బస్సు లోపల
ఒక ఆర్టిస్ట్ బస్ ఎక్కాడు. కండక్టర్ దగ్గర టికెట్ తీసుకున్నాడు. దాని వెనుక కండక్టర్ బొమ్మ గీశాడు. కండక్టర్ రియాక్షన్? ఓహో.. వైరల్
బస్సు బయట
ప్రతి ఉదయం ఆ పెద్దమనిషి ముంబై రోడ్డు డివైడర్ దగ్గర నిలబడతాడు. తెల్లవారు షిఫ్ట్‌కి డ్యూటీ ఎక్కిన డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతాడు. ఆ పెద్దాయన కారుణ్యం? వైరలే కదా.
మనుషులు సాటి మనుషుల పట్ల చూపించే చిన్న చిన్న వాత్సల్యాలే మానవాళిని ముందుకు నడిపిస్తున్నాయి.
సాటిమనిషి ముఖంలో చిరునవ్వు కనిపించేలా చేస్తే ఎంత బాగుంటుంది. బొమ్మలు గీసే ఆషిక్‌ను అడగాలి. కేరళలోని మళప్పురంలో నివసించే ఆషిక్ ఫైన్ ఆర్ట్స్ చదివాడు. చూసిన మనిషి ముఖాన్ని క్షణాల్లో అచ్చుగుద్దినట్టు పెన్సిల్‌తో గీయడంలో దిట్ట. తన ఆర్ట్‌ను కష్టజీవులను సంతోషపెట్టడానికి అతడు వాడుతుంటాడు. నిత్యజీవితంలో తారసపడే పండ్లమ్ముకునేవాళ్లను, పంక్చర్లు వేసేవాళ్లను, కూలీలను, సేల్స్ బోయ్స్‌ను దూరం నుంచి చూసి వారికి తెలియకుండా వారి బొమ్మ గీస్తాడు.
ఆ తర్వాత వారికి తీసుకెళ్లి ఇస్తాడు. తమ పనుల్లో మునిగివున్న ఆ కష్టజీవులు హటాత్తుగా తమ బొమ్మను చూసుకుని తెలియని ఆనందంతో నవ్వుతారు. ఆ నవ్వును కెమెరాలో బంధించి ఇన్‌స్టాలో పెడుతుంటాడు ఆషిక్. ఇటీవల ఒక బస్ కండక్టర్ బొమ్మను అతనిచ్చిన టికెట్ వెనుకే గీసిస్తే అతడు సంతోషంతో తబ్బిబ్బు అయ్యాడు. డబ్బున్నవాళ్ల బొమ్మలు అందరూ గీస్తారు... కాని తమ బొమ్మ కూడా గీసే వారుంటారా... అని ఆనందంతో మురిసి పోవడం ఆషిక్ వీడియోల్లో చూస్తాం. అందుకే అవి వైరల్ అవుతుంటాయి.
ఇక రెండో వైరల్ ఏమిటంటే ముంబైలో ఒక చౌరస్తా దగ్గర నిలుచున్న ఒక పెద్దమనిషి ఉదయాన్నే ఆరు నుంచి ఎనిమిదిన్నర మధ్య సిటీ సర్వీస్‌లను నడిపే బస్‌డ్రైవర్లకు బిస్కెట్ ప్యాకెట్లు పంచుతుంటాడు. తెల్లవారి షిఫ్ట్ ఎక్కేవారు ఏం తింటారో తినరో. ఈ బిస్కెట్స్ వారికి ఉపయోగపడతాయి. తాను చేసేది గొప్పలు చెప్పుకోని ఆ పెద్దమనిషి నిశ్శబ్దంగా బిస్కెట్లు పంచి ఇంటిముఖం పడతాడు. అతని వీడియోను ఒకామె ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తే ఈ మాత్రం కరుణ ప్రతి ఒక్కరిలో ఉంటే ఎంత బాగుండు అని అందరూ సంతోషించారు.
మనుషులు మంచివాళ్లు. కాకపోతే తాము మంచివాళ్లమని అరుదుగా వారికి గుర్తుకొస్తుంటుంది. ఈ మాత్రం మంచిని అందరం చేయగలం. చేస్తే ఎంత బాగుండు.
Comments
Please login to add a commentAdd a comment