TSRTC Bus Conductors, Maroon Colour Uniform For Lady Conductors - Sakshi
Sakshi News home page

ఇక తెలంగాణలో ‘మెరూన్‌’ కండక్టర్లు!

Published Tue, Feb 23 2021 1:19 AM | Last Updated on Tue, Feb 23 2021 11:12 AM

Maroon Color Uniform For Lady Conductors In TSRTC Buses - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇక మెరూన్‌ రంగు ఆప్రాన్‌ (చొక్కా) ధరించి ఆర్టీసీ బస్సుల్లో మహిళా కండక్టర్లు విధులు నిర్వహించనున్నారు. 2019 చివరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశం మేరకు మహిళా కండక్టర్లకు సరికొత్త యూనిఫామ్స్‌ ఎట్టకేలకు అందబోతున్నాయి. ఆర్టీసీలో పనిచేస్తున్న 4,800 మంది మహిళా కండక్టర్ల కోసం రేమండ్స్‌ కంపెనీ నుంచి 30 వేల మీటర్ల వస్త్రాన్ని తాజాగా ఆర్టీసీ కొనుగోలు చేసింది. ఒక్కో కండక్టర్‌కు రెండు ఆప్రాన్‌లకు సరిపడా వస్త్రాన్ని సరఫరా చేస్తారు. వారు తమ కొలతలకు తగ్గట్టు కుట్టించుకుని, నిత్యం ఆప్రాన్‌ ధరించి డ్యూటీకి రావాల్సి ఉంటుంది.

60 లక్షల కోసం ఏడాది ఎదురుచూపు..
2019లో ఆర్టీసీలో రికార్డు స్థాయిలో సుదీర్ఘంగా సాగిన సమ్మె అనంతరం సీఎం కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. అందులో వివిధ అంశాలపై నేరుగా ఉద్యోగులతో మాట్లాడి తెలుసుకున్న విషయాల ఆధారంగా పలు హామీలిచ్చారు. అందులో మహిళా కండక్టర్లకు ప్రత్యేకంగా ఆప్రాన్‌ను యూనిఫాంగా ఇవ్వాలన్నది కూడా ఒకటి. ఈ ఆప్రాన్‌ ఏ రంగులో ఉండాలన్నది కూడా మహిళా కండక్టర్లే నిర్ణయించి చెప్పాలంటూ ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మహిళా ఉద్యోగుల అభిప్రాయాలు తీసుకుంది.

ఎక్కువ మంది మెరూన్‌ రంగు వస్త్రం కావాలని కోరటంతో దాన్నే సిఫారసు చేసింది. వస్త్రం నాణ్యత కూడా మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రేమండ్స్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కానీ ఆ వస్త్రాన్ని కొనేందుకు ఏడాదికిపైగా సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఆర్టీసీలో ఉన్న 4,800 మంది మహిళా కండక్టర్లకు రెండు ఆప్రాన్‌లు కుట్టివ్వాలంటే 30 వేల మీటర్ల వస్త్రం అవసరమవుతుందని అంచనా వేశారు. ఇందుకు రూ.60 లక్షలు ఖర్చవుతుందని నిర్ధారించారు.

అయితే జీతాలకు కూడా డబ్బులు చాలని పరిస్థితిలో అంతమేర నిధులను కూడా కేటాయిం చటం ఆర్టీసీకి కష్టంగా మారింది. ఆ వెంటనే బస్సు చార్జీలు పెంచటంతో ఆర్టీసీ రోజువారీ ఆదాయం దాదాపు రూ.2 కోట్లు పెరిగింది. దీంతో వస్త్రం కొనాలనుకున్న తరుణంలో కోవిడ్‌ రూపంలో సమస్య ఎదురైంది. గత వారం, పది రోజులుగా ఆర్టీసీ ఆదాయం కొంత మెరుగ్గా ఉండటంతో ఎట్టకేలకు వస్త్రం కొనుగోలు చేశారు. సాధారణంగా వస్త్రంతో పాటు యూనిఫాం కుట్టు కూలీలకు కూడా ఆర్టీసీ డబ్బులు చెల్లిస్తుంటుంది. అయితే ప్రస్తుత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వస్త్రం మాత్రమే ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.

పురుషులకు ఇప్పట్లో లేనట్టే
ఆర్టీసీలో ప్రతి మూడేళ్లకు ఓసారి రెండు జతల చొప్పున యూనిఫాం ఇచ్చే సంప్రదాయం ఉంది. కానీ గత ఆరేళ్లుగా యూనిఫాం జారీ నిలిచిపోయింది. సిబ్బందే సొంత ఖర్చులతో యూనిఫాం కొనుక్కుని వేసుకుంటున్నారు. కొంతమంది పాత యూనిఫాంతోనే నెట్టుకొస్తున్నారు. గతంలో ఉన్న వస్త్రం కొంత స్టోర్‌లో ఉండిపోవటంతో కొన్ని డిపోలకు మధ్యలో ఒకసారి యూనిఫాం సరఫరా అయింది. యూనిఫాం లేకుండా డ్యూటీకి హాజరైతే అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగులు జేబు నుంచి ఆ ఖర్చు భరిస్తున్నారు. అయితే ఈ కొత్త యూనిఫాం కూడా మహిళలకు మాత్రమే ఇవ్వనున్నారు. పురుషులకు ఇప్పట్లో లేనట్టేనని అధికారులు చెబుతున్నారు. 

చదవండి:

మేడ్చల్‌ బస్‌ డిపోలో కండక్టర్‌ ఆత్మహత్యాయత్నం
సరికొత్త ప్రయోగానికి సిద్ధమైన టీఎస్‌ఆర్టీసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement