రజనీ జీవితకథతో కన్నడ సినిమా
రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయ వాక్యాలు అవసరంలేదు. ఈ సూపర్ స్టార్ కారణంగా ఆయన స్నేహితుడు రాజ్ బహదూర్‌కి కూడా ఎంతో కొంత పాపులార్టీ వచ్చింది. రజనీ జీవితంలో అతి కీలకమైన వ్యక్తుల్లో బహూదూర్‌కి ముఖ్యమైన స్థానమే ఉంటుంది. రజనీ బస్ కండక్టర్‌గా చేసినప్పుడు బహదూర్ ఆ బస్‌కి డ్రైవర్‌గా చేసేవారు. అప్పుడు తన స్నేహితునిలో నటనాసక్తిని గ్రహించి, ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో చేరడానికి తన వంతు సహాయం చేశారు బహదూర్.
అనంతరం రజనీ నటునిగా మారడం, సూపర్ స్టార్‌గా ఎదగడం అందరికీ తెలిసిందే. ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత పాత స్నేహితులను కొంతమంది మర్చిపోతారు. రజనీ మాత్రం అలాంటి వ్యక్తి కాదు. ఇప్పటికీ రాజ్ బహదూర్‌తో తన స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఇద్దరి స్నేహం ఆధారంగా కన్నడంలో ‘వన్ వే’ అనే చిత్రం రూపొందుతోంది. తమిళంలో ‘ఒరు వళి శాలై’ అనే పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇందులో స్నేహితుని పాత్రను రాజ్ బహదూరే స్వయంగా పోషిస్తున్నారు.
రజనీ పాత్రను ఎవరు చేస్తున్నారనేది రహస్యంగా ఉంచారు. ఈ చిత్రం గురించి రాజ్ బహదూర్ మాట్లాడుతూ -‘‘ఈ సినిమా గురించి రజనీ దగ్గర అనుమతి కోరగానే, వెంటనే పచ్చజెండా ఊపేశారు. ‘మనిద్దరం కలిసి చూద్దాం’ అని కూడా అన్నారు. రజనీకాంత్‌కి ఉన్న ఖ్యాతిని సొమ్ము చేసుకోవడానికి ఈ సినిమా చేయడంలేదు. ఓ మంచి సందేశం ఇస్తున్నాం. మేం రంగస్థలం కళాకారులుగా ఉన్నప్పట్నుంచీ ఇప్పటివరకు మా మధ్య స్నేహం ఎలా ఆరంభమైంది? విడదీయ లేనంత ఆప్తమిత్రులుగా ఎలా మారాం? అనే కథాంశంతో ఈ చిత్రం ఉంటుంది’’ అని చెప్పారు. రుషి రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.