బస్సు కండక్టర్ నిర్లక్ష్యం వల్ల, ఈవ్ టీజింగ్ చేసిన యువకుడు తప్పించుకోవడంతో మహిళా న్యాయవాది పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ వివాదం క్రమంగా డ్రైవర్లు, కండక్టర్లపై పోలీసుల లాఠీచార్జీకి దారితీసింది. దీంతో శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు వందలాది బస్సుల రాకపోకలు ఆగిపోయూయి.
చెన్నై, సాక్షి ప్రతినిధి: చెన్నై నగరం బ్రాడ్‌వే బస్‌స్టేషన్ నుంచి కోయంబేడు బస్‌స్టేషన్‌కు 15ఎఫ్ సిటీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. రాత్రి వేళ కావడంతో ఇళ్లకు చేరుకునే ప్రయాణికులతో బస్సు రద్దీగా ఉంది. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న కోయంబేడుకు చెందిన మహిళా న్యాయవాది విజయలక్ష్మి (38)ని ఓ తుంటరి యువకుడు ఈవ్‌టీజింగ్ చేయగా తీవ్రస్థాయిలోమందలించింది. అయినా లెక్కచేయని ఆ తుంటరి హద్దు మీరడంతో చెప్పుతో కొట్టబోయే ప్రయత్నం చేస్తూ బస్సు ఆపాలని కండక్టర్‌ను కోరింది. అయితే ఇవేమీ లెక్కచేయని విధంగా బస్సును పోనిచ్చాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువకుడు ఆమెపై వేధింంచడంతో, పోలీస్ కంట్రోల్ రూముకు సమాచారం ఇవ్వడంతోపాటూ ప్రయాణికుల సహాయాన్ని కోరింది. ప్రయాణికులు పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా యువకుడు అకస్మాత్తుగా నడుస్తున్న బస్సు నుంచి దూకి పారిపోయాడు.
ఇంతలో బస్సు కోయంబేడుకు చేరుకోవడంతో అక్కడి పోలీస్‌స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేసింది. బస్సులో వేధింపులకు పాల్పడుతున్నపుడే బస్సును ఆపివుంటే యువకుడు పట్టుబడేవాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కండక్టర్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బస్సు కండక్టర్ అశోక్‌ను అదుపులోకి తీసుకోగా అతని వెంట డ్రైవర్ కూడా పోలీస్‌స్టేషన్‌కు వచ్చాడు. కండక్టర్‌పై కేసు పెడితేగానీ కదిలేది లేదని న్యాయవాది విజయలక్ష్మి పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. ఈ సమాచారం అందుకున్న ప్రభుత్వ బస్సుల డ్రైవర్లు, కండక్టర్లు పోలీస్ స్టేషన్ చేరుకుని వాగ్విదానికి దిగారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు జరిపిన లాఠీచార్జీలో ప్రభు అనే కండక్టర్ గాయపడడంతో బస్సులన్నింటినీ రోడ్లపైన, బస్‌స్టేషన్లలోనూ నిలిపివేసి డ్రైవర్లు, కండక్టర్లు ఆందోళనకు దిగారు.
కోయంబేడు 100 ఫీట్‌రోడ్డు, తిరుమంగళం, పూందమల్లి రోడ్లలో వందలాది బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఏమి జరుగుతోందో తెలియక ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యూరు. మద్రాసు ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ ఎండీ పద్మనాభన్, పోలీసు ఉన్నతాధికారులు చర్చలు జరిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడిన యువకుడిని గుర్తించి అరెస్ట్ చేస్తామని, కండక్టర్‌ను గాయపరిచిన పోలీస్‌పై క్రమశిక్షణ చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మహిళా న్యాయవాది, ప్రభుత్వ బస్సుల సిబ్బంది ఎవరిదారిన వారు పోయారు. ఈ ఆందోళన ఫలితంగా శుక్రవారం రాత్రి 10.30 గంటల నుంచి శనివారం తెల్లవారుజాము 3 గంటల వరకు అంటే సుమారు 5 గంటల పాటూ 75 బస్సుల రాకపోకలు స్థంభించిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలపాలయ్యారు.
అర్ధరాత్రి ఆందోళన
Published Sun, Nov 16 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 PM
Advertisement
Advertisement