సీసీ కెమెరాలో రికార్డులు పరిశీలిస్తున్న ప్రిన్సిపాల్
సీసీ కెమెరాల ఏర్పాటు.. ర్యాగింగ్‌కు బ్రేక్
జోగిపేట: కళాశాలల్లో విద్యార్థుల హాజర శాతం పెంచేందుకు బోధనలో పారదర్శకతను తీసుకువచ్చేందుకు విద్యార్థుల క్రమ శిక్షణను పర్యవేక్షించేందుకు, ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టేందుకు కళాశాలల్లో అసాంఘిక కార్యకలాపాలను నిరోదించేందుకు విద్యాశాఖ నడుం బిగించింది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు బయోమెట్రికట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అందోలు నియోజకవర్గ కేంద్రమైన జోగిపే ట జూనియర్ కళాశాలలో వీటిని ఏర్పాటు చేశారు. అటు ఉద్యోగుల్లో.. ఇటు విద్యార్థుల్లో జవాబుదారీ తనాన్ని తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అధ్యాపకులు, విద్యార్థులు అంటున్నారు.
పారదర్శకతకు అవకాశం
బయోమెట్రిక్ హాజరు విధానంతో పాటు కళాశాలలో నిర్వహణ పారదర్శకంగా మారింది. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు వస్తున్నారు. గతంలోలాగా హజరు నమోదులో ఎలాంటి అవకతవలకు అవకాశం ఉండదు. సరైన హాజరు శాతం ఉన్న విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు చెల్లిస్తారు.
సీసీ కెమెరాలతో కళాశాల పరిసరాల చిత్రాలు ఆన్‌లైన్ రికార్డు అవుతుండంతో అందరూ అప్రమత్తంగా ఉంటున్నారు. కళాశాల ఆవరణలో ర్యాగింగ్ నిరోధానికి ఈ కెమెరాలు ఉపయోగపడతాయి. ప్రిన్సిపాల్ సైతం తన గదిలో నుంచి ఎక్కడ ఏం జరుగుతుందో సులువుగా తెలుసుకోవచ్చు.
ప్రయోజనాలు
విద్యార్థులు ఉదయం కళాశాలకు రాగానే నిర్ణీత సమయంలో బయోమెట్రిక్ యంత్రంపై వేలి ముద్రలు నమోదు చేసుకుంటూ తరగతులకు వెళుతున్నారు. కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల కళాశాల బయట నిరీక్షించకుండా, ఎక్కడ తాము చేసే కార్యకలాపాలు కెమెరాలో చిక్కుతాయేమోనని భయపడి గదుల్లోకి పరుగులు తీస్తున్నారు.
ఈ విధానం బాగుంది
కళాశాలలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానం వల్ల ఉద్యోగుల్లో, విద్యార్థుల్లో క్రమశిక్షణ అలవాటైంది. గత రెండు మాసాల నుంచి బాగా మార్పు వచ్చింది. - గోవింద్‌రాం, ప్రిన్సిపాల్, జోగిపేట