సంగారెడ్డి/జోగిపేట,న్యూస్‌లైన్: ‘ కేసీఆర్.... ఉద్యమంలోకి రాకముందు నీ ఆస్తులెన్ని? ఉద్యమంలోకి వచ్చాక నువ్వు కూడబెట్టిన ఆస్తులెన్ని..? విచారణకు సిద్ధమా?’ అని మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ సి.దామోదర రాజనర్సింహ సవాలు విసిరారు. ‘నీ ఆస్తులు...నా ఆస్తులు, నీ సంపద...నా సంపదపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను....నువ్వు సిద్ధంగా ఉన్నావా?’ అని ప్రశ్నించారు. ఆదివారం జోగిపేటలోని వెంకటేశ్వరగార్డెన్‌లో జరిగిన యువభేరి కార్యక్రమానికి దామోదర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్‌పై నిప్పు లు చెరిగారు. బంధుప్రీతి, కులగజ్జికి ప్రతీక కేసీఆర్ అన్నారు.
అవినీతి గురించి మాట్లాడుతున్న కేసీఆర్..తన ఆస్తులు ఎలా సంపాదించాడో ప్రజలకు తెలపాలన్నారు. ఇపుడు ఓట్లకోసం హామీలు గుప్పిస్తున్న కేసీఆర్...గతంలో ఇచ్చిన మాటను ఒక్కటైనా నిలుపుకున్నాడా అని ప్రశ్నించారు. ‘తెలంగాణలో దొరల అలజడి మొదలైంది..ఎప్పుడో పోయిన బాంచన్ నీ కాల్మొక్తా సంస్కృతి మళ్లీ తెలంగాణ పల్లెలకు రాబోతోంది... దొరల తెలంగాణకు సమాజమంతా చరమగీతం పాడాలి...బానిసతనాన్ని భూ స్థాపితం చేయాలి’ అని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
మాట తప్పడమే ఆయన నైజం
ఎవరూ అడగకపోయినా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడు ఉంటాడని, డిప్యూటీ సీఎం మైనార్టీలకు దక్కుతుందని కేసీఆర్ స్వయంగా చెప్పి.. ఇపుడు తానే ముఖ్యమంత్రినంటూ ఆయన మాట తప్పుతున్నాడని దామోదర దుయ్యబట్టారు. నష్టపోతామని తెలిసి కూడా సోనియాగాంధీ ఇచ్చిన మాటకోసం కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రకటించగానే కుటుంబంతో సహా సోనియాగాంధీ వద్దకు వెళ్లిన కేసీఆర్...అక్కడ ఏం మాట్లాడారో అందరికీ చెప్పే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. కేసీఆర్ తన దొరతనాన్ని ఇకనైనా మానుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగా ణ రాష్ట్రాన్ని దొరలకు అప్పగించే ప్రసక్తే లేదన్నారు.
దళితుడే ముఖ్యమంత్రి: సురేష్ షెట్కార్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి తప్పకుండా దళితుడే ఉంటాడ ని కాంగ్రెస్ పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో తెలంగాణ ఇస్తే... ఏనాడూ పార్లమెంట్‌లో తెలంగాణ గురించి మాట్లాడని కేసీఆర్, తానే తెలంగాణ తెచ్చానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. అధిష్టానవర్గానికి దామోదర్ రాజనర్సింహ అందించిన నివేదికే రాష్ట్రం ఏర్పడడానికి కారణమైందన్నారు. తెలంగాణ ఇచ్చింది ముమ్మాటికీ సోనియా గాంధేనన్నారు.
సోనియా సభను విజయవంతం చేయాలి
ఈనెల 27వ తేదీన అందోల్ నియోజకవర్గం పరిధిలోని చౌటకూర్‌లో నిర్వహించనున్న సోనియా గాంధీ సభకు యువకులంతా హాజరు కావాలని మాజీ డిప్యూటీ సీఎం సి.దామోదర్ రాజనర్సింహ కోరారు. సమావేశంలో ఓయు జేఏసీ నాయకులు కైలాస్, ప్రొఫెసర్లు పాండే, వివేక్, ఓయూ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు జాన్ విల్సన్, మాజీ డీసీసీబీ డెరైక్టర్ ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ పి.నారాయణ, నాయకులు ఢిల్లీ వసంత్‌లతోపాటు విద్యార్థి, యువజన నాయకులు పాల్గొన్నారు. అంతకు ముందు వివిధ పార్టీలకు చెందిన సుమారు 3 వేల మంది కాంగ్రెస్‌లో చేరినట్లు పార్టీ వర్గాలు ప్రకటించాయి.
తేల్చుకుందామా?
Published Mon, Apr 21 2014 12:11 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement