స్వర్ణ, రజత, కాంస్యాలు నెగ్గిన వారికి వరుసగా రూ. 75, 50, 30 లక్షల నజరానా
న్యూఢిల్లీ: పారిస్ పారాలింపిక్స్‌లో పాల్గొన్న భారత బృందాన్ని కేంద్ర క్రీడా శాఖ మంగళవారం ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా ప్రోత్సాహకాల్ని అందించింది. స్వర్ణ పతక విజేతకు రూ. 75 లక్షలు... రజత పతకం నెగ్గిన వారికి రూ. 50 లక్షలు... కాంస్య పతకం గెలిచిన వారికి రూ. 30 లక్షలు నజరానా ఇచ్చినట్లు క్రీడా శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.
లాస్ ఏంజెలిస్ 2028 పారాలింపిక్స్ లక్ష్యంగా అథ్లెట్లు సన్నద్ధమయ్యేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తుందని ఆయన చెప్పారు. ‘పారాలింపిక్స్‌లో భారత్ దూసుకెళుతోంది. రియో (2016)లో 4 పతకాలు, టోక్యో (2020)లో 19 పతకాలు సాధించిన మన అథ్లెట్లు పారిస్‌లో అత్యధికంగా 29 పతకాలు గెలిచి పతకాల పట్టికలో 18వ స్థానంలో నిలిచారు.
భవిష్యత్తులో ఈ సంఖ్య మరింత పెరిగేందుకు అథ్లెట్లకు అధునాతన సదుపాయాలు, కిట్లు అందజేస్తాం’ అని కేంద్ర మంత్రి తెలిపారు. ఆదివారం ముగిసిన పారిస్ పారాలింపిక్స్ క్రీడల్లో భారత పారా అథ్లెట్లు 29 పతకాలు నెగ్గారు. ఇందులో 7 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment