జోగిపేట/అల్లాదుర్గం రూరల్: పెద్దాపూర్ గ్రామానికి చెందిన బుడిగజంగం పెంటయ్య ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం మర్వెల్లి గ్రామానికి వచ్చాడు. యాచక వృత్తితో పాటు, గ్రామంలో కథలు చెప్పి సంసారాన్ని లాగుతున్నాడు. సంగమేశ్వర్ అనే గ్రామ పెద్దమనిషి దానంగా ఇచ్చిన 60 గజాల స్థలంలో గుడిసె వేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. గురువారం రాత్రి పెంటయ్య తన మామ పోచయ్యను తీసుకొని అదే గ్రామానికి చెందిన మల్లేశంగౌడ్ ఇంటి వద్ద కథ చెప్పేందుకు వెళ్లాడు. కథ మధ్యలో ఉండగానే ఊరు చివర నుంచి మంటలు ఎగసి పడుతుండటంతో తన గుడిసె మంటల్లో కాలిపోతుందనే ఆనుమానంతో పెంటయ్య గ్రాామస్థులతో కలిసి పరుగె త్తుకుంటూ వెళ్లి చూశారు. అప్పటికే గుడిసెను మంటలు చుట్టుముట్టాయి. ఆ మంటల్లో తన భార్య లక్ష్మి(35), అత్త చంద్రమ్మ(50), కూతరు పోచమ్మ(7), కుమారుడు(1) ఆహుతి అవుతుండడంతో నెత్తీనోరు బాదుకుంటూ గుడిసెలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా మంటలు తీవ్రస్థాయిలో ఎగసి పడటంతో సాధ్యం కాలేదు.
అప్పటికే చట్టుపక్కల నివాసాల్లోని ప్రజలు బిందెలు, బకెట్లతో నీళ్లు తెచ్చి చల్లినా మంటలు అదుపులోకి రాలేదు. గుడిసె పూర్తిగా కాలిపోయింది. దాంతో అందులో నిద్రిస్తున్న నలుగురు కూడా సజీవ దహనమైపోయారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడాలని ధైర్యం చేసినా మంటలు వెళ్లనీయలేదని ప్రత్యక్ష సాక్షులు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. రోజూ మా ఇళ్ల ముందు ఆడుకునే చిన్నారులు కళ్ల ముందే తగలబడిపోయారని వారు రోదిస్తూ తెలిపారు.
మాంసం ముద్దలుగా శవాలు
గుడిసెకు నిప్పంటుకోవడంతో గాఢనిద్రలో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు మంటల్లో కాలిపోయి మాంసం ముద్దలుగా మారారు. బిడ్డా ఏమైపోయారంటూ చిన్నారుల తండ్రి పెంటయ్య ఆర్తనాదాలు గ్రామస్తుల కళ్లల్లో నీళ్లు తెప్పించాయి. తమ పిల్లలను చూడండి ఎలా అయిపోయారో.. మాకు దిక్కెవరంటూ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సంఘటన స్థలం నుంచి క్లూస్ టీం ఆధారాలు సేకరించించింది. సీఐ రాజేందర్ నేతృత్వంలోని అధికారుల బృందం ప్రమాదంపై అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.
స్థలం కోసమే గుడిసె తగలబెట్టారు...
ఇది ప్రమాదమా? లేక విద్రోహ చర్యా? అనే దానిపై పోలీసుల్లో సందిగ్ధత ఉంది. బాధితుడు పెంటయ్య మాత్రం తన గుడిసెను తగలబెట్టారనే చెప్తున్నాడు. అతని మాటల్లోనే... ‘నేను నివాసం ఉంటున్న స్థలంపై మంగళవారం ఇదే గ్రామానికి చెందిన మేతి ఆదాం అనే వ్యక్తితో వివాదం జరిగింది. గ్రామ పటేల్ సంగమేశ్వర్ వద్ద ఈ స్థలం కొన్నానని, కొంత అడ్వాన్సు కూడా ఇచ్చానని, వెంటనే స్థలం ఖాళీ చేసి వెళ్లిపోవాలని మేతి ఆదాం గొడవపడ్డాడు. ఇదే విషయాన్ని పటేల్ సంగమేశ్వర్ వద్దకు వెళ్లి చెప్పా... దాంతో ఆయన వచ్చి ఆదాంకు సంబంధించి ఇంటి స్థలాన్ని చూపించి రాళ్లను పాతించి, నేను నివాసం ఉంటున్న స్థలంలోనే నన్ను ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. అయితే అదే రోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆదాం మళ్లీ వచ్చి స్థలం నాది వెళ్లిపోవాలని, లేనట్లయితే ఏం చేయాలో అది చేస్తానంటూ బెదిరించాడు. ఆదాం చెప్పినట్టుగానే నా గుడిసెను తగలబెట్టి ఉండవచ్చు’ అని పెంటయ్య పోలీసులకు, తహశీల్దారుకు వాంగ్మూలం ఇచ్చారు.
విచారణ జరిపిస్తాం: డీఎస్పీ ఎస్.గోద్రూ
ఈ సంఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని, ప్రమాదవశాత్తు జరిగిందా? ఉద్దేశపూర్వకంగా చేశారా? అనే విషయమై సమగ్ర విచారణ జరిపిస్తామని డీఎస్పీ ఎస్. గోద్రూ తెలిపారు. శుక్రవారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలించారు. వివరాలను స్థానిక ఎస్‌ఐ నరేందర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు సీఐ బి.సైదానాయక్ ఉన్నారు. కాగా మృతదేహాలకు జోగిపేట వైద్యాధికారి నందిత, సిబ్బంది సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.
అర్ధరాత్రి వేళ మర్వెల్లిలో అగ్ని ప్రమాదం
Published Sat, Jan 25 2014 12:23 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement