c.damodar rajanarasimha
-
తేల్చుకుందామా?
సంగారెడ్డి/జోగిపేట,న్యూస్‌లైన్: ‘ కేసీఆర్.... ఉద్యమంలోకి రాకముందు నీ ఆస్తులెన్ని? ఉద్యమంలోకి వచ్చాక నువ్వు కూడబెట్టిన ఆస్తులెన్ని..? విచారణకు సిద్ధమా?’ అని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సి.దామోదర రాజనర్సింహ సవాలు విసిరారు. ‘నీ ఆస్తులు...నా ఆస్తులు, నీ సంపద...నా సంపదపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను....నువ్వు సిద్ధంగా ఉన్నావా?’ అని ప్రశ్నించారు. ఆదివారం జోగిపేటలోని వెంకటేశ్వరగార్డెన్‌లో జరిగిన యువభేరి కార్యక్రమానికి దామోదర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్‌పై నిప్పు లు చెరిగారు. బంధుప్రీతి, కులగజ్జికి ప్రతీక కేసీఆర్ అన్నారు. అవినీతి గురించి మాట్లాడుతున్న కేసీఆర్..తన ఆస్తులు ఎలా సంపాదించాడో ప్రజలకు తెలపాలన్నారు. ఇపుడు ఓట్లకోసం హామీలు గుప్పిస్తున్న కేసీఆర్...గతంలో ఇచ్చిన మాటను ఒక్కటైనా నిలుపుకున్నాడా అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో దొరల అలజడి మొదలైంది..ఎప్పుడో పోయిన బాంచన్ నీ కాల్మొక్తా సంస్కృతి మళ్లీ తెలంగాణ పల్లెలకు రాబోతోంది... దొరల తెలంగాణకు సమాజమంతా చరమగీతం పాడాలి...బానిసతనాన్ని భూ స్థాపితం చేయాలి’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మాట తప్పడమే ఆయన నైజం ఎవరూ అడగకపోయినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడు ఉంటాడని, డిప్యూటీ సీఎం మైనార్టీలకు దక్కుతుందని కేసీఆర్ స్వయంగా చెప్పి.. ఇపుడు తానే ముఖ్యమంత్రినంటూ ఆయన మాట తప్పుతున్నాడని దామోదర దుయ్యబట్టారు. నష్టపోతామని తెలిసి కూడా సోనియాగాంధీ ఇచ్చిన మాటకోసం కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రకటించగానే కుటుంబంతో సహా సోనియాగాంధీ వద్దకు వెళ్లిన కేసీఆర్...అక్కడ ఏం మాట్లాడారో అందరికీ చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కేసీఆర్ తన దొరతనాన్ని ఇకనైనా మానుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగా ణ రాష్ట్రాన్ని దొరలకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు. దళితుడే ముఖ్యమంత్రి: సురేష్ షెట్కార్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తప్పకుండా దళితుడే ఉంటాడ ని కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తెలంగాణ ఇస్తే... ఏనాడూ పార్లమెంట్లో తెలంగాణ గురించి మాట్లాడని కేసీఆర్, తానే తెలంగాణ తెచ్చానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. అధిష్టానవర్గానికి దామోదర్ రాజనర్సింహ అందించిన నివేదికే రాష్ట్రం ఏర్పడడానికి కారణమైందన్నారు. తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియా గాంధేనన్నారు. సోనియా సభను విజయవంతం చేయాలి ఈనెల 27వ తేదీన అందోల్ నియోజకవర్గం పరిధిలోని చౌటకూర్‌లో నిర్వహించనున్న సోనియా గాంధీ సభకు యువకులంతా హాజరు కావాలని మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ కోరారు. సమావేశంలో ఓయు జేఏసీ నాయకులు కైలాస్, ప్రొఫెసర్లు పాండే, వివేక్, ఓయూ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు జాన్ విల్సన్, మాజీ డీసీసీబీ డెరైక్టర్ ఎస్.జగన్మోహన్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పి.నారాయణ, నాయకులు ఢిల్లీ వసంత్లతోపాటు విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు వివిధ పార్టీలకు చెందిన సుమారు 3 వేల మంది కాంగ్రెస్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి. -
ఒక్కరోజు ముచ్చటే
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: డిప్యూటీ సీఎం అట్టహాసంగా ప్రారంభించిన సింగూరు ఎత్తిపోతల పథకం ఒక్కరోజు ముచ్చటగా మిగిలిపోయింది. సిరులు పండించాల్సిన సింగూరు నీరు రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. సాక్షి చెప్పినట్టుగానే అసంపూర్తిగా నిర్మించిన కాల్వలు నీటి ప్రవాహ ఉధృతికి తట్టుకోలేక ఎక్కడికక్కడ తెగిపోయాయి. దీంతో నీటి ప్రవాహ దిశ మారి పంట పొలాలు నీటమునిగాయి. నీటి ప్రవాహ దిశను ఆందోల్ చెరువు వైపునకు మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో అధికారులు గేట్లు మూసివేశారు. ఎక్కడిక్కడ తెగిపోయిన కాల్వలు డిప్యూటీ సీఎం సి.దామోదర రాజనర్సింహ గురువారం మధ్యాహ్నం సింగూరు జలాల ట్రయల్న్‌న్రు ప్రారంభించగా, అధికారులు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వ గుండా అందోల్ చెరువుకు నీళ్లు వదిలారు. 12 గంటల పాటు పారిన నీరు దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అందోల్ మండలం మాసానిపల్లి వరకు చేరింది. అయితే మాసానిపల్లి నుంచి ప్రధాన కాల్వ లేకపోవడం తో అధికారులు పిల్ల కాల్వల్లోకి సింగూరు నీటిని మళ్లిం చారు. ఈ పిల్ల కాల్వలు కూడా అసంపూర్తిగానే ఉండటంతో నీటి ప్రవాహ ఉధృతి తట్టుకోలేక కాల్వలు ఎక్కడికక్కడ తెగిపోయాయి. నీళ్లు పంట పొలాలు, బీడు భూముల్లోకి ప్రవహించాయి. గురువారం రాత్రంతా సింగూరు జలం వృథాగానే పోయింది. శుక్రవారం ఉదయం గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే రంగప్రవేశం చేసిన కాంట్రాక్టర్లు కాల్వలకు మరమ్మతులు చేసే ప్రయత్నం చేశారు. జేసీబీలను తెప్పించి కాల్వల మధ్యలో నిర్మించిన సిమెంట్ దిమ్మెలను ధ్వంసం చేశారు. అనంతరం కట్టలు తెగిపోయిన చోట మట్టితో పూడ్చేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో నీరు మాసానిపల్లికిచెందిన కొమరయ్య అనే రైతు వరి పొలం మీదగా పారి డాకూరు కట్టు కాల్వల్లోకి మళ్లింది. దీంతో కొరమయ్యకు చెందిన 4 ఎకరాల వరిపంట పూర్తిగా నీట మునిగింది. మరోవైపు డాకూరుకుకట్టుకాల్వలోకి భారీగా నీరు చేరడంతో ఆప్రాంతంలోని కాల్వకు పలుచోట్ల గండిపడింది. గేట్లు మూసివేత అందోల్ పెద్ద చెరువు వైపు వెళ్లాల్సిన సింగూరు నీరు దిశ మారి పంటపొలాల మీద ప్రవహిస్తుండటంతో ఏం చేయాలో తోచక అధికారులు తలపట్టుకున్నారు. ప్రవాహ ఉధృతి ఇలాగే కొనసాగితే సమీప గ్రామాలు నీటమునగడం ఖాయమని నిర్ధారించుకున్న ఆధికారులు ముందు జాగ్రత్త చర్యగా సింగూరు గేట్లు మూసివేశారు. అయినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బీడు భూములను సస్యశ్యామలం చేస్తుందనుకున్న సింగూరు జలం రైతన్నల రెక్కల కష్టాన్ని వృథా చేసింది. కాల్వల నిర్మాణం పనులు పూర్తి కాకముందే నీళ్లు వదలటం వల్లే ఈ పరిస్థితి తె లెత్తింది. దీంతో ‘సింగూరు’ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ప్రస్తుతం మరో ఏడాది గడిస్తే తప్ప రైతన్నలకు సింగూరు నుంచి నీళ్లు వచ్చే అవకాశం లేకుండా పోయింది. -
సాకారం కాబోతోన్న స్వప్నం
జోగిపేట, న్యూస్‌లైన్: అందోల్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. సింగూరు జలాలను సాగుకు అందించేందుకు రంగం సిద్ధమైంది. గురువారం ‘సింగూరు’ ట్ర యల్న్న్రు డిప్యూటీ సీఎం ప్రారంభించనుండడంతో ఈ ప్రాంత రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు సాగునీటికి ఇబ్బందులుండవనీ, సింగూరు జలాలలో ప్రాంతం సస్యశ్యామలం అవడం ఖాయమంటున్నారు. పోరాటాలతో దక్కిన ‘సింగూరు’ సింగూరు జలాలను సాగుకు మళ్లించాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. మాజీ మంత్రి సి.రాజనర్సింహ ఆధ్వర్యంలో 45 రోజుల పాటు నిరాహారదీక్షలు జరిగాయి. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ సింగూరుపై ఎత్తిపోతల పథకాలను చేపడతామని హమీలిచ్చి నిర్లక్ష్యం చేసింది. అయితే 2003 సంవత్సరంలో ప్రస్తుత డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ నాయకత్వంలో రైతులు జోగిపేటలోని తహశీల్దారు కార్యాలయం ఎదుట 102 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం బహిరంగసభలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సేద్యానికి సింగూరు జలాలందిస్తామని వైఎస్ హమీ ఇచ్చారు. ఈ హామీ మేరకు 2004 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 2005 సంవత్సరంలోనే సింగూరు జలాలను 40 వేల ఎకరాలకు అందించేందుకు గాను రూ. 89.98 కోట్ల నిధులు మంజూరు చేసింది. సింగూరు కాలువ పనులను ముఖ్యమంత్రి హోదాలో వైఎస్.రాజశేఖర్‌రెడ్డి సింగూరులోనే ప్రారంభించారు. వివిధ కారణాల వల్ల కాల్వల నిర్మాణం పనులు సకాలంలో పూర్తి చేయలేకపోయారు. ఖరీఫ్ సీజన్లో అందోల్ పెద్ద చెరువులోకి నీరును అందించాలన్న పట్టుదలతో డిప్యూటీ సీఎం పనులను వేగవంతం చేయించారు. సింగూరు ఎడమ కాల్వ ద్వారా ఇటిక్యాల, డాకూర్, మాసానిపల్లి శివార్లలోని కాల్వల ద్వారా నీటిని అందోల్ పెద్ద చెరువులోకి తరలించే కార్యక్రమంలో భా గంగా ఈనెల 13న సింగూరు ప్రాజెక్టు వద్ద ట్రయల్న్ ్రకార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ ఎంపీ సురేష్‌షెట్కార్, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డితోపాటు జిల్లా యంత్రాంగం, భారీ సంఖ్యలో రైతులు హాజరుకానున్నారు. రైతుల్లో ఆనందం అందోల్ చెరువులోకి సింగూరు నీరు వస్తుందని తెలుసుకున్న స్థానిక రైతుల్లో అనందం వ్యక్తమవుతోంది. చెరువులోకి నీరు వస్తే తమ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని వారంటున్నారు. సింగూరు నీటితో పుల్కల్, అందోల్ మండలాల్లోని పొలాలకు నీరందే అవకాశం ఉంది.