‘అందోల్’ పైనే ఆందోళన
క్రాస్ ఓటింగ్ ఎవరి పుట్టి ముంచుతుందోనని నేతల గుండెల్లో గుబులు!
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు ప్రచారం జరుగుతుండంతో అభ్యర్థుల్లో గుండెల్లో గుబులు పుడుతోంది. ఎన్నికల్లో ఓటర్లు చతురత చూపారు. ఒకేపార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓటరు ఏ పార్టీవైపు మొగ్గు చూపాడో తేల్చుకోలేక అభ్యర్ధులు ఆందోళన చెందుతున్నారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవ ర్గంలో టీడీపీ అభ్యర్థికి కొంతమంది పార్టీ నాయకులు బహిరంగంగా మద్దతు ఇచ్చినా ఎమ్మెల్యే విషయానికి వచ్చే సరికి ఎవరికి వారు క్రాస్ ఓటింగ్ పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అందోల్‌లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, అభ్యర్థికి, పుల్కల్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి, అల్లాదుర్గం, మునిపల్లి, రాయికోడ్‌లలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ అభ్యర్థులకు, టేక్మాల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు సమాచారం. టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పోటీలో ఉన్నప్పటికీ ఎమ్మెల్యే విషయంలో క్రాస్ ఓటింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు. మాజీ మంత్రి బాబూమోహన్ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేయగా నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని కేడర్ అంతా ఆయన వెంట వచ్చినా పుల్కల్, అల్లాదుర్గం, అందోల్‌లో కొంత మంది నాయకులు టీడీపీలోనే ఉండిపోయారు.
మిగతా వారు టీఆర్‌ఎస్‌కు ఏకపక్షంగా ఓటువేశారు. టీఆర్‌ఎస్‌లో చేరని టీడీపీ నాయకులకు టీడీపీ ఎంపీ అభ్యర్థి నియోజకవర్గ ప్రచార బాధ్యతలను అప్పగించారు. నియోజకవర్గం కేంద్రంలో ఒక సామాజిక వర్గానికి చెందిన వారు టీడీపీ ఎంపీ అభ్యర్థికి బహిరంగంగా మద్దతు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పార్టీలకతీతంగా ఓట్లు క్రాస్ అయినట్లు భావిస్తున్నారు. అభ్యర్థుల గుణ గణాలు, సామాజిక నేపథ్యం, పార్టీ వ్యవహరశైలిపై ఒక అంచనాకు వచ్చిన మెజార్టీ ఓటర్లు ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు కాకుండా వేర్వేరు అభ్యర్థులకు ఓట్లు వేశారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం అభ్యర్థులను కలవరపరుస్తోంది. క్రాస్ ఓటింగ్ ఏ మేరకు జరిగిందనే అంశంపైనే అభ్యర్థుల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
మండలాలు, గ్రామాల వారీగా ఓటింగ్ సరళిపై సమాచారం సేకరించిన ఆయా పార్టీల అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌పై బూత్‌ల వారీగా ఆరా తీస్తున్నారు. ఓటర్ల వ్యవహర శైలి లోక్‌సభ అభ్యర్థుల్లో గుబులు రేపుతుంది. ఎమ్మెల్యే అభ్యర్థికి మొగ్గు చూపిన ఓటర్లు ఎంపీ విషయంలో మరో పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ ఉండడంతో ఓటర్లు తమకు ఇష్టం వచ్చిన అభ్యర్థికి వారికి ఓటు వేశారు. నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ ఎవరికి లాభం..ఎవరికి నష్టం కల్గిస్తుందో 16వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంది.