TSRTC Pays Rs 50 Lakh To Deceased Conductor Family - Sakshi
Sakshi News home page

రోడ్డుప్రమాదంలో పెద్దదిక్కును కోల్పోయిన కుటుంబం.. ఆదుకున్న టీఎస్ఆర్టీసీ

Published Tue, Jun 13 2023 6:35 PM | Last Updated on Tue, Jun 13 2023 7:09 PM

TSRTC Pays Rs 50 Lakh To Deceased Conductor Family  - Sakshi

హైదరాబాద్‌: ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) అండ‌గా నిలిచింది. కండక్టర్ అకాల మరణంతో విషాద చాయాలుఅలుముకున్న ఆ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని అందించి భరోసా కల్పించింది. 

ఈ ఏడాది ఫిబ్రవరిలో జగిత్యాల డిపోకు చెందిన కండక్టర్‌ బొల్లం సత్తయ్య రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జ‌గిత్యాల నుంచి వ‌రంగ‌ల్ వెళ్తున్న టీఎస్‌ఆర్టీసీ బ‌స్సును రాంగ్ రూట్‌లో వ‌చ్చిన లారీ ఢీ కొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. మ‌ల్యాల-బ‌ల‌వంతాపూర్ స్టేజీ వ‌ద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇంటికి పెద్ద దిక్కు మృతి చెందడంతో బాధిత కండ‌క్ట‌ర్ కుటుంబంలో విషాదం అలుముకుంది. 

ఈ నేపధ్యంలో యూబీఐ సూప‌ర్ శాల‌రీ సేవింగ్ అకౌంట్, రూపే కార్డు బాధిత కుటుంబానికి అక్క‌ర‌కొచ్చింది. సిబ్బంది, ఉద్యోగుల సాల‌రీ అకౌంట్స్‌ను ఇటీవ‌ల యూబీఐకి మార్చింది టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం. ఆర్థిక ప్ర‌యోజ‌నాలతో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్‌, రూపే కార్డు తీసుకోవాల‌ని టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి ప్ర‌త్యేక మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. 

దీంతో సంస్థ‌లోని ఉద్యోగులంద‌రూ వారు నివ‌సిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. 

ఈ ఖాతా, కార్డు ద్వారా ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఉండ‌టంతో ఉద్యోగుల‌కు ఎంతో ఆర్థిక ప్ర‌యోజ‌నం చేకూరుతోంది. ప్ర‌మాదాలు జ‌రిగిన స‌మ‌యంలో సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ కింద (ఉద్యోగి వేత‌నం ప్ర‌కారం) క‌నీసం రూ.40ల‌క్ష‌లు, రూపే కార్డు కింద మ‌రో రూ.10ల‌క్ష‌లను యూబీఐ అందజేస్తోంది.

ఈ మేర‌కు రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందిన జ‌గిత్యాల డిపో కండక్ట‌ర్ బొల్లం స‌త్త‌య్య కుటుంబానికి రూ.50 లక్షల విలువైన 2 చెక్కుల‌ను యూబీఐ అధికారులతో కలిసి సంస్థ  ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ మంగ‌ళ‌వారం బ‌స్‌భ‌వ‌న్‌లో అంద‌జేశారు. రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించడంపై కండ‌క్ట‌ర్ సత్తయ్య భార్య బొల్లం పుష్ఫ‌తో పాటు కొడుకు ప్ర‌వీణ్ కుమార్‌, కూతురు మాధ‌వీల‌త‌ సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 

చెక్కులను అంద‌జేసిన అనంత‌రం సజ్జనర్‌ మాట్లాడుతూ.. త‌న త‌ప్పు ఏమీ లేక‌పోయినా రోడ్డు ప్ర‌మాదంలో సత్తయ్య అకాల మ‌ర‌ణం చెంద‌టం దుర‌దృష్ట‌క‌ర‌మన్నారు. ఉద్యోగుల సంక్షేమానికె తమ సంస్థ అధిక‌ ప్రాధాన్య‌త‌నిస్తున్న‌ట్లు గుర్తు చేశారు. 

కుటుంబపోష‌ణ‌లో పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబ స‌భ్యుల‌కు సంస్థ అండ‌గా నిలుస్తుంద‌ని, ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఉండేందుకు బాధిత కుటుంబానికి ఉచిత ప్ర‌మాద బీమా సౌక‌ర్యం ఎంతో ఉప‌క‌రిస్తుంద‌న్నారు. 

ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్థిక ప్ర‌యోజ‌నాల‌తో కూడిన సూప‌ర్ సాల‌రీ సేవింగ్ అకౌంట్ గా ఉద్యోగుల ఖాతాల‌ను యాజమాన్యం మార్చ‌డం జ‌రిగిందని చెప్పారు. సంస్థలోని ప్రతి ఉద్యోగి సూపర్‌ సాలరీ సేవింగ్‌ అకౌంట్‌కు ఖాతాను మార్చుకోవాలని సూచించారు. కొన్ని ప‌థ‌కాలు ఆప‌ద స‌మ‌యంలో అక్క‌ర‌కు వ‌స్తాయ‌ని, ఇందుకు ఇదే ఉదాహ‌ర‌ణ అని, వాటిని వినియోగించుకోవ‌డంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అల‌స‌త్వం వ‌హించ‌కూడ‌ద‌ని సూచించారు. ఈ అవ‌కాశాన్ని క‌ల్పించిన యూబీఐకి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్‌ వి.రవిందర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగ్రామ్‌ సింగ్‌ జీ పాటిల్‌, ఈడీలు ఎస్‌.కృష్ణకాంత్‌, వినోద్‌ కుమార్‌, యూబీఐ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పి.క్రిష్ణ‌ణ్‌, రీజిన‌ల్ హెడ్ డి.అప‌ర్ణ రెడ్డి, డిప్యూటీ రీజిన‌ల్ హెడ్ జి.వి.ముర‌ళీ కృష్ణ‌ ఇతర అధికారులు  పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement