జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సింగూరు జలాలను సాగుకు అందించేందుకు రంగం సిద్ధమైంది. గురువారం ‘సింగూరు’ ట్ర యల్న్‌న్రు డిప్యూటీ సీఎం ప్రారంభించనుండడంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు సాగునీటికి ఇబ్బందులుండవనీ, సింగూరు జలాలలో ప్రాంతం సస్యశ్యామలం అవడం ఖాయమంటున్నారు.
పోరాటాలతో దక్కిన ‘సింగూరు’
సింగూరు జలాలను సాగుకు మళ్లించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. మాజీ మంత్రి సి.రాజనర్సింహ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిరాహారదీక్షలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సింగూరుపై ఎత్తిపోతల పథకాలను చేపడతామని హమీలిచ్చి నిర్లక్ష్యం చేసింది. అయితే 2003 సంవత్సరంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ నాయకత్వంలో రైతులు జోగిపేటలోని తహశీల్దారు కార్యాలయం ఎదుట 102 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు.
ఈ దీక్షలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సేద్యానికి సింగూరు జలాలందిస్తామని వైఎస్ హమీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2005 సంవత్సరంలోనే సింగూరు జలాలను 40 వేల ఎకరాలకు అందించేందుకు గాను రూ. 89.98 కోట్ల నిధులు మంజూరు చేసింది. సింగూరు కాలువ పనులను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సింగూరులోనే ప్రారంభించారు.
వివిధ కారణాల వల్ల కాల్వల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఖరీఫ్ సీజన్‌లో అందోల్ పెద్ద చెరువులోకి నీరును అందించాలన్న పట్టుదలతో డిప్యూటీ సీఎం పనులను వేగవంతం చేయించారు. సింగూరు ఎడమ కాల్వ ద్వారా ఇటిక్యాల, డాకూర్, మాసానిపల్లి శివార్లలోని కాల్వల ద్వారా నీటిని అందోల్ పెద్ద చెరువులోకి తరలించే కార్యక్రమంలో భా గంగా ఈనెల 13న సింగూరు ప్రాజెక్టు వద్ద ట్రయల్న్ ్రకార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితోపాటు జిల్లా యంత్రాంగం, భారీ సంఖ్యలో రైతులు హాజరుకానున్నారు.
రైతుల్లో ఆనందం
అందోల్ చెరువులోకి సింగూరు నీరు వస్తుందని తెలుసుకున్న స్థానిక రైతుల్లో అనందం వ్యక్తమవుతోంది. చెరువులోకి నీరు వస్తే తమ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని వారంటున్నారు. సింగూరు నీటితో పుల్కల్, అందోల్ మండలాల్లోని పొలాలకు నీరందే అవకాశం ఉంది.
సాకారం కాబోతోన్న స్వప్నం
Published Wed, Feb 12 2014 11:33 PM | Last Updated on Fri, Nov 9 2018 6:05 PM
Advertisement