అందోల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధానంగా ఇక్కడ త్రిముఖ పోరు నెలకొంది. టీఆర్‌ఎస్ నుంచి జర్నలిస్ట్ నేత క్రాంతికిరణ్ అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ప్రజాఫ్రంట్ తరఫున మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ మరోసారి బరిలో నిలిచారు. ఇక తాజామాజీ ఎమ్మెల్యే బాబూమోహన్‌కు టీఆర్‌ఎస్ అధిష్టానం టికెట్ ఖరారు చేయకపోవడంతో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బీఎల్‌ఎఫ్ నుంచి జయలక్ష్మి రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే తిరిగి గెలిపిస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యే బాబూమోహన్ భరోసాతో ఉన్నారు. స్థానిక నినాదాన్ని తెరపైకి తేవడంలో సఫలీకృతుడైన క్రాంతికిరణ్ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. డిప్యూటీ సీఎంగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులు, ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కలిసి వస్తాయని దామోదర ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జోగిపేట(అందోల్): కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ‘అందోలు’ నియోజకవర్గానికి పేరుంది. 1952 నుంచి 2014వరకు 15సార్లు జరిగిన ఎన్నికల్లో 9సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి బాబూమోహన్ గెలుపొందారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు చాలా వరకు అమలయ్యాయనే చెప్పవచ్చు. అయితే 2018లో జరిగే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బాబూమోహన్‌కు టీఆర్‌ఎస్ పార్టీ మొండి చెయ్యి చూపింది. దీంతో ఆయన బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ తరఫున జర్నలిస్టు క్రాంతికిరణ్, కాంగ్రెస్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, బీఎల్‌ఎఫ్ నుంచి జయలక్ష్మి, బీఎస్పీ తరఫున బుచ్చయ్యలు పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని భావిస్తున్నా తాజామాజీ ఎమ్మెల్యేగా ఉన్న బాబూమోహన్ కూడా ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలో త్రిముఖ పోటీ ఉంటుంది. ఈ నియోజకవర్గ పరిధిలో 8 మండలాలు వస్తాయి. ఈసారి ఎన్నికలు పోటాపోటీగా ఉన్నాయి. ఎవరికి వారు గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తున్నారు.
అభివృద్ధి పనులు.. సంక్షేమ పథకాలు
సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సింగూరు నీటిని సేద్యానికి అందించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కాలువల నిర్మాణం చేపట్టారు. మంత్రి హరీశ్‌రావు కాలువల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టారు. అందోలు పెద్ద చెరువును మినీట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేసేందుకు రూ.4.90 కోట్లు మంజూరు చేసారు. మొత్తం 10కోట్ల అభివృద్ధికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
చాలా సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న జోగిపేట మోడల్ స్కూల్ భవనాన్ని రూ.1.70 కోట్లతో పూర్తి చేసారు.
జోగిపేటలో 100 పడకల ఆస్పత్రినిర్మాణం పనులను పూర్తి చేసారు. గత సంవత్సరమే మంజూరైనా పనులు అసంపూర్తిగా ఉండగా ఈ ప్రభుత్వం పూర్తి చేసింది.
బీసీ, మైనార్టీ బాలికల, బాలుర గురుకుల పాఠశాలలు ఏర్పాటయ్యాయి.
జోగిపేటలో రెండున్నర కోట్లతో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ స్టేడియాన్ని పూర్తి చేసారు. ఈ స్టేడియం గత ప్రభుత్వ హయాంలోనే మంజూరైంది.
సుమారుగా రూ.200 కోట్లతో ఆర్‌అండ్‌బీశాఖ ద్వారా రోడ్లు, కల్వర్టులు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.
చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జోగిపేట కట్టుకాలువ పనులకు రూ.1.20 కోట్ల నిధులు మంజూరు కావడంతో పనులు కొనసాగుతున్నాయి.
రూ.36.99 కోట్లతో తాలెల్మ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించారు. ఈ పథకంతో మూడు మండలాలకు చెందిన గ్రామాలకు సాగునీరు అందుతుంది.
ప్రధాన సమస్యలు
నియోజకవర్గంలోని టేక్మాల్, అల్లాదుర్గం, రేగోడ్ మండలాలకు సింగూరు ప్రాజెక్టు ద్వారా సేద్యానికి నీరు అందించాల్సిన అవసరం ఉంది. ఈ మండలాల్లో కేవలం బోర్లు, చెరువులపైనే ఆధారపడి పంటలు పండించుకుంటున్నారు.
నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది. ఉపాధిమార్గాలు లేక చాలా మంది వలస పోతున్నారు.
నియోజకవర్గంలో ఇంకా పూర్తిస్థాయిలో ఇంటింటికీ తాగునీటి పథకం పనులు పూర్తికాలేదు. అందోలు, జోగిపేటలలో ప్రధాన ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తి కాలేదు.
నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎక్కడా డబుల్‌బెడ్‌రూం ఇళ్లు పూర్తి కాలేదు.
నియోజకవర్గ కేంద్రమైన జోగిపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసేందుకు అన్ని విధాలుగా అర్హత ఉంది.
చంటి క్రాంతికిరణ్ (టీఆర్‌ఎస్)
జర్నలిస్టు క్రాంతికిరణ్ ఈసారి జరగబోయే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసారు. జెడ్పీటీసీగా పనిచేసిన అనుభవం ఉంది. జర్నలిస్టుగా తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. అందోలు నియోజకవర్గంలో స్థానికులకు 60 ఏళ్లుగా అవకాశం లభించలేదని, స్థానిక నినాదాన్ని తెరపైకి తేవడంలో సఫలీకృతుడైన క్రాంతికిరణ్ అధికార పార్టీ ద్వారా టికెట్టు సంపాదించగలిగారు. అందోలులో ‘స్థానిక’ సెంటిమెంట్ ఉన్నట్లు స్వయంగా కేసీఆర్ ప్రకటించడం విశేషం. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ గెలుపు ధీమాతో ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలోని వట్‌పల్లి మండలం పోతులగూడ గ్రామం స్వగ్రామం, స్థానికుడినైన తనను ఆదరించాలని ఆయన ఓటర్లను కోరుతున్నారు.
దామోదర రాజనర్సింహ (కాంగ్రెస్)
మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అందోలు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. తండ్రి మాజీ మంత్రి రాజనర్సింహ మరణించడంతో 1989లో దామోదర రాజనర్సింహకు పోటీ చేసే అవకాశం లభించింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందారు. డిప్యూటీ సీఎంగా, మంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి పనులను, ఎన్నికల్లో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందంటూ ప్రచారాన్ని సాగిస్తున్నారు. రూ.400 కోట్లతో జేఎన్‌టీయూ ఏర్పాటు చేసానని, 2006లో సింగూరు కాలువ పనులకు దివంగత నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేయించానని ప్రచారంలో చెప్పుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో గెలుపుపై ధీమాగా ఉన్నారు.
జయలక్ష్మి (బీఎల్‌ఎఫ్)
జయలక్ష్మి కార్మికనేతగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆమె రాష్ట్ర అంగన్‌వాడీ వర్కర్ల యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేసిన ఆమె కార్మికులకు నేరుగా సేవలను అందించాలన్న ఉద్ధేశంతో టీచర్ పదవికి రాజీనామా చేసి ఫుల్‌టైం సీఐటీయూ అనుబంధ సంఘంలో పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో సంగారెడ్డి జిల్లాలో చేపట్టిన ఉద్యమాలతో రాష్ట్ర బీఎల్‌ఎఫ్ కమిటీని ఆకర్షించారు. నియోజకవర్గంలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉండడంతో బీఎల్‌ఎఫ్ మహిళా అభ్యర్థిగా జయలక్ష్మిని ఎంపిక చేసారు. బీఎల్‌ఎఫ్ ప్రకటించిన మేనిఫెస్టోను ఊరూరా ప్రచారం చేస్తూ ఎన్నికల ప్రచారంలో ముందుకుపోతున్నారు. సీఐటీయూ అనుబంధంగా ఉన్న ఆశ, అంగన్‌వాడీ, మున్సిపల్, హమాలీ, అసంఘటిత కార్మిక సంఘాల ఓటర్లపైనే ఆమె ఆశలు పెట్టుకున్నారు.
సిట్టింగ్ ప్రొఫైల్
తాజామాజీ ఎమ్మెల్యే బాబూమోహన్ సినీరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. సీఎం కేసీఆర్ 1998లో బాబూమోహన్‌ను అందోలు నుంచి టీడీపీ అభ్యర్థిగా ఉపఎన్నికల్లో పోటీ చేయించి గెలిపించే బాధ్యతను తీసుకున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గం నుంచి 1998, 1999, 2014లలో ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. కార్మికమంత్రిగా కూడా పనిచేసారు. టీడీపీలో ఉన్న బాబూమోహన్ 2014 ఎన్నికలకు కొద్ది రోజుల ముందే టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసిన బాబూమోహన్ 86,759 ఓట్లు సాధించి అప్పటి డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహను 3208 ఓట్లతో ఓడించారు.
సీఎం కేసీఆర్‌ను బావ అని పిలిచేంత సన్నిహితం బాబూమోహన్‌కు ఉన్నా 2018లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్టు ఇవ్వలేదు. దీంతో బీజేపీలో ఆపార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో చేరి పోటీ చేస్తున్నారు. పరిపూర్ణానందస్వామితో పాటు ఇతర జాతీయ నాయకులతో నియోజకవర్గంలో సభలను ఏర్పాటు చేసి ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయన్న ధీమాతో ఉన్నారు.
2014 పోల్ గ్రాఫ్
మొత్తం ఓటర్లు: 2,22,779
బాబూమోహన్ (టీఆర్‌ఎస్) 86,759
పోలైన ఓట్లు: 1,80,186
మెజార్టీ: 3,208
రాజనర్సింహ(కాంగ్రెస్) 83,551
పోలైన ఓట్లు: 1,80,186
2018 ఓట్ గ్రాఫ్
పోలింగ్ కేంద్రాలు: 294
మహిళా ఓటర్లు: 1,11,646
పురుషులు : 1,10,229
మొత్తం ఓటర్లు: 2,21,894
Comments
Please login to add a commentAdd a comment