మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు
పుల్‌కల్(అందోల్) : అక్క ఊరిలో జరుగుతున్న ఉత్సవాలను చూడడానికి వచ్చిన ఓ యువకుడు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని కోర్పోల్‌లో మంగళవారం జరిగింది. వివరాల ప్రకారం..మండల పరిధిలోని ఉప్పరిగూడెంకు చెందిన దూసరి శేఖర్(19) కోర్పోల్‌లోని తన అక్క ఊరిలో జరుగుతున్న జాతరకు వచ్చాడు. మంగళవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో బట్టలు ఊతికేందుకు వెళ్లాడు.
అందరూ ఒడ్డున బట్టలు ఊతుకుతుండగా శేఖర్ స్నానం చేసేందుకు చెరువు లోకి దిగాడు. ఈత వచ్చినప్పటికీ చెరువు అవతలి వైపుకు వెళ్లి తిరిగి వస్తుండగా నీటిలో మునిగి పోయాడు. రెండేళ్ల క్రితం మిషన్ కాకతీయలో బాగంగా చెరువులో పూడిక తీయడంతో నీళ్లు అధికంగా ఉన్నాయి. మనుగుతున్న శేఖర్‌ను గమనించిన వారి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బయటకు తీసే ప్రయత్నం చేయగా అప్పడికే మృతి చెందాడు.
సంఘటన స్థలానికి చేరుకున్న పుల్‌కల్ ఎస్‌ఐ ప్రసాద్‌రావు విచారణ జరిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఒక్కగానొక్క కొడుకు మృతి..
వీరయ్య– నర్సమ్మ దంపతులకు శేఖర్ ఒక్కడే కొడుకు, ఇద్దరు ఆడ పిల్లలు. రెండు సంవత్సరాల క్రితం శేఖర్ తండ్రి వీరయ్య గుండె పోటుతో మృతి చెందాడు. శేఖర్ సంగారెడ్డిలోని ఓ స్వీట్ హౌజ్‌లో పనిచేస్తూ తల్లిని పోషిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. వారి కుటుంబ సభ్యులు రోధిస్తున్న తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
Comments
Please login to add a commentAdd a comment