సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చా
జోగిపేట,న్యూస్‌లైన్: ప్రజా సేవ చేయాలన్న ఉద్దేశంతోనే తాను సినిమా రంగాన్ని వీడి రాజకీయాల్లోకి వచ్చానని అందోల్ ఎమ్మెల్యే పి.బాబూమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అందోల్ మండలం డాకూర్ గ్రామంలో ఆయనను వివిధ కుల సంఘాలు, టీఆర్‌ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వందలాది మంది యువకులు, విద్యార్థుల ఆత్మబలిదాన ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, అందుకే తన విజయాన్ని అమరులకు అంకితమిస్తున్నట్లు ప్రకటించారు.
ఎదుటి పార్టీ వారు తనను అవమాన పరిచే విధంగా ప్రకటనలు చేశారన్నారు. తన పార్టీ కార్యకర్తలు, నాయకులు తన విజయానికి కృషి చేశారన్నారు. వారికి తాను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు కూడా తన విజయానికి తోడ్పడ్డాయన్నారు. తాను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను, కార్యకర్తలను పలకరించాలనుకున్నానని, అయితే ఈ లోగానే కార్యకర్తలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్ రావడం తనకు బాధ కల్గించిందన్నారు. అందుకే పెళ్లిళ్లకు హాజరవుతూ ముఖ్యమైన కార్యకర్తలను కలుసుకుంటున్నానన్నారు.
దండలు, శాలువాలు తేవద్దు
తాను నియోజకవర్గంలో పర్యటించేప్పుడు శాలువాలు, పూలదండలు తీసుకరావద్దని ఎమ్మెల్యే కార్యకర్తలకు సూచించారు. తాను గ్రామాలకు వచ్చినప్పుడు కేవలం సమస్యలు చెబితే చాలునన్నారు. అనవసరంగా డబ్బులు వృధా చేయవద్దని కోరారు.
డాకూర్‌లో సన్మానం
డాకూర్ గ్రామంలో బాబూమోహన్, మాజీ ఎంపీ పి.మాణిక్‌రెడ్డిలకు కార్యకర్తలు ఘనంగా సన్మానం చేశారు. సర్పంచ్ ఏ.శంకరయ్య, మాజీ సర్పంచ్ తమ్మళి శ్రీనివాస్, కురుమ సహకార సంఘం చైర్మన్ రొడ్డ క్రిష్ణయ్య తదితరులు వారిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు జి.లింగాగౌడ్, డీబీ నాగభూషణం, పిట్ల లక్ష్మణ్, సీహెచ్.వెంకటేశం, జగదీశ్, జి.రవీందర్‌గౌడ్, డాకూరి నాగభూషణంతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నా గెలుపు ప్రజలకే అకింతం
అల్లాదుర్గం రూరల్: తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న అందోల్ ప్రజలకే తన విజయాన్ని అకింతమిస్తున్నట్లు ఎమ్మెల్యే బాబుమోహన్ పేర్కొన్నారు. ఆదివారం అల్లాదుర్గం మండలంలో పోతులబోగుడలలో ఓ వివాహనికి ఆయన హాజరయ్యారు. అనంతరం వట్‌పల్లి వెంకట ఖాజా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ తనకు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని, వారికి సేవలందించి కృతజ్ఞతతో ఉంటానన్నారు.అలాగే అవినీతి లేని పాలన అందిస్తానన్నారు. మరో సారి సేవ చేయడానికి అవకాశం కల్పించిన అందోల్ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. వట్‌పల్లి టీఆర్‌ఎస్ నాయకులు బాబుమోహన్‌కు శాలువా కప్పి సన్మానం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ మండల నాయకులు మాజీ ఎంపీపీ కాశీనాథ్, మరవెళ్లి ఎంపీటీసీ సభ్యులు భిక్షపతి, శివాజీరావు, ఉదయ్‌కిరణ్, నాయకులు సుభాష్‌రావ్, మండల టీఆర్‌ఎస్ యువత అధ్యక్షుడు అశోక్‌గౌడ్, కుత్బుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, ఖాజాపటేల్ తదితరులు పాల్గొన్నారు.