విజ్ఞానంపై నిర్లక్ష్యం | library building dilapidated | Sakshi
Sakshi News home page

విజ్ఞానంపై నిర్లక్ష్యం

Published Mon, Sep 12 2016 6:55 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

శిథిలావస్థలో ఉన్న జోగిపేట గ్రంథాలయం

శిథిలావస్థలో ఉన్న జోగిపేట గ్రంథాలయం

  • శిథిలావస్థలో గ్రంథాలయం
  • గ్రంథాలయోద్యమానికి కేంద్ర బిందువు
  • మూడేళ్లుగా ఇన్‌చార్జి అధికారే..
  • అసాంఘిక కార్యక్రమాలకు అడ్డా
  • పట్టించుకోని పాలకులు
  • జోగిపేట: నిజాం నిరంకుశ పాలనలో గ్రంథాలయోద్యమానికి కేంద్ర బిందువైంది.. ఎందరినో చైతన్యవంతులను చేసింది. మరిఎందరికో దిక్సూచిగా నిలిచిన జోగిపేటలోని గ్రంథాలయంపై పాలకుల ఆదరణ కరువైంది. నాందేడ్‌ -అకోలా జాతీయ రహదారికి కనుచూపు మేరలో ఉన్న అందోలు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యేలెవరూ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. విజ్ఞానాన్ని సంపాదించి పెట్టే బాండాగారమైనా పట్టించుకున్న పాపాన పోలేదు.

    1971వ సంవత్సరంలో జోగిపేటలోని పోస్టాఫీసు పక్కన నిర్మించారు. 45 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఎప్పుడు కూలుతుందోనన్న పరిస్థితుల్లో ఉంది. వర్షం కురుసినప్పుడల్లా గోడలు పూర్తిగా తడిసి పోతున్నాయి. భవనం పై భాగంలో కూడా గోడలు కూలిపోతున్నాయి. చూడడానికే భవనం భయమేసే విధంగా తయారయ్యింది. ఎప్పుడు కూలుతుందోనన్న భయంతో పాఠకులు సైతం గ్రంథాలయానికి వచ్చేందుకు జంకుతున్నారు.  గ్రంథాలయంలో 18,900  వివిధ రకాల పుస్తకాలున్నాయి. ప్రతి రోజూ 11 దినపత్రికలు వస్తాయి.

    భవనం చుట్టూ పిచ్చి మొక్కలే..
    గ్రంథాలయం చుట్టూ పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. సుమారు 4 ఫీట్ల ఎత్తులో ఈ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. పాములు కూడా సంచరిస్తూ ఉన్నాయి. పరిసర ప్రాంతమంతా అపరిశుభ్రంగా తయారయ్యింది. నగర పంచాయతీ సిబ్బంది కూడా  శుభ్రపరిచేందుకు ఆసక్తి చూపడంలేదు.  

    అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా...
    గ్రంథాలయ భవనం రోడ్డుకు కొద్ది దూరంలో ఉండడంతో రాత్రి వేళ అటువైపుగా ఎవరూ వెళ్లరు. దీంతో భవనం  వద్ద మద్యం సేవించడం, పేకాట ఆడడం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.  అయినా పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు.

    పట్టించుకోని పాలకులు
    అందోలు నియోజకవర్గం నుంచి ఎంపికైన ఎమ్మెల్యేలెవ్వరూ   ఇప్పటి వరకు గ్రంథాలయంవైపు కన్నెత్తి చూడలేదన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం పుస్తకాలు, దినపత్రిలకు నిధులను కేటాయిస్తున్నా భవనం మరమ్మతులకు మాత్రం ఎలాంటి నిధులను విడుదల చేయడం లేదు.

    ఏడాదికి వారం రోజుల పాటు గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నా ఆ తర్వాత   పట్టించుకోవడంలేదన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యేలకు ప్రతి సంవత్సరం నియోజకవర్గ అభివృద్ది నిధుల కింద లక్షల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అందులోంచి కొంత మేర నిధులను కేటాయించి నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత శాసనసభ్యుడు బాబూమోమాన్‌ ఆ దిశగా చర్యలు తీసుకొని పాఠకుల మెప్పు పొందాలని పలువురు కోరుతున్నారు.  

    హమీ మరచిన జిల్లా చైర్మన్‌
    జిల్లా గ్రంథాలయ చైర్మన్‌గా బాధ్యతలను చేపట్టిన తర్వాత జోగిపేట గ్రంథాలయాన్ని సందర్శించిన చైర్మన్‌ తోపాజి అనంతకిషన్‌ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయిస్తానని హమీ ఇచ్చారు. హమీ ఇచ్చి సుమారు 4 ఏళ్లు కావస్తుంది. ప్రహరీని కూడా నిర్మిస్తానని అప్పట్లో ఆయన అన్నారు. కాని నేటికీ అమలు కాలేదు.  

    మూడేళ్లుగా ఇన్‌చార్జి అధికారి
    జోగిపేట గ్రంథాలయ అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో  మూడు సంవత్సరాలుగా ఇన్‌చార్జి అధికారే బాధ్యతలను నిర్వహిస్తున్నారు. 2013 నుంచి రాజ్‌కుమార్‌ అనే అధికారి ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. అటెండర్‌ కూడా గత సంవత్సరమే రిటైర్డ్‌ కావడంతో నెలకు వెయ్యి రూపాయల చొప్పున చెల్లించి ఒక వ్యక్తిని నియమించారు. ఇన్‌చార్జి అధికారి  ప్రతి బుధ, ఆదివారాల్లో మాత్రమే విధులను జోగిపేటలో నిర్వహిస్తారు.

    డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాలి
    జోగిపేటలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటుకు ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. స్థానికంగా పీజీ వరకు కళాశాలలు ఉండడంతో విద్యార్థులకు అవసరమైన సమాచారం లైబ్రరీలో లభించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారిన జోగిపేటలో డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  పోటీ ప్రపంచానికి తగ్గట్లు సమాచారాన్ని అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. - ఉలువల శ్రీనివాస్, జోగిపేట

    నూతన భవనం నిర్మించండి
    45 సంవత్సరాల క్రితం నిర్మించిన గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవన నిర్మాణాన్ని చేపట్టాలి. గ్రంథాలయం వద్ద జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలను అరికట్టాలి. ఎమ్మెల్యే తన అభివృద్ధి నిధులను కేటాయించి నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలి. ప్రస్తుత భవనం కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. - ఎండీ ఫైజల్‌ అహ్మద్, జోగిపేట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement