
కండెక్టర్ మంజునాథ్
సాక్షి, బెంగళూరు : కన్నకూతురు మృతి చెందిన విషయాన్ని కూడా తెలుపకుండా మానవత్వాన్ని మరిచిన ఆర్టీసీ అధికారులు ఓ కండక్టర్‌ను విధులకు పంపిన ఉదంతం కొప్పళ జిల్లా గంగావతిలో వెలుగు చూసింది. బాగలకోటె జిల్లా రాంపుర గ్రామ నివాసి అయిన మంజునాథ్ గంగావతి టూ కొల్హాపుర బస్సు కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇతని కుమార్తె కవిత(11) బుధవారం ఉదయం మృతి చెందింది. 10 గంటల సమయంలో బస్ డిపో అధికారులకు కుటుంబ సభ్యులు ఫోన్ చేసి విషయం తెలియజేశారు. అయితే ఆ సమాచారాన్ని తండ్రి మంజునాథ్‌కు తెలపకుండా అధికారులు యథాప్రకారం విధులకు పంపించారు. అదే రోజు రాత్రికి ఉద్యోగం ముగించుకొని ఇంటికి వచ్చిన మంజునాథ్‌కు అప్పుడు తన కూతురు మృతి గురించి తెలిసింది. మరుసటి రోజు ఉదయం విధులకు రావాలని బస్సు డిపో అధికారులు మంజునాథ్‌కు సూచించారు.
ఇదే విషయంపై శుక్రవారం కండక్టర్లు, డ్రైవర్లు, ఆర్టీసీ సిబ్బంది కలిసికట్టుగా అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్న కూతురును చివరి చూపు కూడా చూడలేని ఆ తండ్రి రోదన పలువురి హృదయాలను ద్రవింప చేసింది. కాగా మంజునాథ్ కుమార్తె చనిపోయిన విషయం ఆలస్యంగా తెలిసిందని, తనకు విషయం తెలిసిన వెంటనే మంజునాథ్‌ను ఇంటికి పంపానని డిపో మేనేజర్ ఎస్.ఆర్.సొన్నద్ సమాధానమిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment