విజయకేతనం | Employees Union Wins In RTC Elections YSR Kadapa | Sakshi
Sakshi News home page

విజయకేతనం

Published Fri, Aug 10 2018 12:20 PM | Last Updated on Mon, Aug 20 2018 3:30 PM

Employees Union Wins In RTC Elections YSR Kadapa - Sakshi

రాజంపేట డిపోలో ఈయూ ఐక్య కూటమి నేతల ఆనందోత్సాహాలు

సాక్షి కడప : ఏపీఎస్‌ ఆర్టీసీ కార్మికుల గుర్తింపు సంఘ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. గురువారం జిల్లాలోని అన్ని డిపోల పరిధిలో పోలింగ్‌ ప్రశాంతంగా జరగ్గా...పలుచోట్ల ఎన్‌ఎంయూ, ఇంకొన్నిచోట్ల ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఐక్యకూటమి విజయకేతనం ఎగురవేశాయి. పది రోజులు గా ఆర్టీసీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు, మంతనాలతో హడావుడిగా కనిపించిన కార్మిక నేతలు ఈ విజయంతో ఎక్కడికక్కడ సంబరాల్లో మునిగిపోయారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎన్నికల పోలింగ్‌ జరగ్గా, సాయంత్రం నుంచి రాత్రి వరకు జరిగిన కౌంటింగ్‌తో ఉత్కంఠకు తెరపడింది. జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో ఐదుచోట్ల నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ విజయకేతనం ఎగుర వేయగా, మూడు డిపోలతోపాటు వర్క్‌షాప్‌లో ఎంప్లాయీస్‌ యూనియన్‌ కూటమి భారీ మెజార్టీతో గెలుపును కైవసం చేసుకుంది.

భారీగా పోలింగ్‌
జిల్లాలో ఆర్టీసీ కార్మిక గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి అన్నిచోట్ల భారీగా పోలింగ్‌ నమోదైంది. జమ్మలమడుగు డిపో పరిధిలో 100 శాతం ఓటింగ్‌నమోదు కాగా, మైదుకూరు, రాయచోటి, రాజంపేట, బద్వేలులో కూడా 98 నుంచి 99 శాతం ఓటింగ్‌ నమోదైంది. అంతేకాకుండా పులివెందుల, రాయచోటి, ప్రొద్దుటూరు, కడప, వర్క్‌షాప్‌లో కూడా కార్మికులందరూ ఓటుహక్కు వినియోగించుకున్నారు. డ్యూటీలకు వెళుతున్న డ్రైవర్లు, కండక్లర్లు, ఇతర కార్మికులు గురువారం తెల్లవారుజామునే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం కూడా కొంతమంది క్యూలైన్లలో ఉండి ఓటుహక్కును వినియోగించుకున్నారు. కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు కావడంతో ఎక్కడికక్కడ డిపోల పరిధిలో సందడి వాతావరణం నెలకొంది.

కడపలో ఈయూ ఐక్యకూటమి విజయం
కడపలో ఈయూ ఐక్య కూటమి విజయకేతనం ఎగురవేసింది. అందులోనూ జిల్లాలోని ప్రొద్దుటూరు, రాజంపేట, కడప డిపో, వర్క్‌షాప్‌లలో ఈయూకు భారీ మెజార్టీని కార్మికులు అందించారు. కడప డిపోతో పాటు వర్క్‌షాప్‌లోనూ ఈయూ కూటమి గెలుపును అందుకుంది. రాజంపేట, ప్రొద్దుటూరుల్లో  కూటమికి విజయం లభించింది.

ఐదుచోట్ల ఎన్‌ఎంయూ గెలుపు
జిల్లాలో నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ పలుచోట్ల విజయం సాధించింది. రాయచోటి, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, పులివెందులలో గెలుపుబాటలో పయనించింది. జిల్లాలోని పలు డిపోల పరిధిలో జరిగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఎన్‌ఎంయూ హవా కనిపించింది. ఆ ఐదు డిపోల పరిధిలో ఎన్‌ఎంయూకు రాష్ట్రస్థాయిలో కార్మికులు మెజార్టీని అందించారు.

బద్వేలులో ఉత్కంఠ
బద్వేలు డిపో పరిధిలో కార్మిక గుర్తింపు సంఘ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. రెండు యూనియన్లకు సంబంధించి ఓట్ల కౌంటింగ్‌లో సరిసమానంగా వస్తుండడంతో ఉత్కంఠం నెలకొంది. అయితే డిపో పరిధిలో 292 ఓట్లు ఉండగా, 290 ఓట్లు పోలయ్యాయి. డిపో పరిధిలో ఎన్‌ఎంయూకు 147 ఓట్లు రాగా, ఈయూ ఐక్య కూటమికి 142 ఓట్లు వచ్చాయి. మరో ఓటు చెల్లుబాటు కాలేదు. దీంతో ఎన్‌ఎంయూకు కేవలం ఐదు ఓట్ల మెజార్టీ మాత్రమే లభించింది. రాష్ట్రానికి సంబంధించి కూడా ఎన్‌ఎంయూకు బద్వేలు డిపో పరిధిలో 150 ఓట్లు వస్తే, ఈయూ కూటమికి 140 ఓట్లు వచ్చాయి. దీంతో కేవలం 9 ఓట్ల స్వల్ప మెజార్టీ మాత్రమే లభించింది.

ఐక్య కూటమికి పట్టం కట్టిన కార్మికులు
జిల్లాలో ఈయూ ఐక్య కూటమికీ ఆర్టీసీ కార్మికులు పట్టం కట్టారు. ఎంప్లాయీస్‌ యూనియన్, వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్, కార్మిక  పరిషత్, ఎస్‌డబ్ల్యూఎఫ్‌ ఐక్యంగా పోటీకి తలపడడంతో కార్మికులు ఆ కూటమికి అండగా నిలిచారు. ఐక్య కూటమి తరఫున కడప రీజనల్‌ వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌కు కేటాయించారు. ఎన్నికల్లో ఎన్‌ఎంయూ కాగడా గుర్తు, వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ యూనియన్‌ టేబుల్‌ ఫ్యాను గుర్తుపై తలపడ్డారు. కాగా ఆర్టీసీ కార్మికులు ఆత్మప్రభోదానుసారం ఓటు వేసుకోవాలని ఆ యూనియన్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికులకు అండగా ఐక్య కూటమి నిలుస్తోందని భావించిన ఓటర్లు పట్టం కట్టారు. జిల్లావ్యాప్తంగా ఎన్‌ఎంయూ కంటే ఎంప్లాయీస్‌ ఐక్య కూటమికీ 172 ఓట్లు ఆధిక్యత లభించింది. వైఎస్సార్‌ ఆర్టీసీ మజ్దూర్‌ నాయకులు పారదర్శక పిలుపుతో ఈయూ ఐక్య కూటమికి కార్మికులు అండగా నిలవడం విశేషం. ఇక పోస్టల్‌ బ్యాలెట్లు 59 ఉన్నాయి. వీటిని 13న లెక్కించనున్నారు. వీటిలో కేవలం 30 ఓట్లు లభిస్తే ఈయూ ఐక్య కూటమి కడప రీజియన్‌ను కైవసం చేసుకోనుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement