
బాబూమోహన్ ఇక షి‘కారు’!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: తెలుగుదేశంపార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బాబూమోహన్ ‘సైకిల్’ దిగి ‘కారెక్కే’ యోచనలో ఉన్నారు. అందోల్ నియోజకవర్గంలో టీడీపీ బలహీనపడటం, కేసీఆర్‌తో బాబూమోహన్‌కు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో ఆయన టీఆర్‌ఎస్ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. కేసీఆర్ సూచన మేరకు ఇటీవల హరీష్‌రావు ఆయనకు ఫోన్‌చేసి టీఆర్‌ఎస్‌లోకి రావాల్సిందిగా ఆహ్వానించినట్లు తెలిసింది.
అంతా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరటం దాదాపు ఖరారైనట్టే. ఆ విషయం ఇటీవల బాబూమోహన్ స్వయంగా ఆయన సన్నిహితులతో అన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఖమ్మం జిల్లాకు చెందిన బాబూమోహన్ సినిమా రంగం నుంచి నేరుగా అందోల్ నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ స్థానికేతరుడు అయినప్పటికీ అప్పట్లో సినీగ్లామర్, కేసీఆర్ అండదండలతో టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పర్యాయం కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం కేసీఆర్ తెలంగాణ ఉద్యమంతో టీఆర్‌ఎస్ పార్టీ పెట్టడం, రాజకీయ సమీకరణలు మారటంతో 2004 నుంచి వరుసగా రెండుసార్లు ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ చేతిలో ఓడిపోతూ వచ్చారు.
ఫలితంగా నియోజకవర్గంలో టీడీపీ పూర్తిగా బలహీనపడింది. టీడీపీకి చెందిన దిగువ శ్రేణి ముఖ్యనేతలు, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిపోయారు. అందోల్ నియోజకవర్గంపై మంచి పట్టున్న మాజీ ఎంపీ, టీడీపీ సీనియర్ నాయకుడు మాణిక్‌రెడ్డి కూడా ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనే బాబూమోహన్‌ను టీఆర్‌ఎస్‌లోకి తీసుకువచ్చేందుకు గట్టిగా యత్నిస్తున్నట్లు సమాచారం. నిజానికి అందోల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీ బలహీనంగానే ఉంది.
ఇక్కడ ఇప్పటివరకు ఆ పార్టీ నుంచి చెప్పుకోదగిన స్థాయి నాయకుడు ఎదగలేదు. కేసీఆర్‌కు బాబూమోహన్‌తో ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో... బాబూమోహన్‌కు పోటీ లేకుండా చేసేందుకే ఈ ప్రాంతంలో టీఆర్‌ఎస్ పార్టీ నుంచి బలమైన నాయకత్వాన్ని ప్రోత్సహించలేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ విమర్శలకు చెక్ చెప్పేందుకు కూడా కేసీఆర్ బాబూమోహన్‌ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గంలో దామోదర రాజనర్సింహ బలమైన పునాదులు వేసుకున్నారు. ఎలాగైనా సరే ఆయనను ఓడించాలని పట్టుదలతో మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు ‘బాబూమోహనాస్త్రమే’ సరైందనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం.
వెంటాడుతున్న విలీన భయం..
ఇప్పటికే బాబూమోహన్ టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేవారు. కానీ ఆయన్ను విలీన భయం వెంటాడుతున్నట్లు సమాచారం. ఒకవేళ టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్నా, లేదా పార్టీని పూర్తిగా కాంగ్రెస్‌లో విలీనం చేసినా.. అటు టీడీపీ నుంచి టికెట్ రాక, ఇటు టీఆర్‌ఎస్ నుంచి పోటీచేసే అవకాశం లేక ‘రెంటికీ చెడ్డ రేవడి’ అవుతుందనే భయంతో బాబూమోహన్ ఉన్నట్లు తెలిసింది. ఒకవేళ పార్టీ విలీనమైతే తన భవిష్యత్తు ఏమిటో ముందు కేసీఆర్‌తో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని, అంతవరకు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దనే ఆలోచనతో బాబూమోహన్ ఉన్నట్లు తెలిసింది.