‘అందోల్’లో గెలిస్తే రాజయోగమే
జోగిపేట, న్యూస్‌లైన్: అందోలు అసెంబ్లీ స్థానం...మంత్రిపదవికి రాజమార్గంగా మారింది. ఎస్సీకి రిజర్వయిన ఇక్కడి నుంచి పోటీచేసిన వారినంతా పదవులు వరించాయి. ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లిన చాలామంది మంత్రులుగా పనిచేశారు. అందువల్లే ఈ సీటు పొందేందుకు దాదాపు అన్ని పార్టీల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది.
గెలిస్తే...పదవే
1967, 72, 77 సంవత్సరాల్లో వరుసగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున అందోలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సి.రాజనర్సింహకు రాష్ట్ర లిడ్‌క్యాప్ చైర్మన్, రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పదవులు దక్కాయి. ఇక 1985వ సంవత్సరంలో జడ్జి పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన మల్యాల రాజయ్య రాష్ట్ర ఆర్థిక, విద్యుత్ శాఖల మంత్రిగా పనిచేశారు.
1989వ సంవత్సరంలో తండ్రి రాజనర్సింహ మృతితో రాజకీయాల్లోకి వచ్చిన సి.దామోదర రాజనర్సింహ ఆ ఎన్నికల్లో విజయం సాధించి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి పొందారు. ఆయన ఆ పదవిలో మూడేళ్లపాటు కొనసాగారు. ఆ తర్వాత 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన మల్యాల రాజయ్య ఇక్కడ జయకేతనం ఎగురవేసి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు. 1998లో ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేసిన రాజయ్య, సిద్దిపేట ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఖాళీ అయిన అందోలు స్థానానికి 1998వ సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున సినీనటుడు పి.బాబూమోహ న్ పోటీ చేసి గెలుపొందారు.
తిరిగి 1999లో జరిగిన ఎన్నికల్లో రెండవసారి విజయం సాధించిన బాబూమోహన్‌కు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా అవకాశం దక్కింది. ఇక 2004వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన సి.దామోదర్‌కు ప్రాథమిక విద్యాశాఖమంత్రి పదవి వరించింది. అనంతరం 2009లో జరిగిన ఎన్నికల్లో తిరిగి అందోల్ నుంచి విజేతగా నిలిచిన దామోదర్ రాజనర్సింహ మార్కెటింగ్ శాఖ, ఉన్నత, సాంకేతిక విద్యాశాఖ, రాష్ట్ర డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి.
ఇద్దరిలో ఎవరు గెలిచినా కేబినెట్‌లో స్థానం?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడితే దళితుడినే ముఖ్యమంత్రి చేస్తామని ఆ అధిష్టానం ప్రకటించడం...దానికితోడు తెలంగాణ ప్రాంత ప్రచార కమిటీకి సారథ్య బాధ్యతలను దామోదరకు అప్పగించడంతో రానున్న రోజుల్లో ఆయనకు సీఎం పదవి దక్కే అవకాశం ఉందని స్థానిక పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఇక్కడి నుంచే ప్రస్తుతం టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేస్తున్న బాబూమోహన్ విజేతగా నిలిచి, టీఆర్‌ఎస్ అధికారాన్ని చేపడితే కేసీఆర్‌కు సన్నిహితుడైన బాబూమోహన్‌కు ముఖ్య పదవే దక్కుతుందని ఊహాగానాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సారి ఎవరికి రాజయోగం వరిస్తుందో వేచి చూడాల్సి ఉంది.