సర్పంచులకు అన్ని అధికారాలు ఇవ్వాలి
తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
హైదరాబాద్: కింది స్థాయిలో అన్ని సమస్యల పరిష్కారానికి గ్రామ వ్యవస్థే ఎంతో కీలకమని దానికి నిధులు, విధులు, అధికారం ఇవ్వకపోవడం సబబు కాదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. గ్రామ స్థాయిలో ఏ సమస్య వచ్చినా ముందుగా సర్పంచ్‌నే ప్రశ్నిస్తారని, వారికి విధులు కల్పించడం వల్ల ప్రభుత్వంపై భారం తగ్గడమే కాకుండా పనులు కూడా సక్రమంగా జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ నెల 27న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సర్పంచుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన ‘సర్పంచుల మహా ధర్నా’ పోస్టర్‌ను కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాజారామ్ యాదవ్, పురుషోత్తంలతో కలసి కోదండరాం ఆవిష్కరించారు. ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ నిధులు, విధులు కల్పించాలని రాజ్యాంగం చెప్పినా ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షుడు ఆందోళ్ కృష్ణ, శాంతి నాయక్ పాల్గొన్నారు.