కానిస్టేబుల్ కుమారుడే..
Published Tue, Apr 12 2016 8:24 PM | Last Updated on Sun, Sep 3 2017 9:47 PM
ఎగిరెగిరి పడడం అందరికీ వచ్చు.. ఎదిగినా ఒదిగి ఉండటం కొందరికే తెలుసు. తెర మీద పోషించే పాత్ర ఎందరికో నచ్చుతుంది.. కానీ తెర వెనుక వ్యక్తిత్వం అందరికీ నచ్చటం గొప్ప విషయం. ఆయనో సినీ శిఖరం.. ఎల్లలు దాటిన అభిమానం ఆయన సొంతం. అయినా వినయమే ఆభరణం. ఆయనే మన సూపర్ స్టార్ రజనీకాంత్. తలైవా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరిన సందర్భంగా..
కానిస్టేబుల్ కుమారుడే..
సామాన్య పోలీస్ కానిస్టేబుల్ అయిన రామోజీ రావ్ గైక్వాడ్, రమాబాయిల నాలుగవ సంతానం శివాజీరావ్ గైక్వాడ్. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మీద అభిమానంతో పెట్టుకున్న పేరు. ఆరేళ్లకే మహా ఆకతాయిగా ఉండే గడుగ్గాయిలా తయారయ్యాడు. క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్.. అన్నిటినీ ఓ చూపు చూసేవాడు. తమ్ముడి దుందుడుకుతనం గమనించిన అన్నయ్య సరాసరి రామకృష్ణ మఠంలో చేర్పించాడు. ఇక అక్కడి నుంచి క్రమశిక్షణ గల జీవితం అలవరచుకున్నాడు శివాజీరావు. వేదాలు, సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రలాంటి విషయాలు ఆసక్తిగా అనిపించేవి. ఆ వయసులోనే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితుడయ్యాడు. మఠంలో ప్రదర్శించే నాటికలలో పాత్రలు వేస్తుండేవాడు. అక్కడే నటన వైపు మనసు మళ్లింది.
ప్రాథమిక విద్య అనంతరం మఠం వదిలి మరో పాఠశాలలో చేరాడు. పాఠశాల విద్య అయిపోయేంతవరకు అక్కడే చదువుకున్నాడు. ఆ సమయంలోనే ఓ సారి 'కురుక్షేత్ర' అనే నాటికలో దుర్యోధనుడి పాత్ర పోషించిన శివాజీరావుకి చెప్పుకోదగ్గ ప్రశంసలే దక్కాయి. ఆ దెబ్బతో నటించాలనే దాహం మరింత పెరిగింది.
కూలీ నుంచి కండక్టర్ వరకు..
పాఠశాల నుంచి బయటకు వచ్చాక బతుకు తెరువు కోసం శివాజీ చేయనిపని లేదు. కూలి పనికి వెళ్లేవాడు, అది లేని రోజున కార్పెంటర్ అవతారం ఎత్తేవాడు.. అదీ దొరక్కపోతే మరోటి. బెంగళూరు ట్రాన్స్పోస్టు సర్వీస్లో బస్ కండక్టర్గా ఉద్యోగం దొరికే వరకు ఇదే పంథా కొనసాగింది.
యుక్త వయసు.. ఉడుకు రక్తం.. కుదురుగా ఉండనిస్తుందా? ఒంట్లో ఉన్న స్టైల్ అంతా పనిలో చూపించేవాడు. ఆడుతూ పాడుతూ పని చేసేవాడు. రూపాయి బిళ్ల ఎగరేస్తే కళ్లప్పగించి చూడాల్సిందే. టిక్కెట్లను అంత స్టైల్గా కొట్టొచ్చని శివాజీని చూశాకే చాలామంది కండక్టర్లకు తెలిసుంటుంది.
కండక్టర్ ఉద్యోగంతోపాటు కన్నడ నాటికలు కూడా నడుస్తుండేవి. యాక్టింగ్ కోర్సు చేయడానికి మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరాడు. కుటుంబం నుంచి తీవ్ర వ్యతిరేకత.. స్నేహితుడి నుంచి బోలెడంత ప్రోత్సాహం. అలా ఓ రోజు ఇన్స్టిట్యూట్లో ఓ నాటికలో నటిస్తుండగా తమిళ దర్శకుడు కె.బాలచందర్ కంటపడ్డాడు. త్వరగా తమిళం నేర్చుకోవోయ్ అంటూ సలహా ఇచ్చేశారు బాలచందర్.
అపూర్వ రాగాంగళ్ నుంచి ..
అన్నట్టే బాలచందర్ అవకాశమూ ఇచ్చారు. 'అపూర్వ రాగాంగళ్' సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా తెరంగేట్రం చేశాడు శివాజీరావ్ గైక్వాడ్. పెద్దగా పట్టించుకోలేదు జనాలు. కన్నడంలో కొన్ని ప్రయత్నాలు.. ప్రయత్న లోపం లేదుగానీ ఫలితంలో మాత్రం లోపమే. సరిగా అప్పుడు బాలచందర్ నుంచి మరోసారి పిలుపు. 'అంతులేని కధ'లో అన్నయ్య పాత్ర. బాలచందర్ లాగే ఈసారి జనాలు కూడా పట్టేశారు. మొదట్లో చిన్న చిన్న వేషాలు, విలన్ పాత్రలు.. వెనుకడుగు వేయలేదు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు.
కొన్నాళ్ల తర్వాత 'చిలకమ్మ చెప్పింది' అనే తెలుగు సినిమాలో తొలిసారి ప్రధాన పాత్రలో నటించాడు. కథానాయకుడిగా అక్కడ మొదలైన ప్రయాణం 'శివాజీ' సినిమాతో ఆసియాలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటుడిగా రికార్డు సృష్టించేంత విజయవంతంగా కొనసాగింది. ఇక మధ్యలో ఎదురయ్యే ఆటుపోట్లు సర్వ సాధరణమే కదా. తలైవా సినిమా రిలీజ్ అయ్యిందంటే థియేటర్లో ఈలలు, గోలలే. 150 సినిమాల మైలురాయిని దాటేసిన రజనీ సినీ ప్రయాణం మరింత కొనసాగాలన్నది అభిమానుల ఆకాంక్ష. రజనీ తదుపరి చిత్రం రోబో 2.0 సెట్స్ మీద ఉంది.
దేశవిదేశాల అభిమానం..
దేశవిదేశాల్లో అభిమానులను సంపాదించుకున్న రజనీ.. మొదటి నుంచి నిరాడంబరంగానే ఉన్నారు. సినిమాల్లో స్టైల్కి సెల్ఫీలా కనిపించే ఆయన.. తెర వెనుక మాత్రం మినిమమ్ మేకప్ కూడా లేకుండా సాదాసీదాగా ఉంటారు. ఆధ్యాత్మిక చింతనే ఆరోగ్య సూత్రం. ఇవ్వడంలో పెద్ద చేయి. అభిమానులు ఆపదలో ఉంటే పిలవకుండానే పలుకుతాడు. అందుకే వారి గుండెల్లో అభిమాన దేవుడయ్యాడు.
భారత ప్రభుత్వం 'పద్మవిభూషణ్' తో సత్కరించిన సందర్భంగా..
Advertisement
Advertisement