‘క్రాస్’ ఓటు.. టీడీపీకి చేటు! | Cross-voting fever in tdp leaders | Sakshi
Sakshi News home page

‘క్రాస్’ ఓటు.. టీడీపీకి చేటు!

Published Fri, May 9 2014 12:18 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM

Cross-voting fever in tdp leaders

 అమలాపురం, న్యూస్‌లైన్ : ‘క్రాస్ ఓటింగ్..’- జిల్లాలో రాజకీయవర్గాల్లో చర్చంతా ఇప్పుడు దీనిపైనే. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో దీని ప్రభావం ఎక్కువగా ఉందని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, రాజకీయ విశ్లేషకులు గట్టిగా చెబుతున్నారు. జిల్లాలో ఏజెన్సీ, మెట్ట, మైదానం, కోనసీమ అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గంలో క్రాస్ ఓటింగ్ అంచనాలకు మించి ఉందని అంచనా వేస్తున్నారు. పార్లమెంట్ అభ్యర్థులు కొన్నిచోట్ల, అసెంబ్లీ అభ్యర్థులు మరికొన్ని చోట్ల పనిగట్టుకుని క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించారని సమాచారం.
 
 ఈ ధోరణి ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో కనిపించిందంటున్నారు. ఈ కారణంగా ఆ పార్టీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులనే క్రాస్ ఓటింగ్ గుబులు ఎక్కువగా పట్టి పీడిస్తోంది. ఆ పార్టీకి ఎంతో కొంత ఆధిక్యత వస్తుందనుకున్న ప్రాంతాల్లో జరిగిన క్రాస్ ఓటింగ్ వల్ల తమ కొంప కొల్లేరవుతుందని ఆ పార్టీ అభ్యర్థులు, నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. టీడీపీ పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులు కేవలం తమ ఒక్కరికీ ఓటు వేస్తే చాలని, రెండో ఓటు మీకు నచ్చినవారికి వేసుకోండని బహిరంగంగా నిర్వహించిన ప్రచారం ఆ పార్టీ గెలుపు అవకాశాలను దెబ్బ తీసింది. పార్టీకి ఎంతో కొంత ఓటింగ్ పడే చోట కూడా రెండు ఓట్లు పార్టీకి వేయాలని కోరిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒకరిద్దరు మాత్రమే కావడం గమనార్హం.
 
 ఎక్కడికక్కడ చీలిన టీడీపీ ఓట్లు..
 క్రాస్ ఓటింగ్ ప్రభావం ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలో కనిపించింది. ఇక్కడ నుంచి పార్లమెంట్ బరిలో నిలిచిన పండుల రవీంద్రబాబు నామినేషన్ వేసే వరకు స్థానికంగా ఎవరికీ తెలియనే తెలియరు. దీనికి తోడు ఆయనను బరిలో నిలపడం వల్ల ఈ స్థానం ఆశించిన గొల్లపల్లి సూర్యారావు అవకాశం కోల్పోయి రాజోలు అసెంబ్లీ బరిలో నిలవాల్సి వచ్చింది.
 
 దీనితో అమలాపురం అసెంబ్లీ పరిధిలోని గొల్లపల్లి అభిమానులు క్రాస్ ఓటింగ్ చేశారని తెలుస్తోంది. అమలాపురం పట్టణంలో టీడీపీ ఆధిక్యత ఉన్న వార్డుల్లో సైతం ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి పండులకు ఆశించిన స్థాయిలో ఓట్లు పడలేదని టీడీపీ నాయకులే అంగీకరిస్తున్నారు. ఉప్పలగుప్తం మండలంలో ఆ పార్టీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు సొంత గ్రామమైన ఎస్.యానాం, దాని చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఆ పార్టీ నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు పార్లమెంట్ అభ్యర్థికి మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. మండపేట, పి.గన్నవరం, రాజోలు, కొత్తపేట, మండపేటల్లో టీడీపీ బలంగా ఉన్న ప్రాంతాల్లో కొన్నిచోట్ల పార్లమెంట్‌కు, మరికొన్ని చోట్ల అసెంబ్లీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ పడినట్టు ఆ పార్టీ నాయకులు గుర్తించారు.
 
కాకినాడ పార్లమెంట్ పరిధిలో తుని, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురాల్లో సైతం టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు కేవలం తమ విజయం పైనే దృష్టి పెట్టారు. దీనితో పార్టీకి గంపగుత్తగా పడాల్సిన ఓటింగ్‌లో కూడా చీలిక కనిపించిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ టీడీపీ నుంచి పార్లమెంట్‌కు పోటీ చేస్తున్న తోట నరసింహానికి అసెంబ్లీ అభ్యర్థులతో సమానంగా ఓట్లు పడలేదని చెబుతున్నారు. తనకు ఎంతో కొంత బలం ఉన్న చోట నరసింహం కూడా తనకు పడే ఓట్ల పైనే దృష్టి పెట్టడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను కలవరానికి గురి చేస్తోంది.
 
 రాజమండ్రిలో టీడీపీకి బలమైన ఓటింగ్ ఉన్న ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల గెలుపుపై తొలి నుంచీ పెద్దగా నమ్మకం లేని పార్లమెంట్ అభ్యర్థి మురళీమోహన్ తనకు పడే ఓట్ల పైనే దృష్టి కేంద్రీకరించడం ఆ పార్టీ అసెంబ్లీ అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తోంది. అసలే ఒకవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌కు అంచనాలకు మించి ఓటింగ్ పడడం, మరోవైపు సొంత పార్టీలోనే అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థులు క్రాస్ ఓటింగ్‌ను ప్రోత్సహించడం టీడీపీలో మినుకుమినుకుమంటున్న గెలుపు ఆశను కూడా ఆరిపోయేలా చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement