షాద్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో శనివారం ఫరూఖ్‌నగర్ మండలం నేరేళ్ళచెరువు గ్రామానికి చెందిన ప్రైవేట్ కండక్టర్ కె.శివకుమార్, డ్రైవర్ ఎండీ గౌస్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, బస్సును గద్వాల డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి షాద్‌నగర్‌లో తనికీ చేశారు. టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్ కె.శివకుమార్ క్యాష్ బ్యాగ్‌లో రూ.3143 ఉండాలి. కానీ, రూ.4470 ఉన్నట్లు గుర్తించారు. అదనంగా ఉన్న డబ్బుల గురించి కండక్టర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పడం లేదని డీఎం వివరించారు. ప్రయాణికులకు టికెట్లు అమ్మిన తర్వాత వాటిని తిరిగి కండక్టర్ ప్రయాణికుల నుంచి తీసుకొని బ్యాగులో ఉంచుకున్నట్లు తెలిపారు. కండక్టర్ కె.శివకుమార్ పాత టికెట్లను ప్రయాణికులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తాము గుర్తించామని డీఎం తెలిపారు. ఈ మేరకు శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శివకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. -
మతిస్థిమితం కోల్పోయిన ఆర్టీసీ కండక్టర్
జోగిపేట (అందోల్): ‘ఆర్టీసీ సమ్మె ముగియకుంటే మా జీవితాలు ముగిసినట్లే. నా భర్త ఉద్యోగానికి వెళ్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. సీఎం సారూ.. కనికరిస్తే బాగుండు. సమ్మె కారణంగా ఆందోళనతో నా భర్త మతి స్థిమితితం కోల్పోయాడు. కడుపునిండా తిని 20 రోజులయ్యింది’అంటూ ఆర్టీసీ కండక్టర్ నాగేశ్వర్ (45) భార్య సుజాత కన్నీటి పర్యాంతమవుతూ తమ కష్టాలను వెల్లడించింది. వివరాలిలా ఉన్నాయి.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ డిపోలో పనిచేస్తున్న కండక్టర్ నాగేశ్వర్ జోగిపేటకు చెందిన సుజాతను 18 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. సంగారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా ప్రతి రోజు సంగారెడ్డి డిపో వద్ద జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఇటీవల ప్రభుత్వం కార్మికులు విధుల్లో చేరాలని నిర్ణయించిన డెడ్‌లైన్‌ను టీవీలో చూసినప్పటి నుంచి ఆయన ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో సుజాత తన తల్లి నివాసం ఉండే జోగిపేటకు భర్తతో కలసి వచ్చింది. మూడు, నాలుగు రోజులనుంచి నాగేశ్వర్ టికెట్.. టికెట్.. బస్ ఆగింది దిగండి.. రైట్ రైట్ అంటూ అరవడం, అసందర్భంగా నవ్వుతుండటం, ఫోన్ రాకున్నా హాలో.. హాలో అనడం, ఎవరు చేశారని ఎవరైనా అడిగితే అశ్వత్థామ.. అని సమాధానం ఇస్తున్నాడు. ఒక్కోసారి ఉండండి.. డిపోలో కలెక్షన్ కట్టివస్తా .. అని కూడా అంటున్నాడని భార్య సుజాత ఆందోళన వ్యక్తం చేసింది. తనను, పిల్లలను కూడా గుర్తు పట్టడంలేదని తెలిపింది. తమకు ఇద్దరు కొడుకులు ఉన్నారని, జీతం రాక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో చదువులను మధ్యలోనే మాన్పించేసినట్లు ఆమె చెప్పింది. నాగేశ్వర్ రాత్రంతా నిద్రపోకుండా ఏదో ఒకటి మాట్లాడుతుండడంతో భర్త ప్రవర్తనను చూసి సుజాత కన్నీరు మున్నీరవుతూ జాగారం చేస్తుండగా, కొడుకులు కూడా తల్లిదండ్రుల బాధను చూసి వారు కూడా నిద్రకు దూరం అవుతున్నారు. చేతిలో డబ్బులు లేవని, తన భర్తకు చికిత్స అందించేందుకు దాతలు సాయం చేయాలని సుజాత వేడుకుంటోంది. ఆర్టీసీ ఆస్పత్రికి వెళ్తే సమ్మెలో ఉన్న ఉన్నవారికి చికిత్స చేయమంటూ వెళ్లగొట్టారని తెలిపింది. వేరే ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో దేవుడి మీద భారం వేసి అలాగే ఉన్నట్లు తెలిపింది. కాగా, నాగేశ్వర్‌కు చికిత్స చేయించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలని కార్మికులు, స్థానికులు కోరుతున్నారు. (చదవండి: చలో ట్యాంక్‌బండ్ మరో మిలియన్ మార్చ్) -
మానవత్వానికి మాయని మచ్చ
సాక్షి, బెంగళూరు : కన్నకూతురు మృతి చెందిన విషయాన్ని కూడా తెలుపకుండా మానవత్వాన్ని మరిచిన ఆర్టీసీ అధికారులు ఓ కండక్టర్‌ను విధులకు పంపిన ఉదంతం కొప్పళ జిల్లా గంగావతిలో వెలుగు చూసింది. బాగలకోటె జిల్లా రాంపుర గ్రామ నివాసి అయిన మంజునాథ్ గంగావతి టూ కొల్హాపుర బస్సు కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని కుమార్తె కవిత(11) బుధవారం ఉదయం మృతి చెందింది. 10 గంటల సమయంలో బస్ డిపో అధికారులకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అయితే ఆ సమాచారాన్ని తండ్రి మంజునాథ్‌కు తెలపకుండా అధికారులు యథాప్రకారం విధులకు పంపించారు. అదే రోజు రాత్రికి ఉద్యోగం ముగించుకొని ఇంటికి వచ్చిన మంజునాథ్‌కు అప్పుడు తన కూతురు మృతి గురించి తెలిసింది. మరుసటి రోజు ఉదయం విధులకు రావాలని బస్సు డిపో అధికారులు మంజునాథ్‌కు సూచించారు. ఇదే విషయంపై శుక్రవారం కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది కలిసికట్టుగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న కూతురును చివరి చూపు కూడా చూడలేని ఆ తండ్రి రోదన పలువురి హృదయాలను ద్రవింప చేసింది. కాగా మంజునాథ్ కుమార్తె చనిపోయిన విషయం ఆలస్యంగా తెలిసిందని, తనకు విషయం తెలిసిన వెంటనే మంజునాథ్‌ను ఇంటికి పంపానని డిపో మేనేజర్ ఎస్.ఆర్.సొన్నద్ సమాధానమిచ్చారు. -
మంచి కండక్టర్!
సాక్షి, బోధన్ : బస్సులో మరిచిపోయిన రూ.25 వేల క్యాష్ బ్యాగును కండక్టర్ తిరిగి ప్రయాణికుడికి ఇచ్చి మంచితనం చాటుకున్నాడు. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు (ఏపీ25వై.0018) శనివారం ఉదయం వరంగల్ వెళ్లి తిరిగి నిజామాబాద్ మీదుగా రాత్రి 8 గంటలకు బోధన్‌కు చేరుకుంది. బోధన్ పట్టణం ఆచన్‌పల్లి ప్రాంతానికి చెందిన నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నీరడి గంగా శంకర్ నిజామాబాద్ బస్టాండ్‌లో బస్సు ఎక్కారు. లెదర్ బ్యాగును బస్సులోనే మరిచిపోయి బోధన్‌లో బస్సు దిగి వెళ్లిపోయాడు. గమనించిన కండక్టర్ రాజ్‌కుమార్ లెదర్బ్యాగును డిపో సెక్యూరిటీ కానిస్టేబుల్స్‌కు అప్పగించారు. బ్యాగును తెరిచి చూడగా అందులో రూ. 25 వేల నగదు, మెడిసిన్స్, మెడికల్ రిపోర్టులు ఉన్నాయి. దీంతో డీఎం రమణకు సమాచారం అందించారు. మంచితనం చాటుకున్న కండక్టర్ రాజ్‌కుమార్, డ్రైవర్రాజును డిపో అధికారులు అభినందించారు. -
ఎయిర్ బస్
‘వణక్కమ్ (నమస్కారం) మనకు ప్రభుత్వం మంచి బస్సు ఇచ్చింది. దీనిని పరిశుభ్రంగా ఉంచడానికి సహకరించండి. చెత్త పారేయవద్దు. నా దగ్గర చింతపండు క్యాండీ ఉంది, మీకు వికారంగా ఉంటే అడగండి, ఇస్తాను, మీకు వాంతి అయ్యేలా ఉంటే చెప్పండి, బ్యాగు ఇస్తాను. ఎవ్వరూ మొహమాటపడక్కర్లేదు’ అంటూ ప్రయాణికులను మృదువుగా ఆహ్వానిస్తారు శివషణ్ముగమ్. కోయంబత్తూరు సింగనల్లూరు బస్ స్టాండ్ బస్ హార్న్ శబ్దాలతో, టైర్ల బర్బర్ ధ్వనులతో, దుర్వాసనతో, బాగా రద్దీగా, గందరగోళంగా ఉన్న సమయంలో శివషణ్ముగమ్ పిలుపు అమృతంలా చెవిని తాకుతుంది. ఈయన మాట్లాడిన మాటల వీడియో కిందటి వారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయనకు తక్షణమే ప్రజలలో మంచి గుర్తింపు కూడా వచ్చింది. చాలా న్యూస్ చానెల్స్ ఆయనను పలకరించాయి. ఒక చిన్న స్వాగతవచనం ఎంతోమందిని ఎందుకు ఆకర్షించింది? సాధారణంగా మన బస్ కండక్టర్లు, పని ఒత్తిడి కారణంగా కాని, ఇతర కారణాల వల్ల కాని చాలా చిరాకుగా, నిర్లక్ష్యంగా గాని ప్రవర్తిస్తుంటారు. స్నేహపూర్వకంగా పలకరించరు. కాని శివషణ్ముగమ్ మాత్రం ప్రశాంతమైన, స్వచ్ఛమైన వాయువు పీల్చుకునేలా ప్రయాణికులకు తోడ్పడతారు.తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్‌కి చెందిన కోయంబత్తూరు – మదురై బస్సులో కండక్టరుగా పనిచేస్తున్నారు శివషణ్ముగమ్. ఆ బస్టాండ్‌లో ‘మదురై బై పాస్... మదురై బై పాస్’... అంటూ బస్ ఫుట్‌బోర్డు మీద నిలబడి, ప్రయాణికులను ఆప్యాయంగా పిలుస్తుంటారు శివషణ్ముగమ్. ఆయనకు ఈ రూట్లో ఇటీవలే కొత్త బస్సును కేటాయించారు. నీలిరంగు యూనిఫారమ్‌లో, చేతిలో సంచితో బస్ డోర్ దగ్గర నిలబడి, 52 సంవత్సరాల శివషణ్ముగమ్ ‘‘మీరంతా ఈ బస్సులో ప్రయాణించడానికి ఏదో ఒక కారణం ఉంది. మీ అందరికీ శుభం జరగాలి. మీ యాత్ర దిగ్విజయంగా జరగాలని మా డ్రైవర్ సదాశివం, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీకు సహాయపడడానికి నేను ఇక్కడ ఉన్నాను’ అని చెబుతారు. విమానంలోకి ఎక్కగానే ఎయిర్ హోస్టెస్ మాట్లాడే స్వాగత వచనాలను పోలి ఉంటాయి శివషణ్ముగమ్ మాటలు. కాని ఇంతవరకు ఒక్కసారి కూడా ఆయన విమానం ఎక్కలేదు. ఇది తనకు తానుగా అలవాటు చేసుకున్న సంప్రదాయం.23 సంవత్సరాలుగా టీఎన్ఆర్టీసీలో పని చేస్తున్న శివషణ్ముగమ్ ఇటువంటి పలకరింపును ఇటీవలే ప్రారంభించారు. ప్రయాణికులంతా ఈ బస్సును పరిశుభ్రంగా ఉంచుతారని ఆశిస్తున్నా ను’ అంటూ అందరినీ ఉత్తేజపరుస్తూ, ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ప్రశాంత చిత్తంతో ప్రారంభించేలా చేస్తున్నారు శివషణ్ముగమ్. – జయంతి -
ఫ్రెండ్లీ కండక్టర్ మూర్తి
సాక్షి కడప/సెవెన్‌రోడ్స్ : కడప–రాయచోటి మధ్య రోజూ ప్రయాణించే వ్యక్తులు పలమనేరు ఆర్టీసీ డిపో బస్సు కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో చిత్తూరు, మదనపల్లె, బెంగళూరు, రాయచోటి నాన్‌స్టాఫ్ బస్సులు వచ్చినప్పటికీ ప్రయాణికులు అందులో ఎక్కరు. ఆ బస్సుల్లో ఎక్కితే ముందే గమ్య స్థానానికి చేరుకోవచ్చని తెలిసినప్పటికీ పలమనేరు డిపో బస్సు కోసమే వేచి ఉంటారు. ఈ కథనం చదివే పాఠకులకు ఇది కొంత వింతగానే అనిపిస్తుంది. కానీ ఇది ముమ్మాటికి నిజం. పలమనేరు బస్సు కండక్టర్ బ్రాహ్మణపల్లె గురుమూర్తి ఇందుకు కారణం. ఆయనేమీ సూపర్‌స్టార్ కాదు. ఒక సాధారణ కండక్టర్‌కు ఇంత ఫాలోయింగ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? అలాగైతే మంగళ, గురు, శనివారాలలో కడప ఆర్టీసీ బస్టాండులో సాయంత్రం 6 గంటలకు పలమనేరు బస్సు ఎక్కితే అర్థమవుతుంది. ప్రయాణికుల పట్ల ఆయన చూపే గౌరవ మర్యాదలే ఇంతటి అభిమానానికి కారణం. ప్రయాణికులు బస్సు ఎక్కే సందర్భంలో డ్రైవర్ వెనుక మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వడంటూ కండక్టర్ గురుమూర్తి అందరినీ అభ్యర్తిస్తుంటారు. ఎవరైనా పురుషులు ఆ సీట్లలో కూర్చుంటే ‘ప్లీజ్ సార్...దయచేసి ప్రక్కసీట్లలో వెళ్లి కూర్చోండి’అంటూ వినమ్రంగా చెబుతారు. బస్సు ఇతర వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో, గువ్వలచెరువు ఘాట్‌లో మలుపులు తిరిగేటపుడు డ్రైవర్ పక్కనే నిలుచుని తగు సూచనలు అందిస్తుంటారు. అందరూ ‘రైట్’అనడం పరిపాటి. అయితే గురుమూర్తి మాత్రం తమదైన చిత్తూరుజిల్లా యాసలో ‘రైట్టు...రైట్టు’అంటూ డ్రైవర్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే నోటితో ఆయన వేసే విచిత్రమైన విజిల్ ప్రయాణీకులంతా ఆసక్తిగా వింటుంటారు. చిల్లర ప్లీజ్ చాలామంది టిక్కెట్టుకు సరిపడు చిల్లర ఇవ్వకపోవడం సర్వసాధారణం. ఎవరైనా తక్కువ టిక్కెట్టుకు పెద్దనోట్లు ఇచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం విసిగించుకోరు. పైగా ఎవరైనా ప్రయాణికుడు తమకు రావాల్సిన చిల్లర మరిచిపోయి వెళ్లిపోతారని ముందస్తుగా అడిగి మరీ చిల్లర అందిస్తారు. కడప నుంచి సాయంత్రం పలమనేరుకు వెళ్లే సమయంలో రాత్రి 8 గంటకల్లా బస్సు రాయచోటికి చేరాలని ఆయన తాపత్రయ పడుతుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు రాయచోటి నుంచి ప్రయాణికులను తీసుకెళుతుందని ఈయన ఆందోళన. అంటే ఆదాయం ఏపీఎస్ఆర్టీసీకి దక్కాలనే తపన ఆయనది. ఎందరో అభిమానులు రాయచోటికి చెందిన పలువురు కడపలో ఉద్యోగాలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వీరంతా రోజూ రాయచోటి–కడప మధ్య ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. కండక్టర్ గురుమూర్తి ప్రయాణికులకు ఇచ్చే గౌరవ మర్యాదలకు వీరంతా ఆకర్షితులయ్యారు. గురుమూర్తి ఒక కండక్టర్‌గా కాకుండా తమ స్నేహితునిగా భావిస్తారు. బస్సు దిగే సమయంలో ‘మూర్తి వెళ్లొస్తాం’అంటూ సెలవు తీసుకోవడం పరిపాటి. ఉత్తమ కండక్టర్‌గా అవార్డులు చిత్తూరుజిల్లా తవనంపల్లె మండలం అరగొండ సమీపంలోని గాజులపల్లెకు చెందిన గురుమూర్తి కండక్టర్‌గా కుప్పం డిపోలో మొదటిసారిగా పనిచేశారు. తర్వాత పలమనేరు డిపోకు బదిలీపై వచ్చిన కండక్టర్ గురుమూర్తికి పలుమార్లు అవార్డులు వరించాయి. మూడుసార్లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కండక్టర్ అవార్డులను అందుకున్నారు. ప్రయాణికులతో అనుక్షణం కలిసిపోతూ....మనలో ఒకరిలా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రయాణికుల సంగతి అటుంచితే సంస్థలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గురుమూర్తి. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఒక కిలోమీటరుకు ఈపీకే (ఎర్నింగ్ పర్ కిలోమీటరు) రూ. 17–20 ఉండగా, అలాంటిది చిత్తూరు–తిరుమల సర్వీసులో 479 కిలోమీటర్లు తిప్పి కిలో మీటరుకు రూ. 50 ఈపీకే సాధించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో ఇది రాష్ట్రంలోనే మొదటి స్థానమని సంబం«ధిత డిపో మేనేజర్ గురుమూర్తిని అభినందించిన ఘటనలు ఉన్నాయి. కలెక్షన్ కింగ్ ఆర్టీసీసంస్థకు రాబడిలోనూ గురుమూర్తి ఆరాటం ఫలిస్తోంది. కుప్పం, పలమనేరు ఇలా అన్నిచోట్ల...ఏ రూటుకు బస్సు పోయినా గురుమూర్తి కలెక్షన్ల కింగ్‌గా మారిపోయారు. ఇప్పటికే పలమనేరు పరిధిలో ఆర్టీసీ బస్సులో అధిక ఆదాయాన్ని తీసుకువస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా వరుసగా కడప–పలమనేరు మధ్య తిరుగుతున్న బస్సు ద్వారా అత్యధిక ఆదాయం ఒనగూరుస్తూ ప్రతినెల ప్రశంసాపత్రం అందుకుంటున్నారు. ఇలా వరుసగా ఐదు నెలలుగా ప్రతినెల అధిక ఆదాయ గుర్తింపు గురుమూర్తికే లభిస్తోంది. సినిమారంగం నుంచి అనుకోకుండా కండక్టర్ మధ్య తరగతి కుటుంబానికి చెందిన గురుమూర్తికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. ఇంటర్ చదువుతున్న సమయంలో చదువుకు స్వస్తి చెప్పి సినిమాపై ఉన్న అభిమానంతో చెన్నైకి వెళ్లారు. ఇష్టమైన సినిమా రంగంలో రాణించడం కోసం కష్టాలు పడుతూ ఎట్టకేలకు ఓ సంస్థలో ప్రొడెక్షన్ చీఫ్‌గా చేరారు. ఇతను పనిచేసిన సంస్థ చిరంజీవి హీరోగానే సినిమాలు ఎక్కువగా చేసేవారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో కూడా ‘గురు’మూర్తికి మంచి సంబంధాలే ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారిగా మూర్తి కుటుంబంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో నేరుగా సొంతూరు వచ్చారు. సినిమా రంగంపై ఆశ వదలుకున్నారు. కుటుంబ భారం మీద పడడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్యోగం కోసం ఆలోచన చేస్తున్న సమయంలోనే పదవ తరగతి అర్హతతో కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే దరఖాస్తు చేశారు. వెంటనే ఉద్యోగం రావడం, అందులో చేరడం కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రయాణీకుల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు. -
చిల్లర అడిగాడని కోపంతో రెచ్చిపోయి..
-
చిల్లర అడిగితే.. చితక్కొట్టాడు..!
సాక్షి, వనపర్తి : జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ బస్ కండక్టర్ రౌడీలా ప్రవర్తించాడు. ఈ ఘటన వనపర్తి బస్టాండ్‌లో చోటుచేసుకుంది. వివరాలివి.. ఓ యువకుడు తనకు రావాల్సిన రూ.3 చిల్లరను కండక్టర్‌ను అడిగాడు. కోపంతో ఆ కండక్టర్ రెచ్చిపోయి ఆ యువకుడ్ని బస్టాండ్‌లోని కంట్రోల్ రూమ్‌లో వేసి చితకబాదాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేకపోతే తమదైన శైలిలో పోక తప్పదని వారు హెచ్చరించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, సంబంధిత అధికారులు ఎవరూ కూడా అడ్డుచెప్పలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్థినిని వేధిస్తున్న కండక్టర్ అరెస్ట్
నాగోలు: బస్సులో ప్రయాణిస్తున్న బీటెక్ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించడమేగాక వేధింపులకు పాల్పడుతున్న బస్సు కండక్టర్‌ను వనస్థలిపురం షీ టీమ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నాగోలు అయ్యప్ప కాలనీకి చెందిన బాదం శ్రీనివాస్‌గుప్తా అలియాస్ బీఎస్గుప్తా(50) బండ్లగూడ ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. హయత్‌నగర్ నుంచి మెహిదీపట్నం వెళ్లే బస్సులో భాగ్యలత ప్రాంతానికి చెందిన బీటెక్ విద్యార్థిని రోజు బస్సు ఎక్కే క్రమంలో శ్రీనివాస్‌గుప్తా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. అతని వేధింపులు శృతిమంచడంతో బాధితురాలు ఈ విషయాన్ని తల్లికి చెప్పింది. దీనిపై ఆమె గుప్తాను నిలదీయగా దురుసుగా ప్రవర్తించాడు. శుక్రవారం బస్సు లో మరోసారి అసభ్యంగా ప్రవర్తించడంతో బాధితురాలు వనస్థలిపురం షీ టీమ్ వాట్సాప్ నెంబర్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న షీటీమ్ సభ్యులు నిందితుడిని అ రెస్ట్ చేసి కేసులు నమోదు చేసి రిమా ండ్‌కు త రలించారు. కండక్టర్ శ్రీనివాస్‌గుప్తా బస్సు లో మహిళలు, విద్యార్థినుల పట్ల అస భ్యంగా ప్ర వర్తిస్తున్నాడని పోలీసులు తెలిపా రు. సమావేశంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐ విజయ్, షీ టీమ్ ఏఎస్ఐ యాద య్య, సుమలత, మహేష్, పాల్గొన్నారు. -
నిత్య కర్షకుడు.. ఈ కండక్టర్
మంచాల: బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తూనే వ్యవసాయంలో రాణిస్తున్నాడు మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన లా లగారి గణేష్. మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందిన గ ణేష్కు రెండు ఎకరాల భూమి ఉంది. అందులో ఏళ్లతరబడి వివిధ పంటలు సాగుచేసినా ఆశించిన దిగుబడి రాలేదు. దిగుబడి వచ్చినా ధర లేక కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉండేది. అ యినా ఆయన సాగు బాటను వదల్లేదు. మధ్యలో బస్ కండక్టర్ ఉ ద్యోగం వచ్చినా వ్యవసాయం మీద ఆశ చంపుకోలేదు. సాధారణ పంటలతో లాభం లేదనుకుని ఏదైనా ప్రత్యేక పంటను సాగు చే యాలని గణేష్ ఆలోచించాడు. ఏ పంట వేస్తే లాభాలు ఉంటాయ నే విషయంపై చాలా రోజులు పరిశీలన చేశాడు. ఆ దశలో మా ర్కెట్లో మంచి డిమాండ్ ఉన్న గెర్కిన్ పంటపై ఆయన దృష్టిపడింది. దీంతో ఆ పంట సాగు వివరాలు తెలుసుకున్నాడు. సాగు కోసం విత్తనాలు సరఫరా చేసే కంపెనీ ప్రతినిధులను ఆశ్రయించాడు. వారు ఆరుట్లకు వచ్చి గణేష్ వ్యవసాయ భూమిని పరిశీలించారు. గ్లోబల్ గ్రీన్ కంపెనీ లిమిటెడ్ కంపెనీ వారు గెర్కిన్ పంట విత్తనాలు, క్రిమి సంహారక మందులు ఇవ్వడమే గాకుండా పంటను తామే కొనుగోలు చేస్తామని ఒప్పదం చేసుకున్నారు. 120 రోజుల పంట... గెర్కిన్∙ 120 రోజుల పంట. విత్తనాలు నాటిన మూడు నాలుగు రోజుల్లో మొలకలు వస్తాయి. 30 రోజుల వ్యవధిలో కాత వస్తుంది. మొదటి భీజం ఆకులు, పూత తీసి వేయాలి. అనంతరం వచ్చే కాతను కోసి మార్కెట్‌కు తరలించాలి. మొదట్లో ఎకరాకు ఐదు ను ంచి ఆరు క్విటాళ్ల దిగుబడి వస్తుంది. ఒకటి, రెండు కాతలు అనంతరం టన్ను వరకు వస్తుంది. గెర్కిన్ కాయలను కాసిన రెండవ రోజు కోసి మార్కెట్‌కు తరలించాలి. 120 రోజుల వ్యవధిలో 20కి పైగా కోతలు వస్తుంది. పంటను విత్తనాలు సరఫరా చేసిన కంపెనీ వారు కొనుగోలు చేస్తున్నారు. కాయ సైజును ఆధారంగా రేటు నిర్ణయిస్తారు. ‘ఎ’ రకం 14ఎం.ఎం, రూ.కిలో 30, ‘బి’ రకం 18 ఎం.ఎం. రూ.19, ‘సి’ రకం 25ఎం.ఎం. రూ.12, ‘డి’ రకం 33 ఎం.ఎం రూ.04 చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వారే కంపెనీ వాహనాల ద్వారా తోట వద్దకు వచ్చి పంట తీసుకెళ్తున్నారు. ఉద్యోగం చేస్తూనే.. గణేష్ కొన్ని సంవత్సరాలుగా బస్ కండక్టర్ ఉద్యోగం చేస్తూనే.. వ్యవసాయాన్ని కూడా చూసుకుంటున్నాడు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కండక్టర్ ఉద్యోగం చేస్తాడు. మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు వ్యవసాయ క్షేత్రంలో పనులు చేస్తాడు. సాగులో తన భార్య శోభ సహకారం అందిస్తోంది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందడమే కాకుండా పది మందికి జీవనోపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. లాభదాయకమైన సాగు నాకు వ్యవసాయం అంటే మక్కువ. కండక్టర్ ఉద్యోగం వచ్చినా పంటల సాగు వదల్లేదు. గెర్కిన్ పంట చాలా లాభదాయకం. ఈ పంట సాగు చేయడం వల్లన 120 రోజుల వ్యవధిలో లక్ష రూపాయలు సంపాదించవచ్చు. ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. విదేశాల్లో మందుల తయారీకి ఉపయోగిస్తారు. ప్రధానంగా ఉష్ణ మండల దేశాలకు ఎగుమతి అవుతుంది. నేను కష్టపడడమే కాకుండా నిత్యం పది మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు సంతోషంగా ఉంది. – లాలగారి గణేష్, ఆరుట్ల -
నిజాయితీ చాటుకున్న కండక్టర్
మణికొండ: ఆర్టీసీ బస్సులో దొరికిన పర్సును తిరిగి పోగొట్టుకున్న వ్యక్తిని పిలిచి అందజేసి ఓ బస్ కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నాడు. మణికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని పంచవటి కాలనీలో నివసిస్తున్న మురళీమోహన్ శనివారం సొంత పనిపై నగరానికి వెళ్లివచ్చారు. కాగా అతను ప్రయాణించిన ఆర్టీసీ బస్సులో తన పర్సును పోగొట్టుకున్నాడు. లింగంపల్లి నుంచి ఉప్పల్‌కు సర్వీస్ అందించే 113 బస్‌లో కండక్టర్‌గా పని చేస్తున్న మధుకు పర్సు దొరికింది. దీంతో పర్సు ఎవరిదో.. వారికి అందజేయాలనే ఉద్దేశ్యంతో అందులోని వివరాల ప్రకారం అతనికి ఫోన్ చేసి పర్సు తన వద్ద ఉందని, వచ్చి తీసుకోవాలని సూచించారు. మురళీమోహన్‌తో పాటు కండక్టర్ మధు కూడా మణికొండలోనే నివసిస్తుండడంతో సర్పంచ్ నరేందర్‌రెడ్డి సమక్షంలో మధు ఆయనకు పర్సును అప్పగించారు. అందులో రూ. 8వేల నగదుతో పాటు ఏటీఎం కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, క్రెడిట్‌కార్డులు తదితర విలువైన కార్డులు ఉన్నాయని, నిజాయితీగా తన పర్సు తనకు అందించిన కండక్టర్ మధుకు మురళీమోహన్ కృతజ్ఞతలు తెలిపారు. -
నన్ను బలి పశువును చేశారు
రోహతక్ : చిన్నారి ప్రద్యుమ్న హత్య కేసులో సీనియర్ విద్యార్థి అసలు నిందితుడని తేలటంతో.. ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు కండక్టర్ అశోక్ కుమార్ బెయిల్ కోసం శుక్రవారం అర్జి పెట్టుకున్నాడు. అంతేకాదు తనను అనవసరంగా ఈ కేసులోకి లాగినందుకు హర్యానా పోలీస్, స్కూల్ మేనేజ్మెంట్ పై కేసు వేయబోతున్నాడని సమాచారం. ఈ విషయాలను అశోక్ కుమార్ తరపు న్యాయవాది మోహిత్ వర్మ ప్రకటించారు. ఈ కేసులో అసలు నిందితులకు రక్షణ కల్పించి అనవసరంగా అశోక్ కుమార్‌ను బలిపశువును చేశారని.. మీడియా ముందు చెయ్యని నేరం ఒప్పుకోవాలంటూ హర్యానా పోలీసులు హింసించారని మోహిత్ చెప్పారు. పోలీసులపై, విమర్శలను తప్పించుకునేందుకు అశోక్ ను ఇరికించిన స్కూల్ యాజమాన్యంపై అశోక్ తరపున కేసు వేయబోతున్నట్లు మోహిత్ పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్విస్ట్ తో దేశం మొత్తం విస్మయం చెందగా.. అశోక్ కుమార్‌కు అనూహ్యంగా మద్దతు లభించటం మొదలయ్యింది. ఇదిలా ఉంటే చిన్నారిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారించిన సీబీఐ, అశోక్ కుమార్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లభించలేదని.. అయితే హత్యలో అతనిపై పాత్ర లేదన్న విషయంపై మాత్రం ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెప్పింది. ఇవి కూడా చదవండి... బాలుడి దారుణ హత్య.. కేంద్రానికి నోటీసులు, కీలక నరాలు తెగి ప్రద్యుమ్న అరవలేదు -
పోలీస్ వర్సెస్ కండక్టర్.. వైరల్ వీడియో
-
ఆర్టీసీ బస్ కండక్టర్ ఎంతపనిచేశాడు..!
చిల్లర లేదంటూ టికెట్ల వెనుక ఇవ్వాల్సిన అమౌంట్ ను రాయడం ఆర్టీసీ కండక్టర్లందరికీ అలవాటే. కొన్ని సార్లు రావాల్సిన చిల్లర మర్చిపోయి మనం బస్సు దిగేస్తాం. ఇంకొంతమందైతే కండక్టర్ దగ్గర్నుంచి చివరిరూపాయి వసూలు చేసేదాకా వదలరు. అలా తనకు రావాల్సిన డబ్బుల కోసం ఓ మహిళ పట్టుపట్టడం, కండక్టర్ ఆమెతో గొడవపడటం, ఆమె తరఫు బందువులొచ్చి రభస చేయడం, చివరికి పోలీసుల రంగ ప్రవేశం.. వీటన్నింటినీ అవమానంగా భావించిన కండక్టర్ కదులుతున్న బస్సులో నుంచి నదిలోకి దూకేసిన అనూహ్య సంఘటన ఆదివారం కర్ణాటకలో చోటుచేసుకుంది. మంగళూరు నుంచి అలంగూరుకు బయలుదేరిన కర్ణాటక ఆర్టీసీ బస్సు కండక్టర్ దేవదాస్ శెట్టి(24) కదులుతున్న బస్సులో నుంచి కుమారధార నదిలోకి దూకి గల్లంతయ్యాడు. బస్సు డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మంగళూరులో బస్సెక్కిన ఓ మహిళ కండక్టర్ కు డబ్బులిచ్చి టికెట్ తీసుకుంది. ఖరీదు పోగా మిగిలిన చిల్లరను ఆమె బస్సు దిగేటప్పుడు ఇచ్చేశాడు కండక్టర్. అయితే తాను ఇచ్చింది రూ.100 కాదని, రూ.500లని ఆ మహిళ కండక్టర్ తో వాదనకు దిగింది. 'కాదూ.. నువ్విచ్చింది వందే'అని కండక్టర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దీంతో మహిళ తన బంధువులకు ఫోన్ చేసి పిలిపించింది. అంతాకలిసి బస్సును కందబ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కండక్టర్ దగ్గరున్న బ్యాగ్ ను పోలీసులు తనిఖీ చేయగా టికెట్ల లెక్క కంటే రూ.500 ఎక్కువ ఉన్నట్లు బయటపడింది. ఇక చేసేదేమీలేక కండక్టర్ మహిళకు క్షమాపణలు చెప్పుకున్నాడు. బస్సు మళ్లీ బయలుదేరింది. జరిగిన ఘటనతో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదని ఒక చీటీలో రాసి దాన్ని డ్రైవర్ బ్యాగులో ఉంచిన కండక్టర్ బ్రిడ్జి పైనుంచి బస్సు వెళుతుండగా నదిలోకి దూకేశాడు. సదరు మహిళతోపాటు ఆమె బంధువులు, కదంబ పోలీసుల తీరును ఆక్షేపిస్తూ బస్సు డ్రైవర్ సుబ్రహ్మణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశాడు. నదిలో గల్లైంతైన కండక్టర్ దేవదాస్ శెట్టి ఆచూకీ ఇంకా లభించలేదు. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు. -
కండక్టర్‌పై కానిస్టేబుళ్ల క్రౌర్యం
న్యూఢిల్లీ: తమకు సంబంధించిన వారికి పార్సిల్ ఇచ్చేందుకు నిరాకరించాడని ఓ బస్ కండక్టర్‌ను ఇద్దరు కానిస్టేబుళ్లు చితకబాదారు. ఈ ఘటన ఉత్తర ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ వద్ద చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను వేరే చోటుకి బదిలీ చేశారు. అయితే, వారిపై కేసు నమోదుకావడంగానీ, ఆ కండక్టర్ కేసు పెట్టడంగానీ జరగలేదు. తమకు సంబంధించిన వారికి పార్సిల్ పంపించడం కోసం నీరజ్, నీరజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఓ బస్సు కండక్టర్ వద్దకు వెళ్లి అడిగారు. వాళ్లు ఎలా అడిగారో.. అతడు ఏ సమాధానం చెప్పాడో తెలియదుగానీ వెంటనే గొడవ ప్రారంభమైంది. ఆ ఇద్దరు కలిసి బస్ కండక్టర్ని కొట్టడం ప్రారంభించారు. ఓ బాటసారి ఆ దృశ్యాన్ని తన మొబైల్లో బంధించాడు. ఏడు సెకన్ల నిడివితో కూడిన ఆ వీడియో బయటకు రావడంతో వారిద్దరికి సమన్లు పంపించి అక్కడి నుంచి జిల్లా విభాగంలోకి వారిని బదిలీ చేశారు. -
బస్సులో మిస్సుతో...!
ఓ లక్ష్యాన్ని సాధించడానికి తపన పడే ఒక యువకుడు అనుకోకుండా బస్ కండక్టర్ అవుతాడు. ఆ బస్‌లో అతనికో మిస్సు పరిచయమవుతుంది. ఆమెతో ఈ కండక్టర్‌కు ఎలాంటి అనుబంధం ఏర్పడింది? చివరకు ఏమైంది? తెలియాలంటే మా ‘రైట్ రైట్’ చిత్రం చూడాల్సిందే అంటున్నారు హీరో సుమంత్ అశ్విన్. మను దర్శకత్వంలో సుమంత్ అశ్విన్, పూజా జవేరి జంటగా శ్రీసత్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జె.వంశీకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జూన్ 10న విడుదల కానుంది. ‘బాహుబలి’ ప్రభాకర్ ఇందులో ప్రధాన పాత్ర చేశారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ- ‘‘నేనిప్పటివరకూ చేసిన పాత్రల్లో ఇందులో చాలా భిన్నమైన పాత్ర చేశా. నా క్యారెక్టర్ చాలా సహజంగా ఉంటుంది. ఈ చిత్రం షూటింగ్ ఎంజాయ్ చేస్తూ చేశా. మొదటి భాగం వినోదాత్మకంగా, రెండో భాగం మిస్టరీగా ఉంటుంది’’ అని తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎస్.కోట నుంచి గవిటికి వెళ్లే ఆర్టీసీ బస్ది ఈ చిత్రంలో కీలక పాత్ర. కామెడీ, లవ్, మిస్టరీ అంశాలతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. సుమంత్ అశ్విన్ కెరీర్లో చెప్పకోదగ్గ చిత్రం అవుతుంది. ప్రభాకర్ పాత్ర ఇందులో హైలెట్‌గా నిలుస్తుంది. జె.బి. స్వర పరచిన పాటలకు అనూహ్య స్పందన వస్తోంది. అన్నివర్గాల వారు చూసేలా తీర్చిదిద్దిన ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చెప్పారు. నాజర్, ధన్‌రాజ్, షకలక శంకర్, తాగుబోతు రమేశ్, జీవా, రాజా రవీంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమేరా: శేఖర్ వి.జోసఫ్, సహ నిర్మాత జె.శ్రీనివాస రాజు, సమర్పణ: వత్సవాయి వెంకటేశ్వర్లు. -
కానిస్టేబుల్ కుమారుడే..
ఎగిరెగిరి పడడం అందరికీ వచ్చు.. ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే తెలుసు. తెర మీద పోషించే పాత్ర ఎందరికో నచ్చుతుంది.. కానీ తెర వెనుక వ్యక్తిత్వం అందరికీ నచ్చటం గొప్ప విషయం. ఆయనో సినీ శిఖరం.. ఎల్లలు దాటిన అభిమానం ఆయన సొంతం. అయినా వినయమే ఆభరణం. ఆయనే మన సూపర్ స్టార్ రజనీకాంత్. తలైవా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిన సందర్భంగా.. కానిస్టేబుల్ కుమారుడే.. సామాన్య పోలీస్ కానిస్టేబుల్ అయిన రామోజీ రావ్ గైక్వాడ్, రమాబాయిల నాలుగవ సంతానం శివాజీరావ్ గైక్వాడ్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మీద అభిమానంతో పెట్టుకున్న పేరు. ఆరేళ్లకే మహా ఆకతాయిగా ఉండే గడుగ్గాయిలా తయారయ్యాడు. క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్.. అన్నిటినీ ఓ చూపు చూసేవాడు. తమ్ముడి దుందుడుకుతనం గమనించిన అన్నయ్య సరాసరి రామకృష్ణ మఠంలో చేర్పించాడు. ఇక అక్కడి నుంచి క్రమశిక్షణ గల జీవితం అలవరచుకున్నాడు శివాజీరావు. వేదాలు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలాంటి విషయాలు ఆసక్తిగా అనిపించేవి. ఆ వయసులోనే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడయ్యాడు. మఠంలో ప్రదర్శించే నాటికలలో పాత్రలు వేస్తుండేవాడు. అక్కడే నటన వైపు మనసు మళ్లింది. ప్రాథమిక విద్య అనంతరం మఠం వదిలి మరో పాఠశాలలో చేరాడు. పాఠశాల విద్య అయిపోయేంతవరకు అక్కడే చదువుకున్నాడు. ఆ సమయంలోనే ఓ సారి 'కురుక్షేత్ర' అనే నాటికలో దుర్యోధనుడి పాత్ర పోషించిన శివాజీరావుకి చెప్పుకోదగ్గ ప్రశంసలే దక్కాయి. ఆ దెబ్బతో నటించాలనే దాహం మరింత పెరిగింది. కూలీ నుంచి కండక్టర్ వరకు.. పాఠశాల నుంచి బయటకు వచ్చాక బతుకు తెరువు కోసం శివాజీ చేయనిపని లేదు. కూలి పనికి వెళ్లేవాడు, అది లేని రోజున కార్పెంటర్ అవతారం ఎత్తేవాడు.. అదీ దొరక్కపోతే మరోటి. బెంగళూరు ట్రాన్స్పోస్టు సర్వీస్‌లో బస్ కండక్టర్‌గా ఉద్యోగం దొరికే వరకు ఇదే పంథా కొనసాగింది. యుక్త వయసు.. ఉడుకు రక్తం.. కుదురుగా ఉండనిస్తుందా? ఒంట్లో ఉన్న స్టైల్ అంతా పనిలో చూపించేవాడు. ఆడుతూ పాడుతూ పని చేసేవాడు. రూపాయి బిళ్ల ఎగరేస్తే కళ్లప్పగించి చూడాల్సిందే. టిక్కెట్లను అంత స్టైల్‌గా కొట్టొచ్చని శివాజీని చూశాకే చాలామంది కండక్టర్లకు తెలిసుంటుంది. కండక్టర్ ఉద్యోగంతోపాటు కన్నడ నాటికలు కూడా నడుస్తుండేవి. యాక్టింగ్ కోర్సు చేయడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరాడు. కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత.. స్నేహితుడి నుంచి బోలెడంత ప్రోత్సాహం. అలా ఓ రోజు ఇన్స్టిట్యూట్లో ఓ నాటికలో నటిస్తుండగా తమిళ దర్శకుడు కె.బాలచందర్ కంటపడ్డాడు. త్వరగా తమిళం నేర్చుకోవోయ్ అంటూ సలహా ఇచ్చేశారు బాలచందర్. అపూర్వ రాగాంగళ్ నుంచి .. అన్నట్టే బాలచందర్ అవకాశమూ ఇచ్చారు. 'అపూర్వ రాగాంగళ్' సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేశాడు శివాజీరావ్ గైక్వాడ్. పెద్దగా పట్టించుకోలేదు జనాలు. కన్నడంలో కొన్ని ప్రయత్నాలు.. ప్రయత్న లోపం లేదుగానీ ఫలితంలో మాత్రం లోపమే. సరిగా అప్పుడు బాలచందర్ నుంచి మరోసారి పిలుపు. 'అంతులేని కధ'లో అన్నయ్య పాత్ర. బాలచందర్ లాగే ఈసారి జనాలు కూడా పట్టేశారు. మొదట్లో చిన్న చిన్న వేషాలు, విలన్ పాత్రలు.. వెనుకడుగు వేయలేదు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత 'చిలకమ్మ చెప్పింది' అనే తెలుగు సినిమాలో తొలిసారి ప్రధాన పాత్రలో నటించాడు. కథానాయకుడిగా అక్కడ మొదలైన ప్రయాణం 'శివాజీ' సినిమాతో ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా రికార్డు సృష్టించేంత విజయవంతంగా కొనసాగింది. ఇక మధ్యలో ఎదురయ్యే ఆటుపోట్లు సర్వ సాధరణమే కదా. తలైవా సినిమా రిలీజ్ అయ్యిందంటే థియేటర్లో ఈలలు, గోలలే. 150 సినిమాల మైలురాయిని దాటేసిన రజనీ సినీ ప్రయాణం మరింత కొనసాగాలన్నది అభిమానుల ఆకాంక్ష. రజనీ తదుపరి చిత్రం రోబో 2.0 సెట్స్ మీద ఉంది. దేశవిదేశాల అభిమానం.. దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న రజనీ.. మొదటి నుంచి నిరాడంబరంగానే ఉన్నారు. సినిమాల్లో స్టైల్‌కి సెల్ఫీలా కనిపించే ఆయన.. తెర వెనుక మాత్రం మినిమమ్ మేకప్ కూడా లేకుండా సాదాసీదాగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతనే ఆరోగ్య సూత్రం. ఇవ్వడంలో పెద్ద చేయి. అభిమానులు ఆపదలో ఉంటే పిలవకుండానే పలుకుతాడు. అందుకే వారి గుండెల్లో అభిమాన దేవుడయ్యాడు. భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' తో సత్కరించిన సందర్భంగా.. -
కండక్టర్ కామాంధుడైన వేళ..
పలాన్పూర్: ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి హాయిగా చదువుకుంటున్న ఓ పద్నాలుగేళ్ల బాలికకు తన బస్సు ప్రయాణం నిద్రలేని రాత్రిని మిగులుస్తుందని ఊహించలేదు. స్కూల్ వెళుతున్న తనను బస్ కండక్టర్ అసహ్యం పుట్టేలా మాటలు అనడంతోపాటు అసభ్యకరంగా స్పృషించేందుకు ప్రయత్నించడంతో బెదిరిపోయి రన్నింగ్ బస్సులో నుంచి దూకేసింది. దీంతో ఆ బాలికకు గాయాలు అయ్యాయి. ఈ సందర్భంగా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం పాలన్పూర్ అనే గ్రామానికి చెందిన బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది. గుజరాత్ ప్రభుత్వం నడిపే ఆర్టీసీ ద్వారా ఓ స్కూల్ వెళుతుంటుంది. మంగళవారం కూడా అలాగే బయలుదేరింది. బస్సు ఎక్కేసరికి అందులో డ్రైవర్ కండక్టర్ తప్ప ఇంకెవరూ లేరు. దీంతో బయపడిన ఆ బాలిక డోర్ వద్దే నిల్చుంది. అయితే, అలా నిల్చోవద్దని సీట్లో కూర్చోవాలని ఈశ్వర్ భాయ్(49) అనే కండక్టర్ చెప్పాడు. అనంతరం ఆ బాలిక పక్కనే కూర్చుని అసభ్యకరంగా మాట్లాడటంతోపాటు లైంగిక వేధింపులకు దిగాడు. దీంతో భయపడిన ఆ బాలిక రన్నింగ్ లోనే బస్సులో నుంచి కిందికి దూకేసింది. ఈ మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు కండక్టర్ ను అరెస్టు చేశారు. బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. -
గుండెపోటుతో కుప్పకూలిన కండక్టర్
గూడురు టౌన్: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం ఓ కండక్టర్ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఎం.హరిబాబు అనే కండక్టర్ ఉదయం డిపోకు వెళ్లి రిజిస్టర్లో సంతకం పెడుతున్న సమయంలో గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కింద పడిపోయాడు. తోటి ఉద్యోగులు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. -
పోకిరీకి చెప్పు దెబ్బలు
నల్గొండ : పది రోజుల నుంచి వేధిస్తున్న ఓ యువకున్ని మహిళా కండక్టర్ చెప్పుతో బుద్ధి చెప్పిన సంఘటన నల్గొండ బస్టాండ్ వద్ద సోమవారం జరిగింది. భువనగిరి ప్రాంతానికి చెందిన రాంబాబు అనే డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న యువకుడు కొన్ని రోజుల నుంచి ఆమెను ఫాలో అవుతున్నాడు. ఏ రూట్లో డ్యూటీ వేస్తే ఆ రూట్లో ఆమెను అనుసరిస్తున్నాడు. విషయాన్ని గమనించిన మహిళా కండక్టర్ ఆ యువకుడ్ని నల్గొండ బస్టాండ్ వద్ద చెప్పుతో కొట్టింది. స్థానికులు కూడా జోక్యం చేసుకుని ఆ యువకుడికి దేహశుద్ధి చేశారు. -
కండక్టర్ నమ్మకం
తపాలా అది వేసవికాలం ఉదయం 5.30. ఎయిర్‌పోర్ట్‌లో జాబ్ చేస్తున్న రోజులు. శనివారం ఆలేరులో ఉంటున్న అమ్మ దగ్గరికి వచ్చాను, తిరిగి సోమవారం హైదరాబాద్‌కి బయలుదేరుతున్నాను. ఉప్పల్ రింగ్‌రోడ్‌లో ఆఫీస్ క్యాబ్ నన్ను పికప్ చేసుకుంటుంది. అమ్మ గోరు వెచ్చని పాల గ్లాసు చేతికి ఇస్తూ- ‘లంచ్ బాక్స్ బ్యాగ్‌లో పెట్టేశా, ఆరోగ్యం జాగ్రత్త, బాగా తిను, స్లోగా బైక్ డ్రైవ్ చేయి’ అంటుంటే పాలు గుటుక్కున తాగేసి ‘సరే అమ్మా వస్తాను’ అన్నా. ‘అన్నయ్య బై’ అంది దుప్పట్లోంచి తల బయటపెట్టి నా చెల్లెలు సాహితి. బస్టాపులో అడుగుపెడుతున్నానో లేదో హైదరాబాద్ బస్ కదులుతోంది, వేగంగా ఎక్కి కూర్చున్నా. విండో సీట్ దొరికింది. చల్లగా గాలి వీస్తుంది. ఆ గాలికి నా ఎడమ పక్క విండో సీట్లో కూర్చున్న అమ్మాయి తన ఎగురుతున్న జుట్టును సర్దుకుంటూ నా వైపు చూసింది. అందంగా ఉంది. వెళ్ళేలోపు పరిచయం చేసుకుందాం! నేను తనను చూసినప్పుడు తను చూడట్లేదు. తను నన్ను చూసినప్పుడు నేను చూడట్లేదు. కాసేపటికి ఇద్దరం అనుకోకుండా ఒకరినొకరం చూసుకున్నాం. తను సన్నగా నవ్వింది, నేను కూడా నవ్వాను. అంతలో బస్ కండక్టర్ టికెట్ అన్నాడు. స్టైల్‌గా వెనక జేబులో చేయి పెట్టానంతే, గుండె గుబేలుమంది. తొందర్లో పర్స్ ఇంట్లోనే మర్చిపోయా, ఎలా ఇప్పుడు? మధ్యలో దిగిపోవాలా? నిల్చొని బస్ అంతా కలియచూశా తెలిసినవారు ఉంటారేమో అని. మై బ్యాడ్‌లక్. భువనగిరి దాకా మేనేజ్ చేసి నా ఫ్రెండ్ అష్విన్ గాడికి ఫోన్ చేస్తే వాడు డబ్బు అరేంజ్ చేస్తాడు కదా అని ధైర్యం తెచ్చుకుని కండక్టర్‌కి అసలు విషయం చెప్పా. ‘నేను రోజు ఇదే రూట్లో డ్యూటీ చేస్తా, డబ్బులు రేపు రింగ్‌రోడ్‌లో తెచ్చివ్వు’ అన్నాడు. ‘థాంక్యూ సర్’ అని ఫోన్ నంబర్ తీసుకున్నాను. తెల్లారి డబ్బులు తిరిగి ఇచ్చేశాను. నాకు హెల్ప్ చేసిన ఆ ఆర్టీసీ కండక్టర్ని ఎప్పటికీ మర్చిపోను. ఎప్పుడు బస్ ఎక్కినా ఈ సంఘటన గుర్తుకొస్తుంది. - సుద్దాల సమ్రాట్, ఉప్పల్, హైదరాబాద్ -
అర్ధరాత్రి ఆందోళన
బస్సు కండక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఈవ్ టీజింగ్ చేసిన యువకుడు తప్పించుకోవడంతో మహిళా న్యాయవాది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివాదం క్రమంగా డ్రైవర్లు, కండక్టర్లపై పోలీసుల లాఠీచార్జీకి దారితీసింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వందలాది బస్సుల రాకపోకలు ఆగిపోయూయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరం బ్రాడ్వే బస్‌స్టేషన్ నుంచి కోయంబేడు బస్‌స్టేషన్‌కు 15ఎఫ్ సిటీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. రాత్రి వేళ కావడంతో ఇళ్లకు చేరుకునే ప్రయాణికులతో బస్సు రద్దీగా ఉంది. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న కోయంబేడుకు చెందిన మహిళా న్యాయవాది విజయలక్ష్మి (38)ని ఓ తుంటరి యువకుడు ఈవ్‌టీజింగ్ చేయగా తీవ్రస్థాయిలోమందలించింది. అయినా లెక్కచేయని ఆ తుంటరి హద్దు మీరడంతో చెప్పుతో కొట్టబోయే ప్రయత్నం చేస్తూ బస్సు ఆపాలని కండక్టర్‌ను కోరింది. అయితే ఇవేమీ లెక్కచేయని విధంగా బస్సును పోనిచ్చాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు ఆమెపై వేధింంచడంతో, పోలీస్ కంట్రోల్ రూముకు సమాచారం ఇవ్వడంతోపాటూ ప్రయాణికుల సహాయాన్ని కోరింది. ప్రయాణికులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా యువకుడు అకస్మాత్తుగా నడుస్తున్న బస్సు నుంచి దూకి పారిపోయాడు. ఇంతలో బస్సు కోయంబేడుకు చేరుకోవడంతో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. బస్సులో వేధింపులకు పాల్పడుతున్నపుడే బస్సును ఆపివుంటే యువకుడు పట్టుబడేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కండక్టర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బస్సు కండక్టర్ అశోక్‌ను అదుపులోకి తీసుకోగా అతని వెంట డ్రైవర్ కూడా పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. కండక్టర్‌పై కేసు పెడితేగానీ కదిలేది లేదని న్యాయవాది విజయలక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు పోలీస్ స్టేషన్ చేరుకుని వాగ్విదానికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జీలో ప్రభు అనే కండక్టర్ గాయపడడంతో బస్సులన్నింటినీ రోడ్లపైన, బస్స్టేషన్లలోనూ నిలిపివేసి డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళనకు దిగారు. కోయంబేడు 100 ఫీట్రోడ్డు, తిరుమంగళం, పూందమల్లి రోడ్లలో వందలాది బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఏమి జరుగుతోందో తెలియక ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యూరు. మద్రాసు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఎండీ పద్మనాభన్, పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన యువకుడిని గుర్తించి అరెస్ట్ చేస్తామని, కండక్టర్‌ను గాయపరిచిన పోలీస్‌పై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళా న్యాయవాది, ప్రభుత్వ బస్సుల సిబ్బంది ఎవరిదారిన వారు పోయారు. ఈ ఆందోళన ఫలితంగా శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 3 గంటల వరకు అంటే సుమారు 5 గంటల పాటూ 75 బస్సుల రాకపోకలు స్థంభించిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలపాలయ్యారు. -
రజనీ జీవితకథతో కన్నడ సినిమా
రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరంలేదు. ఈ సూపర్ స్టార్ కారణంగా ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్‌కి కూడా ఎంతో కొంత పాపులార్టీ వచ్చింది. రజనీ జీవితంలో అతి కీలకమైన వ్యక్తుల్లో బహూదూర్కి ముఖ్యమైన స్థానమే ఉంటుంది. రజనీ బస్ కండక్టర్‌గా చేసినప్పుడు బహదూర్ ఆ బస్కి డ్రైవర్‌గా చేసేవారు. అప్పుడు తన స్నేహితునిలో నటనాసక్తిని గ్రహించి, ఫిలిం ఇన్స్టిట్యూట్లో చేరడానికి తన వంతు సహాయం చేశారు బహదూర్. అనంతరం రజనీ నటునిగా మారడం, సూపర్ స్టార్‌గా ఎదగడం అందరికీ తెలిసిందే. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత పాత స్నేహితులను కొంతమంది మర్చిపోతారు. రజనీ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ రాజ్ బహదూర్‌తో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరి స్నేహం ఆధారంగా కన్నడంలో ‘వన్ వే’ అనే చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘ఒరు వళి శాలై’ అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో స్నేహితుని పాత్రను రాజ్ బహదూరే స్వయంగా పోషిస్తున్నారు. రజనీ పాత్రను ఎవరు చేస్తున్నారనేది రహస్యంగా ఉంచారు. ఈ చిత్రం గురించి రాజ్ బహదూర్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా గురించి రజనీ దగ్గర అనుమతి కోరగానే, వెంటనే పచ్చజెండా ఊపేశారు. ‘మనిద్దరం కలిసి చూద్దాం’ అని కూడా అన్నారు. రజనీకాంత్‌కి ఉన్న ఖ్యాతిని సొమ్ము చేసుకోవడానికి ఈ సినిమా చేయడంలేదు. ఓ మంచి సందేశం ఇస్తున్నాం. మేం రంగస్థలం కళాకారులుగా ఉన్నప్పట్నుంచీ ఇప్పటివరకు మా మధ్య స్నేహం ఎలా ఆరంభమైంది? విడదీయ లేనంత ఆప్తమిత్రులుగా ఎలా మారాం? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. రుషి రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. -
నేనే రజనీకాంత్!
బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించి సొంత దేశంలోనే కాక, పరాయి దేశాల్లో కూడా అభిమానుల్ని సంపాదించుకున్న సినీ నటుడు... సూపర్‌స్టార్ రజనీకాంత్. స్ఫూర్తిదాయకమైన ఆయన జీవితం ఆధారంగా బాలీవుడ్లో ఓ సినిమా తెరకెక్కనుంది. సినిమా పేరు ‘మై హూ రజనీకాంత్’. వర్ష ప్రొడక్షన్స్ పతాకంపై సరోజ నిర్మించనున్న ఈ చిత్రానికి ఫైజల్ సైఫ్ దర్శకుడు. తెరపై రజనీకాంత్‌లా కనిపించే అపూర్వ అవకాశాన్ని మలయాళ నటుడు ఆదిత్యమీనన్ కొట్టేశారు. బిల్లా, సింహా, మిర్చి చిత్రాల్లో ప్రతినాయకునిగా అలరించిన ఆదిత్యమీనన్ తెలుగువారికి సుపరిచితుడే. కవితా రాధేశ్యామ్, ఆర్యేమాన్ రామ్ సే ఇందులో కీలక పాత్రధారులు. పాకిస్తానీ సంగీత దర్శకుడు తౌసిఫ్ అలీ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఏప్రిల్ 31న ఈ చిత్రం సెట్స్‌కి వెళ్లనుంది. ఈ సినిమాను రజనీకాంత్‌కి అంకితం ఇవ్వాలని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. -
రూ.10లక్షలు నొక్కేసిన కండక్టర్
నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్: ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ కండక్టర్ రూ.10 లక్షల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. విషయం వెలుగులోకి రావడం తో పత్తా లేకుండా పోయాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ యాజమాన్యం పేద ప్రయాణికుల కోసం వనిత కార్డులను ప్రవేశ పె ట్టిం ది. ఈ కార్డు తీసుకున్న వ్యక్తి కుటుంబ సభ్యులందరికీ బస్సు చార్జిలో 10 శాతం రాయితీ లభిస్తుంది. ప్రమాద బీమా కూడా ఉంటుంది. ఆర్టీసీ అధికారులు రూ. 100 విలువ గల వని త కార్డులను అమ్మాలని కండక్టర్లకు పురమాయించారు. నిజామాబాద్ రెండో డిపోలో ప నిచేసే కండక్టర్ రాజేందర్ అలియాస్ రాజు 10 వేల కార్డులు తీసుకుని ప్రయాణికులకు అ మ్మాడు. ఇందుకుగాను వసూలైన రూ. 10 ల క్షలు తిరిగి కార్పొరేషన్‌కు చెల్లించలేదు. ఈ వి షయాన్ని అధికారులు ఆలస్యంగా గుర్తించా రు. డిపో మేనేజర్, డిపో సీఐలు విచారణ ని మిత్తం కండక్టర్ స్వగ్రామమైన బాల్కొండ మండలం ముప్కాల్ వెళ్లారు. అయినా అతని వివరాలు తెలియలేదు. వివరాల కోసం ఆర్టీసీ ఆర్ఎంకు ‘న్యూస్‌లైన్ ’ఫోన్ చేయగా.. డిపో మే నేజర్‌ను అడగండి అంటూ ఫోన్ కట్ చేశా డు. ఇక డిపోమేనేజర్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.