అసౌకర్యాల చెరలో ద్రాక్షారామ బస్టాండ్ (అంతర చిత్రం) గోవకరం బస్ డిపో పరిధిలో తాటాకుల పందిరే ద్విచక్ర వాహనాల స్టాండ్
సాక్షి, రాజమహేంద్రవరం: ప్రగతి రథ చక్రాలకు వేదికైన ఆర్టీసీ బస్సు కాంపెక్సుల్లో సమస్యలు తిష్టవేశాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని తొమ్మిది కాంప్లెక్సుల్లోనూ సమస్యలు తాండవిస్తున్నాయి. సరిపడా మరుగుదొడ్లు, కూర్చునేందుకు, అవసరమైనన్ని బెంచీలు, వాహనాల పార్కింగ్ సౌకర్యం లేకపోవడం, దుకాణాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు, క్యాంటీన్లలో బెంబేలెత్తించేలా టీ, టిఫిన్ల ధరలు, తాగడానికి మంచినీరు కూడా కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన డంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సుల్లో చోటుచేసుకున్న లోపాలు ‘సాక్షి’ పరిశీలనలో వెలుగుచూశాయి.
ముక్కు మూసుకోవాల్సిందే...
గోకవరం, రావులపాలెం కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు సరిపడా మరుగుదొడ్లు, మూత్ర శాలలు లేకపోవడంతో ఆరుబయటే మూత్రశాలగా మారింది. ప్రయాణికులు ఆరుబయటే మూత్ర విసర్జన చేస్తుండడంతో డిపో ఆవరణల్లో దుర్గంధం వెదజల్లుతోంది. రావులపాలెంలో మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గోకవరంలోని మూత్రశాల వద్ద నీటి సమస్య నెలకొంది. నీరు రాకపోవడంతో మూత్రశాలలో దుర్వాసన వస్తోంది. అమలాపురంలో పార్కింగ్ స్టాండ్ పక్కన డ్రైనేజీ నీరు ఆవరణలో నిల్వ ఉంటుండడంతో ఆ పరిసరాలు మురికికూపంలా మారాయి.
ప్రమాదం జరిగితే బూడిదే...
గోకవరం బస్టాండ్‌లో తాటాకుల పందిరిలో ద్విచక్ర వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ అగ్ని ప్రమాదం జరిగితే భారీ ఆస్తినష్టం వాటిల్లుతుంది. రావులపాలెం డిపోలో రద్దీకి అనుగుణంగా పార్కింగ్ సౌకర్యం లేదు. బస్టాండ్ ఆవరణంతా ఆటోలు, వ్యాన్ల స్టాండ్లతో ఆక్రమణలో ఉంది. పార్కింగ్ సదుపాయం సరిపోకపోవడంతో డిపో చుట్టూ మూడు ప్రైవేటు పార్కింగ్ స్టాండ్లు వెలిశాయి. జాతీయ రహదారి, లొల్ల ప్రధాన కాలువ ఆధునికీకరించడంతో బస్టాండ్ వర్షాకాలంలో చెరువును తలపిస్తోంది. ఆ సయమంలో రెండు మోటార్లు పెట్టి వర్షపు నీటిని తోడుతారు. ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా సదుపాయం లేదు. డీలక్స్ ఫ్లాట్‌ఫాంపై సరిపడా బల్లలు లేవు. బస్సులు ఆగేందుకు సరైన ఫ్లాట్‌ఫాం లేదు. డ్రైవర్ ఆదమరిచినా, బస్సు బ్రేక్ విఫలమైనా ప్రయాణికులపై దూసుకొచ్చే ప్రమాదం ఉంది. రామచంద్రపురంలో పార్కింగ్ స్టాండ్ నిర్వహించడం లేదు. ఒక్కో కాంప్లెక్సులో ఒక్కోలా పార్కింగ్ రుసుం వసూలు చేస్తున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ కాంప్లెక్సుల్లో ప్రతి నాలుగు గంటలకు రూ.5 లెక్కన రోజుకు రూ.30 వసూలు చేస్తున్నారు. గోకవరం, రాజోలు డిపోల్లో రోజుకు రూ.20లñ చొప్పున తీసుకుంటున్నారు. చూసేందుకు చిన్న సమస్యలున్నా ప్రయాణికులను పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు.
దడపుట్టిస్తున్న ధరలు....
అన్ని ఆర్టీసీ కాంప్లెక్సుల్లోని దుకాణాల్లో తినుబండారాలు, కూల్ డ్రింకులు, కంపెనీ చిప్స్ ఎమ్మార్పీకి మించి అమ్ముతున్నారు. అర లీటర్ కూల్ డ్రింక్ ఎమ్మార్పీ రూ.38 ఉంటే రూ.42, రూ.18 లేస్‌చిప్స్ రూ.20, రూ.15 గుడ్ డే బిస్కట్ ప్యాకెట్ రూ.18 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక క్యాంటీన్లలో టీ తాగినా, టిఫిన్ చేసినా జేబులు గుల్ల అవ్వాల్సిందే. రాజమహేంద్రవరం కాంప్లెక్సులోని క్యాంటిన్‌లో టిఫిన్ ధరలు ఆకాశంలో ఉన్నాయి. రెండు ఇడ్లీ రూ.30, చపాతి రూ.40, దోసె రూ.35, మైసూర్ బజ్జీ రూ.30 (నాలుగు), పేపర్ కప్పులో టీ రూ.15 లెక్కన విక్రయిస్తున్నారు. కాకినాడ కాంప్లెక్సులోని క్యాంటీన్‌లో రెండు ఇడ్లీ రూ.25, చపాతి రూ.30, దోసె రూ.30, మైసూర్ బజ్జీ రూ.25, టీ రూ.10 లెక్కన అమ్ముతున్నారు. హోటళ్లు, ఆర్టీసీ డిపో ఎదరుగా ఉన్న హోటళల్లో కన్నా డిపోల్లో 25 నుంచి 35 శాతం అధికంగా ధరలున్నాయి.
మౌలిక సౌకర్యాలు మాటుమాయం...
ఆర్టీసీ కాంప్లెక్సుల్లో ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. నిర్వహణకు వివిధ పేర్లతో టికెట్లపై అదనంగా వసూలు చేస్తున్నా ఆర్టీసీ ప్రయాణికులకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. రాజమహేంద్రవరం, కాకినాడ, రామచంద్రపురం, అమలాపురం, రావులపాలెం, తుని, ప్రత్తిపాడు, గోకవరం, రాజోలు కాంప్లెక్సుల్లో తాగునీటి సదుపాయం లేదు. మంచినీరు కావాలంటే అక్కడ దుకాణాల్లో రూ.20 వెచ్చించి బాటిల్ కొనుగోలు చేయాల్సిందే. అది కూడా స్థానికంగా తయారు చేసే సంస్థ బాటిళ్లు విక్రయిస్తున్నారు. రావులపాలెం, గోకవరంలలో ప్రయాణికులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు లేవు. ప్రత్తిపాడు, రామచంద్రపురాల్లో ఫ్యాన్లు తిరగడం లేదు. రామచంద్రపురం డిపోలో ఫ్యాన్లు తిరగకపోవడంతో పగటి పూటే ప్రయాణికులపై దోమలు స్వైర విహారం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment