పాతబస్టాండు పైకప్పు పెచ్చులూడిన దృశ్యం, మైదుకూరు బస్టాండ్‌లోకి వెళ్లే దారి ఇలా..
ఇదీ జిల్లాలో బస్టాండ్‌ల పరిస్థితి. పైకి మాత్రం హైటెక్ హంగులంటూ టీవీలు, స్టీలు బెంచీలు వేశారు. కానీ ప్రాంగణాలు మొత్తం కంపుకొడుతున్నాయి. మరుగుదొడ్లు ఉన్నా దారుణం. అంతా వసూళ్లే. ఇక దుకాణాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు.
సాక్షి, కడప : ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. చాలావరకు బస్టాండ్‌లకు సోకులు చేసినప్పటికి కొన్ని మౌలిక వసతులను ఇంకా కల్పించలేదు. బస్టాండ్లలోకి వెళ్లే రోడ్లు గుంతలమయంగా మారాయి. ఆవరణలు కంపుకొడుతున్నాయి. ధరల మోత మోగుతోంది. అయినా అధికారులు మాత్రం అంతా బాగుందనే చెబుతున్నారు. ఉదాహరణకు.. కడప నగరంలోని పాత బస్టాండ్ ఎప్పుడు కూలుతుందో తెలియదు. ఇప్పటికే పెచ్చులు రాలుతున్నా..పైకప్పు అంతా నెర్రెలు చీలి ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా....గోడలకు చెట్లు మొలిచి శిథిలావస్థకు చేరుకుంటున్నా పట్టించుకునేవారే లేరు. పరిస్థితి చేయదాటకమునుపే అధికారులతోపాటు అందరూ అప్రమత్తం కావాలి. ప్రతినిత్యం వేలాది మంది కడప పాత బస్టాండులో బస్సుల కోసం వేచి ఉండడంతో ఆ ప్రాంతం రద్దీగా ఉంటోంది. అయితే పరిస్థితి చూస్తే భయానకంగా ఉంది. ఇలా జిల్లాలో రాయచోటి, మైదుకూరు, బద్వేలు, రాజంపేట, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పోరుమామిళ్ల తదితర బస్టాండ్లలో సమస్యలమయంగా మారడంతో పాటు విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ బస్టాండ్లలో సమస్యలపై సాక్షి గ్రౌండ్ రిపోర్టు..
జనం మధ్యలో మూత్ర విసర్జన
జిల్లాకేంద్రమైన కడపలో ప్రతినిత్యం వివిధ అవసరాల నిమిత్తం ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఎక్కువగా పాత బస్టాండు మీదుగానే ప్రయాణాలు సాగిస్తుంటారు. దీంతో పాత బస్టాండులో ఎక్కడ చూసినా జనమే జనం. అయితే అనువైన వసతులు సరిగా లేకపోవడంతో బహిరంగంగానే మూత్ర విసర్జన చేస్తుంటారు. జనం చూస్తున్నా....గోడల మీద రాతలు కనిపిస్తున్నా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా తమ పని కానిస్తున్నారు. ఇదేమని అడిగే అధికారులు లేకపోగా...కనీసం జనం సమీపంలోకి వస్తే జరిమాన విధిస్తారన్న భయం కూడా ప్రజల్లో లేదు. దీంతో పాత బస్టాండులో పరిస్థితి దారుణంగా మారింది. ఎక్కడ చూసినా మూత్ర విసర్జన కంపుతో జనం అల్లాడిపోతున్నా కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లే దిక్కుకూడా లేదు. అలాగే కొత్త బస్టాండ్‌లోనూ పరిసరాలన్నీ కంపుకొడుతున్నాయి. వర్షం కురిస్తే అంతా జలమయమే. ఆవరణలోని రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి.
పారిశుద్ద్యం అంతంతమాత్రమే
ఆర్టీసీ బస్టాండ్‌తోపాటు పాత బస్టాండులోనూ పారిశుధ్యం అధ్వానంగా కనిపిస్తోంది. అలాగే జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల నీరు రోడ్లమీదనే పారుతుండడంతో ప్రయాణికులు బస్సు ఎక్కే, దిగే సమయంలో ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్టాండులో టాయ్‌లెట్ల వద్ద తప్పనిసరిగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.5 తీసుకుంటున్నారు. అయినా పరిశుభ్రంగా ఉంచడ లేదు. దుర్వాసన భరించలేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
ఎమ్మార్పీకి ఎసరు
జిల్లాలోని బస్టాండ్లలో ఎమ్మార్పీకి ఎసరు పెట్టి తినుబండారాలపై దోపిడీ చేస్తున్నారు. మినరల్ వాటర్ ఒక లీటరు ఎమ్మార్పీ ధర రూ.20 అయితే రూ.25 వరకు రాబడుతున్నారు. ఒక్క వాటరే కాదు, మిగతా వాటికి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. బస్టాండు ప్రాంగణంలోని హోటళ్లలో దోపిడీపర్వం మరింత అధికంగా కొనసాగుతోంది. బస్టాండ్లలో ఉన్న అధికభాగం షాపులలో ఎమ్మార్పీని పక్కనపెట్టి దోచుకుంటున్నా అడిగే అధికారులు లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు సమస్యలపై దృష్టి సారించి వాటి పరిష్కారానికి చొరవ చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.
జిల్లాలోని బస్టాండ్ల తీరిది..
♦ మైదుకూరు బస్టాండ్‌లో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉంది. అందులోనూ నీటి సౌకర్యం లేదు. దీంతో ఎప్పుడూ మూత వేసి ఉంటారు. ఇబ్బందిగా మారింది. పైగా చుట్టుపక్కల వారు కూడా బస్టాండు ఆవరణంలోని బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన సాగిస్తున్నారు. రోడ్లు బాగా లేకపోవడంతో బస్సులు గుంతలో వెళుతున్నప్పుడు ప్రయాణికులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
♦ ప్రొద్దుటూరు బస్టాండులో మరుగుదొడ్లు ఉన్నా సరిగా లేవు. దీంతో ప్రయాణికులకు మరుగు కంపుతో అల్లాడుతున్నారు.
♦ రాయచోటి బస్టాండ్‌లో మరుగుదొడ్లు త లుపులకు రంధ్రాలు పడి వాడకానికి ఇబ్బం దిగా ఉంది. చుట్టూ దుర్వాసన వెదజల్లుతుండడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్టాండ్ ఆవరణలోని దుకా ణాల్లో అధికధరలు వసూలు చేస్తున్నారు.
♦ బద్వేలు బస్టాండ్‌లో తాగునీటి సమస్య వెంటాడుతోంది. పైగా ఎప్పుడు చూసినా పందులు నిత్య సంచారంగా మారింది. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment