సంగారెడ్డి మున్సిపాలిటీ/జోగిపేట (అందోల్): పాతకక్షలు భగ్గుమన్నాయి. భూ వివాదం విషయమై చోటుచేసుకున్న ఘర్షణ.. చివరకు ప్రాణాల మీదకు తెచ్చింది. తండ్రీకొడుకులపై ప్రత్యర్థులు కారంపొడి చల్లి.. కత్తులతో దాడి చేశారు. దీంతో కొడుకు మృతి చెందగా.. తండ్రి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. జోగిపేట సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బేగరి దేవయ్య (మెదక్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ), కాశన్నగారి ప్రదీప్‌కు చెందిన వ్యవసాయ భూములు పక్కపక్కనే ఉన్నాయి. భూ తగాదాల కారణంగా ఇరువురి మధ్య కొన్నేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్ మెట్లు ఎక్కాయి.(చదవండి: ‘నీవు లేకుండా నేను ఎలా బతకాలి’ )
ఈ క్రమంలో తమకు సంబంధించిన పొలంలో దేవయ్య దున్నుకుంటున్నారని తెలుసుకున్న ప్రదీప్ సోదరులు కాశన్నగారి కరుణాకర్, ప్రసాద్, స్నేహితుడు సైదులు, మరో ఇద్దరు మహిళలు మాణెమ్మ, సురేఖలు కలసి మంగళవారం దేవయ్య, ఆయన కుమారుడు కరుణాకర్‌తో గొడవకు దిగారు. వీరి మధ్య మాటామాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ప్రదీప్ వర్గానికి చెందిన వారు తండ్రీకొడుకులపై కారంపొడి చల్లి, మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చెందాడు. దేవయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. కాగా, ఈ ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment