ప్రయాణికులకు చిల్లర ఇస్తున్న గురుమూర్తి
సాక్షి కడప/సెవెన్‌రోడ్స్ : కడప–రాయచోటి మధ్య రోజూ ప్రయాణించే వ్యక్తులు పలమనేరు ఆర్టీసీ డిపో బస్సు కోసం ఎదురుచూస్తుంటారు. ఆ సమయంలో చిత్తూరు, మదనపల్లె, బెంగళూరు, రాయచోటి నాన్‌స్టాఫ్ బస్సులు వచ్చినప్పటికీ ప్రయాణికులు అందులో ఎక్కరు. ఆ బస్సుల్లో ఎక్కితే ముందే గమ్య స్థానానికి చేరుకోవచ్చని తెలిసినప్పటికీ పలమనేరు డిపో బస్సు కోసమే వేచి ఉంటారు. ఈ కథనం చదివే పాఠకులకు ఇది కొంత వింతగానే అనిపిస్తుంది. కానీ ఇది ముమ్మాటికి నిజం. పలమనేరు బస్సు కండక్టర్ బ్రాహ్మణపల్లె గురుమూర్తి ఇందుకు కారణం. ఆయనేమీ సూపర్‌స్టార్ కాదు. ఒక సాధారణ కండక్టర్‌కు ఇంత ఫాలోయింగ్ ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? అలాగైతే మంగళ, గురు, శనివారాలలో కడప ఆర్టీసీ బస్టాండులో సాయంత్రం 6 గంటలకు పలమనేరు బస్సు ఎక్కితే అర్థమవుతుంది.
ప్రయాణికుల పట్ల ఆయన చూపే గౌరవ మర్యాదలే ఇంతటి అభిమానానికి కారణం. ప్రయాణికులు బస్సు ఎక్కే సందర్భంలో డ్రైవర్ వెనుక మహిళలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చోనివ్వడంటూ కండక్టర్ గురుమూర్తి అందరినీ అభ్యర్తిస్తుంటారు. ఎవరైనా పురుషులు ఆ సీట్లలో కూర్చుంటే ‘ప్లీజ్ సార్...దయచేసి ప్రక్కసీట్లలో వెళ్లి కూర్చోండి’అంటూ వినమ్రంగా చెబుతారు. బస్సు ఇతర వాహనాన్ని ఓవర్ టేక్ చేసే సమయంలో, గువ్వలచెరువు ఘాట్‌లో మలుపులు తిరిగేటపుడు డ్రైవర్ పక్కనే నిలుచుని తగు సూచనలు అందిస్తుంటారు. అందరూ ‘రైట్’అనడం పరిపాటి. అయితే గురుమూర్తి మాత్రం తమదైన చిత్తూరుజిల్లా యాసలో ‘రైట్టు...రైట్టు’అంటూ డ్రైవర్‌కు సిగ్నల్స్ ఇవ్వడం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అలాగే నోటితో ఆయన వేసే విచిత్రమైన విజిల్ ప్రయాణీకులంతా ఆసక్తిగా వింటుంటారు.
చిల్లర ప్లీజ్
చాలామంది టిక్కెట్టుకు సరిపడు చిల్లర ఇవ్వకపోవడం సర్వసాధారణం. ఎవరైనా తక్కువ టిక్కెట్టుకు పెద్దనోట్లు ఇచ్చినప్పటికీ ఆయన ఏమాత్రం విసిగించుకోరు. పైగా ఎవరైనా ప్రయాణికుడు తమకు రావాల్సిన చిల్లర మరిచిపోయి వెళ్లిపోతారని ముందస్తుగా అడిగి మరీ చిల్లర అందిస్తారు. కడప నుంచి సాయంత్రం పలమనేరుకు వెళ్లే సమయంలో రాత్రి 8 గంటకల్లా బస్సు రాయచోటికి చేరాలని ఆయన తాపత్రయ పడుతుంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన బస్సు రాయచోటి నుంచి ప్రయాణికులను తీసుకెళుతుందని ఈయన ఆందోళన. అంటే ఆదాయం ఏపీఎస్‌ఆర్టీసీకి దక్కాలనే తపన ఆయనది.
ఎందరో అభిమానులు
రాయచోటికి చెందిన పలువురు కడపలో ఉద్యోగాలు చేస్తున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న వీరంతా రోజూ రాయచోటి–కడప మధ్య ప్రతిరోజు ప్రయాణిస్తుంటారు. కండక్టర్ గురుమూర్తి ప్రయాణికులకు ఇచ్చే గౌరవ మర్యాదలకు వీరంతా ఆకర్షితులయ్యారు. గురుమూర్తి ఒక కండక్టర్‌గా కాకుండా తమ స్నేహితునిగా భావిస్తారు. బస్సు దిగే సమయంలో ‘మూర్తి వెళ్లొస్తాం’అంటూ సెలవు తీసుకోవడం పరిపాటి.
ఉత్తమ కండక్టర్‌గా అవార్డులు
చిత్తూరుజిల్లా తవనంపల్లె మండలం అరగొండ సమీపంలోని గాజులపల్లెకు చెందిన గురుమూర్తి కండక్టర్‌గా కుప్పం డిపోలో మొదటిసారిగా పనిచేశారు. తర్వాత పలమనేరు డిపోకు బదిలీపై వచ్చిన కండక్టర్ గురుమూర్తికి పలుమార్లు అవార్డులు వరించాయి. మూడుసార్లు రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కండక్టర్ అవార్డులను అందుకున్నారు. ప్రయాణికులతో అనుక్షణం కలిసిపోతూ....మనలో ఒకరిలా ఉంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రయాణికుల సంగతి అటుంచితే సంస్థలోనూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి గురుమూర్తి. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఒక కిలోమీటరుకు ఈపీకే (ఎర్నింగ్ పర్ కిలోమీటరు) రూ. 17–20 ఉండగా, అలాంటిది చిత్తూరు–తిరుమల సర్వీసులో 479 కిలోమీటర్లు తిప్పి కిలో మీటరుకు రూ. 50 ఈపీకే సాధించి అధికారుల ప్రశంసలు అందుకున్నారు. అప్పట్లో ఇది రాష్ట్రంలోనే మొదటి స్థానమని సంబం«ధిత డిపో మేనేజర్ గురుమూర్తిని అభినందించిన ఘటనలు ఉన్నాయి.
కలెక్షన్ కింగ్
ఆర్టీసీసంస్థకు రాబడిలోనూ గురుమూర్తి ఆరాటం ఫలిస్తోంది. కుప్పం, పలమనేరు ఇలా అన్నిచోట్ల...ఏ రూటుకు బస్సు పోయినా గురుమూర్తి కలెక్షన్ల కింగ్‌గా మారిపోయారు. ఇప్పటికే పలమనేరు పరిధిలో ఆర్టీసీ బస్సులో అధిక ఆదాయాన్ని తీసుకువస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా వరుసగా కడప–పలమనేరు మధ్య తిరుగుతున్న బస్సు ద్వారా అత్యధిక ఆదాయం ఒనగూరుస్తూ ప్రతినెల ప్రశంసాపత్రం అందుకుంటున్నారు. ఇలా వరుసగా ఐదు నెలలుగా ప్రతినెల అధిక ఆదాయ గుర్తింపు గురుమూర్తికే లభిస్తోంది.
సినిమారంగం నుంచి అనుకోకుండా కండక్టర్
మధ్య తరగతి కుటుంబానికి చెందిన గురుమూర్తికి చిన్నప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. ఇంటర్ చదువుతున్న సమయంలో చదువుకు స్వస్తి చెప్పి సినిమాపై ఉన్న అభిమానంతో చెన్నైకి వెళ్లారు. ఇష్టమైన సినిమా రంగంలో రాణించడం కోసం కష్టాలు పడుతూ ఎట్టకేలకు ఓ సంస్థలో ప్రొడెక్షన్ చీఫ్‌గా చేరారు. ఇతను పనిచేసిన సంస్థ చిరంజీవి హీరోగానే సినిమాలు ఎక్కువగా చేసేవారు. ఈ నేపథ్యంలో చిరంజీవితో కూడా ‘గురు’మూర్తికి మంచి సంబంధాలే ఏర్పడ్డాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక్కసారిగా మూర్తి కుటుంబంలో విషాదం అలుముకుంది.
తల్లిదండ్రులు ఇద్దరు మృతి చెందడంతో నేరుగా సొంతూరు వచ్చారు. సినిమా రంగంపై ఆశ వదలుకున్నారు. కుటుంబ భారం మీద పడడంతో తప్పని పరిస్థితుల్లో ఉద్యోగం కోసం ఆలోచన చేస్తున్న సమయంలోనే పదవ తరగతి అర్హతతో కండక్టర్ పోస్టులు భర్తీ చేస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే దరఖాస్తు చేశారు. వెంటనే ఉద్యోగం రావడం, అందులో చేరడం కొన్ని రోజుల్లోనే జరిగిపోయింది. కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించినప్పటి నుంచి కూడా ప్రయాణీకుల్లో తన ప్రత్యేక ముద్రను వేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment