
రోహతక్ : చిన్నారి ప్రద్యుమ్న హత్య కేసులో సీనియర్ విద్యార్థి అసలు నిందితుడని తేలటంతో.. ఆరోపణలతో అరెస్టయిన స్కూల్ బస్సు కండక్టర్ అశోక్ కుమార్ బెయిల్ కోసం శుక్రవారం అర్జి పెట్టుకున్నాడు. అంతేకాదు తనను అనవసరంగా ఈ కేసులోకి లాగినందుకు హర్యానా పోలీస్, స్కూల్ మేనేజ్‌మెంట్ పై కేసు వేయబోతున్నాడని సమాచారం.
ఈ విషయాలను అశోక్ కుమార్ తరపు న్యాయవాది మోహిత్ వర్మ ప్రకటించారు. ఈ కేసులో అసలు నిందితులకు రక్షణ కల్పించి అనవసరంగా అశోక్ కుమార్‌ను బలిపశువును చేశారని.. మీడియా ముందు చెయ్యని నేరం ఒప్పుకోవాలంటూ హర్యానా పోలీసులు హింసించారని మోహిత్ చెప్పారు. పోలీసులపై, విమర్శలను తప్పించుకునేందుకు అశోక్ ను ఇరికించిన స్కూల్ యాజమాన్యంపై అశోక్ తరపున కేసు వేయబోతున్నట్లు మోహిత్ పేర్కొన్నారు.
కాగా, ఈ కేసులో ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్లోనే 11వ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధిని సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్విస్ట్ తో దేశం మొత్తం విస్మయం చెందగా.. అశోక్ కుమార్‌కు అనూహ్యంగా మద్దతు లభించటం మొదలయ్యింది. ఇదిలా ఉంటే చిన్నారిపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని నిర్ధారించిన సీబీఐ, అశోక్ కుమార్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యం లభించలేదని.. అయితే హత్యలో అతనిపై పాత్ర లేదన్న విషయంపై మాత్రం ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమని చెప్పింది.
ఇవి కూడా చదవండి... బాలుడి దారుణ హత్య.. కేంద్రానికి నోటీసులు, కీలక నరాలు తెగి ప్రద్యుమ్న అరవలేదు